Sunday, July 15, 2012

నాదము

             మనం గతములో ఒకచోట 'ఓం'కారము లోని అర్థమాత్ర (నాదము) గురించి చెప్పు కున్నాము. ఇప్పుడు దాని గురించి వివరంగా తెలుసుకుందాము . దీనిని స్థూలంగా 'ఓం' అని అంటారు. 'ఓం' అంటే, అకార, ఉకార, మకార, అర్థమాత్రల సమ్మేళనము. ఇందులో నాదము ఎక్కడ వుంది? అనే ప్రశ్నవెంటనే వస్తుంది. నాదము, ఓంకారాన్నిఅనుష్ఠించడంలోను, అను సంధానించడంలోను సాధింపబడుతోంది. శ్రీవేటూరి వారు 'ఓంకార నాదానుసంధానమౌ' అని ప్రయోగించారు. అదిఎలాగో ఒకసారి చూద్దాం. మనం 'ఓం' అని ఒక్కసారి ఉచ్ఛరించి వదిలి వేయరాదు. దానిని మనఊపిరి, శక్తి ఉన్నంతవరకూ సాగదీసి, తదుపరిదాన్ని మన మనస్సుతో పొడిగించాలి. అలా చేయగా, చేయగా, ఒకానొక పరిస్థితిలో, ఓం కారములోని అ, ఉ, మ లనే అక్షరాలు లయించి పోయి, అక్షరం లేని శబ్దం మాత్రమే మిగులుతుంది. దీన్నే నాదము, నాద బిందువు అని అంటారు. ఈ భావంతోనే, శ్రీశంకరాచార్యులవారు అమ్మవారిని 'సౌందర్య లహరి'లో  'నాదబిందు కళాధరి' అని కీర్తించారు. ఈ నాదబిందు సాధనకు ఓంకారమొక్కటే సులభమార్గం. దీనిని పరిచయం చెయ్యడం కోసమే ఒకసారి 'మాండలిన్' పై 'నమక చమక ములు' పలికించడం జరిగింది.  ఈ నాదబిందువు గురించి, పెద్దలు, సనాతనులు ఏమి చెప్పారో ఒకసారిచూద్దాం. ఇక్కడ ప్రసంగవశాత్తు 'ఓం' అని వచ్చినా దానిని నాదబిందువుగానే పరి గణించ వలసినదిగా ప్రార్ధన. నాద బిందువు యొక్క భౌతిక రూపమే 'ఓం'. [ఇక్కడ ఇంకొక ప్రశ్న రావచ్చును. ఆత్మ సాక్షాత్కారం దాకా వచ్చిన తర్వాత, నాదము గురించి ఎందుకు? అని. యోగమార్గములో, పరబ్రహ్మను చేరుటకు నాద బిందువు చాలా దగ్గర దారి. (shortcut) చాలామంది నియమిత పధ్ధతి ప్రకారం ముందుకు సాగ వలసి వస్తుంది. కాని, జన్మతః జ్ఞాన పరంగా, యోగపరంగా ఒకింత పరిణితి, పరిపక్వత సాధించిన వారికి, ఇటువంటి పద్ధతులు సనాతనులు సూచించారు. అటువంటి వారికిది చాలా సులభము. తెలుసుకొని, జాగ్రత్తగా అనుసరించేవారికి కూడ ఇది సులభ మార్గమే అవుతుంది. మొట్టమొదటే నాదబిందువు గురించి చెపితే కొంత గందరగోళం ఉత్పన్నమయ్యే పరిస్థితి కూడ వుంది. అందువలన ఇంత వరకూ వచ్చిన తర్వాత ఇక్కడ చెపితే, కొంతమేరకు అర్థమవుతుందనే భావనతో ఇక్కడ చెప్పడం జరుగుతోంది. పాఠకులు  గమనింప ప్రార్థన.)     
      
             అధర్వశిరోపనిషత్ 5వ ఖండంలో ఓంకారమునకు ఈ దిగువ తెల్పిన 9 నిర్వచనములు నీయబడినవి.

1. అథఃకస్మాదుచ్యతే ఓంకారః? యస్మాదుచ్ఛార్యమాణయేవ స్సర్వం శరీరమ్ మూర్థ్వమున్నయతి, తస్మాదుచ్యతే ఓంకారః|  ఓం అని పలుకుటకు  ప్రయత్నించిన వెంటనే దేహమంతయు, అనగా కుండలిని ముఖద్వారము మొదలుకొని, ఏకాదశ ద్వారములుకల దేహమునంతయూ ప్రాణవాయువు ఊర్ఠ్వభాగమునకు లేవ దీయును. కావున ఓంకార మనబడుచున్నది.

2.
అథఃకస్మాదుచ్యతే ప్రణవః? యస్మాదుచ్ఛార్యమాణయేవ ఋచో, యజూగ్ మ్ షి, సామధర్వాంగి రసశ్ఛ యజ్ఞే బ్రహ్మణేభ్యః ప్రణామయతి| తస్మాదుచ్యతే ప్రణవః| ఎందువలన ఉచ్ఛరింపబడుచుండగనే, ఋక్కులను, యజస్సులను, సమములను, అథర్వవేద మంత్రములను, షడంగములు మున్నగు వాటిని, జపయజ్ఞము  నందు బ్రహ్మవర్చస్సును, తన్నుచ్చరించు వారిచే పొందింప జేయుచున్నందున, ప్రణవమని చెప్పబడుచున్నది.
 
3. అథఃకస్మాదుచ్యతే సర్వవ్యాపీ? యస్మాదుచ్ఛార్యమాణయేవ సర్వాన్ లోకాన్ వ్యాప్నోతి, సేహోయథా పలలపిండం, శాంతమూలమోతప్రోత మను ప్రాప్య సర్వం వ్యతిశిష్టస్త స్యైవాను విద్ధం వ్యతిశిష్ట స్తస్మాదుచ్యతే సర్వవ్యాపీ| ఉచ్ఛరింపబడుచుండగనే కర్మఫలభూతములగు భూమ్యాకాశాది సకల లోకములను, నువ్వులపిండి ముద్దలో చమురు ఎట్లు వ్యాపించియున్నదో అట్లు శాంతమూల మగు ఓతప్రోతమగు జగత్తును అనుసరించి పొంది మిగిలియున్నదో, అందువలన సర్వవ్యాపీ అని చెప్పబడును. (బట్టలు నేయునపుడు ఉపయోగించే నిలువు అడ్డ దారములను సంస్కృతములో ఓతప్రోతము లంటారు. తెలుగులో పడుగు, పేక లంటారు. వస్త్రములో నిలువు, అడ్డ దారము లెటుల వ్యాపించి ఉన్నవో, ఓంకారము కూడ ఈజగత్తులో అలా వ్యాపిస్తుంది.) 

4.
అథఃకస్మాదుచ్యతే అనంతః? యస్మాదుచ్ఛార్యమాణయేవ ఆద్యంత నోపలభ్యతే, తిర్యగూర్థ్వ మాధస్తాత్తస్మా దుచ్యతే అనంతః| ఉచ్ఛరింపబడుచుండగనే ఆదియు అంతము కనబడుటలేదో, అష్టదిశలందును, అధోభాగము నందును ఆద్యంతములు కనబడుటలేదో, అందువలన అనంతమని చెప్పబడుచున్నది. 

5.
అథఃకస్మాదుచ్యతే తారమ్?యస్మాదుచ్ఛార్యమాణయేవ గర్భజన్మజరామరణ సంసార మహాభయాత్తారయతి, తస్మాదుచ్యతే తారమ్| ఉచ్ఛరింపబడిన వెంటనే గర్భవాసక్లేశము, జనన కాలికాబాధ, ముదిమి, చావు మున్నగునవికల సంసారమునుండి తరింప జేయుటవలన తారమని చెప్పబడుచున్నది.

6. అథఃకస్మాదుచ్యతే సూక్ష్మమ్?యస్మాదుచ్ఛార్యమాణయేవ సూక్ష్మోభూత్వాపరశ్శరీరాణ్యే వాధి తిష్టతి , తస్మాదుచ్యతే సూక్ష్మమ్| ఉచ్ఛరింపబడుచుండగనే అతి సూక్ష్మమునై, స్థావరజంగ మాత్మకములగు భూతముల యొక్క శరీరములను ఆధీనము చేసికొనుచున్నది. కావున సూక్ష్మమనబడుచున్నది.

7.  
అథఃకస్మాదుచ్యతే శుక్లమ్?యస్మాదుచ్ఛార్యమాణయేవ క్లందతే, క్లామయతే, తస్మాదుచ్యతే శుక్లమ్| ఉచ్ఛరింపబడుచుండగనే లోపలధ్వని చేయగలుగుచున్నదో, నాడీగణోత్పన్న దోషము లను నాశనము చేయుచున్నదో, అజ్ఞాన తత్కార్యములను నాశనము చేయుచున్నదో, అందు వలన శుక్లమన బడుచున్నది. 

8.
అథఃకస్మాదుచ్యతే వైద్యుతమ్?యస్మాదుచ్ఛార్యమాణయేవాతి మహతి, తమసి సర్వం శరీరమ్ విద్యోతయతి , తస్మాదుచ్యతే వైద్యుతమ్|  ఉచ్ఛరింపబడుచుండగనే అత్యంత గాఢమైన అంధకారమునందు, లేదా అజ్ఞానమునందున్న సకల దేహమును ప్రకాశింపజేయు చున్నదో, అందువలన వైద్యుతమనబడుచున్నది.

9.
అథఃకస్మాదుచ్యతే పరంబ్రహ్మ?యస్మాదుచ్ఛార్యమాణయేవ బృహతి, బృహయతి, తస్మా దుచ్యతే పరంబ్రహ్మ| ఉచ్ఛరింపబడుచుండగనే వృద్ధిని పొందుచున్నదో, అన్యములైన వాటిని వృద్ధి పొందింప జేయుచున్నదో, అందువలన పరబ్రహము అని చెప్పబడుచున్నది.

     పై నిర్వచనములు పరిశీలించినచో, ఓంకారము ఊర్ధ్వముఖముగా ప్రయాణము చేయుటకు, అనగా యోగామార్గామునకు మార్గదర్శి. సర్వవేద, సర్వ మంత్రార్థము. సర్వ ప్రపంచమునందు వ్యాపించియున్నది. జన్మ, జరా, మృత్యు బాధా రాహిత్యము కలుగజేయు నది. సంసార మహా భయనాశకము. అత్యంతసూక్ష్మము. సర్వభూతములను వశీకరించునది. భౌతికముగా ఉచ్ఛ రించినచో, లోపల అనగా మానసికముగా స్పందన కలుగజేయునది. నాడులలో ఉత్పన్నమైన దోషములను పరిహరించునది. ప్రకాశస్వరూపము. తాను వృద్ధిపొందుతూ, సాధకుని వృద్ధి పొందించునది అని విశదమగుచున్నది. ఇన్ని గుణములు కలది మరొకటి ఈ ప్రపంచములో కనబడుటలేదు. ఇటివంటి ఓంకారము అదే నాదబిందువు నిరాకార పరమాత్మ ను చేరుటకు ఉపయోగపడుననుటలో ఎటువంటి సంశయము లేదు.

         'కైవల్యోపనిషత్' 10వ శ్లోకములో, "ఆత్మానమరణింకృత్వా ప్రణవం చోత్తరారణి, జ్ఞాన నిర్మధనాభ్యాసాత్పాశం దహతి పణ్డితః| తన్ను అధారారణి గాను, ప్రణవము నుత్త
రారణి గాను గావించుకొని, జ్ఞానాభ్యాసమను మథనముచే బ్రహ్మజ్ఞాని అజ్ఞానమను పాశమును దహించు చున్నాడు." అని చెప్పబడినది. అరణి అంటే యజ్ఞములో అగ్నిని పుట్టించుటకు చెక్కతో చేసి నటువంటి సాధనము.అధారారణిని నేలపైవుంచి, దానిరంధ్రములో నుత్తరారణినుంచి వేగముగా త్రిప్పినచో అగ్ని జనించును. ఈవిధముగా సాధకుడు తన్నుఅధారారణిగను, ఓంకారమును నుత్తరారణిగాను భావించి, జ్ఞానమథనముగావించినచో, అజ్ఞానపాశము దహించబడును. దీనిని బట్టి నాదబిందూపాసన అజ్ఞానాంధకారమును పోగొట్టుననుటలో సందేహము లేదు. సాధకు నికి మొదట అజ్ఞానము పూర్తిగా నశిస్తేనే గాని, ముందుకు వెళ్ళలేడు. కాబట్టి సాధకునికి ఇది చాలా ముఖ్యమైనది.

         నాదబిందువు యొక్క ఉత్పత్తిస్థానములను 'అమృతనాదోపనిషత్' చక్కగా వివరించినది. "అఘోష మవ్యఞ్జన మస్వరంచ, మత్తాలు కంఠోష్ఠ మనాసికంచ యత్, అరేఫజాత ముభయోష్మ వర్జితం,యదక్షరం నక్షరతే కథంచిత్ | మాత్రాలిఙ్గపదంత్యక్త్వాశబ్దవ్యంజనవర్జితం,అస్వరేణ మకారేణ పదం సూక్ష్మంహి గచ్ఛతి| ఘోషవ్యంజన స్వరతాలుకంఠో
ష్ఠ నాసికముల సంబంధము లేనిదియు, రేఫము నుండి పుట్టినది కనిదియు, ఉభయోష్మవర్జితమునగు ఏ అక్షరము కలదో, అది ఎన్నడునూ నశింపనిదై యున్నది. శబ్దవ్యంజన రహితమైన, అకార, ఉకార, మకారమను మూడు మాత్రల గుర్తులతో కూడిన ఓంకార పదమును విడచి, స్వర రహితమగు అర్థమాత్రతో,  అనగా ప్రణవముయొక్క తురీయమగు అర్థమాత్ర సహాయమున, కేవలపదమును,తురీయాతీత మగు పరబ్రహ్మపదమును పొందుచున్నాడు." మొదటిశ్లోకమును పరిశీలించినచో ఉపనిషద్రష్ఠ యొక్క స్వరవిజ్ఞానము అనగా శరీరమందు శబ్దోత్పన్నస్థానముల యొక్క విజ్ఞానము, ఎంత కలదో, తెలియుచున్నది. అచ్చులు, హల్లులు, స్వరము కానిది, తాలువు, కంఠము, ముక్కు మున్నగు వాటినుండి పుట్టినది కానిది, రేఫము కానిది(ర్ర్ర్ ర్ కానిది), పెదవులనుండి పుట్టినది కానిది, ఏ అక్షరమైతే వున్నదో, అది నాశనము లేనిది అని విశదీకరించారు. దీనిని బట్టి నాద బిందువు భాష నుండి కాని, శరీరము నుండి కాని ఉత్పన్నము కాదు అని, మానసికముగా మాత్రమే సాధ్యపడునని తెలుయుచున్నది. ఇక రెండవ శ్లోకములో, దీని ద్వారా తురీయాతీత మైన పరబ్రహ్మ పదమును చేరుకొనవచ్చునని, రూఢిపరచుచున్నారు. ఈ ఉపనిషత్ లోనే, 32, 33వ శ్లోకములలో, ఓంకారము ఇంకనూ నిశితముగా పరిశీలింపబడినది. "పార్థివః పంచ మాత్రస్తు, చతుర్మాత్రస్తు వారుణః, ఆగ్నేయస్తు త్రిమాత్రో, వాయువ్యస్తు ద్విమాత్రకః| ఏకమాత్ర స్తదాకాశో, హ్యమాత్రంతు విచిన్తయేత్, సంధిం కృత్వాత్ మనసా, చింతయే దాత్మనే నాత్మని|" "శబ్దస్పర్శరూపరసగంధములను పంచమాత్రలతో కూడినది పార్థివ ప్రణవము. శబ్దస్పర్శ రూపరసములను నాలుగు మాత్రలతో కూడినది వారుణ ప్రణవము. శబ్దస్పర్శరూపములను మూడు మాత్రలతో కూడినది ఆగ్నేయ ప్రణవము. (ఇక్కడ ఆగ్నేయమంటే దిక్కు కాదు, పంచ భూతములలో అగ్నిభూతము) శబ్దస్పర్శలను రెండుమాత్రలతో కూడినది వాయువ్య ప్రణవము. (ఇక్కడకూడా దిక్కుకాదు,వాయుభూతము)శబ్దమను ఒక్కమాత్రతో కూడినది ఆకాశప్రణవము. మాత్రారహితమైనది ఆమాత్ర ప్రణవము. అట్టి ఆమాత్ర ప్రణవమును ఆత్మతోజేర్చి, ఆత్మయందు, ఆత్మను ధ్యానించవలెను." ఈ వివరణలో ఓంకారమునకు, పంచ మహాభూతములకు గల సంబంధం వివరింపబడినది. ఓంకారమును, మానసికముగా నిరంతరముగా పొడిగించి భావిస్తూ ఉన్నచో, క్రమముగా ఒక్కక్క మాత్ర, ఒక్కొక్క మహా భూతము లయించి, చివరకు ఆమాత్ర ప్రణవము మిగులును. నాదబిందు వంటేఇదే. మనకు తెలుసున్నంతలో, శుద్ధ గమ్భీర నిరాకార పరమాత్మ స్వరూపముతో పోల్చతగినది ఏదైనా వుంటే, అది నాద బిందువొక్కటే! ఈ నాద బిందువును ఆత్మతో జేర్చి ఆత్మను ద్యానింప వలెను. ఇందులో మొదటిది మన ఆత్మ. రెండవది దీనికి మూలమైన పరమాత్మ. పరమాత్మను   ధ్యానించడానికి దాని అంశమైన ఆత్మ వల్లే అవుతుంది. కాబట్టి అలా చెప్పారు. ఇక్కడ మనం ఇంకొక ఉదాహరణ చెప్పుకోవాలి. మోషేకి యోహావా (బైబిల్ పరిభాషలో పరమాత్మ) కొండ గుహలో అగ్నిజ్వాల రూపములో కనిపించి నపుడు, మోషే నీ గురించి ప్రజలకి ఏమని చెప్పాలి? అని అడిగినప్పుడు, ఆయన 'Tell them, 'I am that I am"'  అని అంటారు. ఇది చాలా ముఖ్యమైన వాక్యం. మన నాలుగు మహా వాక్యాల వంటిది. ఇందులో మొదటి 'I' పరమాత్మ, రెండో 'I' ఆత్మ. ఎన్నిరకాలుగా చెప్పుకున్న, దీని అసలు అర్థం ఇదే. కాబట్టి పరమాత్మను పట్టుకోవడానికి ఆత్మే సరియైన సాధనం. ఇటివంటి సాధనమైన ఆత్మకి, నిరాకార పరబ్రహ్మతో సరిసమానమైనటువంటి నాద బిందువును అను సంధానించి ధ్యానం చేస్తే, తప్పక పరబ్రహ్మ యొక్క అపరోక్షానుభవము కలుగుతుంది. 

            బ్రహ్మవిద్యోపనిషత్ నందు ఓంకారము యొక్క భౌతిక రూపమును చక్కగా వివరించి నారు. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ యదుక్తం బ్రహ్మ వాదిభిః, శరీరమ్ తస్యవక్ష్యామి, స్థానం కాలం లయా తథా| తత్ర దేవాస్త్రయః ప్రోక్తాః లోకావేదాస్త్రయోన్నయః, తిస్రో మాత్రార్థమాత్రాచ ఆక్షరాస్యశ వస్యచ| బ్రహ్మవేత్తలగువారు 'ఓం' అను ఏకాక్షరమునే బ్రహ్మమని చెప్పుచున్నారు. ఆ బ్రహ్మా వలంబన భూతమగు ప్రణవము యొక్క స్థానకాల మాత్రాది వివరణము చెప్పబడినది. 'అ' కారమునకు, ఋగ్వేదము, గార్హపత్యాగ్ని, పృధివి, బ్రహ్మ, సూర్యకాంతి, దక్షిణ నేత్రము. 'ఉ' కారమునకు, యజుర్వేదము, దక్షిణాగ్ని, అంతరిక్షము, విష్ణువు, చంద్రకాంతి, వామ నేత్రము. 'మ' కారమునకు సామవేదము, అహవనీయాగ్ని, ద్యులోకము, ఈశ్వరుదు, అగ్నికాంతి, తృతీయ నేత్రము, లేదా ఆజ్ఞా చక్రము. ఈ త్రిమాత్రా ప్రణవము యొక్క ఊర్థ్వమందు అర్థమాత్ర ప్రకాశింపుచున్నది. అనగా ఆజ్ఞా చక్రమునకు పైభాగమునందు, అనగా సహస్రారమునందు అర్థమాత్రాస్థానము. అనగా నాద బిందూపాసన ఆజ్ఞా చక్రమున మొదలై సహస్రారమును చేరును. ఇది ధ్యానయోగములో అత్యంత ముఖ్య మైనది. అత్యున్నత స్థానమైనటువంటి ఆ సహస్రారమును చేరుటకు నాద బిందువు ఒక ముఖ్య సాధనము.

             యోగశిఖోపనిషత్ ప్రణవమును లింగమని నిర్వచించినది. "సుక్ష్మాత్వా త్కారణత్వా చ్ఛలనా ద్గమనాదపి, లక్షణాత్పరమేశస్య లిమ్గామిత్యభిధేయతే| అతి సుక్ష్మమగుట చేతనూ, సర్వకారణ మగుటచేతనూ, అన్నిటినీ తనయందు లీనము చేసుకొనుట చేతనూ,
అన్నింటి యందు చేరియుండుట చేతనూ, పరమేశ్వరుని లక్షణములు కలిగి యుండుటచేతనూ, ప్రణవము లింగమని చెప్పబడు చున్నది." దీని బట్టి లింగ స్వరూపము ప్రణవమని తెలుయు చున్నది. లింగాకారమును పరిశీలించినచో, ఒకానొక రూపమును కలిగి యున్ననూ, నైరూప్య మగుటచేత, ఆ రూపమిది యని ఖచ్చితముగా చెప్పలేము. సాకార స్వరూపము నుండి మనస్సు ను నిరాకార స్వరూపము లోనికి మార్చుటకు ఒక సాధనముగా లింగ స్వరూప మేర్పడి యుండునని ఒక భావన. కావుననే ప్రణవము లింగమని భావింపబడినది. నిరాకారో పాసనకు నాద బిందువే సరియైన సాధనము.

             యోగ వాశిష్టము, ఉత్పత్తి ప్రకరణములో శ్రీవశిష్టులవారు శ్రీ రామచంద్రులవారికి ఈ రకంగా బోధించారు. "ఓంకారో
చ్ఛరణప్రాప్త శబ్ద తత్త్వానుభావనాత్, సుషుప్తో సంవిదోజాతే, ప్రాణ స్పందో నిరుద్ధ్యతే| ఓంకారము నుచ్ఛరించుచూ, అద్దాని అర్థమును చింతన చేయుట వలన బాహ్య పదార్థ జ్ఞానము సంపూర్ణముగా నుపశమింప ప్రాణ స్పందనము నిరోధింప బడును." శ్రీవశిష్టులవారు దీనికి ఉదాహరణ కుడా ఇచ్చారు. "ఇతి సంచింత యన్నేవ బలిః పరమ కోవిదః, ఓంకారార్థ మాత్రార్థం భావయన్మౌనమాస్థితం, సంశాంత సర్వసంకల్పః ప్రశాంత కల్పనా గణః| ఈ ప్రకారముగా చింతన చేయుచూ మహాజ్ఞాని యైన బలిచక్రవర్తి, సమస్త సంకల్ప ములు లెస్సగా శమించినవాడై, కల్పనా సమూహవర్జితుడై, ఓంకారము యొక్క అర్థమాత్రార్థ మగు తురీయాత్మను భావించుచూ (స్వాత్మ స్వరూపమును అనుభవించుచూ), మౌనముగా నుండెను."  దీనిని బట్టి శ్రీరామచంద్రునికే పూర్వీకుడైన శ్రీబలిచక్రవర్తి కాలము నుండియే ఈ నాదబిందూపాసన కలదని ఋజువగుచున్నది. 

         ఇంకనూ శ్రీ వశిష్టులవారు శ్రీరామచంద్రులవారికి, నిర్వాణప్రకరణములో ఇలాసూటిగా ఆదేశించారు. "ఒమిత్యుదస్తభవ వాసనమేకమాస్స్వ్య నత్వం నచాహమపి నానది హస్తి సత్యం|" ఓ రామచంద్రా! నీవు ఓంకారము యొక్క మొదటి మూఉడు పాదములు (అకార, ఉకార, మకారములు)నాల్గవపాదమున (అర్థమాత్రలో)లయమొనర్చి, (అనగా నాదబిందువును సాధించి) సంసార వాసనా రహితుడవై, ఏక తురియా రూపుడవై, యుండుము"

           ఈ రకమైన మునిప్రోక్త, ఉపనిషత్ వాక్యోపదేశమైన మార్గము ద్వారా సాధకుడు పర బ్రహ్మము యొక్క  అపరోక్షానుభూతి పొందవలయును.

            ఈ సారి కలుసుకున్నప్పుడు, నాదము యొక్క తదుపరి స్థాయి యైన 'తేజస్సు' గురించి తెలుసుకుందాము.

(మీ స్పందనల కోసం ఎదురు చూస్తూ వుంటాము. www.tatvavisleshana.weebly.com ని దర్శించండి.) 

1 comment:

  1. నాదబిందు స్వరూప తత్త్వ విశ్లేషణ, విచారణ నభూతో.

    ReplyDelete