చైతన్యము ఆవస్థలలో చివరిది. సర్వ ప్రాణులలోను, పదార్ధములలోను స్థావరజంగ మాత్మకమైన ఈ ప్రకృతిలోనూ నిండి వున్నది చైతన్యమే. మనలో నున్న ఈ ప్రాణచైతన్యమును విశ్వము ఆవిర్భవించుటకు మూలకారణమైన ఆ పరా చైతన్యముతో అనుసంధానింప వలెను. చైతన్యము గురించి సర్వసారోపనిషత్ ఈ ప్రకారముగా చెప్తోంది.
"అవస్థాత్రయ భావాభావ సాక్షి, స్వయం భావాభావ రహితం, నిరంతర చైతన్యమాత్రం యథా తత్తురీయమ్. అవస్థా త్రయోపహిత మవస్తాప లక్షితం చ నిరవస్తం విశుద్ధమేవ చైతన్యం." "జాగ్రత్స్వప్నసుషుప్త్యవస్థల యొక్క భావా భావములను సాక్షి గాను, భావాభావములు తనకు లేకనుండు నిరంతర చైతన్యముగా నుండు స్థితి ఏదియో అది తురీయము. అవస్థాత్రయముతో సంబంధపడినదిగాను, అవస్తాత్రయములచేత ఊహింపదగినది గాను, అవస్తాత్రయము లేనిది గను, శుద్ధమైనదిగను, నుండునది ఏదియో, అదే చైతన్యము."
మానవునికి గల మూడు అవస్థల యొక్క భావాభావములకు, అనుభవములకు సాక్షి గాను, ఇవి తనకు లేకుండు స్థితి ఏదియో అది తురీయము. అనగా చిట్టచివరిది. ఇది ప్రాణ సంబంధమైన చైతన్యము. ఈ అవస్తాత్రయములతో సంబంధము వున్నట్లు గాను, వీటిచే ఊహించుటకు వీలుగాను, మరియు వీటికి ఏవిధమైన సంబంధము లేనట్టిదైన శుద్ధమైనది అనంత చైతన్యము. ఇది అలౌకికము, పారలౌకికము.
మండలబ్రాహ్మణోపనిషత్ ధ్యానము గురించి ఈవిధంగా చెప్తోంది. "సర్వ శరీరేషు చైతన్యేకతా ధ్యానం" "సర్వ శరీరములందునూ వుండు చైతన్య మొక్కటియేయని భావించి యుండుటయే ధ్యానము." పైన చెప్పినటువంటి చైతన్యము అన్నిం టి యందు వుండునని భావించుటయే (అనుభవించుటయే) ధ్యానమని చెప్పబడుచున్నది. ధ్యానయోగములో చిట్ట చివరి భావన ఇదియే. ఇచట కేవల చైతన్య భావన తప్ప ఇతర భావన లుండవు. దీనికి చాలా చక్కటిఉదాహరణలు "శ్రీ ఆదిపాండురంగ భక్తవిజయము" లో వున్నాయి. అందులో ఒకటి చూద్దాము. ఒక సారి నామదేవుడు రొట్టెలు చేస్తూ వుండగా, ఒక కుక్క వచ్చి రొట్టెలను నోటితో కరచి పట్టుకొని పారిపొతుంది. అప్పుడు నామదేవుడు నేతి గిన్నెను చేతితో పట్టుకొని దాని వెనుక పరిగెడతాడు. ఆ కుక్క పండరీపురమంతా తిప్పి చివరికి నామదేవుడికి దొరుకుతుంది. అప్పుడు నామదేవుడు ఆ కుక్కను జాగ్రత్తగా వొళ్ళో కూర్చోపెట్టుకొని, పాండురంగా! గట్టిగా వున్న ఈ రొట్టెలను తింటే, నీ నోటికి గుచ్చుకోవా? ఈ నేతిలో ముంచిపెడతాను, అప్పుడు మెత్తగా వుంటాయి, అని ఆ రొట్టెలను నేతిలో ముంచి ఆ కుక్కకు పెడుతూ వుంటాడు. కొంత మంది ఇది చూసి ఆయనను వెక్కిరిస్తే, కొంతమంది ఆయన ఆకుక్కలో పాండురంగడిని చూడగలుగుతున్నాడని తెలుసుకొన్నారు. ఈ స్థాయిలో శారీరిక, మానసిక అంతరాలు నశిస్తాయి. సర్వ ప్రాపంచిక కోరికలు, భావనలు నశిస్తాయి. చివరికి కర్మలు, వేదనిర్దిష్ట ధర్మములు కూడా త్యజింపబడతాయి. నారద భక్తి సూత్రాలలొ 48, 49 సూత్రాలు ఈ విధంగా వున్నాయి.
48. "యః కర్మ ఫలం త్యజతి, కర్మాణి సంన్యస్యతి, తతో నిర్ద్వం దోవా భవతి" "ఎవడు కర్మ ఫలములను వదలునో, ఎవడు స్వార్థమైన కర్మంబులను సన్యసించునో, వాడు సుఖదుఃఖాది ద్వంద్వంబులకు అతీతుడు."
49. "(యో)వేదానపి సంన్యస్యతి, కేవల మవిచ్ఛిన్నానురాగం భవతి" "ఎవడు వేదనిర్ధిష్ఠ ధర్మములను కూడ సన్యసించునో, అతడు నిర్మలమైనట్టి, ఎడలేనట్టి ననురాగంబును భగవంతుని యెడల కలుగును."
పై వాక్యములను బట్టి విచారించినచో, చైతన్య స్వరూపభావన అర్థమగును. ఆ తురీయ మైన అవస్థలో దేనికీ తావు లేదు. ఆ చైతన్య స్వరూపముతొ భావైక్యము తప్ప దేనితొనూ పని లేదు. మనము ఏరు దాటవలెను. పడవ ఎక్కి ఏరు దాటుతాము. అవతలి గట్టు ఎక్కిన తర్వాత పడవను ఏటిలోనే వదులుతాము తప్ప పడవను మోసుకొని పోముకదా! అలాగే భోజనము చేయడానికి శుభ్రమైన ఆకును తెస్తాము. దానిని కడిగి భద్రపరుస్తాము. భోజనము చేసిన పిదప, ఆ ఆకును చెత్తకుండీలో పడవేస్తాము. అంటే, ఏరు దాటిన తర్వాత పడవ, భోజనము అయిన తర్వాత ఆకు యొక్క అవుసరము లేదు. వాటిని విడచి పెట్ట వలసినదే. అలాగే, చైతన్య భావనకు వచ్చిన తర్వాత, ఆమార్గమునకు ఉపయుక్తమైన వాటియొక్క, అనగా పుణ్యకర్మలు, వాటి ఫలితాలు, భక్తి మొదలైన సాకార సంబంధమైన విషయాలు, జ్ఞాన, తపోనిష్టలు యొక్క అవుసరము లేదు. సాధకుని మనస్సు ఎల్లప్పుడూ ఆ నిరంతర చైతన్యభావనలో, ఆపరమాత్మ తో అనుసంధానింపబడి వుండాలి. అమృతనాదోపనిషత్ ఇలా చెప్తోంది. "శాస్త్రాణ్యధీత మేధావీ, అభ్యస్యచ పునఃపునః, పరమం బ్రహ్మవిజ్ఞాయ ఉల్కావత్తాన్యధోత్సృజేత్" "మేధాసంపన్నుడు శాస్త్రముల నధ్యయనము చేసి, అట్లధ్యయనము చేసిన దానిని శ్రవణమననాదులచే మరల మరల నభ్యసించి, పరబ్రహ్మము నెరింగి, పిదప సాధనామాత్రములగు నా శాస్త్రములను విడచి పెట్టవలెను." ఈ స్థితిలో విశ్వచైతన్యభావన అంకురిస్తుంది. యోగవాశిష్టం ఉత్పత్తిప్రకరణములో ఈ విషయం చెప్పబడింది. "చిదిహస్తిహి చిన్మాత్రమిదం చిన్నయ మేవచ, చిత్వం చిదహమేతేచ లోకాశ్చిదితి సంగ్రహః" "ఈ ప్రపంచమున చైతన్యమే కలదు. ఈ ప్రపంచమంతయూ చైతన్యమే అయి వున్నది. ఇది అంతయూ చైతన్యమయమే అగును. "చిచ్చేత కల్పనా బంధస్యన్ముక్తి ర్ముక్తిరుచ్యతే, చిదచేత్యాఖలాత్మేతి సర్వ సిద్దాంత సంగ్రహః" "చైతన్యము యొక్క విషయాకార కల్పనయే బంధము. అట్టి కల్పన లేకుండుటయే ముక్తి. విషయాకార రహితమగు చైతన్యమే పూర్ణాత్మ. ఇదియే సమస్త సిద్దాంతముల యొక్క సారంశము."
మొదటిశ్లోకములో సర్వము చైతన్యమయమని ప్రతిపాదింపబడినది. రెండవశ్లోకములో చైతన్యము కలిగించు భావాభావముల గురించి చక్కగా వివరింపబడినది. అవస్థా త్రయముతో కూడిన చైతన్య భావన లౌకికమైనట్టిది. అది విషయకారకమగును. తద్వారా అధోగతి కల్గును. కాని దానికతీతమైన విశ్వచైతన్యమే నేను అన్న భావన ద్వారా ఆవిషయముల ప్రభావము నశించి పూర్ణాత్మ ప్రకాశించును. సమస్త సిద్దాంతముల యొక్క సారమిదియే యని గ్రహించ వలెను.
ఈ చైతన్యము గురించి మాండూక్యోపనిషత్ మనకు ఈ విధంగా సరియైన అవగాహన కల్పిస్తోంది. "నాంతః ప్రజ్ఞం, నబహిప్రజ్ఞం, నోభయతః ప్రజ్ఞం, నప్రజ్ఞానఘనం,నప్రజ్ఞం, నాప్రజ్ఞం, అదృష్టమవ్యవహార్య మగ్రాహ్య మలక్షణ మచింత్య మవ్యపదేశ్యమేకాత్మ ప్రత్యయసారం, ప్రపంచో పశమం, శాంతం, శివమద్వైతం, చతుర్థం, మన్యంతే స ఆత్మా, స విజ్ఞేయః" "అంతరమైన చేతన కాదు. బహిరమైన చేతన కాదు. ఈ రెండు అయిన చేతన కాదు. కరడుకట్టిన చేతన కాదు. అచేతన కాదు. కనిపించనిది. వ్యవహారములకు అతీతమైనది. గ్రహించుటకు ఆశక్యమైనది. లక్షణములకు అతీతమైనది. చింతింపనలవి కానిది. నిర్దేశింపలేనిది. అన్ని పరిస్థితులలోను ఆత్మ ఒక్కటే అనే తత్త్వపుసారం. ప్రపంచములన్నింటినీ ఉపశమింపచేసేదీ, శాంతమూ, ఆనందము, ద్వైతము కానిది, నాలుగవదీ అని భావిస్తారు. అతడే ఆత్మ. అతడే తెలుసుకోనవలసిన వాడు."
ఇందులో పరాచైతన్యము గురించి చెప్పబడినది. ఇది శరీరము లోపల నున్న చైతన్యము కాదు. ప్రాణుల చలనము వలన కలిగిన బాహ్యమైన చైతన్యము కాదు. ఈ రెండు కలసి ఏర్పడినది కాదు. అచేతన మసలేకాదు. ఒకచోట ఘనీభవించిన చైతన్యము కాదు. ఈ పాంచభౌతిక శరీరమునకు కనిపించనిదీ, అన్ని వ్యవహారములకు, ఉపాసనలకు అతీతమైనది, ఆలోచనల ద్వారా గోచరముకానిది, ఏవిధముగాను సూచింప నలవికానిది, ఏవిధముగానైనను ఒక్కటే అను తత్త్వపుసారం. ఈ విశ్వమునంతటనూ నిండియుండి దాని యొక్క సృష్టి, స్థితి, లయములకు మూల కారణమైనది. పరమ శాంతము, అఖండైక నిర్మలానందము నొసంగు నది. ద్వైతము కానిది. ఏవిధముగా నైననూ విభజించి చూడలేనిది. నీవు, నేను అను బేధము లేనిది, నాలుగవదీ, అనగా అవస్థాత్రయమునకు అతీతమైనది, అదియే ఆత్మ ద్వారా పొంద వలసిన మూలకారణము అని భావించాలి.
ఈ చైతన్యభావనలో పూర్తిగా మమైక్యమయిన తర్వాత, తురీయస్థితిని అనుభ వించుటకు యోగ్యమైన జీవన్ముక్త స్థితి వస్తుంది. దాని గురించి మళ్లీ కలుసుకున్నప్పుడు తెలుసుకుందాము.
(మీ స్పందనల కోసం ఎదురు చూస్తూ వుంటాము. Please visit www.tatvavisleshana.weebly.com)
No comments:
Post a Comment