Thursday, July 19, 2012

తేజస్సు

                                   తేజస్సు               
             మనం గతంలో నాదం గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు దాని తదుపరి స్థాయి అయిన తేజస్సు గురించి తెలుసుకుందాము. భౌతికముగా నాదము మరియు తేజస్సు అనగా శబ్దము, కాంతులను పరిశీలించిన, శబ్దము కంటే కాంతి యొక్క వేగము, త్వరణము(velocity), వ్యాపకత్వము, పరిధి ఎక్కువ. కావుననే, అనేక లక్షల కాంతి సంవత్సరాల దూరములొ నున్న నక్షత్రములను ఈ భౌతిక నేత్రములతో చూడ గలుగుచున్నాము. ఇట్లే, ఆధ్యాత్మికభావములో కూడ నాదము కంటే తెజస్సునకు ఎక్కువ ప్రాముఖ్యత కలదు. ఈ తేజస్సు భౌతికమైన కాంతి కాదు. ఇది ఆత్మ సంబంధమైనది (spiritual). ఈ తేజస్సు జ్ఞాననేత్రము ద్వారా మాత్రమే గోచరమగునది. ధ్యాన సమాధుల్లో మాత్రమే అనుభవములోనికి వచ్చునది. ఈ అధ్యాయము లో తెజస్సునకు భౌతికమైన ఉదాహరణలు వచ్చినప్పటికీ, వాటిని ఆత్మ సంబం ధమైనవిగాను, పారలౌకికమైనవి గాను భావించవలెను.

             మొదట నాదమునకు తేజస్సునకు గల సంబంధము తెలుసుకొందాము. తేజోబిందూ పనిషత్ 5వ అధ్యాయములో ఈ విధంగా చెప్పబడినది. "శాంతా శాంత విహీనాత్మా నాదంత జ్యోతిరూపకః, మహావాక్యార్థతో బ్రహస్మి త్యతిదూరతః| తచ్ఛబ్ద వర్జస్త్వం శబ్దహీనో  యొ నాదాంత జ్యోతిరేవసః| అఖండైకరసోవా హ మానందోస్మితి వర్జితః, సర్వాతీత స్వభాత్మా నాదాంత జ్యోతి రేవసః|"  వాక్యముల ననుసరించి శాంతము, అశామ్తము మున్నగునవి విసర్జించినవానికి, బ్రహ్మస్మి మొదలగు మహావాక్యార్థములు మరియు శబ్దమును కూడ విసర్జించిన వానికి, అఖండైక రసప్రవాహములో మునిగి తేలుచు, అన్ని విధములైన ప్రాపంచిక స్వభావములు విసర్జించిన వానికి, నాదము యొక్క  అంతమందు జ్యోతి రూపమొక్కటియే మిగులును. దీనిని బట్టి నాదము యొక్క అంతమందు తేజస్సు మిగులునని ఋజువగుచున్నది. ఆ తేజోరూప దర్శనము వలన సకలాతీత సమతుల్య భావన ఏర్పడుచున్నది.

                మండలబ్రాహ్మణోపనిషత్ లో 'అంతర్లక్ష్యము' ను వివరించుచూ భౌతికముగా నాద బిందువును ఎట్లు సాధించవచ్చునో, ఆ తదుపరి తేజోదర్శనమెట్లగునో వివరించబడినది. "మూలాధారాదారభ్య బ్రహ్మరంధ్ర పర్యంతం సుషుమ్నా సుర్యాభా, తన్మధ్యే, తటిత్కోటిసమా మృణాళతన్తు సూక్ష్మాకుండలినీ, తత్ర తమోనివృత్తిః, తద్దర్శనా పాప
నివృత్తిః, తర్జన్యగ్రోన్మీలిత కర్ణరంధ్రద్వయే, ఫూత్కార శబ్దోజాయతే, తత్ర స్థితేమనసి, చక్షుర్మధ్యనీలజ్యోతిపశ్యతి, ఏవం హృదఏపి." మూలాధారము నుండి బ్రహ్మరంద్ర (సహస్రారము) పర్యంతము సుషుమ్నా నాది సూర్యుని వలె ప్రకాశింపుచున్నది. దాని నడుమ, తటిత్కోటి సమానమైన తామరనూలు వోలె సూక్ష్మమైన కుండలినీశక్తి (ప్రాణశక్తి) వెలుగు చున్నది. అప్పుడు తమోనివృత్తి చెందును. చూపుడు వెళ్ళ కొనలచేత కర్ణరంధ్రములు మూసికొనిన యెడల ఫూత్కార శబ్దము వినపడును. అపుడు స్థితప్రజ్ఞతో కూడిన మనస్సుతో నేత్రమధ్యమందలి  నీలజ్యోతి కనపడును. అట్లే హృదయమందు కూడ తేజో దర్శనము చూడవలెను.

                 పై వివరణలో, వెనుక, నాదములో చెప్పినదంతయూ, రెండు వాక్యములలో ఉపనిషద్రష్ట ప్రవచించినారు. కావుననే, ప్రతి వాక్యమును, ప్రతి శబ్దమును ఎంతో లోతుగా అలోచించవలసిన ఆవశ్యకత కన్పట్టుచున్నది. నాదబిందువును మానసికముగా సాధించ లేక పోయినచో, భౌతికముగా ఎలా సాధించగలమో ఇక్కడ వివరించారు. మన చెవులలో చూపుడు వేళ్ళ కొనలను జొనిపిన ప్రాణ ఘోష వినపడును. అది ఒక రంధ్రము నుండి గాలి వేగముగా ప్రయాణించు శబ్దమును పోలియుండును. ఆ శబ్దమునకు నాదమును ఆపాదించి, దృష్టిని ఆజ్ఞా చక్రమునండు అనగా భ్రుకుటి యందు నిలిపిన, నాదబిందువును సాధించగలము. దానిపై ఏకాగ్రతతో మనస్సును నిలిపిన యెడల 'నీలజ్యొతి' కనపడును. ఆ నీలజ్యొతి ఆత్మ దర్శనము తప్ప మరి యితరము కాదు.  ఈ సాధనలో చాలామంది చాలా రంగులు, వివిధ రుపాలి కలవని సూచించుచున్నారు.  ఈ విషయములో తెలుసుకోన వలసినదేమిటంటే, ఇది ఎవరికి వారికి ఒక ప్రత్యేకమైన అనుభవము. ఇంకొకరితో పోల్చి చూడరాదు. అందుకే, చాలామంది ద్రష్టాలి రకరకాలుగా చెప్పినను, వీటిని గురించి తెలుసుకొని, తనదైన మార్గములో సాధకుడు గమ్యాన్ని చేరవలసియుంటుంది. ఎన్ని రంగులు, ఎన్ని ఆకారములు సాధనలో కనిపించిననూ చివరికి, పరిపూర్ణమైన తెలుపులో కలసిపోవలసినదే! పండువెన్నెల వంటి ఆతేజస్సులో ఆనంద మనుభవించవలసినదే! ఈ ఉపనిషద్రష్ట ప్రణవ తేజోమయ స్వరూపము గురించి, అనగా, నాద బిందువు యొక్క కాంతిమయ స్వరూపము గురించి ఈ విధంగా ప్రవచించారు. "స్ఫటిక ధూమ్ర బిందు నాదకళా నక్షత్ర ఖద్యోతాదీ సువర్ణ నవరత్నాదిప్రభా దృశ్యంతే, తదేవ ప్రణవస్వరూపమ్|" "స్ఫటిక మైన తెల్లని కాంతియు, బిందునాదకళా నక్షత్రముల వంటి కాంతియు, మెరుము, దీపము, స్వర్ణము, నవరత్నములునగు కాంతి చూడబడుచున్నది. అదియే ప్రణవ స్వరూ పము." దీనిని బట్టి ప్రణవమునకు తేజో రూపము కలదని ఋజువగుచున్నది. వివిధ కాంతుల గురించి చెప్పిననూ, మొదట స్ఫటికమైన తెల్లని కాంతి యని చెప్పుట వలన, అదియే అసలైన స్వరూపమని తెలుయుచున్నది. తెల్లని కాంతిలో అన్ని వర్ణములు కలిసి యున్నవి కదా! ఇదియే స్వప్రకాశ దర్శనము. కావున దీనిని అంతర్లక్ష్యమని పేర్కొన్నారు.
అంతర్లక్ష్యమనగా, తనలో తన గురించి తాను చూచుట. లేదా తెలుసుకొనుట.  దీనిపై 'బహిర్లక్ష్యము' కలదని ఈ ఉపనిషత్ లోనే సూచించినారు. బహిర్లక్ష్యమనగా, తనను దాటి పైనున్న దానిని చూచుట, లేదా, తెలుసుకొనుట.

                   '
బహిర్లక్ష్యస్తు నాసాగ్రే చతు ష్షడష్ట దశ ద్వాదశాంగుళిభిః క్రమాత్ నీలద్యుతి శ్యామత్వ సద్రుగ్రక్త భఙ్గీస్ఫుర చ్ఛుక్ల పీతవర్ణ ద్వయోపేతం,వ్యోమతత్త్వం పశ్యతి, సతు యోగీ, చల దృష్ట్యా వ్యోమ భాగ వీక్షితు పురుషస్య దృష్టగ్రే ద్వాదశాంగులమానః జ్యొతిః పశ్యతి. తదామృత తత్త్వమేతి ." "బహిర్లక్ష్యమనగా నాసికా గ్రమందు, నాలుగు, ఆరు, ఎనిమిది, పది, పన్నెండంగుళముల చేత క్రమముగా నీలవర్ణ ప్రకాశముగాను, శ్యామలవర్ణ సమానమైన రక్త వర్ణముతో కూడినదిగాను, తెలుపును, పీత(బంగారు)వర్ణమును కలిసినట్లుండు, వ్యోమతత్త్వ మును జూచుచున్నాడు. వాడే యోగి. చల దృష్టి చేత వ్యోమ భాగమును జూచెడి యోగి దృష్టి యొక్క అగ్రభాగమునందు జ్యోతికిరణములు కనబడును. ఇందువలన దృష్టి స్థిరమగుచున్నది. శిరోగ్రభాగము నందు పన్నెండంగుళములకు మీద, జ్యోతిస్సమూహ దర్శనము కలిగి, అమృత తత్త్వము కలుగుచున్నది."

       ఈ
బహిర్లక్ష్యము సాధకునికి అత్యంత ప్రధానము. ఎంతో తీవ్రమైన సాధనను ఉపనిషద్రష్ట కొన్ని సాదారణ వాక్యములలో ప్రవచించినారు. దీనిని నిశితముగా పరిశీలించినచో, సరియైన మార్గము దొరకును.
బహిర్లక్ష్యము నాసికాగ్రము నుండి బయలుదేరి, ఆజ్ఞాచక్రము, సహస్రా రము చేరి, అటనుండి ఇంకనూ పైకి పోవుచున్నది. అనగా సహస్రారము దాటి ఇంకనూ స్థాయిలు గలవని తేలుచున్నది. ఇక్కడ 'చల దృష్టి' అని సూచించినారు. చలదృష్టి అనగా దృష్టిని కేంద్రీకరించుస్థానమును పైపైకి తీసుకోని వెళ్ళుట. అలా పైపైకి శిరోగ్రభాగము నుండి ఇంకనూ పైకి తీసుకొని వెళ్ళవలయును. ఇచట అంగుళములనగా కొలత కాదని, స్థాయీ బేధమని గ్రహించవలెను. తదుపరి, వివిధ స్థాయిలలో కనిపించు తేజస్సు యొక్క వర్ణములు వివరించుచూ, నీలము, శ్యామలవర్ణముతో కలసి యుండు ఎరుపు, తెలుపు బంగారు వర్ణముతో కలసియుండు వర్ణములు తెలియజేయుచూ, దృష్టి యొక్క అగ్ర భాగము నందు జ్యోతి కిరణములు కనబడునని సూచించినారు. నాసికాగ్రము నుండి, కనులవరకూ వున్నది అధో దృష్టి. అనగా క్రిందకు, ప్రపంచసంబంధమైనవి చూచుట. ఆజ్ఞా చక్రము నుండి ఊర్ధ్వ దృష్టి మొదలగును. అక్కడనుండి  భౌతికేతరమైనవి, పారలౌకికమైనవి కనపడును. అచ్చోట జ్యోతి కిరణములు కనబడునని సూచించినారు. అనగా ఆతేజోమయస్వరూపము యొక్క కిరణము లు మాత్రమే కనపడును. అనగా, ఆ నిరాకార పరమాత్మ యొక్క అంశమగు ఆత్మ కనబడును. ఇచట దృష్టి స్థిరమగును. అనగా దృఢమైన ఏకాగ్రత కలుగును. కాని చాల దృష్టి ఆపరాదు. ఆ ఏకాగ్ర స్థానమును మెల్లమెల్లగా ఇంకనూ పైపైకి తీసుకోని పోయినయెడల జ్యోతి సమూహము కనపడును. అనగా, జ్యోతి కిరణముల, అనగా ఆత్మయొక్క మూలమైన పరమాత్మ అనుభ వము కలుగును. అపుడు అమృత తత్త్వము కలుగును. అట్లు చేసిన వాడే యోగి అని నిర్వ చించినారు. ఈ స్థాయికి వచ్చిన సాధకుని ఆత్మ స్వరూపమే ఇంకనూ పైస్థాయిలకు తీసుకొని పోగలదు.

             ఈ సారి కలుసుకున్నప్పుడు దీని తదుపరి స్థాయి అయిన 'చైతన్యము' గురించి తెలుసుకుందాము.


(మీ స్పందనల కోసం ఎదురు చూస్తూ వుంటాము. Please visit www.tatvavisleshana.weebly.com)                           

No comments:

Post a Comment