Monday, July 23, 2012

జీవన్ముక్త స్థితి

                                            జీవన్ముక్త స్థితి

              ఎప్పుడైతే సద్గురువు పర్యవేక్షణలో సమాధినిష్టుడై, ఆత్మ సాక్షాత్కారము పొంది, చైతన్య భావాన్ని అనుభవిస్తూ వుంటారో, అక్కడ నుండి అనుభవాలే తప్ప నిర్వచనాలు వుండవు. స్థితిలో కొనసాగడం తప్ప వేరేయిక ఏవిధమైన ప్రక్రియ, ఉపాసన, జీవిక, వుండవు. జీవితమున్నంత కాలము జీవన్ముక్తస్థితిలో గడుపుచూ, ప్రాణావసర సమయములో ఉర్థ్వంగా ఉత్క్రమించి, ఈ ప్రాణాన్ని తృణప్రాయంగా విసర్జించి, జన్మ జరా మృత్యు చక్రం నుండి తప్పించు కొని, నేరుగా విదేహముక్తియుక్తంగా, పరబ్రహ్మస్వరూపంలో మమైక్యమగుట తప్పఇంకేమియు లేదు. దీని గురించి చాలా తక్కువ సమాచారం దొరికింది. ఎందుకంటే పరబ్రహ్మ అయినవారు చెప్పడానికి క్రిందికి దిగిరారు కాబట్టి. కాని కొంతమంది మహాత్ములు, ఋషులు మనలాటి వారికోసం కొంత విషయాన్ని చెప్పారు. దానిని తెలుసుకుందాము.
 
                                  బృహదారణ్యకోపనిషత్ ముక్తులు మూడు విధాలుగా చెప్పింది. 1.క్రమముక్తి: ఉపాసకుడు చనిపోయిన పిమ్మట తన ఉపాసనా ఫలంగా దేవయాన మార్గాన బ్రహ్మ లోకాన్ని చేరి, అచట కల్పాంతము వరకూ వుంటూ, కల్పాంతంలో ఆ కార్య బ్రహ్మ (చతుర్ముఖ బ్రహ్మ) తో పాటు పరమాత్మ యందు లీనమగుట. ఈ దశ సాధారణంగా సాకార స్వరూపాన్ని అర్చించే వారికి, ఆ సాకార స్వరూపముతొ సారూప్య, సామీప్య సాయుజ్యాలు పొందే వారికి వస్తుంది. ఆ విధానంలో కూడ ఒక విధమైన తాదాత్మ్యస్థితిని పొంది, ఆ సాకార స్వరూపముతో అభేదస్థితిని సాధించిన వారు మాత్రమే, ఆ సాకారస్వరూపముతొ పాటు పరబ్రహ్మలో లీనమవుతారు. అలా లేని వారు, కల్పాంతంలో అణుస్వరూపములో ఉండి, మళ్ళా సృష్టి ఏర్పడిన తర్వాత అర్హతను బట్టి తగు జన్మను పొందుతారు. 2.జీవన్ముక్తి: బ్రహ్మజ్ఞానం కలిగినప్పటికీ, ప్రారబ్దకర్మ వశాన లోకనుసారంగా వర్తిస్తూ అసంగుడై ఉండటం. (ఇక్కడ ఒక ప్రశ్న వచ్చి తీరాలి. కర్మఫలం దగ్దమైతేనే గాని బ్రహ్మజ్ఞానంరాదు కదా, ఇంకా ప్రారబ్దకర్మ ఏమిటి? అని. నిజానికి కర్మపాశ విముక్తి అయితేనే తప్ప బ్రహ్మజ్ఞానం రాదు. అప్పుడు కర్మలు, కర్మ ఫలితాలు పోతాయేగాని, ప్రారబ్దం వల్ల వచ్చిన జీవితం  అంతమవదు. అది మన చేతిలో లేదు. దానిని పూర్తిగా అనుభవించ వలసినదే! కాబట్టి అది పూర్తి అయ్యే వరకు ఈ ప్రపంచంలోనే వుంటూ, దీని పట్ల అసంగుడై, దీన్ని అంటుకోకుండా వుంటారు. వారు నిజంగా ముక్తులే. కాని ఆ ప్రక్రియ దేహానంతరం కలుగుతుంది. అంతవరకూ వారు వేచి యుండాల్సిందే! దానినే జీవన్ముక్త దశ అంటారు.) 3.విదేహముక్తి: దేహపాతానంతరం కలిగే నిర్విశేషబ్రహ్మైక్య స్థితి. ఇప్పుడు మనం జీవన్ముక్త దశ గురించి, జీవన్ముక్తుల లక్షణముల గురించి పెద్దలు, మహానుభావులు ఏమి చెప్పారో తెలుసుకుందాము.

పైఙ్గలోపనిషత్: తృతీయాధ్యాయము:
 
           
'తత్త్వమసి', 'అహం బ్రహ్మస్మి'  అను మహావాక్యముల అర్థమును విచారణ చేయుట శ్రవణము. ఏకాంతములో పరమార్థమును (శ్రవణార్థమును) అనుసంధానము చేయుట మననము. శ్రవణమననముల వలన సంశయరహితార్థము నందు ఏకాగ్రముగా మనస్సు నిలిపి యుండుట నిధిధ్యాసనము. ధ్యాతృధ్యానములను త్యజించి, నివాసితదీపము రీతిగా ద్యేయైక గోచరమగు చిత్తమును కలిగియుండుటే సమాధి. అట్టి సమాధి సమయములో అనాది సంసార సంచితములై యున్న కర్మరాసులన్నియు లయించి పోవును. పిమ్మట అభ్యాస బలమున సహస్రాములుగా అమృతధారలు వర్షించును. అందువలన యోగవేత్తలు సమాధిని 'ధర్మమేఘము' అని పలుకుదురు. (ఇక్కడ సద్గురువులు పోడూరి కృష్ణవేణు మాతాజీగారు చెప్పినటువంటి ఒక విషయం గుర్తుకు వస్తోంది. గురువుగారు అప్పుడప్పుడు, అంగుడిలో పైనుండి ఏదో చుక్కలుగా పడుతోందిరా, నోరంతా తియ్యగా అవుతుందిరా, ఆరుచి చెప్పలేమురా, అని చెప్పేవారు. దీనిని బట్టి శాస్త్రములలో చెప్పినటు వంటి విషయాలు తప్పక అనుభవము లోనికి వస్తాయని తెలుస్తున్నది.)  సమాధి వలన సర్వవాసనలు నశించగా, కర్మసంచయము (పాపపుణ్యములు) సమూలముగా నశించిపోగా, వేదాంత వాక్యము కరతలామలకము రీతిగా, అపరోక్షసాక్షాత్కారము సంభవించును. అప్పుడు ఆ ఆత్మజ్ఞాని జీవన్ముక్తుడగును.

మహోపనిషత్: ద్వితీయాధ్యాయము:జనకుడు శుకునితో చెప్పుచున్నాడు:
            జ్ఞాన విస్తారమును, సారామ్శాములను విపులముగా చెప్పుచున్నాను. ఈ విషయములను అర్థము చేసికోన్నచో, జీవుడు వెంటనే జీవన్ముక్తదశను పొందుచున్నాడు. దృశ్యము లేనేలేదు అనెడు అత్మజ్ఞానముతో మనస్సులో నున్న దృశ్యభావములను తుడిచివేసినచో తక్షణమే మహోన్నతమగు నిర్వాణసుఖము నుత్పన్నమగును. వాసనలను, రాగద్వేషాదులను సంపూర్ణముగ పరిత్యజించుటయే ఉత్తమ మోక్షమని సజ్జనులు వచించుచున్నారు. మోక్షమునకు ఇదియే సరియైన మార్గము. ఎవరైతే పరిశుద్ధ వాసనలతో నిండియున్నారో వారు తిరిగి జననమరణా దిగా గల అనర్థమును పొందరు. అట్టివారే యదార్థమును తెలిసికొనిన వారు. అట్టివారే జీవన్ముక్తులు, మహాత్ములు అని చెప్పబడెదరు. ధృఢమగు విషయచింతనయే బంధమని చెప్పబడును. వాసనాక్షయమే మోక్షమని చెప్పబడును. (దేహ, లోక, శాస్త్ర వాసనలే సర్వవాసనలు) తపస్సు మున్నగు సాధనలు చిఎయకయే సహజముగా ఎవరికి భోగములు రుచింపవో, అతడు జీవన్ముక్తుడని చెప్పబడును. హర్షము, అమర్షము, భయము, క్రోధము, కామము, కార్పణ్యము, ఈ సంకల్పవృత్తులు ఎవని అంతఃకరణమును స్పృశింపజాలవో, అతడే
జీవన్ముక్తుడని చెప్పబడును. అహంకార వాసనను అవలిఇలగా త్యజించి ఎవడు దృశ్యమును త్యాగము చేయునో, అతడు జీవన్ముక్తుడని చెప్పబడును. ఎవని అంతర్ముఖ దృష్టిలో ఇష్టానిష్టములు లేకయుండునో, ఎవడు సుషుప్తావస్థలో నున్నవానివలె సంచరించునో అతడు జీవన్ముక్తుడని చెప్పబడును. ఎవడు సర్వదా ఆత్మానందమును పొందునో, ఎవని మనస్సు పూర్ణముగా పావనముగా నుండునో, ఎవడు సర్వోత్తమ విశ్రాంతిని పొంది, ఏవిషయమును వాంఛింపక, గత స్నేహుడై జీవించునో, అతడు జీవన్ముక్తుడని చెప్పబడును. ఎవనియొక్క హృదయము ఆకాశము రీతిగా దృశ్యవిషయములందు కొంచెము కూడా సంగము పెట్టుకొనక యుండునో, అతడే జీవన్ముక్తుడని చెప్పబడును. ఎవడు రాగద్వేషములను, సుఖదుఃఖములను, ధర్మాధర్మములను, ఫలాఫలములను లక్ష్యము చేయక, ఆపేక్షారహితుడై, నిష్కామభావముతో సత్కర్మలను చేయుచుండునో, అతడు జీవన్ముక్తుడని చెప్పబడును. ఎవడు మౌనదీక్ష కలవాడై అహంభావ రహితుడై, మానములేనివాడై, ముక్తమత్సరుడై, ఉద్వేగరహితుడై, నిస్సంకల్పుడై, కర్తవ్యకర్మలను చేయుచుండునో, అతడు జీవన్ముక్తుడు.

           ఎవడు సర్వత్ర విగత స్నేహితుడై సాక్షిభావముతో ఉండునో, ఇచ్ఛారహితుడై సత్కర్మలు చేయుచుండునో,
అతడు జీవన్ముక్తుడు. ఎవడు తన మనస్సులో ధర్మాధర్మములను, సకల సంకల్పములను, ఇష్టమును, సర్వమును పరిత్యజించియున్నాడో, అతడు జీవన్ముక్తుడు. ఎవడు కన్పిమ్చుచున్న ఈ సమస్త దృశ్యములను సమ్యక్దృష్టితో పరిత్యజించి యుండునో, అతడు జీవన్ముక్తుడు. కారము, పులుపు, ఉప్పు, చేదు, రుచి, అరుచి వీటన్నింటినీ సమ భావముతో ఎవడు భుజించుచున్నాడో, అతడు జీవన్ముక్తుడు. వృద్ధాప్యము, మరణము, ఆపద, రాజ్యము, దరిద్రము, వీటన్నింటినీ సమభావముతో ప్రీతిగ నెవడు అనుభవించునో, అతడు జీవన్ముక్తుడు. ధర్మాధర్మములు, సుఖదుఃఖములు, జననమరణములు ఇవన్నియు ఎవడు బుద్ధితో పూర్ణముగ త్యాగము చెయుచున్నాడో అతడు జీవన్ముక్తుడు. ఉద్వేగానంద రహితుడై స్వచ్చమగు సమత్వబుద్ధితో పొంగిపోవుట, క్రుంగిపోవుట లేక యుండునో, అతడు జీవన్ముక్తుడు. సర్వేచ్చలను, సకలసంశయములను, సర్వప్రయత్నములను, సర్వ నిశ్చయ ములను ఎవడు జ్ఞానబుద్ధితో పరిత్యజించియున్నాడో, అతడు జీవన్ముక్తుడు. సృష్టిస్థితిలయ ములందు, ఉదయాస్తమయములందు, భావాభావములయందు ఎవనిమనస్సు సమభావము తో నుండునో, అతడు జీవన్ముక్తుడు. ఎవడు కొంచెము కూడ ద్వేషింపడో, కాంక్షింపడో, రాగద్వేష రహితుడో, ఎవడు ప్రారబ్ద భోగములను అనుభవించుచుండునో, అతడు జీవన్ముక్తుడు. ఎవడు సంసార సంకులములో శాంతుడై యుండునో, కళాయుక్తుడై కూడ నిష్కళుడై యుండునో, మనస్సుఉండి కూడ, అమనస్కుడై యుండునో, అతడు జీవన్ముక్తుడు. ఎవడు సమస్త సంపదల యందుండియు, సమస్త వ్యవహారములందుండియు, స్పృహలేనివాడై యుండునో, పూర్ణ బోధాస్వరూపుడై నుండునో, అతడు జీవన్ముక్తుడు.
                                    
 
వివేకచూడామణి: 

         228. తనకంటే (ఆత్మకంటే) నితర వస్తువు గోచరింపకుండు స్థితియే పరమాద్వైతము. అట్టి పరతత్త్వబోధకలిగిన శుభావస్థ యందు బ్రహ్మాతిరిక్త మగు వస్తువెద్దియూ గోచరింపక సర్వమును బ్రహ్మముగనే స్ఫురించుచుండును. ఏమనగా సృష్టికి పూర్వమందును, పరమందును కల్పితప్రపంచము లేనిది. పరతత్త్వముమాత్రమే సత్యము, నిత్యము. కనుక పరతత్త్వబోధ కలిగిన దశయందు బ్రహ్మేతరమెద్దియునూ స్పురింపదు. ఇదియే జీవన్ముక్త స్థితి.

    (తదుపరి విషయమునకై  www.tatvavisleshana.weebly.com ను సందర్శించండి.)

No comments:

Post a Comment