Friday, July 27, 2012

ప్రాణోత్క్రమణము

                                             ప్రాణోత్క్రమణము           జీవన్ముక్త లక్షణాలు, జీవన్ముక్తునిదశలు గురించి తెలుసుకున్న తర్వాత, విదేహముక్తికి ద్వారము, చతుర్ముఖ బ్రహ్మ మొదలుకొని చీమ వరకు, ప్రతీజీవికి తప్పనిసరి అయిన ప్రాణో త్క్రమణము గురించి అంటే మరణము గురించి తెలుసుకుందాము. మరణము అంటే ఏముంది, చచ్చిపోవడమే కదా! దీని గురించి ఏమి తెలుసుకోవాలి, ఎందుకు తెలుసుకోవాలి? అనే ప్రశ్నలు వస్తాయి. ఆధ్యాత్మికజీవితములొసంభవించే ప్రతీదశగురించి సాధకుడుతప్పనిసరిగా క్షుణ్ణము గా తెలుసుకోవాలి. ప్రతీదానియొక్క పూర్తిజ్ఞానము సంపాదించి, దాన్ని ఆఎరుకతో అనుభ వించాలి. ఈప్రాణోత్క్రమణము ప్రతీవారికి వారివారి జ్ఞానము యొక్క స్థాయిలని బట్టి సంభవి స్తుంది. అజ్ఞాని దీనిగురించి భయపడతాడుగాని, జ్ఞాని ఎంతమాత్రమూ భయపడడు. పైగాదీనిని పరబ్రహ్మ స్వరూపమునకు జేర్చే సాధనముగా భావించి, సాదరముగా స్వాగతిస్తాడు. ఇక్కడ మనం తెలుసుకోన విషయము ఇంకొకటి వుంది. ఇక్కడ పెద్దలు చెప్పిన విషయాలను భౌతిక మరణముతో పోల్చిచూడవద్దు. వీరు చెప్పిన విషయములు ఆత్మకు, తత్సంబంధిత ఇతర శరీరాలకు (ఇవి భౌతికశరీరానికి అందవు, ధ్యానములోను, యోగములోను మాత్రమే అను భవము లోనికి వస్తాయి.) సంబంధించినవి. ఇక్కడ చెప్పిన కొన్ని పరిణామాలు ఈ భౌతిక శరీరములొ సంభవింపవు కూడా! ఈ విషయాలను ఆదృష్టిలో మాత్రమే గమనించ మనవి. ఇప్పుడు ప్రాణోత్క్రమణము గురించి మహానుభావులు ఏమి వివరించారో తెలుసుకుందాము.

యోగవాసిష్టము:నిర్వాణ ప్రకరణము:32వ సర్గ:దేహపాత విచారము:ఈశ్వరుడు వశిష్టునితో వచింపు చున్నాడు:
 
            పరమచైతన్యము జీవుల శరీరమున ప్రవేశించి, కార్యముల నాచరింపజేయు విధిని, దేహముల బ్రవేశించి, చలనయుక్తమై, స్నాత, భోక్త, బ్రాహ్మణుడు, క్షత్రియుడు, మున్నగు సంజ్ఞలను బడయు విధానమును చెప్పుచున్నాను వినుము.  ఈ చైతన్యమునకొక శక్తి యున్నది. అయ్యది ఆవరణ శక్తి. అయ్యది తనకాశ్రయమగు బ్రహ్మమును మరుగున పడజేసి, లేదనిపించుచూ, పుఉర్వా ర్జితములగు సంస్కార జనితములగు యత్నములను, వివిధ ములును, విధినిషేధ  రూపకమగు కాయిక, వాచిక, కర్మల వలన మనోభావము పొంది చైతన్యము నుండి ఉద్భవించినదయ్యు, జడమువోలె నగుచున్నది. ఇట్లు వ్యవహారదశను బొందిన బ్రహ్మశక్తి, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియముల వలన ద్రష్టృ, దృశ్య, దర్శనములను బేధముల బొందుచున్నది. పరమచైతన్యము ఈ మాయాశక్తి యొక్క ప్రసాదమువలననే కళంకితమై జగద్రూప గంధర్వనగరములను సృష్టించుచున్నది. (పరమార్థ భావమున)
సృష్టించుటలేదు. 
 

           సర్వవ్యాపియగు ఈ చిత్ శక్తి బలముననే ఈ జీవులందరూ వికాసమునందుచున్నారు. ఈ జీవులు చైతన్యము యొక్క ప్రతిబింబమాత్రులు. (పంచభూత)ద్రవ్య స్వభావులగు జీవులు అద్రవ్య (నర్ధర్మక) స్వభావమగు చైతన్యము యొక్క ప్రతిబింబమని నుడువ వీలుపడదందువా? (ఇక్కడ ఒక విషయాన్ని గమ్మత్తుగా చెప్పారు. జ్ఞాని స్వస్వరూప జ్ఞానము పొంది, ఆ పరా చైతన్యము యొక్క ప్రతిబింబమే తన ఆత్మ అని తెలుసుకుంటాడు. కాని తాను భౌతికశరీరమని భావించే అజ్ఞానియొక్క ఆత్మకూడా ఆ చైతన్యము యొక్క ప్రతి బింబమని చెప్పగలమా? అని ప్రశ్నించారు. దానికి జవాబు కూడా ఇస్తున్నారు.) ద్రవ్యము యొక్క ప్రతిబింబమే పడవలెనను నియమము లేదు. అద్దము నందు గుణము, క్రియలు మున్నగువాటి ప్రతిబింబము కూడా పడుచున్నది. ఇటగూడ నట్లే గ్రహింపవలయును. ఈ జీవుడు బ్రహ్మము యొక్క ప్రతిబింబ మైననూ, నిజస్వరూపమును విస్మరించినందున జడ భావము పొందినాడు. సద్బ్రాహ్మణుడు మోహ వశమునను కుకర్మల నాచరించుట వలన శూద్రత్వము బొందుటలేదా? (చూశారా! చేసీ కర్మలను బట్టే వర్ణము నిర్ణయింపబడుతుంది.) ఈ చైతన్యము స్వస్వరూపమును విస్మరించుట వలననే చిత్తభావమును బొందినది. మహాత్ములు కూడా మోహవశమున వికలత్వము బొంది, దీనభావము నొందుచున్నారు కదా! తరంగముల వలన నీరు సంభవించునట్లు ఈ చైతన్యము కూడ ప్రాణవాయువుతో నధ్యస్తమై శరీరమును సంచరింప జేయుచున్నది(ఈ శరీరము నడవ టానికి, ప్రాణవాయువు తోపాటు చైతన్యము కూడ అవుసరమే). పరమాత్మ శరీర శకటమును నడిపింపగోరి, మనస్సు, ప్రాణములను దృఢవాహనముల రెండింటిని సృష్టించినాడు. ఈ చైతన్యము జడరుపమును గ్రహించి, జీవభావము నొంది, ప్రానమను గుఱ్ఱము కట్టబడిన మనస్సను రథమునేక్కి, తన స్వరూపమును త్యజింపకున్ననూ, జాగ్రద్దశయందు, జన్మించు చున్నానని తోచు పదార్థములుగను, స్వప్నావస్థయందు (మేల్కొనిన) నష్టమగు పదార్థములు గను, కనబడుచున్నది. కాని ఈ పదార్థములుగా మారుట లేదు. అందువలన తరంగత్వము జలముల నుండి వేరు కానట్లు, ఈ చైతన్యము కూడ జగత్తు నుండి వేరు కాదు. దీపమున ఇల్లే ప్రకాశించునట్లు, నిరామయమగు పరమాత్మ చైతన్యముండుటవలననే, జీవుడు జీవించు చున్నాడు. సూర్యుడు తాను (నీటినావిరిగ మార్చి) సృష్టించి ప్రకాశింపజేయు మేఘమండలము వలననే గాప్పబడి, తిరోధాన, మ్లాన, ఖండభావముల బొందునట్లు, చైతన్యము గూడ అన్నిటి కినీ ఆధారమయ్యు, ఈశరీరమున వైవశ్యము నొందుచున్నది. ఎక్కుడుగా కల్లుద్రావి మత్తు గన్న మనుజుడు తన అవయవము ఖండింపబడిననూ దానిని గ్రహింపజాలనట్లు, చైతన్యము గూడ వైవశ్యము నొంది, స్వస్వరూపమును గ్రహింపజాలకున్నది. మదమత్తుడు కైపు తగ్గినా, తానా సమయమున యొనర్చిన చెయిదముల గుర్తుకు దెచ్చుకొననియట్లు చైతన్యము కూడ మోహము వినష్టమవ, స్వస్వరూపమును గ్రహింపజాలదు. 

          కుష్టురోగి హస్తపాదములవలె కొంచెము కొంచెముగ సర్వశరీరవ్యాపి యగు జీవ చైతన్యము విలుప్తమవ, ప్రాణవాయువు యొక్క శక్తి గూడ హస్తపాదాది శరీరాంగములు గూడ వైవశ్యమునందును. అప్పుడు చైతన్యము హృదయకమలమున చలనరహితమై, యజ్ఞమున కుపయోగించని కాష్ట పాత్ర వలె నుండును. హృదయకమలదళములు చలనరహితమవ, విసన కర్ర వీవనిచొ, గాలి కట్టువడునట్లు అంతరమున నున్న ప్రాణవాయువు లన్నియు నాగి పోవును. గాలి ఆగిపోవ కట్టువడు దుమారమువోలె ప్రాణవాయువు లోనదిగిన జీవుడు నామ రూపొపాధి రహితుడై, కారణస్వరూపుడై వెలయును. అప్పుడు అతని మనస్సు గూడ రజోగుణ హీనము, నిరాదారమునై ప్రాణవాయువుతో లీనమై కారణాత్మతనందును. మరల వృక్ష బీజము వలె దేహరూపముగ బ్రకాశించుచుండును. ఇట్లు వైకల్యమునందిన మూలకారణములతో పుర్య ష్టకము ప్రశాంతమైన, [పుర్యష్టకమనిన శరీరమనే నగరములో కల ఎనిమిది ముఖ్య మైన భాగాలు. అవి, 1.జ్ఞానేంద్రియ పంచకము, 2.కర్మేంద్రియ పంచకము, 3.ప్రాణాది పంచకము, 4.ఆకాశాది పంచకము, 5.అంతఃకరణ చతుష్టయము, 6.కామము,  7.కర్మలు, 8.తమస్సు (అవిద్య)] దేహము నిశ్చలమై పడిపోవును. స్వస్వరూపాజ్ఞానమను మోహము వలన చైతన్యము చేత్యాంకురమును బొందుచున్నది.  దానియండే వాసనాసమూహములన్నియూ గూడ స్పందించుచున్నవి. ఈవాసనల వలన పరిచాలితమై చైతన్యము స్వస్వరూపమును విస్మరించి, ఆళీకములగు (స్వప్నములవంటి) కల్పనల నోనర్చుచుండును. క్రమముగా హృదయ కమలదళములు వికసింప పుర్యష్టకము గూడ పరిస్ఫుటమగును. ఈ హ్సృదయ కమలయంత్రమును నిశ్చలమొనర్చిన, పుర్యష్టకముగూడ వినష్టమై పోవును.శరీరమధ్యమున పుర్యష్టకమున్నంత వరకు అయ్యది జీవద్దశ నంటియుండును. పుర్యష్టకము నశించిన శరీరము మృతమైనదిగ నెన్నబడును. తన సంకల్పము వలననే జీవుడు మరణాది దుఃఖ సమూహము ననుభవించుచున్నాడు. మరియు శరీరమందలి పద్మయంత్రము కూడ ఎడతెగక చలించుచున్నది. ఎవ్వరి హృదయమున సదా పవిత్రమగు వాసనయుండునో, అట్టి జీవులు శాశ్వతులుగను, ఏకరూపులుగను చిరంజీవులు, జీవన్ముక్తులై వెలయుదురు. హృత్పద్మ యంత్రము నిరుద్ధమవ, ప్రాణవాయువు శాంతింప ఈ శరీరము ధృతి, శక్తి వీడి కాష్టలోష్టసమమై భూమిమీద గూలును. అనాదికాలము నుండి అభ్యస్తములగు వాసనల గూర్చుకొని, మనస్సె చ్చటెచ్చట పరిభ్రమించుచుండునో, అచ్చటచ్చట స్వర్గానరకముల గాంచుచుండును. గృహస్థుడు దూరమవ, పాడుబడ్డ ఇంటివలె, మనస్సు, ప్రాణవాయువులు లేచిపియిన, శరీరము శవరూపము నొందును.


           సర్వగామియగు బ్రహ్మచైతన్యమే చేత్యభావమును, అందుండి చేతనభావమును, దానినుండి జీవభావమును, దానినుండి మనోభావమును, అందుండి పుర్యష్టకమును దాల్చి, సూక్ష్మశరీరమును దాల్చుచున్నది. ఈభావన దృఢమవ, దానినే సత్యమని తలచి, దీనియందు ఆసక్తినిగొని, తన అతివాహక భావమును మరచును. ఇట్లు కృత్రిమమగు భావనమున, అసత్య శరీరమున సత్యబుద్ధినిగొని, అసత్యమును సత్యముగను, సత్యము నసత్యముగను యొనర్చు చున్నది. సర్వగామి యగు ఈ చైతన్యము యొక్క ఒక అంశమాత్రము (అనగా చైతన్యము తన యందు ఒక అంశను కల్పించుకొని) మనస్సుగా మారి, పుర్యష్టకరధము నధిరోహించి, జగత్తు నాక్రమించుచున్నది. ఈ చైతన్యము సూక్ష్మ భూతాత్మకమును, ప్రాణాయామమునునగు పుర్యష్తకరూప శరీరమును లేవదీయ, జనులు దీనిని జీవించియున్నదానినిగ పేర్కొను చున్నారు. ఈ
జీవించియుండుట శవమధ్యమున బేతాళము ప్రవేశింప, అది కదిలిన జీవించి యున్నదని తలంచుటలో బోలియున్నది. పుర్యష్టకము నశించి, చిత్తమాకాశామున లీనమవ, శరీరము కాష్ఠపాషాణము వలె అచేతనమగును.  ఈ స్థితినే శరీరము మృతమనబడును. క్రొత్త దగు చివురుటాకు కాలక్రమమున ఎండిపోవునట్లు, జీవ భావము నందిన ఈ చైతన్యము అజ్ఞానమున తన అజరామర బ్రహ్మ స్వరూపమునుమరచి, కాలక్రమమున వైవశ్యమొంది, శక్తిరహితమగును. పిదప హృత్పద్మయంత్రము జీవ స్మృతిని గోల్పోయి నిశ్చలమవ, ప్రాణ వాయువు నిరుద్ధమగును. అప్పుడే మనుష్యుని మృతుడందురు. వృక్షపత్రములవలె మనుష్యుల శరీరములు గూడ పుట్టిగిట్టుచున్నవి. జననమరణములు వీటికి స్వాభావికములు. అగుచో దుఃఖింపనేల? చిత్సముద్రమున ఏ ఏ వైపుల ఎన్ని శరీరములను బుద్బుద పంక్తులు లేచుచున్నవో చెప్పజాలము. బుద్ధిమంతులకు వీటియందు శాశ్వత బుద్ధి లేదు.
మైత్రాయణ్యుపనిషత్ :
ద్వితీయ ప్రపాఠకము: 
          2.
బాహ్యేంద్రియ స్తంభానము కలగగా, ఊర్థ్వముగా ఉత్క్రమించి(పోయి), బాధపడుచు, పడక, తమస్సును పోగొట్టునే, అతడే ఆత్మ. మరియు ఏ యితడు నిర్మలుడై ఈ శరీరము నుండి లేచి, పరమజ్యోతి రూపము పొంది, నిజరూపు పొందునో, అతడే ఆత్మ. ఈ బ్రహ్మ అమృతము, అభయము.


బ్రహ్మసూత్ర దర్శనం:

        ఉత్క్రాంతిని గురించి చెప్పబడ్డది. ఈ విధమైన ఉత్క్రాంతి (బ్రహ్మ)ఉపాసకునికి, ఉపాసకుడు కానివానికి కూడ సమానమౌనా? కాదా? అని సంశయం.
          సూ: "సమానాచాసృత్యుపక్రమాదమృతత్త్వంచానుపాష్య" దేవయానమార్గారంభానికి పూర్వం విద్వాంసుడు, అ
విద్వాంసుడు వీరిద్దరి ఉత్క్రాంతి సమానమే. ఎందుచేత? 'వాఙ్మనసి' అనే శృతి విశేషమైనది. సగుణవిద్యయందు చెప్పబడిన అమృతత్త్వం కేవలం ఔపచారికమే. గౌణము అవిద్య అనేది దహింపబడక పూర్వమే కలుగుతోంది కాబట్టి. సగుణబ్రహ్మజ్ఞానికి (సాకారోపాసకునికి) మూర్ధన్యనాడీ ప్రవేశము ఉత్తరమార్గాన పోవడం జరుగుతుంది. ఆయా మార్గాల వరకూ ఉపాసకుడైన జ్ఞానికి, ఉపాసకుడు కాని అజ్ఞానికి కూడ భూత సూక్ష్మావయవం సమానమే! దేవయాన మార్గాన పోకుండా (పర)బ్రహ్మలోక ప్రాప్తి అనేది సగుణబ్రహ్మజ్ఞానికి కలుగదు కాబట్టి, ఉత్క్రాంతి ఇతనికి సమానమే. ఉపాసకుడు పొందే అమృతత్త్వం కాదు. ఆపేక్షిక మైనట్టి అమృతత్త్వమన్నమాట. (సాకారోపాసకుడైన సాధారణ జ్ఞానికి, అజ్ఞానికి కూడ ప్రాణం పోయే మార్గాలు, అవయవాలు ఒక్కలాగే వుంటాయి. అజ్ఞానికి ఒకవేళ ప్రాణం ఊర్థ్వముగా పోయినా, అక్కడ వున్న అవయవాలైన కళ్ళు, ముక్కు, నోరు, చెవులు మున్నగు అవయవాల ద్వారా పోతుంది. అజ్ఞాని కాబట్టి సంచితము, ప్రారబ్దములను బట్టి తదుపరి జన్మ వుంటుంది. సాధారణ జ్ఞానికి కూడా ఊర్థ్వముగా ప్రాణం పోయినప్పటికీ, ఉపాసనా దైవము యొక్క ధ్యాస వుండటమువలన ఆ సాకారదైవము యొక్క సారూప్య, సామీప్య, సాయుజ్యాలు కలుగుతాయి తప్ప మోక్షం లభించదు. ఉపాసనల వలన లభించిన పుణ్యఫలం పూర్తి కాగానే మళ్ళా జన్మకు వస్తాడు.) 

            నిర్గుణ బ్రహ్మజ్ఞానం కలవానికి 
ఉత్క్రాంతి వున్నదా? లేదా?  సంశయ నివారణ. సూ: 'సృష్టోహ్యీకేషాం'. కొందరి శాఖయందు, కణ్వశాఖయందు దేహమునుండి  ప్రాణోత్క్రాంతి నిషేధం స్పష్టంగా వుంది. కాబట్టి బ్రహ్మవిదునకు ఉత్క్రాంతి లేదు. బృహదారణ్యకోపనిషత్ 3.2.12. లో చనిపోయేవారి ప్రాణాలు ఉత్క్రమణం చెందుతాయా, చెందవా? అని అడుగగా, చెందవు అని యాజ్ఞవల్క్యుడు సమాధానమిచ్చాడు. మరి ప్రాణాలు  ఉత్క్రాంతిని పొందక పోతే యితడు మృతుడు కాడు గదా! అనే అనుమానానికి 'అత్ర్యేవ సమవరీయన్తే' అని ప్రాణాలకు ఇచ్చటనే వినాశాన్ని చెప్పి, ఆ వినాశనం సిద్ధించటానికై 'సఉచ్ఛ్వయత్త్వాధ్మాయ యత్యాధ్మతోమృతశ్వేతే' ఆ పురుషుడు ఉబ్బుతాడు, పొట్ట వాయువు చేత  పూరిమ్పబడుతుంది, దేహము కూడ ఉబ్బు తుంది. మృతుడై పడిపోతాడు అని మరణావస్థను వర్ణించాడు. కాబట్టి అవిద్వాంసునికి శరీరము నుండియే ప్రాణోత్క్రమణం చెప్పబడ్డది. అంతేతప్ప (పరబ్రహ్మ)విద్వాంసుడైన జీవునికి ప్రాణో త్క్రమణం గాని, మార్గంగాని లేదు. "అతబ్రహ్మ సమశ్నుతే" బ్రహ్మవేత్త ఇచటనే బ్రహ్మమగును అని శృతి బోధిస్తోంది. సూ: తాని పరేతథా హ్యాహ" బ్రహ్మవేత్తలకు ఆ ప్రాణాత్మకాలైన  ఇంద్రి యాలు, భూతాలూ పరమాత్మయందే లయమౌతాయి. నిరవశేషంగా లయమౌతాయి. 'ఏవ మేవాస్య' అనే శృతి ఇట్లాగే చెపుతోంది. (ప్రశ్నోపనిషత్ 6.5) నదులన్నీ సముద్రాన్ని పొంది తమతమ రూపాన్ని కోల్పోయి సముద్రమనే పేరుతొ వ్యవహరింప బడునట్లుగా అంతటా ప్రత్యగ్రూపమైన బ్రహ్మ స్వరూపాన్నే చూస్తూవుండే బ్రహ్మవేత్త యొక్క ఇంద్రియాలు అపరోక్ష జ్ఞానం వల్ల మాత్రమే తెలుసుకోవడానికి వీలైన పురుషుని పొంది (లయమై) తమతమ నామ రూపాల్ని కోల్పోతున్నాయి. కాబట్టి బ్రహ్మవేత్త యొక్క ఇంద్రియాలు పరమాత్మ యందే లయ మౌతున్నాయి అని సిద్దాంతం. (దీనిని బట్టి తెలుసుకునేదేమిటంటే యోగులకు, బ్రహ్మవేత్తలకు ప్రాణోత్క్రమణం లేదు. వారి శరీరము లోంచి ప్రాణం బయటకు రాగానే, పరబ్రహ్మ సర్వవ్యాపి కాబట్టి, అక్కడే వున్న పరబ్రహ్మలో నిరవశేషంగా లయమవుతుంది. అది ఎవ్వరికీ గోచరము కాదు. వీరియొక్క నిరవశేషలయం కారణముగా, భౌతికశరీరమును పంచభూతాలలో కలప టమే తప్ప, వీరికి ఎటువంటి అపరకర్మలూ  అవుసరము లేదు. ఆరాధనోత్సవాలను మాత్రమే జరుపుకోవాలి. ఈ విధానాన్ని సద్గురువులు పోడూరి కృష్ణవేణు మాతాజీగారి పట్ల  ఆచరించటం జరిగింది.) 

           సూ: "అవిద్భాగోవచనాత్" విద్వాంసుని ఇంద్రియాలకు (కళలకు) బ్రహ్మతో పూర్తిగా అవిభాగమైన లయమే అని శృతి వచనం.
(ప్రశ్నోపనిషత్ 6.5) ఆ కళలయొక్క (ఇంద్రియాలు ప్రాణాల యొక్క) నామరూపాలు నశిస్తాయి. అన్నీకలసిపోయి పురుషుడని మాత్రమే వ్యవహారం. ఇట్లు బ్రహ్మైక్య రూపమైనట్టి లయాన్ని పొంది నప్పుడు సాధకుడు కళలు లేనివాడు, ముక్తుడు అవుతాడు అని చెప్పడం వల్ల నిశ్శేషలయం అని తెలుస్తోంది. అజ్ఞానులకు అవిద్యా శేషం వుంటుంది కాబట్టి, వారి ఇంద్రియలయం సావశేషలయమై వుంటుంది.

         
శృతి ప్రమాణాలిట్లావున్నాయి. (బృ.దా.ఉ.4.4.1) ఇట్లా జీవుడు ప్రవేశించిన తర్వాత హృదయం ప్రకాశిస్తుంది. ఆ అప్రకాశం సూచించినమార్గం ద్వారా జీవుడు నిష్క్రమిస్తాడు. (8.8.6.) హృదయములో నూటఒక్క ముఖ్యమైన నాడులున్నాయి. అందులో మూర్థం వైపుకు పోయే ఒక నాడి వుంది. దానిద్వారా పైకి పోయే జీవుడు అమృతత్త్వాన్ని పొందుతాడు. మిగతా నాడులు కేవలం బయటకు పోవటానికి మార్గాలుగానే వుంటాయి. వాటినుండి నిష్క్రమించిన వారికి బ్రహ్మలోక ప్రాప్తి లేదని తెలుస్తోంది. సూ: "తదోకో-గ్రజ్వలనం తత్ప్రకాశిత ద్వారః  విద్యా సామర్థ్యాత్, తచ్ఛేష గత్యనుస్మృతి యోగాచ్ఛహార్థామగ్రహీత శ్శతాధికయా "| సగుణ బ్రహ్మవేత్త యొక్క ఆత్మ శరీరం నుండి నిష్క్రమించేటప్పుడు జీవునికి వాసస్థానమైన హృదయం యొక్క చివరి భాగంలో ఒక విధమైన జ్వలనం కలుగుతుంది. దానిచేత ప్రకాశింపజేయబడిన మార్గం కలవాడై హృదయంలో అధివసించియున్న బ్రహ్మము చేత అనుగ్రహింప బడినవాడై బ్రహ్మవిద్యా సామర్థ్యం వల్లనూ, బ్రహ్మవిద్యకు అంగంగా చెప్పబడిన గతిని ధ్యానించడం వల్లనూ, నూట ఒకటవది అయిన మూర్థన్యనాడి (సుషుమ్న) మార్గాన నిష్క్రమిస్తాడు. వాగీంద్రియం ఉపసంహ రింపబడటం జీవుడు హృదయస్థానాన్ని ప్రవేశించడం, హృదయాగ్రం ప్రకాశించడం అనేవి జ్ఞానికి, అజ్ఞానికి సమానమే. దీనివల్ల నిర్గమించేమార్గం ప్రకాశితమౌతుంది. అయితేజ్ఞాని మూర్థస్థానంలో వున్న సుషుమ్న నాడీ మార్గాన నిష్క్రమిస్తాడు. అమృతత్త్వాన్ని పొందుతాడు. అజ్ఞానులు శరీరమందలి ఇతరద్వారాల గుండా, కండ్లు, ముక్కులు చెవులు మున్నగు వాటి ద్వారా నిష్క్రమిస్తారు.

            సూ: "అతశ్చాయనేపి దక్షిణే" విద్యాఫలమనేది నియతంగా వుండేది కాబట్టి దక్షిణాయనంలో చనిపోయిన ఉపాసకునికి సైతం బ్రహ్మలోక ప్రాప్తి ఉంది.  వేచి ఉండనక్కర లేదు. ఉత్తరాయణం అంతే కేవలం కాలాని చెప్పే విభాగం కాదు. ఉత్తరాయణాభిమానియైన దేవత అని అర్థం. కాలాభిమాని అయిన ఆ దేవత అన్ని కాలాల్లొనూ వుంటాడు. ఉత్తరాయణ మరణం మంచిదని అజ్ఞానులైన వారి విషయంలో చెప్పినారట. భీష్ముడు ఉత్తరాయణం కోసం ప్రతీక్షించడం అనేది లోకాచారం కోసం, తండ్రి తనకు ఇచ్చిన స్వచ్ఛంద మరణమనే వరం యొక్క శక్తిని వెల్లడించడం కోసం అని మనం గ్రహించాలి. (భీష్ముడు కూడా తక్కువ వాడేమీ  కాదు. అష్టవసువులలో ఆఖరి వాడు. కామధేనువు శాపమువలన మానవునిగా మిగిలిన వసువులతో పాటు జన్మించాడు. గంగ శంతనుని ద్వారా కని, నీటిలో పడవేసిన ఏడుగురు శిశువులూ మిగిలిన వసువులు.) 

            సూ: "సంపద్యావిర్భావ స్వేన శబ్డాత్" ప్రకాశ స్వరూపమైన ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది ఆ ఆత్మరూపంలో విద్వాంసుడు ఆవిర్భూతుడౌతాడు. 


            సూ: "అనావృత్తిః శబ్దాను
వృత్తిః శబ్దాత్" (చివరి సూత్రం) అర్చిరాది మార్గం గుండా బ్రహ్మ లోకానికి పోయిన ఉపాసకులకు పునరావృత్తి లేదు. పునరావృత్తి లేదు. 

 (మీ స్పందనల కోసం ఎదురు చూస్తూ వుంటాము. దయచేసి                               www.tatvavisleshana.weebly.com ను దర్శించండి.)

No comments:

Post a Comment