Sunday, August 12, 2012

ధన్యవాదములు

                              ధన్యవాదములు             మా యొక్క వెబ్ సైట్ "www.tatvavisleshana.weebly.com" ను అచిరకాలములోనే 500 మంది సందర్శించినారు. ఇం   మా యొక్క వెబ్ సైట్ "www.tatvavisleshana.weebly.com" ను అచిరకాలములోనే 500 మంది సందర్శించినారు. ఇందుకు కారకులైన ప్రతి ఒక్కరికీ మాధన్యవాదములు తెలియజేయు చున్నాము. భవిష్యత్తులో కూడ ఇటువంటి ఆదరణనే చూపిస్తారని అభిలషించుచూ మరియు మీయొక్క అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేస్తారని అశిస్తూ  = తత్వవిశ్లేషణ టీం.     చున్నాము. భవిష్యత్తులో కూడ ఇటువంటి ఆదరణనే చూపిస్తారని అభిలషించుచూ మరియు మీయొక్క అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేస్తారని అశిస్తూ             

Thursday, August 2, 2012

విదేహముక్తి - మోక్షము

                                        విదేహ ముక్తి - మోక్షము
          మనం జీవన్ముక్త లక్షణాలు, ప్రాణోత్క్రమణముల గురించి తెలుసుకున్నతర్వాత ఇక మిగిలింది విదేహముక్తి. అంటే మోక్షమే. దీని గురించి తెలిసింది చాలా తక్కువే. పరబ్రహ్మ స్వరూపమన్నా, మోక్షమన్నా ఒక్కటే. కాని మనలాటి వాళ్ళ కోసం పెద్దలు, ఆత్మవంతులు కొంత తెలియచెప్పారు. లభ్యమైనంత వరకు దానిగురించి తెలుసుకుందాము.

మహోపనిషత్:తృతీయాధ్యాయము:
        జీవన్ముక్తుడు తన శరీరము పడిపోయిన సమయములో, శ్వాస ఆగిపోయిన వెంటనే జీవన్ముక్త పదవిని దాటి, విదేహముక్త పదవిని అధిష్టించు చున్నాడు. విదేహముక్తుడు జన్మించడు, మరణించడు. అతడు నిర్వికారుడై యున్నాడు. సత్తు, అసత్తు కాడు. దూరము దగ్గర కాడు. అహము కాడు. తదితరము కాడు. ఆ జీవన్ముక్తుని స్థితి ఎట్టిదనగా, అత్యంత నిశ్చలము, మహా గంభీరమునై యుండును. అది ప్రకాశము, చీకటియు కాదు. మహా వ్యాపకమై, అద్వితీయమై సర్వత్ర నిండియుండును. అనాఖముగా, అనభివ్యక్తముగా అతీతముగ నొక్కటి శేషించి యుండును. అది శూన్యము, సాకారము, దృశ్యము, దర్శనము కాదు. భూతపదార్థ సముదాయము కాదు. కేవలసత్తా మాత్రము. అనంతరూపములో సంస్థితమై యుండును. ఇదమిత్థమని వచించుటకు సాధ్యము కాదు. పూర్ణము కంటే అధిక పూర్ణముగా నుండును. అది సత్తు,అసత్తు, సదసత్తు కాదు. భావము, భావన కాదు. కేవల చిత్పదార్థము. మహాచైతన్యము. అనంతమై, అజరమై, శివమై, ఆదిమధ్యాంతరహితమై, నిరామయమై యున్నది. అనాదిసత్యపదార్థము. ద్రష్టృదర్శనదృశ్య మనేది త్రిపుటి మధ్య భాగములో కేవల దర్శనమేది కలదో అదే అది. (జీవితములొ, చూచెడిది, చూసెడి వాడు, చూచుట అనే ప్రక్రియ మూడూ వుంటాయి. కాని ముక్తదశలో ఈ మూడూ ఒక్కటే అయి వుంటాయి. ముక్తికి కారణమైన పరబ్రహ్మ, ముక్తమయ్యే ఆత్మ, ముక్తి పొందుట అనే ప్రక్రియలు మూడూ ఒక్కటే. విడివిడిగా ఏమి వుండవు.) దీనికంటే గొప్పది, ఉత్తమమైనది, మరియేదియు లేదు. ఇదియే నిశ్చయము. ఇదియే సిద్దాంతము. ఇంతకు మించి యెద్దియునూ లేదు. జీవుడు తన సంకల్పముతో బద్ధుడగుచున్నాడు. సంకల్ప శూన్యుడై విముక్తుడగుచున్నాడు. ఏ మహాత్మునకు సర్వభోగ విరక్తి కలిగియున్నదో, సర్వదృశ్యవస్తువులయందును విరక్తి కలిగి యున్నదో అట్టి వానికి కూడ నియ్యది స్వసంవేద్యమే. పూర్ణ హృదయము గల నీకు ప్రాప్తవ్య మంతయూ ప్రాప్తించియున్నది. నీ స్వరూపమై, తపస్సై యున్నది. నీవు ముక్తుడవై యున్నావు. భ్రాంతిని విడచి పెట్టుము. బాహ్యము నతిక్రమించినదియు, బాహ్యరహిత మైనదియు బుద్ధిలోపల నున్నదియునగు తత్త్వమును దర్శించుచు, దర్శిమ్పని వాడవుగా నగుము. (అనగా దానితో తాదాత్మ్యము చెందవలెనని భావము.) సాక్షిగా నున్న నీవు పరిపూర్ణుడుగా నున్నావు.

బ్రహ్మసూత్రదర్శనం:
          సూ: తదధిగమ ఉత్తర పూర్వాఘయోరశ్లేష వినాశౌ తదవ్యపదేశాత్| బ్రహ్మజ్ఞానం కలిగిన మీదట పూర్వోత్తర పాపాలన్నీ నశిస్తాయి. బ్రహ్మజ్ఞానం, ద్బ్రహ్మ సాక్షాత్కారం కలిగినప్పుడు వెనుకటి పాపాలతో, రాబోయే పాపాలతో ఎట్టి సంబంధమూ వుండదు. ఆ పాపాలు అతనిని (బ్రహ్మజ్ఞానిని) అంటవు. క్రమంగా ఉత్తరపాపం అంటదని, పూర్వపాపం  నశిస్తుందని, గ్రహించాలి. బ్రహ్మజ్ఞాని యొక్క పాపములు జ్ఞానాగ్నిలో పడి భస్మమై పోతాయి. 

          సూ: ఇతర ఇతర స్యాప్యేనమ సంశ్లేషః పాతేయ| పాపం కంటే ఇతరమైన పుణ్యానికి సైతం అంటక పోవటం, నాశనమవటం వున్నాయి. అంటే బ్రహ్మజ్ఞాని యొక్క పాపపుణ్యాలు రెండూ నశించిపోతాయి. అతనికి రెండూ అంటవు. పుణ్యమనేది నశించక పొతే, ఆ పుణ్యాలవల్ల వచ్చే ఫలాన్ని అనుభవించటానికై మళ్లీ శరీరం ధరించాల్సివస్తుంది. ఆ స్థితిలో ఇక మోక్షమనేది అసంభవమవుతుంది. అందుకే ముండకోపనిషత్తులో  అతని కర్మలన్నీ పుణ్యపాపకర్మలన్నీ క్షీణించిపోతాయి అని, బృహదారణ్యకోపనిషత్తులో బ్రహ్మవేత్త పుణ్యపాపాలు రెంటినీ తరిస్తాడనీ, ఇట్లు పాపపుణ్యాలు రెండిటికీ నాశము చెప్పబడింది. ఇక మోక్షమో, శరీరపాతమైన తర్వాత మోక్షమే! ఇక జన్మమనేది ఉండదు.

           సూ: భోగేన త్వితరేక్షపయిత్వా సంపద్యతే| ఆరబ్దాలైన పుణ్యపాపాలు అనుభవించడం ద్వారా క్షయం కావించుకొనే బ్రహ్మను పొందుతున్నాడు. బ్రహ్మజ్ఞానం కలిగినంతనే అనారబ్దా లైన (సంచితములైన) పుణ్యపాపాలన్నీ నశించి పోతున్నాయి.  ఆరబ్దమనేది దేహపాతంవరకే వుంటుంది. దేహపాతం, ఆరబ్దకర్మ సమాప్తి రెండు ఒకేసారి జరుగుతాయి.  ఈవిషయమే "తస్యతావదేవచిరం" అనే శృతి వాక్యంలో చెప్పబడ్డది. కాబట్టి ప్రారబ్ద భోగానంతరం ఇంకా అనేక దేహాల్ని ధరించడం అనేది వుండదు. దేహపాతం కలగడం ఆలశ్యం, మోక్షమే.

యోగ వాసిష్టం: ఉత్పత్తి ప్రకరణం: 9 వ సర్గ:
            14. జీవన్ముక్త  పురుషుడే దేహమును వదిలిన పిమ్మట విదేహముక్తుడగును. వాయువు స్పందమునువీడి నిశ్చలమగునట్లు విదేహముక్తుడు మరల జన్మింపడు, మరణింపడు. వ్యక్తము కాడు. దూరమునగాని, దగ్గరగాని యుండడు. నేను, ఇతరులు అనే దృష్టి అతనికుండదు. ఈ విదేహముక్తుడే పరబ్రహ్మమై వెలయును.

ఉపశమ ప్రకరణం: 71వ సర్గ:
           
1-5: అవస్థాత్రయంబుల విచారించి, సాక్షియగు చిన్మాత్రమున వాటిని లయమొందించి, శేషించునట్టి చిన్మాత్రస్థితి రూపమగు తురీయావస్థ యొక్క యనుభవమెంత వరకూనుండునో, అంతవరకే జీవన్ముక్తుల యొక్కయు, వేదవాక్యముల యొక్కయు కేవలపదముండును. మనుజులకాకాశము విషయము కానట్లు, తురీయమునకు తురీయాతీతపదము, విదేహ, జీవన్ముక్తులకు వేదవాక్యము కూడ విషయము కానేరదు. ఆ విశ్రాంతపదవి అన్నింటి కంటే యతి దూరమున కలదు. వాయువునకాకాశామువలె, విదేహముక్తులకు
గమ్యమై యలరు చున్నది. జ్ఞాని కొంతకాలము సుషుప్తావస్థ యందు, కొంతకాలము జాగ్రత్ స్థితి ననుభవించి యుండి, పిదప పరమానందపూరితుడై తురీయపదమును పొందును. తురీయాతీత పదమెరింగిన ఆత్మజ్ఞులెట్లా తురియాతీతదశ నొందుచున్నారో, అటులనే నివున్నూ ద్వంద్వ రహితమగు యా పదము నొందుము.

           52-56: ఆ శరీరము లన్నింటియందు నామరూపముగ పరమాత్మ యొక్క (కల్పిత యజ్ఞానముచే ప్రసిద్ధమగు) సర్వశక్తి కలదు. ఇక్కారణమున స్వయముగా నా పరమాత్మ కల్పితయజ్ఞానరూపుడై సుషుప్తి ప్రళయము లందు స్థితి కలిగియున్నాడు. ప్రతిబింబదశ నొందిన పరమాత్మచే భూషితమగు నా యజ్ఞానమే జీవుడనబడుచున్నది. (ఎప్పుడైతే ఆత్మ అజ్ఞానము లో పడిందో, అప్పుడది జీవుడని పిలువబడుతోంది. ఆ అజ్ఞానం తొలిగితే, అదే ఆత్మ, పరమాత్మ కూడా.) ఆ జీవుడే సంసారమున మహామోహామయాత్మకమగు 'మాయ' యను పంజర మందలి గజమగును. జీవ (ప్రాణ) ధారచే నది జీవుడనంబడుచున్నది. అటులనే యహంకరించుటచే, అహంకారమనియు, నిశ్చయించుటచే బుద్ధియనియు, సంకల్ప వికల్పముల నొనర్చుటచే మనంబనియు, మనోదేహాదులకు కారణమగుటచే ప్రకృతియనియు, వర్థిల్లుటచే దేహమనియు, అజ్ఞానాధిక్యముచే జడమనియు, చైతన్యప్రాదాన్యముచే చేతన మనియు, వచింపబడుచున్నది. అజ్ఞానతత్సాక్షుల మధ్యగల పరమాత్మభావసహితమగు మనస్సను తత్త్వమే అనేకత్వము నొంది, జీవ, బుద్ధి, చిత్తాహంకారాది నానా సంజ్ఞల ధరించు చున్నది. (ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పారు. ఒకానొక సున్నితమైన, సంక్లిష్టమైన తురీయదశకు వెళ్లేసరికి, ఆత్మ, జీవుడు, అంతఃకరణలు ఇవన్నీ ఒక్కటే! వేరు వేరు కావు. ఆయా దశలలో ఆయా పేర్లతో పిలువబడే 'ఆత్మ' అదొక్కటే!  జ్ఞానసంహితమైతే
అదే పరమాత్మ కూడా!

            72వ సర్గ:32-43: అసమ్యక్(మిధ్యా) దర్శనము త్యజించి, సమ్యక్ దర్శనము నవలంభింపుము. సమ్యక్ దర్శనమున స్థిరుడగు వాడెచటను విమోహితుడు కాడు. దృశ్య దర్శన సంబంధ విస్తారముచే మనోరూపమగు ఆత్మయే ప్రకాశించుచున్నది.
దృశ్యదర్శన సంబంధమున గల్గు పరమాత్మ సంబంధమగు అనుభవరూప  సుఖవృత్తియు ఉపాధికృత భేద నిరసముచే గలుగు సుఖమున్ను అఖండబ్రహ్మమే యగును. కాన యనుభవమే సారమగు బ్రహ్మమని పేర్కొనబడినది. దృశ్యదర్శన సంబంధమున గల సర్వూత్తమమగు సుఖానుభవమే అజ్ఞానులకు సంసారమున్ను, జ్ఞానులకు మహాభ్యుదయ యుక్తమగు మోక్షమున్ను గలుగ జేయుచున్నది. మరియు దృశ్యదర్శన సంబంధమునగల యనుభవరూపమగు సుఖమే ఆత్మ యొక్క దేహమని ఎన్నబడినది. ఆ సుఖమే దృశ్య(విషయ)ముతో గూడినచొ బంధనమనియు, దృశ్యరహితమయినచో ముక్తియనియు వచింపబడినది. దృశ్యదర్శన సంబంధమున గల సుఖసంపత్తు వికారరహితమై, వృద్ధిక్షయములు లేనిదగుచో, ముక్తి యనియే విజ్ఞులచే దలంపబడినది. దృశ్యదర్శన సంబంధమునగల యనుభవమే అఖండపూర్ణానందస్వరూపమగు (పర)బ్రహ్మమగును. దృశ్యదర్శనవర్జితమగు సుఖము నవలంభించి, సంసారబంధరహితుడవు గమ్ము. ఇట్లు తన సుఖస్వరూపము నాశ్రయించుటనే సుషుప్తివృత్తి నాశ్రయించి, జీవునకు   స్వస్వరూపదృష్టి ప్రకాశించును. ఇవ్విధమున తురీయావస్థ సంప్రాప్తించును. ఈ స్థితియే ముక్త మని పేర్కొనబడినది. దృశ్యదర్శనవర్జితుడై పరమాత్మబుద్ధితో గూడుకొనియున్న జీవుడట్టి స్థితి నొందును. ముక్తిరూపమగు నా తురీయావస్థయందు ఆత్మ స్థూలముగాని, సూక్ష్మముగాని, ప్రత్యక్షముగాని, అప్రత్యక్షముగాని, చైతన్యము గాని, జడముగాని, సత్తుగాని, అసత్తుగాని, అహంకారరూపముగాని, దన్యరూపము గాని, ఏకముగాని, అనేకముగాని, సమీపస్థముగాని, దూరస్థముగాని, ప్రాప్యాముగాని, అప్రాప్యముగాని, సర్వరూపముగాని, సర్వవ్యాపకముగాని, పదార్థరూపము గాని, అపదార్థరూపము గాని, పంచభూతాత్మ గాని, పంచ భూతరూపము గాని, గాక యుండును.

ఉత్పత్తి ప్రకరణము:9వ సర్గ:
           
26. ముక్తి యని చెప్పబడునదే బ్రహ్మము, నిర్వాణము గూడనైయున్నది. దీనిని బడయగల ఉపాయముని చెప్పెదను వినుము. అహం బుద్ధితోగూడి కనపడు దృశ్య జగత్తం తయూ వంధ్యాపుత్రునివలె అళీకమను(స్వప్నమువలె లేనిదను) జ్ఞానము వలననే  ఈ ముక్తి కలుగును.

అన్నపూర్ణోపనిషత్:ద్వితీయాధ్యాయము:
          దృశ్యముతో కూడినది బంధము. దీని నుండి విముక్తి కల్గిన ముక్తి వచ్చును.
దృశ్య దర్శన సంబంధమున అనామయమైన ఏ యనుభూతి యున్నదో, ఆ సౌషుప్తిని స్తంభింప జేసి, నీవుండుము. అప్పుడే స్థితి కల్గునో, అదే తుర్యత్త్వమును పొందును. దానియందు దృష్టిని స్థిరముగా జేయుము. ఆత్మ స్థూలము కాదు. అణువు కాదు. ప్రత్యక్షము కాదు. ఇతరమును కాదు. అచేతనుడు, జడుడు కాదు. ఆసన్న, సన్మయుడును కాదు. నేను కాదు. అన్యుదకాను. ఏకుడను, అనేకుడను కాను. అద్వయుడను, అవ్యయుడను, సర్వేంద్రియములను కాను. స్థానమైన మనస్సు దృశ్యత్వమును పొందినది. దృశ్యదర్శన సంబంధమున పారమార్థిక సుఖమేదియున్నదో, ఆ అతీతమైన పదము దేనివలన కల్గునో అది ఇక్కడనే ఉన్నది. మోక్షము ఆకాశము పైభాగమున లేదు. పాతాళమునలేదు. భూమిమీదలేదు. అన్ని ఆశలు క్షయమును పొందగా చిత్తము క్షయమగును. అదే మోక్షమన బడును.


"న విద్యతే యస్య చ జన్మకర్మవా న నామరూపే గుణదోష ఏవ వా
తథాపి లోకావ్యయసంభవాయ యః స్వమాయయా తాన్యనుకాలమృచ్ఛతి
తస్మై నమః పరేశాయ బ్రహ్మణే-ననంతశక్తయే అరూపాయోరురూపాయ నమః ఆశ్చర్య కర్మణే
నమ ఆత్మ ప్రదీపాయ సాక్షిణే పరమాత్మనే నమో గిరాం విదూరాయ మనసశ్చేతసామపి

సత్త్వేన ప్రతిలభ్యాయ నైష్కర్మ్యేణ విపశ్చితా నమః కైవల్యనాధాయ నిర్వాణసుఖసంవిదే"
                ఎవరి జన్మము మనవలె కర్మబంధముతో జరుగదో, ఎవరిచే నహంకారప్రేరితకర్మ కావింపబడదో, ఎవరి నిర్గుణ స్వరూపమునకు నామదేయంబులు లేవో, రూపము లేదో, అయిననూ ఎవ్వరు సమయానుసారంబున జగత్సృష్టిలయంబుల గావించుచూ, స్వేచ్ఛతో జన్మంబు తనకుతా పొందునో, అట్టి అనంతశక్తి సంపన్న పరబ్రహ్మ పరమేశ్వరునకు నమస్కారము చేయుచున్నాను.  ఆ ప్రకృతి ఆకార రహితమైయ్యూ అనేకాకారంబులు గల్గియుండు అద్భుతకర్మాచరణుడైన భగవానునకు పలుమార్లు నమస్కరించుచున్నాను. స్వయం ప్రకాశమూర్తి, సాక్షీభూతుడైన పరమాత్మకు నమస్కారములు చేయుచున్నాను. ఏ ప్రభువు మనోవాక్చిత్తవృత్తులకతీతుడై సర్వత్ర వ్యాపించియుండునో వానికి పలుమార్లు నమస్కరించుచున్నాను. వివేకియైన పురుషునిచే, సత్వగుణ విశిష్టనివృత్తి  ధర్మాచరణముచే ప్రాప్తయోగ్యమైన మోక్ష సుఖంబునిచ్చువాడు, మరియు మోక్షసుఖానుభూతి రూపుడైన ప్రభువునకు నమస్కారము చేయుచున్నాను.    (వ్యాస  భాగవతము)
 "భవము దోషంబు రూపంబు గర్మంబు నాహ్వయమును గుణము లెవ్వనికి లేక
జగముల గలిగించు సమయించు కొరకునై నిజమాయ నెవ్వడిన్నియును దాల్చు
నా పరేశునకు ననంతశక్తికి బ్రహ్మకిద్ధరూపికి రుపహీనునకును

జిత్రచారునికి సాక్షికి నాత్మరుచికిని బరమాత్మునకు బరబ్రహ్మమునకు
మాటలను నెరుకల మనముల జేరంగగాని శుచికి సత్త్వగమ్యు డగుచు
నిపుణుడైన వాని నిష్కర్మతకు మెచ్చు, వాని కే నొనర్తు వందనములు."
               భగవంతునికి పుట్టుకా, పాపమూ, ఆకారమూ, కర్మా, నామాలూ, గుణాలూ లేవు. అతడు లోకాలను పుట్టించి నశింప జేయడం కోసం తన మాయాప్రభావంతో యివన్నీ ధరిస్తాడు.  రూపం లేనివాడైనా ఆశ్చర్యకరంగా అంతులేని శక్తితో నిండైన రూపాన్ని పొందుతాడు. అన్నింటినీ చూస్తాడు.  ఆత్మకాంతిలో వెలుగుతాడు. అతడే ఆత్మకుమూలం. అతడే మోక్షానికి అధికారి.అతడు మాట లకూ వూహలకూ అందరానివాడు, పరిశుద్ధుడు. సత్వగుణంతో దరిచేర దగినవాడు. నేర్పరులు చేసే ఫలాపేక్షలేని కర్మలకు సంతోషిస్తాడు. అటువంటి దేవునికి నేను నమస్కారాలు చేస్తాను. (పోతన భాగవతము)

                                                   "ఒక మనవి"
            ఇంతవరకూ గతించిన విషయాలన్నీ చదివి జీర్ణించుకున్న పాఠకోత్తములకు వేనవేల నమస్కారములు. మా పరమగురువుల ఆశయమిదియే. దీపంతో దీపం వెలిగించినట్లు, తత్త్వ జ్ఞానయోగాలను అందరికి అందించడమే వారి ఆశయం. మన దగ్గరున్నది ఏమిచ్చినా అది అయిపోతుంది. కాని ఇచ్చినకొద్దీ పెరిగేవి విద్య, జ్ఞానం మాత్రమే. ఎలాగంటే, ఒక దిపంతో ఎన్ని లక్షల, కోట్ల దీపాలు వెలిగించినా, మొదటి దీపం యొక్క కాంతి తగ్గదు, సరికదా, మిగతా దీపాలతో కలసి, మహోజ్జ్వల కాంతి వెదజల్లుతుంది. కాబట్టి మనమందరం కూడ ఈ తత్త్వజ్ఞాన యోగ దీపాలను వెలిగించి అందరికి అందిద్దాం. అశాంతితో కొట్టుకుపోతున్న ప్రపంచజనులలో, యోగులశాతాన్ని పెంచి, సమతుల్యతను సాధించి, ఆధ్యాత్మిక తత్త్వ జ్ఞాన యోగ పరంగా మన భారతవర్షాన్ని ప్రపంచంలో ప్రప్రధమంగా నిలబెడదాం! ఈ ప్రక్రియలో మీరందరూ మీ మీ వంతుగా ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాము. ఈ ప్రయత్నంలో మేము పరిశీలించిన గ్రంధములు: ఉపనిషత్తులు, శ్రీ వివేకచూడామణి , శ్రీఅష్టావక్రగీత, శ్రీ యోగవాసిష్ఠము, శ్రీనోరి శ్రీనాధవెంకట సోమయాజులు వారి 'బ్రహ్మసూత్ర దర్శనం'.  అనన్యులైన ఈ గ్రంధ కర్తలకు మా శరణాగతిని ప్రకటించుచున్నాము. ఈ విషయ పరంపర ఇంకా కొనసాగుతుంది. ఆదరించ ప్రార్థన. మీ అందరకూ తగు ఆధ్యాత్మిక తత్త్వజ్ఞానయోగములను ప్రసాదించాలని ఆ మహాగురుతత్త్వాన్ని, శ్రీగురుపరంపరని ప్రార్థిస్తున్నాము. = తత్వవిశ్లేషణ టీం.