Friday, July 27, 2012

ప్రాణోత్క్రమణము

                                             ప్రాణోత్క్రమణము           జీవన్ముక్త లక్షణాలు, జీవన్ముక్తునిదశలు గురించి తెలుసుకున్న తర్వాత, విదేహముక్తికి ద్వారము, చతుర్ముఖ బ్రహ్మ మొదలుకొని చీమ వరకు, ప్రతీజీవికి తప్పనిసరి అయిన ప్రాణో త్క్రమణము గురించి అంటే మరణము గురించి తెలుసుకుందాము. మరణము అంటే ఏముంది, చచ్చిపోవడమే కదా! దీని గురించి ఏమి తెలుసుకోవాలి, ఎందుకు తెలుసుకోవాలి? అనే ప్రశ్నలు వస్తాయి. ఆధ్యాత్మికజీవితములొసంభవించే ప్రతీదశగురించి సాధకుడుతప్పనిసరిగా క్షుణ్ణము గా తెలుసుకోవాలి. ప్రతీదానియొక్క పూర్తిజ్ఞానము సంపాదించి, దాన్ని ఆఎరుకతో అనుభ వించాలి. ఈప్రాణోత్క్రమణము ప్రతీవారికి వారివారి జ్ఞానము యొక్క స్థాయిలని బట్టి సంభవి స్తుంది. అజ్ఞాని దీనిగురించి భయపడతాడుగాని, జ్ఞాని ఎంతమాత్రమూ భయపడడు. పైగాదీనిని పరబ్రహ్మ స్వరూపమునకు జేర్చే సాధనముగా భావించి, సాదరముగా స్వాగతిస్తాడు. ఇక్కడ మనం తెలుసుకోన విషయము ఇంకొకటి వుంది. ఇక్కడ పెద్దలు చెప్పిన విషయాలను భౌతిక మరణముతో పోల్చిచూడవద్దు. వీరు చెప్పిన విషయములు ఆత్మకు, తత్సంబంధిత ఇతర శరీరాలకు (ఇవి భౌతికశరీరానికి అందవు, ధ్యానములోను, యోగములోను మాత్రమే అను భవము లోనికి వస్తాయి.) సంబంధించినవి. ఇక్కడ చెప్పిన కొన్ని పరిణామాలు ఈ భౌతిక శరీరములొ సంభవింపవు కూడా! ఈ విషయాలను ఆదృష్టిలో మాత్రమే గమనించ మనవి. ఇప్పుడు ప్రాణోత్క్రమణము గురించి మహానుభావులు ఏమి వివరించారో తెలుసుకుందాము.

యోగవాసిష్టము:నిర్వాణ ప్రకరణము:32వ సర్గ:దేహపాత విచారము:ఈశ్వరుడు వశిష్టునితో వచింపు చున్నాడు:
 
            పరమచైతన్యము జీవుల శరీరమున ప్రవేశించి, కార్యముల నాచరింపజేయు విధిని, దేహముల బ్రవేశించి, చలనయుక్తమై, స్నాత, భోక్త, బ్రాహ్మణుడు, క్షత్రియుడు, మున్నగు సంజ్ఞలను బడయు విధానమును చెప్పుచున్నాను వినుము.  ఈ చైతన్యమునకొక శక్తి యున్నది. అయ్యది ఆవరణ శక్తి. అయ్యది తనకాశ్రయమగు బ్రహ్మమును మరుగున పడజేసి, లేదనిపించుచూ, పుఉర్వా ర్జితములగు సంస్కార జనితములగు యత్నములను, వివిధ ములును, విధినిషేధ  రూపకమగు కాయిక, వాచిక, కర్మల వలన మనోభావము పొంది చైతన్యము నుండి ఉద్భవించినదయ్యు, జడమువోలె నగుచున్నది. ఇట్లు వ్యవహారదశను బొందిన బ్రహ్మశక్తి, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియముల వలన ద్రష్టృ, దృశ్య, దర్శనములను బేధముల బొందుచున్నది. పరమచైతన్యము ఈ మాయాశక్తి యొక్క ప్రసాదమువలననే కళంకితమై జగద్రూప గంధర్వనగరములను సృష్టించుచున్నది. (పరమార్థ భావమున)
సృష్టించుటలేదు. 
 

           సర్వవ్యాపియగు ఈ చిత్ శక్తి బలముననే ఈ జీవులందరూ వికాసమునందుచున్నారు. ఈ జీవులు చైతన్యము యొక్క ప్రతిబింబమాత్రులు. (పంచభూత)ద్రవ్య స్వభావులగు జీవులు అద్రవ్య (నర్ధర్మక) స్వభావమగు చైతన్యము యొక్క ప్రతిబింబమని నుడువ వీలుపడదందువా? (ఇక్కడ ఒక విషయాన్ని గమ్మత్తుగా చెప్పారు. జ్ఞాని స్వస్వరూప జ్ఞానము పొంది, ఆ పరా చైతన్యము యొక్క ప్రతిబింబమే తన ఆత్మ అని తెలుసుకుంటాడు. కాని తాను భౌతికశరీరమని భావించే అజ్ఞానియొక్క ఆత్మకూడా ఆ చైతన్యము యొక్క ప్రతి బింబమని చెప్పగలమా? అని ప్రశ్నించారు. దానికి జవాబు కూడా ఇస్తున్నారు.) ద్రవ్యము యొక్క ప్రతిబింబమే పడవలెనను నియమము లేదు. అద్దము నందు గుణము, క్రియలు మున్నగువాటి ప్రతిబింబము కూడా పడుచున్నది. ఇటగూడ నట్లే గ్రహింపవలయును. ఈ జీవుడు బ్రహ్మము యొక్క ప్రతిబింబ మైననూ, నిజస్వరూపమును విస్మరించినందున జడ భావము పొందినాడు. సద్బ్రాహ్మణుడు మోహ వశమునను కుకర్మల నాచరించుట వలన శూద్రత్వము బొందుటలేదా? (చూశారా! చేసీ కర్మలను బట్టే వర్ణము నిర్ణయింపబడుతుంది.) ఈ చైతన్యము స్వస్వరూపమును విస్మరించుట వలననే చిత్తభావమును బొందినది. మహాత్ములు కూడా మోహవశమున వికలత్వము బొంది, దీనభావము నొందుచున్నారు కదా! తరంగముల వలన నీరు సంభవించునట్లు ఈ చైతన్యము కూడ ప్రాణవాయువుతో నధ్యస్తమై శరీరమును సంచరింప జేయుచున్నది(ఈ శరీరము నడవ టానికి, ప్రాణవాయువు తోపాటు చైతన్యము కూడ అవుసరమే). పరమాత్మ శరీర శకటమును నడిపింపగోరి, మనస్సు, ప్రాణములను దృఢవాహనముల రెండింటిని సృష్టించినాడు. ఈ చైతన్యము జడరుపమును గ్రహించి, జీవభావము నొంది, ప్రానమను గుఱ్ఱము కట్టబడిన మనస్సను రథమునేక్కి, తన స్వరూపమును త్యజింపకున్ననూ, జాగ్రద్దశయందు, జన్మించు చున్నానని తోచు పదార్థములుగను, స్వప్నావస్థయందు (మేల్కొనిన) నష్టమగు పదార్థములు గను, కనబడుచున్నది. కాని ఈ పదార్థములుగా మారుట లేదు. అందువలన తరంగత్వము జలముల నుండి వేరు కానట్లు, ఈ చైతన్యము కూడ జగత్తు నుండి వేరు కాదు. దీపమున ఇల్లే ప్రకాశించునట్లు, నిరామయమగు పరమాత్మ చైతన్యముండుటవలననే, జీవుడు జీవించు చున్నాడు. సూర్యుడు తాను (నీటినావిరిగ మార్చి) సృష్టించి ప్రకాశింపజేయు మేఘమండలము వలననే గాప్పబడి, తిరోధాన, మ్లాన, ఖండభావముల బొందునట్లు, చైతన్యము గూడ అన్నిటి కినీ ఆధారమయ్యు, ఈశరీరమున వైవశ్యము నొందుచున్నది. ఎక్కుడుగా కల్లుద్రావి మత్తు గన్న మనుజుడు తన అవయవము ఖండింపబడిననూ దానిని గ్రహింపజాలనట్లు, చైతన్యము గూడ వైవశ్యము నొంది, స్వస్వరూపమును గ్రహింపజాలకున్నది. మదమత్తుడు కైపు తగ్గినా, తానా సమయమున యొనర్చిన చెయిదముల గుర్తుకు దెచ్చుకొననియట్లు చైతన్యము కూడ మోహము వినష్టమవ, స్వస్వరూపమును గ్రహింపజాలదు. 

          కుష్టురోగి హస్తపాదములవలె కొంచెము కొంచెముగ సర్వశరీరవ్యాపి యగు జీవ చైతన్యము విలుప్తమవ, ప్రాణవాయువు యొక్క శక్తి గూడ హస్తపాదాది శరీరాంగములు గూడ వైవశ్యమునందును. అప్పుడు చైతన్యము హృదయకమలమున చలనరహితమై, యజ్ఞమున కుపయోగించని కాష్ట పాత్ర వలె నుండును. హృదయకమలదళములు చలనరహితమవ, విసన కర్ర వీవనిచొ, గాలి కట్టువడునట్లు అంతరమున నున్న ప్రాణవాయువు లన్నియు నాగి పోవును. గాలి ఆగిపోవ కట్టువడు దుమారమువోలె ప్రాణవాయువు లోనదిగిన జీవుడు నామ రూపొపాధి రహితుడై, కారణస్వరూపుడై వెలయును. అప్పుడు అతని మనస్సు గూడ రజోగుణ హీనము, నిరాదారమునై ప్రాణవాయువుతో లీనమై కారణాత్మతనందును. మరల వృక్ష బీజము వలె దేహరూపముగ బ్రకాశించుచుండును. ఇట్లు వైకల్యమునందిన మూలకారణములతో పుర్య ష్టకము ప్రశాంతమైన, [పుర్యష్టకమనిన శరీరమనే నగరములో కల ఎనిమిది ముఖ్య మైన భాగాలు. అవి, 1.జ్ఞానేంద్రియ పంచకము, 2.కర్మేంద్రియ పంచకము, 3.ప్రాణాది పంచకము, 4.ఆకాశాది పంచకము, 5.అంతఃకరణ చతుష్టయము, 6.కామము,  7.కర్మలు, 8.తమస్సు (అవిద్య)] దేహము నిశ్చలమై పడిపోవును. స్వస్వరూపాజ్ఞానమను మోహము వలన చైతన్యము చేత్యాంకురమును బొందుచున్నది.  దానియండే వాసనాసమూహములన్నియూ గూడ స్పందించుచున్నవి. ఈవాసనల వలన పరిచాలితమై చైతన్యము స్వస్వరూపమును విస్మరించి, ఆళీకములగు (స్వప్నములవంటి) కల్పనల నోనర్చుచుండును. క్రమముగా హృదయ కమలదళములు వికసింప పుర్యష్టకము గూడ పరిస్ఫుటమగును. ఈ హ్సృదయ కమలయంత్రమును నిశ్చలమొనర్చిన, పుర్యష్టకముగూడ వినష్టమై పోవును.శరీరమధ్యమున పుర్యష్టకమున్నంత వరకు అయ్యది జీవద్దశ నంటియుండును. పుర్యష్టకము నశించిన శరీరము మృతమైనదిగ నెన్నబడును. తన సంకల్పము వలననే జీవుడు మరణాది దుఃఖ సమూహము ననుభవించుచున్నాడు. మరియు శరీరమందలి పద్మయంత్రము కూడ ఎడతెగక చలించుచున్నది. ఎవ్వరి హృదయమున సదా పవిత్రమగు వాసనయుండునో, అట్టి జీవులు శాశ్వతులుగను, ఏకరూపులుగను చిరంజీవులు, జీవన్ముక్తులై వెలయుదురు. హృత్పద్మ యంత్రము నిరుద్ధమవ, ప్రాణవాయువు శాంతింప ఈ శరీరము ధృతి, శక్తి వీడి కాష్టలోష్టసమమై భూమిమీద గూలును. అనాదికాలము నుండి అభ్యస్తములగు వాసనల గూర్చుకొని, మనస్సె చ్చటెచ్చట పరిభ్రమించుచుండునో, అచ్చటచ్చట స్వర్గానరకముల గాంచుచుండును. గృహస్థుడు దూరమవ, పాడుబడ్డ ఇంటివలె, మనస్సు, ప్రాణవాయువులు లేచిపియిన, శరీరము శవరూపము నొందును.


           సర్వగామియగు బ్రహ్మచైతన్యమే చేత్యభావమును, అందుండి చేతనభావమును, దానినుండి జీవభావమును, దానినుండి మనోభావమును, అందుండి పుర్యష్టకమును దాల్చి, సూక్ష్మశరీరమును దాల్చుచున్నది. ఈభావన దృఢమవ, దానినే సత్యమని తలచి, దీనియందు ఆసక్తినిగొని, తన అతివాహక భావమును మరచును. ఇట్లు కృత్రిమమగు భావనమున, అసత్య శరీరమున సత్యబుద్ధినిగొని, అసత్యమును సత్యముగను, సత్యము నసత్యముగను యొనర్చు చున్నది. సర్వగామి యగు ఈ చైతన్యము యొక్క ఒక అంశమాత్రము (అనగా చైతన్యము తన యందు ఒక అంశను కల్పించుకొని) మనస్సుగా మారి, పుర్యష్టకరధము నధిరోహించి, జగత్తు నాక్రమించుచున్నది. ఈ చైతన్యము సూక్ష్మ భూతాత్మకమును, ప్రాణాయామమునునగు పుర్యష్తకరూప శరీరమును లేవదీయ, జనులు దీనిని జీవించియున్నదానినిగ పేర్కొను చున్నారు. ఈ
జీవించియుండుట శవమధ్యమున బేతాళము ప్రవేశింప, అది కదిలిన జీవించి యున్నదని తలంచుటలో బోలియున్నది. పుర్యష్టకము నశించి, చిత్తమాకాశామున లీనమవ, శరీరము కాష్ఠపాషాణము వలె అచేతనమగును.  ఈ స్థితినే శరీరము మృతమనబడును. క్రొత్త దగు చివురుటాకు కాలక్రమమున ఎండిపోవునట్లు, జీవ భావము నందిన ఈ చైతన్యము అజ్ఞానమున తన అజరామర బ్రహ్మ స్వరూపమునుమరచి, కాలక్రమమున వైవశ్యమొంది, శక్తిరహితమగును. పిదప హృత్పద్మయంత్రము జీవ స్మృతిని గోల్పోయి నిశ్చలమవ, ప్రాణ వాయువు నిరుద్ధమగును. అప్పుడే మనుష్యుని మృతుడందురు. వృక్షపత్రములవలె మనుష్యుల శరీరములు గూడ పుట్టిగిట్టుచున్నవి. జననమరణములు వీటికి స్వాభావికములు. అగుచో దుఃఖింపనేల? చిత్సముద్రమున ఏ ఏ వైపుల ఎన్ని శరీరములను బుద్బుద పంక్తులు లేచుచున్నవో చెప్పజాలము. బుద్ధిమంతులకు వీటియందు శాశ్వత బుద్ధి లేదు.
మైత్రాయణ్యుపనిషత్ :
ద్వితీయ ప్రపాఠకము: 
          2.
బాహ్యేంద్రియ స్తంభానము కలగగా, ఊర్థ్వముగా ఉత్క్రమించి(పోయి), బాధపడుచు, పడక, తమస్సును పోగొట్టునే, అతడే ఆత్మ. మరియు ఏ యితడు నిర్మలుడై ఈ శరీరము నుండి లేచి, పరమజ్యోతి రూపము పొంది, నిజరూపు పొందునో, అతడే ఆత్మ. ఈ బ్రహ్మ అమృతము, అభయము.


బ్రహ్మసూత్ర దర్శనం:

        ఉత్క్రాంతిని గురించి చెప్పబడ్డది. ఈ విధమైన ఉత్క్రాంతి (బ్రహ్మ)ఉపాసకునికి, ఉపాసకుడు కానివానికి కూడ సమానమౌనా? కాదా? అని సంశయం.
          సూ: "సమానాచాసృత్యుపక్రమాదమృతత్త్వంచానుపాష్య" దేవయానమార్గారంభానికి పూర్వం విద్వాంసుడు, అ
విద్వాంసుడు వీరిద్దరి ఉత్క్రాంతి సమానమే. ఎందుచేత? 'వాఙ్మనసి' అనే శృతి విశేషమైనది. సగుణవిద్యయందు చెప్పబడిన అమృతత్త్వం కేవలం ఔపచారికమే. గౌణము అవిద్య అనేది దహింపబడక పూర్వమే కలుగుతోంది కాబట్టి. సగుణబ్రహ్మజ్ఞానికి (సాకారోపాసకునికి) మూర్ధన్యనాడీ ప్రవేశము ఉత్తరమార్గాన పోవడం జరుగుతుంది. ఆయా మార్గాల వరకూ ఉపాసకుడైన జ్ఞానికి, ఉపాసకుడు కాని అజ్ఞానికి కూడ భూత సూక్ష్మావయవం సమానమే! దేవయాన మార్గాన పోకుండా (పర)బ్రహ్మలోక ప్రాప్తి అనేది సగుణబ్రహ్మజ్ఞానికి కలుగదు కాబట్టి, ఉత్క్రాంతి ఇతనికి సమానమే. ఉపాసకుడు పొందే అమృతత్త్వం కాదు. ఆపేక్షిక మైనట్టి అమృతత్త్వమన్నమాట. (సాకారోపాసకుడైన సాధారణ జ్ఞానికి, అజ్ఞానికి కూడ ప్రాణం పోయే మార్గాలు, అవయవాలు ఒక్కలాగే వుంటాయి. అజ్ఞానికి ఒకవేళ ప్రాణం ఊర్థ్వముగా పోయినా, అక్కడ వున్న అవయవాలైన కళ్ళు, ముక్కు, నోరు, చెవులు మున్నగు అవయవాల ద్వారా పోతుంది. అజ్ఞాని కాబట్టి సంచితము, ప్రారబ్దములను బట్టి తదుపరి జన్మ వుంటుంది. సాధారణ జ్ఞానికి కూడా ఊర్థ్వముగా ప్రాణం పోయినప్పటికీ, ఉపాసనా దైవము యొక్క ధ్యాస వుండటమువలన ఆ సాకారదైవము యొక్క సారూప్య, సామీప్య, సాయుజ్యాలు కలుగుతాయి తప్ప మోక్షం లభించదు. ఉపాసనల వలన లభించిన పుణ్యఫలం పూర్తి కాగానే మళ్ళా జన్మకు వస్తాడు.) 

            నిర్గుణ బ్రహ్మజ్ఞానం కలవానికి 
ఉత్క్రాంతి వున్నదా? లేదా?  సంశయ నివారణ. సూ: 'సృష్టోహ్యీకేషాం'. కొందరి శాఖయందు, కణ్వశాఖయందు దేహమునుండి  ప్రాణోత్క్రాంతి నిషేధం స్పష్టంగా వుంది. కాబట్టి బ్రహ్మవిదునకు ఉత్క్రాంతి లేదు. బృహదారణ్యకోపనిషత్ 3.2.12. లో చనిపోయేవారి ప్రాణాలు ఉత్క్రమణం చెందుతాయా, చెందవా? అని అడుగగా, చెందవు అని యాజ్ఞవల్క్యుడు సమాధానమిచ్చాడు. మరి ప్రాణాలు  ఉత్క్రాంతిని పొందక పోతే యితడు మృతుడు కాడు గదా! అనే అనుమానానికి 'అత్ర్యేవ సమవరీయన్తే' అని ప్రాణాలకు ఇచ్చటనే వినాశాన్ని చెప్పి, ఆ వినాశనం సిద్ధించటానికై 'సఉచ్ఛ్వయత్త్వాధ్మాయ యత్యాధ్మతోమృతశ్వేతే' ఆ పురుషుడు ఉబ్బుతాడు, పొట్ట వాయువు చేత  పూరిమ్పబడుతుంది, దేహము కూడ ఉబ్బు తుంది. మృతుడై పడిపోతాడు అని మరణావస్థను వర్ణించాడు. కాబట్టి అవిద్వాంసునికి శరీరము నుండియే ప్రాణోత్క్రమణం చెప్పబడ్డది. అంతేతప్ప (పరబ్రహ్మ)విద్వాంసుడైన జీవునికి ప్రాణో త్క్రమణం గాని, మార్గంగాని లేదు. "అతబ్రహ్మ సమశ్నుతే" బ్రహ్మవేత్త ఇచటనే బ్రహ్మమగును అని శృతి బోధిస్తోంది. సూ: తాని పరేతథా హ్యాహ" బ్రహ్మవేత్తలకు ఆ ప్రాణాత్మకాలైన  ఇంద్రి యాలు, భూతాలూ పరమాత్మయందే లయమౌతాయి. నిరవశేషంగా లయమౌతాయి. 'ఏవ మేవాస్య' అనే శృతి ఇట్లాగే చెపుతోంది. (ప్రశ్నోపనిషత్ 6.5) నదులన్నీ సముద్రాన్ని పొంది తమతమ రూపాన్ని కోల్పోయి సముద్రమనే పేరుతొ వ్యవహరింప బడునట్లుగా అంతటా ప్రత్యగ్రూపమైన బ్రహ్మ స్వరూపాన్నే చూస్తూవుండే బ్రహ్మవేత్త యొక్క ఇంద్రియాలు అపరోక్ష జ్ఞానం వల్ల మాత్రమే తెలుసుకోవడానికి వీలైన పురుషుని పొంది (లయమై) తమతమ నామ రూపాల్ని కోల్పోతున్నాయి. కాబట్టి బ్రహ్మవేత్త యొక్క ఇంద్రియాలు పరమాత్మ యందే లయ మౌతున్నాయి అని సిద్దాంతం. (దీనిని బట్టి తెలుసుకునేదేమిటంటే యోగులకు, బ్రహ్మవేత్తలకు ప్రాణోత్క్రమణం లేదు. వారి శరీరము లోంచి ప్రాణం బయటకు రాగానే, పరబ్రహ్మ సర్వవ్యాపి కాబట్టి, అక్కడే వున్న పరబ్రహ్మలో నిరవశేషంగా లయమవుతుంది. అది ఎవ్వరికీ గోచరము కాదు. వీరియొక్క నిరవశేషలయం కారణముగా, భౌతికశరీరమును పంచభూతాలలో కలప టమే తప్ప, వీరికి ఎటువంటి అపరకర్మలూ  అవుసరము లేదు. ఆరాధనోత్సవాలను మాత్రమే జరుపుకోవాలి. ఈ విధానాన్ని సద్గురువులు పోడూరి కృష్ణవేణు మాతాజీగారి పట్ల  ఆచరించటం జరిగింది.) 

           సూ: "అవిద్భాగోవచనాత్" విద్వాంసుని ఇంద్రియాలకు (కళలకు) బ్రహ్మతో పూర్తిగా అవిభాగమైన లయమే అని శృతి వచనం.
(ప్రశ్నోపనిషత్ 6.5) ఆ కళలయొక్క (ఇంద్రియాలు ప్రాణాల యొక్క) నామరూపాలు నశిస్తాయి. అన్నీకలసిపోయి పురుషుడని మాత్రమే వ్యవహారం. ఇట్లు బ్రహ్మైక్య రూపమైనట్టి లయాన్ని పొంది నప్పుడు సాధకుడు కళలు లేనివాడు, ముక్తుడు అవుతాడు అని చెప్పడం వల్ల నిశ్శేషలయం అని తెలుస్తోంది. అజ్ఞానులకు అవిద్యా శేషం వుంటుంది కాబట్టి, వారి ఇంద్రియలయం సావశేషలయమై వుంటుంది.

         
శృతి ప్రమాణాలిట్లావున్నాయి. (బృ.దా.ఉ.4.4.1) ఇట్లా జీవుడు ప్రవేశించిన తర్వాత హృదయం ప్రకాశిస్తుంది. ఆ అప్రకాశం సూచించినమార్గం ద్వారా జీవుడు నిష్క్రమిస్తాడు. (8.8.6.) హృదయములో నూటఒక్క ముఖ్యమైన నాడులున్నాయి. అందులో మూర్థం వైపుకు పోయే ఒక నాడి వుంది. దానిద్వారా పైకి పోయే జీవుడు అమృతత్త్వాన్ని పొందుతాడు. మిగతా నాడులు కేవలం బయటకు పోవటానికి మార్గాలుగానే వుంటాయి. వాటినుండి నిష్క్రమించిన వారికి బ్రహ్మలోక ప్రాప్తి లేదని తెలుస్తోంది. సూ: "తదోకో-గ్రజ్వలనం తత్ప్రకాశిత ద్వారః  విద్యా సామర్థ్యాత్, తచ్ఛేష గత్యనుస్మృతి యోగాచ్ఛహార్థామగ్రహీత శ్శతాధికయా "| సగుణ బ్రహ్మవేత్త యొక్క ఆత్మ శరీరం నుండి నిష్క్రమించేటప్పుడు జీవునికి వాసస్థానమైన హృదయం యొక్క చివరి భాగంలో ఒక విధమైన జ్వలనం కలుగుతుంది. దానిచేత ప్రకాశింపజేయబడిన మార్గం కలవాడై హృదయంలో అధివసించియున్న బ్రహ్మము చేత అనుగ్రహింప బడినవాడై బ్రహ్మవిద్యా సామర్థ్యం వల్లనూ, బ్రహ్మవిద్యకు అంగంగా చెప్పబడిన గతిని ధ్యానించడం వల్లనూ, నూట ఒకటవది అయిన మూర్థన్యనాడి (సుషుమ్న) మార్గాన నిష్క్రమిస్తాడు. వాగీంద్రియం ఉపసంహ రింపబడటం జీవుడు హృదయస్థానాన్ని ప్రవేశించడం, హృదయాగ్రం ప్రకాశించడం అనేవి జ్ఞానికి, అజ్ఞానికి సమానమే. దీనివల్ల నిర్గమించేమార్గం ప్రకాశితమౌతుంది. అయితేజ్ఞాని మూర్థస్థానంలో వున్న సుషుమ్న నాడీ మార్గాన నిష్క్రమిస్తాడు. అమృతత్త్వాన్ని పొందుతాడు. అజ్ఞానులు శరీరమందలి ఇతరద్వారాల గుండా, కండ్లు, ముక్కులు చెవులు మున్నగు వాటి ద్వారా నిష్క్రమిస్తారు.

            సూ: "అతశ్చాయనేపి దక్షిణే" విద్యాఫలమనేది నియతంగా వుండేది కాబట్టి దక్షిణాయనంలో చనిపోయిన ఉపాసకునికి సైతం బ్రహ్మలోక ప్రాప్తి ఉంది.  వేచి ఉండనక్కర లేదు. ఉత్తరాయణం అంతే కేవలం కాలాని చెప్పే విభాగం కాదు. ఉత్తరాయణాభిమానియైన దేవత అని అర్థం. కాలాభిమాని అయిన ఆ దేవత అన్ని కాలాల్లొనూ వుంటాడు. ఉత్తరాయణ మరణం మంచిదని అజ్ఞానులైన వారి విషయంలో చెప్పినారట. భీష్ముడు ఉత్తరాయణం కోసం ప్రతీక్షించడం అనేది లోకాచారం కోసం, తండ్రి తనకు ఇచ్చిన స్వచ్ఛంద మరణమనే వరం యొక్క శక్తిని వెల్లడించడం కోసం అని మనం గ్రహించాలి. (భీష్ముడు కూడా తక్కువ వాడేమీ  కాదు. అష్టవసువులలో ఆఖరి వాడు. కామధేనువు శాపమువలన మానవునిగా మిగిలిన వసువులతో పాటు జన్మించాడు. గంగ శంతనుని ద్వారా కని, నీటిలో పడవేసిన ఏడుగురు శిశువులూ మిగిలిన వసువులు.) 

            సూ: "సంపద్యావిర్భావ స్వేన శబ్డాత్" ప్రకాశ స్వరూపమైన ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది ఆ ఆత్మరూపంలో విద్వాంసుడు ఆవిర్భూతుడౌతాడు. 


            సూ: "అనావృత్తిః శబ్దాను
వృత్తిః శబ్దాత్" (చివరి సూత్రం) అర్చిరాది మార్గం గుండా బ్రహ్మ లోకానికి పోయిన ఉపాసకులకు పునరావృత్తి లేదు. పునరావృత్తి లేదు. 

 (మీ స్పందనల కోసం ఎదురు చూస్తూ వుంటాము. దయచేసి                               www.tatvavisleshana.weebly.com ను దర్శించండి.)

Monday, July 23, 2012

జీవన్ముక్త స్థితి

                                            జీవన్ముక్త స్థితి

              ఎప్పుడైతే సద్గురువు పర్యవేక్షణలో సమాధినిష్టుడై, ఆత్మ సాక్షాత్కారము పొంది, చైతన్య భావాన్ని అనుభవిస్తూ వుంటారో, అక్కడ నుండి అనుభవాలే తప్ప నిర్వచనాలు వుండవు. స్థితిలో కొనసాగడం తప్ప వేరేయిక ఏవిధమైన ప్రక్రియ, ఉపాసన, జీవిక, వుండవు. జీవితమున్నంత కాలము జీవన్ముక్తస్థితిలో గడుపుచూ, ప్రాణావసర సమయములో ఉర్థ్వంగా ఉత్క్రమించి, ఈ ప్రాణాన్ని తృణప్రాయంగా విసర్జించి, జన్మ జరా మృత్యు చక్రం నుండి తప్పించు కొని, నేరుగా విదేహముక్తియుక్తంగా, పరబ్రహ్మస్వరూపంలో మమైక్యమగుట తప్పఇంకేమియు లేదు. దీని గురించి చాలా తక్కువ సమాచారం దొరికింది. ఎందుకంటే పరబ్రహ్మ అయినవారు చెప్పడానికి క్రిందికి దిగిరారు కాబట్టి. కాని కొంతమంది మహాత్ములు, ఋషులు మనలాటి వారికోసం కొంత విషయాన్ని చెప్పారు. దానిని తెలుసుకుందాము.
 
                                  బృహదారణ్యకోపనిషత్ ముక్తులు మూడు విధాలుగా చెప్పింది. 1.క్రమముక్తి: ఉపాసకుడు చనిపోయిన పిమ్మట తన ఉపాసనా ఫలంగా దేవయాన మార్గాన బ్రహ్మ లోకాన్ని చేరి, అచట కల్పాంతము వరకూ వుంటూ, కల్పాంతంలో ఆ కార్య బ్రహ్మ (చతుర్ముఖ బ్రహ్మ) తో పాటు పరమాత్మ యందు లీనమగుట. ఈ దశ సాధారణంగా సాకార స్వరూపాన్ని అర్చించే వారికి, ఆ సాకార స్వరూపముతొ సారూప్య, సామీప్య సాయుజ్యాలు పొందే వారికి వస్తుంది. ఆ విధానంలో కూడ ఒక విధమైన తాదాత్మ్యస్థితిని పొంది, ఆ సాకార స్వరూపముతో అభేదస్థితిని సాధించిన వారు మాత్రమే, ఆ సాకారస్వరూపముతొ పాటు పరబ్రహ్మలో లీనమవుతారు. అలా లేని వారు, కల్పాంతంలో అణుస్వరూపములో ఉండి, మళ్ళా సృష్టి ఏర్పడిన తర్వాత అర్హతను బట్టి తగు జన్మను పొందుతారు. 2.జీవన్ముక్తి: బ్రహ్మజ్ఞానం కలిగినప్పటికీ, ప్రారబ్దకర్మ వశాన లోకనుసారంగా వర్తిస్తూ అసంగుడై ఉండటం. (ఇక్కడ ఒక ప్రశ్న వచ్చి తీరాలి. కర్మఫలం దగ్దమైతేనే గాని బ్రహ్మజ్ఞానంరాదు కదా, ఇంకా ప్రారబ్దకర్మ ఏమిటి? అని. నిజానికి కర్మపాశ విముక్తి అయితేనే తప్ప బ్రహ్మజ్ఞానం రాదు. అప్పుడు కర్మలు, కర్మ ఫలితాలు పోతాయేగాని, ప్రారబ్దం వల్ల వచ్చిన జీవితం  అంతమవదు. అది మన చేతిలో లేదు. దానిని పూర్తిగా అనుభవించ వలసినదే! కాబట్టి అది పూర్తి అయ్యే వరకు ఈ ప్రపంచంలోనే వుంటూ, దీని పట్ల అసంగుడై, దీన్ని అంటుకోకుండా వుంటారు. వారు నిజంగా ముక్తులే. కాని ఆ ప్రక్రియ దేహానంతరం కలుగుతుంది. అంతవరకూ వారు వేచి యుండాల్సిందే! దానినే జీవన్ముక్త దశ అంటారు.) 3.విదేహముక్తి: దేహపాతానంతరం కలిగే నిర్విశేషబ్రహ్మైక్య స్థితి. ఇప్పుడు మనం జీవన్ముక్త దశ గురించి, జీవన్ముక్తుల లక్షణముల గురించి పెద్దలు, మహానుభావులు ఏమి చెప్పారో తెలుసుకుందాము.

పైఙ్గలోపనిషత్: తృతీయాధ్యాయము:
 
           
'తత్త్వమసి', 'అహం బ్రహ్మస్మి'  అను మహావాక్యముల అర్థమును విచారణ చేయుట శ్రవణము. ఏకాంతములో పరమార్థమును (శ్రవణార్థమును) అనుసంధానము చేయుట మననము. శ్రవణమననముల వలన సంశయరహితార్థము నందు ఏకాగ్రముగా మనస్సు నిలిపి యుండుట నిధిధ్యాసనము. ధ్యాతృధ్యానములను త్యజించి, నివాసితదీపము రీతిగా ద్యేయైక గోచరమగు చిత్తమును కలిగియుండుటే సమాధి. అట్టి సమాధి సమయములో అనాది సంసార సంచితములై యున్న కర్మరాసులన్నియు లయించి పోవును. పిమ్మట అభ్యాస బలమున సహస్రాములుగా అమృతధారలు వర్షించును. అందువలన యోగవేత్తలు సమాధిని 'ధర్మమేఘము' అని పలుకుదురు. (ఇక్కడ సద్గురువులు పోడూరి కృష్ణవేణు మాతాజీగారు చెప్పినటువంటి ఒక విషయం గుర్తుకు వస్తోంది. గురువుగారు అప్పుడప్పుడు, అంగుడిలో పైనుండి ఏదో చుక్కలుగా పడుతోందిరా, నోరంతా తియ్యగా అవుతుందిరా, ఆరుచి చెప్పలేమురా, అని చెప్పేవారు. దీనిని బట్టి శాస్త్రములలో చెప్పినటు వంటి విషయాలు తప్పక అనుభవము లోనికి వస్తాయని తెలుస్తున్నది.)  సమాధి వలన సర్వవాసనలు నశించగా, కర్మసంచయము (పాపపుణ్యములు) సమూలముగా నశించిపోగా, వేదాంత వాక్యము కరతలామలకము రీతిగా, అపరోక్షసాక్షాత్కారము సంభవించును. అప్పుడు ఆ ఆత్మజ్ఞాని జీవన్ముక్తుడగును.

మహోపనిషత్: ద్వితీయాధ్యాయము:జనకుడు శుకునితో చెప్పుచున్నాడు:
            జ్ఞాన విస్తారమును, సారామ్శాములను విపులముగా చెప్పుచున్నాను. ఈ విషయములను అర్థము చేసికోన్నచో, జీవుడు వెంటనే జీవన్ముక్తదశను పొందుచున్నాడు. దృశ్యము లేనేలేదు అనెడు అత్మజ్ఞానముతో మనస్సులో నున్న దృశ్యభావములను తుడిచివేసినచో తక్షణమే మహోన్నతమగు నిర్వాణసుఖము నుత్పన్నమగును. వాసనలను, రాగద్వేషాదులను సంపూర్ణముగ పరిత్యజించుటయే ఉత్తమ మోక్షమని సజ్జనులు వచించుచున్నారు. మోక్షమునకు ఇదియే సరియైన మార్గము. ఎవరైతే పరిశుద్ధ వాసనలతో నిండియున్నారో వారు తిరిగి జననమరణా దిగా గల అనర్థమును పొందరు. అట్టివారే యదార్థమును తెలిసికొనిన వారు. అట్టివారే జీవన్ముక్తులు, మహాత్ములు అని చెప్పబడెదరు. ధృఢమగు విషయచింతనయే బంధమని చెప్పబడును. వాసనాక్షయమే మోక్షమని చెప్పబడును. (దేహ, లోక, శాస్త్ర వాసనలే సర్వవాసనలు) తపస్సు మున్నగు సాధనలు చిఎయకయే సహజముగా ఎవరికి భోగములు రుచింపవో, అతడు జీవన్ముక్తుడని చెప్పబడును. హర్షము, అమర్షము, భయము, క్రోధము, కామము, కార్పణ్యము, ఈ సంకల్పవృత్తులు ఎవని అంతఃకరణమును స్పృశింపజాలవో, అతడే
జీవన్ముక్తుడని చెప్పబడును. అహంకార వాసనను అవలిఇలగా త్యజించి ఎవడు దృశ్యమును త్యాగము చేయునో, అతడు జీవన్ముక్తుడని చెప్పబడును. ఎవని అంతర్ముఖ దృష్టిలో ఇష్టానిష్టములు లేకయుండునో, ఎవడు సుషుప్తావస్థలో నున్నవానివలె సంచరించునో అతడు జీవన్ముక్తుడని చెప్పబడును. ఎవడు సర్వదా ఆత్మానందమును పొందునో, ఎవని మనస్సు పూర్ణముగా పావనముగా నుండునో, ఎవడు సర్వోత్తమ విశ్రాంతిని పొంది, ఏవిషయమును వాంఛింపక, గత స్నేహుడై జీవించునో, అతడు జీవన్ముక్తుడని చెప్పబడును. ఎవనియొక్క హృదయము ఆకాశము రీతిగా దృశ్యవిషయములందు కొంచెము కూడా సంగము పెట్టుకొనక యుండునో, అతడే జీవన్ముక్తుడని చెప్పబడును. ఎవడు రాగద్వేషములను, సుఖదుఃఖములను, ధర్మాధర్మములను, ఫలాఫలములను లక్ష్యము చేయక, ఆపేక్షారహితుడై, నిష్కామభావముతో సత్కర్మలను చేయుచుండునో, అతడు జీవన్ముక్తుడని చెప్పబడును. ఎవడు మౌనదీక్ష కలవాడై అహంభావ రహితుడై, మానములేనివాడై, ముక్తమత్సరుడై, ఉద్వేగరహితుడై, నిస్సంకల్పుడై, కర్తవ్యకర్మలను చేయుచుండునో, అతడు జీవన్ముక్తుడు.

           ఎవడు సర్వత్ర విగత స్నేహితుడై సాక్షిభావముతో ఉండునో, ఇచ్ఛారహితుడై సత్కర్మలు చేయుచుండునో,
అతడు జీవన్ముక్తుడు. ఎవడు తన మనస్సులో ధర్మాధర్మములను, సకల సంకల్పములను, ఇష్టమును, సర్వమును పరిత్యజించియున్నాడో, అతడు జీవన్ముక్తుడు. ఎవడు కన్పిమ్చుచున్న ఈ సమస్త దృశ్యములను సమ్యక్దృష్టితో పరిత్యజించి యుండునో, అతడు జీవన్ముక్తుడు. కారము, పులుపు, ఉప్పు, చేదు, రుచి, అరుచి వీటన్నింటినీ సమ భావముతో ఎవడు భుజించుచున్నాడో, అతడు జీవన్ముక్తుడు. వృద్ధాప్యము, మరణము, ఆపద, రాజ్యము, దరిద్రము, వీటన్నింటినీ సమభావముతో ప్రీతిగ నెవడు అనుభవించునో, అతడు జీవన్ముక్తుడు. ధర్మాధర్మములు, సుఖదుఃఖములు, జననమరణములు ఇవన్నియు ఎవడు బుద్ధితో పూర్ణముగ త్యాగము చెయుచున్నాడో అతడు జీవన్ముక్తుడు. ఉద్వేగానంద రహితుడై స్వచ్చమగు సమత్వబుద్ధితో పొంగిపోవుట, క్రుంగిపోవుట లేక యుండునో, అతడు జీవన్ముక్తుడు. సర్వేచ్చలను, సకలసంశయములను, సర్వప్రయత్నములను, సర్వ నిశ్చయ ములను ఎవడు జ్ఞానబుద్ధితో పరిత్యజించియున్నాడో, అతడు జీవన్ముక్తుడు. సృష్టిస్థితిలయ ములందు, ఉదయాస్తమయములందు, భావాభావములయందు ఎవనిమనస్సు సమభావము తో నుండునో, అతడు జీవన్ముక్తుడు. ఎవడు కొంచెము కూడ ద్వేషింపడో, కాంక్షింపడో, రాగద్వేష రహితుడో, ఎవడు ప్రారబ్ద భోగములను అనుభవించుచుండునో, అతడు జీవన్ముక్తుడు. ఎవడు సంసార సంకులములో శాంతుడై యుండునో, కళాయుక్తుడై కూడ నిష్కళుడై యుండునో, మనస్సుఉండి కూడ, అమనస్కుడై యుండునో, అతడు జీవన్ముక్తుడు. ఎవడు సమస్త సంపదల యందుండియు, సమస్త వ్యవహారములందుండియు, స్పృహలేనివాడై యుండునో, పూర్ణ బోధాస్వరూపుడై నుండునో, అతడు జీవన్ముక్తుడు.
                                    
 
వివేకచూడామణి: 

         228. తనకంటే (ఆత్మకంటే) నితర వస్తువు గోచరింపకుండు స్థితియే పరమాద్వైతము. అట్టి పరతత్త్వబోధకలిగిన శుభావస్థ యందు బ్రహ్మాతిరిక్త మగు వస్తువెద్దియూ గోచరింపక సర్వమును బ్రహ్మముగనే స్ఫురించుచుండును. ఏమనగా సృష్టికి పూర్వమందును, పరమందును కల్పితప్రపంచము లేనిది. పరతత్త్వముమాత్రమే సత్యము, నిత్యము. కనుక పరతత్త్వబోధ కలిగిన దశయందు బ్రహ్మేతరమెద్దియునూ స్పురింపదు. ఇదియే జీవన్ముక్త స్థితి.

    (తదుపరి విషయమునకై  www.tatvavisleshana.weebly.com ను సందర్శించండి.)

Friday, July 20, 2012

చైతన్యము

                                     
            చైతన్యము ఆవస్థలలో చివరిది. సర్వ ప్రాణులలోను, పదార్ధములలోను స్థావరజంగ మాత్మకమైన ఈ ప్రకృతిలోనూ నిండి వున్నది చైతన్యమే. మనలో నున్న ఈ ప్రాణచైతన్యమును విశ్వము ఆవిర్భవించుటకు మూలకారణమైన ఆ పరా చైతన్యముతో అనుసంధానింప వలెను.  చైతన్యము గురించి సర్వసారోపనిషత్ ఈ ప్రకారముగా చెప్తోంది.

      "అవస్థాత్రయ భావాభావ సాక్షి, స్వయం భావాభావ రహితం, నిరంతర చైతన్యమాత్రం యథా తత్తురీయమ్. అవస్థా త్రయోపహిత మవస్తాప లక్షితం చ నిరవస్తం విశుద్ధమేవ చైతన్యం." "జాగ్రత్స్వప్నసుషుప్త్యవస్థల యొక్క భావా భావములను సాక్షి గాను, భావాభావములు తనకు లేకనుండు నిరంతర చైతన్యముగా నుండు స్థితి ఏదియో అది తురీయము. అవస్థాత్రయముతో సంబంధపడినదిగాను, అవస్తాత్రయములచేత ఊహింపదగినది గాను, అవస్తాత్రయము లేనిది గను, శుద్ధమైనదిగను, నుండునది ఏదియో, అదే చైతన్యము."

           మానవునికి గల మూడు అవస్థల యొక్క భావాభావములకు, అనుభవములకు సాక్షి గాను, ఇవి తనకు లేకుండు స్థితి ఏదియో అది తురీయము. అనగా చిట్టచివరిది. ఇది ప్రాణ సంబంధమైన చైతన్యము. ఈ అవస్తాత్రయములతో సంబంధము వున్నట్లు గాను, వీటిచే ఊహించుటకు వీలుగాను, మరియు వీటికి ఏవిధమైన సంబంధము లేనట్టిదైన శుద్ధమైనది అనంత చైతన్యము. ఇది అలౌకికము, పారలౌకికము.

            మండలబ్రాహ్మణోపనిషత్ ధ్యానము గురించి ఈవిధంగా చెప్తోంది. "సర్వ శరీరేషు చైతన్యేకతా ధ్యానం" "సర్వ శరీరములందునూ వుండు చైతన్య మొక్కటియేయని భావించి యుండుటయే ధ్యానము." పైన చెప్పినటువంటి చైతన్యము అన్నిం టి యందు వుండునని భావించుటయే (అనుభవించుటయే) ధ్యానమని చెప్పబడుచున్నది. ధ్యానయోగములో చిట్ట చివరి భావన ఇదియే. ఇచట కేవల చైతన్య భావన తప్ప ఇతర భావన లుండవు. దీనికి చాలా చక్కటిఉదాహరణలు  "శ్రీ ఆదిపాండురంగ భక్తవిజయము" లో  వున్నాయి. అందులో ఒకటి చూద్దాము. ఒక సారి నామదేవుడు రొట్టెలు చేస్తూ వుండగా, ఒక కుక్క వచ్చి రొట్టెలను నోటితో కరచి పట్టుకొని పారిపొతుంది. అప్పుడు నామదేవుడు నేతి గిన్నెను చేతితో పట్టుకొని దాని వెనుక పరిగెడతాడు. ఆ కుక్క పండరీపురమంతా తిప్పి చివరికి నామదేవుడికి దొరుకుతుంది. అప్పుడు నామదేవుడు ఆ కుక్కను జాగ్రత్తగా వొళ్ళో కూర్చోపెట్టుకొని, పాండురంగా! గట్టిగా వున్న ఈ రొట్టెలను తింటే, నీ నోటికి గుచ్చుకోవా? ఈ నేతిలో ముంచిపెడతాను, అప్పుడు మెత్తగా వుంటాయి, అని ఆ రొట్టెలను నేతిలో ముంచి ఆ కుక్కకు పెడుతూ వుంటాడు. కొంత మంది ఇది చూసి ఆయనను వెక్కిరిస్తే, కొంతమంది ఆయన ఆకుక్కలో పాండురంగడిని చూడగలుగుతున్నాడని తెలుసుకొన్నారు. ఈ స్థాయిలో శారీరిక, మానసిక అంతరాలు నశిస్తాయి. సర్వ ప్రాపంచిక కోరికలు, భావనలు నశిస్తాయి. చివరికి కర్మలు, వేదనిర్దిష్ట ధర్మములు కూడా త్యజింపబడతాయి. నారద భక్తి సూత్రాలలొ 48, 49 సూత్రాలు ఈ విధంగా వున్నాయి.

48. "యః కర్మ ఫలం త్యజతి, కర్మాణి సంన్యస్యతి, తతో నిర్ద్వం దోవా భవతి" "ఎవడు కర్మ ఫలములను వదలునో, ఎవడు స్వార్థమైన కర్మంబులను సన్యసించునో, వాడు సుఖదుఃఖాది ద్వంద్వంబులకు అతీతుడు."

49. "(యో)వేదానపి సంన్యస్యతి, కేవల మవిచ్ఛిన్నానురాగం భవతి" "ఎవడు వేదనిర్ధిష్ఠ  ధర్మములను కూడ సన్యసించునో, అతడు నిర్మలమైనట్టి, ఎడలేనట్టి ననురాగంబును భగవంతుని యెడల కలుగును."

            పై వాక్యములను బట్టి విచారించినచో, చైతన్య స్వరూపభావన అర్థమగును. ఆ తురీయ మైన అవస్థలో దేనికీ తావు లేదు. ఆ చైతన్య స్వరూపముతొ భావైక్యము తప్ప దేనితొనూ పని లేదు. మనము ఏరు దాటవలెను. పడవ ఎక్కి ఏరు దాటుతాము. అవతలి గట్టు ఎక్కిన తర్వాత పడవను ఏటిలోనే వదులుతాము తప్ప పడవను మోసుకొని పోముకదా! అలాగే భోజనము చేయడానికి శుభ్రమైన ఆకును తెస్తాము. దానిని కడిగి భద్రపరుస్తాము. భోజనము చేసిన పిదప, ఆ ఆకును చెత్తకుండీలో పడవేస్తాము. అంటే, ఏరు దాటిన తర్వాత పడవ, భోజనము అయిన తర్వాత ఆకు యొక్క అవుసరము లేదు. వాటిని విడచి పెట్ట వలసినదే. అలాగే, చైతన్య భావనకు వచ్చిన తర్వాత, ఆమార్గమునకు ఉపయుక్తమైన వాటియొక్క, అనగా పుణ్యకర్మలు, వాటి ఫలితాలు, భక్తి మొదలైన సాకార సంబంధమైన విషయాలు, జ్ఞాన, తపోనిష్టలు యొక్క అవుసరము లేదు. సాధకుని మనస్సు ఎల్లప్పుడూ ఆ నిరంతర చైతన్యభావనలో, ఆపరమాత్మ తో అనుసంధానింపబడి వుండాలి. అమృతనాదోపనిషత్ ఇలా చెప్తోంది. "శాస్త్రాణ్యధీత మేధావీ, అభ్యస్యచ పునఃపునః, పరమం బ్రహ్మవిజ్ఞాయ ఉల్కావత్తాన్యధోత్సృజేత్" "మేధాసంపన్నుడు శాస్త్రముల నధ్యయనము చేసి, అట్లధ్యయనము చేసిన దానిని శ్రవణమననాదులచే మరల మరల నభ్యసించి, పరబ్రహ్మము నెరింగి, పిదప సాధనామాత్రములగు నా శాస్త్రములను విడచి పెట్టవలెను." ఈ స్థితిలో విశ్వచైతన్యభావన అంకురిస్తుంది. యోగవాశిష్టం ఉత్పత్తిప్రకరణములో ఈ విషయం చెప్పబడింది. "చిదిహస్తిహి చిన్మాత్రమిదం చిన్నయ మేవచ, చిత్వం చిదహమేతేచ లోకాశ్చిదితి సంగ్రహః" "ఈ ప్రపంచమున చైతన్యమే కలదు.  ఈ ప్రపంచమంతయూ చైతన్యమే అయి వున్నది. ఇది అంతయూ చైతన్యమయమే అగును. "చిచ్చేత కల్పనా బంధస్యన్ముక్తి ర్ముక్తిరుచ్యతే, చిదచేత్యాఖలాత్మేతి సర్వ సిద్దాంత సంగ్రహః" "చైతన్యము యొక్క విషయాకార కల్పనయే బంధము.  అట్టి కల్పన లేకుండుటయే ముక్తి. విషయాకార రహితమగు చైతన్యమే పూర్ణాత్మ. ఇదియే సమస్త సిద్దాంతముల యొక్క సారంశము."

            మొదటిశ్లోకములో సర్వము చైతన్యమయమని ప్రతిపాదింపబడినది. రెండవశ్లోకములో చైతన్యము కలిగించు భావాభావముల గురించి చక్కగా వివరింపబడినది. అవస్థా త్రయముతో కూడిన చైతన్య భావన లౌకికమైనట్టిది. అది విషయకారకమగును. తద్వారా అధోగతి కల్గును. కాని దానికతీతమైన విశ్వచైతన్యమే నేను అన్న భావన ద్వారా ఆవిషయముల ప్రభావము నశించి పూర్ణాత్మ ప్రకాశించును. సమస్త సిద్దాంతముల యొక్క సారమిదియే యని గ్రహించ వలెను.

           ఈ చైతన్యము గురించి మాండూక్యోపనిషత్ మనకు ఈ విధంగా సరియైన అవగాహన కల్పిస్తోంది. "నాంతః ప్రజ్ఞం, నబహి
ప్రజ్ఞం, నోభయతః ప్రజ్ఞం, నప్రజ్ఞానఘనం,నప్రజ్ఞం, నాప్రజ్ఞం, అదృష్టమవ్యవహార్య మగ్రాహ్య మలక్షణ మచింత్య మవ్యపదేశ్యమేకాత్మ ప్రత్యయసారం, ప్రపంచో పశమం, శాంతం, శివమద్వైతం, చతుర్థం, మన్యంతే స ఆత్మా, స విజ్ఞేయః" "అంతరమైన చేతన కాదు. బహిరమైన చేతన కాదు. ఈ రెండు అయిన చేతన కాదు. కరడుకట్టిన చేతన కాదు. అచేతన కాదు. కనిపించనిది. వ్యవహారములకు అతీతమైనది. గ్రహించుటకు ఆశక్యమైనది. లక్షణములకు అతీతమైనది. చింతింపనలవి కానిది. నిర్దేశింపలేనిది. అన్ని పరిస్థితులలోను ఆత్మ ఒక్కటే అనే తత్త్వపుసారం. ప్రపంచములన్నింటినీ ఉపశమింపచేసేదీ, శాంతమూ, ఆనందము, ద్వైతము కానిది, నాలుగవదీ అని భావిస్తారు. అతడే ఆత్మ. అతడే తెలుసుకోనవలసిన వాడు."

            ఇందులో పరాచైతన్యము గురించి చెప్పబడినది. ఇది శరీరము లోపల నున్న చైతన్యము కాదు. ప్రాణుల చలనము వలన కలిగిన బాహ్యమైన చైతన్యము కాదు. ఈ రెండు కలసి ఏర్పడినది కాదు. అచేతన మసలేకాదు. ఒకచోట ఘనీభవించిన చైతన్యము కాదు. ఈ పాంచభౌతిక శరీరమునకు కనిపించనిదీ, అన్ని వ్యవహారములకు, ఉపాసనలకు అతీతమైనది, ఆలోచనల ద్వారా గోచరముకానిది, ఏవిధముగాను సూచింప నలవికానిది, ఏవిధముగానైనను ఒక్కటే అను తత్త్వపుసారం. ఈ విశ్వమునంతటనూ నిండియుండి దాని యొక్క సృష్టి, స్థితి, లయములకు మూల కారణమైనది. పరమ శాంతము, అఖండైక నిర్మలానందము నొసంగు నది. ద్వైతము కానిది. ఏవిధముగా నైననూ విభజించి చూడలేనిది. నీవు, నేను అను బేధము లేనిది, నాలుగవదీ, అనగా అవస్థాత్రయమునకు అతీతమైనది, అదియే ఆత్మ ద్వారా పొంద వలసిన మూలకారణము అని భావించాలి.

            ఈ చైతన్యభావనలో పూర్తిగా మమైక్యమయిన తర్వాత, తురీయస్థితిని అనుభ వించుటకు యోగ్యమైన జీవన్ముక్త స్థితి వస్తుంది. దాని గురించి మళ్లీ కలుసుకున్నప్పుడు తెలుసుకుందాము. 

(మీ స్పందనల కోసం ఎదురు చూస్తూ వుంటాము. Please visit www.tatvavisleshana.weebly.com)

Thursday, July 19, 2012

తేజస్సు

                                   తేజస్సు               
             మనం గతంలో నాదం గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు దాని తదుపరి స్థాయి అయిన తేజస్సు గురించి తెలుసుకుందాము. భౌతికముగా నాదము మరియు తేజస్సు అనగా శబ్దము, కాంతులను పరిశీలించిన, శబ్దము కంటే కాంతి యొక్క వేగము, త్వరణము(velocity), వ్యాపకత్వము, పరిధి ఎక్కువ. కావుననే, అనేక లక్షల కాంతి సంవత్సరాల దూరములొ నున్న నక్షత్రములను ఈ భౌతిక నేత్రములతో చూడ గలుగుచున్నాము. ఇట్లే, ఆధ్యాత్మికభావములో కూడ నాదము కంటే తెజస్సునకు ఎక్కువ ప్రాముఖ్యత కలదు. ఈ తేజస్సు భౌతికమైన కాంతి కాదు. ఇది ఆత్మ సంబంధమైనది (spiritual). ఈ తేజస్సు జ్ఞాననేత్రము ద్వారా మాత్రమే గోచరమగునది. ధ్యాన సమాధుల్లో మాత్రమే అనుభవములోనికి వచ్చునది. ఈ అధ్యాయము లో తెజస్సునకు భౌతికమైన ఉదాహరణలు వచ్చినప్పటికీ, వాటిని ఆత్మ సంబం ధమైనవిగాను, పారలౌకికమైనవి గాను భావించవలెను.

             మొదట నాదమునకు తేజస్సునకు గల సంబంధము తెలుసుకొందాము. తేజోబిందూ పనిషత్ 5వ అధ్యాయములో ఈ విధంగా చెప్పబడినది. "శాంతా శాంత విహీనాత్మా నాదంత జ్యోతిరూపకః, మహావాక్యార్థతో బ్రహస్మి త్యతిదూరతః| తచ్ఛబ్ద వర్జస్త్వం శబ్దహీనో  యొ నాదాంత జ్యోతిరేవసః| అఖండైకరసోవా హ మానందోస్మితి వర్జితః, సర్వాతీత స్వభాత్మా నాదాంత జ్యోతి రేవసః|"  వాక్యముల ననుసరించి శాంతము, అశామ్తము మున్నగునవి విసర్జించినవానికి, బ్రహ్మస్మి మొదలగు మహావాక్యార్థములు మరియు శబ్దమును కూడ విసర్జించిన వానికి, అఖండైక రసప్రవాహములో మునిగి తేలుచు, అన్ని విధములైన ప్రాపంచిక స్వభావములు విసర్జించిన వానికి, నాదము యొక్క  అంతమందు జ్యోతి రూపమొక్కటియే మిగులును. దీనిని బట్టి నాదము యొక్క అంతమందు తేజస్సు మిగులునని ఋజువగుచున్నది. ఆ తేజోరూప దర్శనము వలన సకలాతీత సమతుల్య భావన ఏర్పడుచున్నది.

                మండలబ్రాహ్మణోపనిషత్ లో 'అంతర్లక్ష్యము' ను వివరించుచూ భౌతికముగా నాద బిందువును ఎట్లు సాధించవచ్చునో, ఆ తదుపరి తేజోదర్శనమెట్లగునో వివరించబడినది. "మూలాధారాదారభ్య బ్రహ్మరంధ్ర పర్యంతం సుషుమ్నా సుర్యాభా, తన్మధ్యే, తటిత్కోటిసమా మృణాళతన్తు సూక్ష్మాకుండలినీ, తత్ర తమోనివృత్తిః, తద్దర్శనా పాప
నివృత్తిః, తర్జన్యగ్రోన్మీలిత కర్ణరంధ్రద్వయే, ఫూత్కార శబ్దోజాయతే, తత్ర స్థితేమనసి, చక్షుర్మధ్యనీలజ్యోతిపశ్యతి, ఏవం హృదఏపి." మూలాధారము నుండి బ్రహ్మరంద్ర (సహస్రారము) పర్యంతము సుషుమ్నా నాది సూర్యుని వలె ప్రకాశింపుచున్నది. దాని నడుమ, తటిత్కోటి సమానమైన తామరనూలు వోలె సూక్ష్మమైన కుండలినీశక్తి (ప్రాణశక్తి) వెలుగు చున్నది. అప్పుడు తమోనివృత్తి చెందును. చూపుడు వెళ్ళ కొనలచేత కర్ణరంధ్రములు మూసికొనిన యెడల ఫూత్కార శబ్దము వినపడును. అపుడు స్థితప్రజ్ఞతో కూడిన మనస్సుతో నేత్రమధ్యమందలి  నీలజ్యోతి కనపడును. అట్లే హృదయమందు కూడ తేజో దర్శనము చూడవలెను.

                 పై వివరణలో, వెనుక, నాదములో చెప్పినదంతయూ, రెండు వాక్యములలో ఉపనిషద్రష్ట ప్రవచించినారు. కావుననే, ప్రతి వాక్యమును, ప్రతి శబ్దమును ఎంతో లోతుగా అలోచించవలసిన ఆవశ్యకత కన్పట్టుచున్నది. నాదబిందువును మానసికముగా సాధించ లేక పోయినచో, భౌతికముగా ఎలా సాధించగలమో ఇక్కడ వివరించారు. మన చెవులలో చూపుడు వేళ్ళ కొనలను జొనిపిన ప్రాణ ఘోష వినపడును. అది ఒక రంధ్రము నుండి గాలి వేగముగా ప్రయాణించు శబ్దమును పోలియుండును. ఆ శబ్దమునకు నాదమును ఆపాదించి, దృష్టిని ఆజ్ఞా చక్రమునండు అనగా భ్రుకుటి యందు నిలిపిన, నాదబిందువును సాధించగలము. దానిపై ఏకాగ్రతతో మనస్సును నిలిపిన యెడల 'నీలజ్యొతి' కనపడును. ఆ నీలజ్యొతి ఆత్మ దర్శనము తప్ప మరి యితరము కాదు.  ఈ సాధనలో చాలామంది చాలా రంగులు, వివిధ రుపాలి కలవని సూచించుచున్నారు.  ఈ విషయములో తెలుసుకోన వలసినదేమిటంటే, ఇది ఎవరికి వారికి ఒక ప్రత్యేకమైన అనుభవము. ఇంకొకరితో పోల్చి చూడరాదు. అందుకే, చాలామంది ద్రష్టాలి రకరకాలుగా చెప్పినను, వీటిని గురించి తెలుసుకొని, తనదైన మార్గములో సాధకుడు గమ్యాన్ని చేరవలసియుంటుంది. ఎన్ని రంగులు, ఎన్ని ఆకారములు సాధనలో కనిపించిననూ చివరికి, పరిపూర్ణమైన తెలుపులో కలసిపోవలసినదే! పండువెన్నెల వంటి ఆతేజస్సులో ఆనంద మనుభవించవలసినదే! ఈ ఉపనిషద్రష్ట ప్రణవ తేజోమయ స్వరూపము గురించి, అనగా, నాద బిందువు యొక్క కాంతిమయ స్వరూపము గురించి ఈ విధంగా ప్రవచించారు. "స్ఫటిక ధూమ్ర బిందు నాదకళా నక్షత్ర ఖద్యోతాదీ సువర్ణ నవరత్నాదిప్రభా దృశ్యంతే, తదేవ ప్రణవస్వరూపమ్|" "స్ఫటిక మైన తెల్లని కాంతియు, బిందునాదకళా నక్షత్రముల వంటి కాంతియు, మెరుము, దీపము, స్వర్ణము, నవరత్నములునగు కాంతి చూడబడుచున్నది. అదియే ప్రణవ స్వరూ పము." దీనిని బట్టి ప్రణవమునకు తేజో రూపము కలదని ఋజువగుచున్నది. వివిధ కాంతుల గురించి చెప్పిననూ, మొదట స్ఫటికమైన తెల్లని కాంతి యని చెప్పుట వలన, అదియే అసలైన స్వరూపమని తెలుయుచున్నది. తెల్లని కాంతిలో అన్ని వర్ణములు కలిసి యున్నవి కదా! ఇదియే స్వప్రకాశ దర్శనము. కావున దీనిని అంతర్లక్ష్యమని పేర్కొన్నారు.
అంతర్లక్ష్యమనగా, తనలో తన గురించి తాను చూచుట. లేదా తెలుసుకొనుట.  దీనిపై 'బహిర్లక్ష్యము' కలదని ఈ ఉపనిషత్ లోనే సూచించినారు. బహిర్లక్ష్యమనగా, తనను దాటి పైనున్న దానిని చూచుట, లేదా, తెలుసుకొనుట.

                   '
బహిర్లక్ష్యస్తు నాసాగ్రే చతు ష్షడష్ట దశ ద్వాదశాంగుళిభిః క్రమాత్ నీలద్యుతి శ్యామత్వ సద్రుగ్రక్త భఙ్గీస్ఫుర చ్ఛుక్ల పీతవర్ణ ద్వయోపేతం,వ్యోమతత్త్వం పశ్యతి, సతు యోగీ, చల దృష్ట్యా వ్యోమ భాగ వీక్షితు పురుషస్య దృష్టగ్రే ద్వాదశాంగులమానః జ్యొతిః పశ్యతి. తదామృత తత్త్వమేతి ." "బహిర్లక్ష్యమనగా నాసికా గ్రమందు, నాలుగు, ఆరు, ఎనిమిది, పది, పన్నెండంగుళముల చేత క్రమముగా నీలవర్ణ ప్రకాశముగాను, శ్యామలవర్ణ సమానమైన రక్త వర్ణముతో కూడినదిగాను, తెలుపును, పీత(బంగారు)వర్ణమును కలిసినట్లుండు, వ్యోమతత్త్వ మును జూచుచున్నాడు. వాడే యోగి. చల దృష్టి చేత వ్యోమ భాగమును జూచెడి యోగి దృష్టి యొక్క అగ్రభాగమునందు జ్యోతికిరణములు కనబడును. ఇందువలన దృష్టి స్థిరమగుచున్నది. శిరోగ్రభాగము నందు పన్నెండంగుళములకు మీద, జ్యోతిస్సమూహ దర్శనము కలిగి, అమృత తత్త్వము కలుగుచున్నది."

       ఈ
బహిర్లక్ష్యము సాధకునికి అత్యంత ప్రధానము. ఎంతో తీవ్రమైన సాధనను ఉపనిషద్రష్ట కొన్ని సాదారణ వాక్యములలో ప్రవచించినారు. దీనిని నిశితముగా పరిశీలించినచో, సరియైన మార్గము దొరకును.
బహిర్లక్ష్యము నాసికాగ్రము నుండి బయలుదేరి, ఆజ్ఞాచక్రము, సహస్రా రము చేరి, అటనుండి ఇంకనూ పైకి పోవుచున్నది. అనగా సహస్రారము దాటి ఇంకనూ స్థాయిలు గలవని తేలుచున్నది. ఇక్కడ 'చల దృష్టి' అని సూచించినారు. చలదృష్టి అనగా దృష్టిని కేంద్రీకరించుస్థానమును పైపైకి తీసుకోని వెళ్ళుట. అలా పైపైకి శిరోగ్రభాగము నుండి ఇంకనూ పైకి తీసుకొని వెళ్ళవలయును. ఇచట అంగుళములనగా కొలత కాదని, స్థాయీ బేధమని గ్రహించవలెను. తదుపరి, వివిధ స్థాయిలలో కనిపించు తేజస్సు యొక్క వర్ణములు వివరించుచూ, నీలము, శ్యామలవర్ణముతో కలసి యుండు ఎరుపు, తెలుపు బంగారు వర్ణముతో కలసియుండు వర్ణములు తెలియజేయుచూ, దృష్టి యొక్క అగ్ర భాగము నందు జ్యోతి కిరణములు కనబడునని సూచించినారు. నాసికాగ్రము నుండి, కనులవరకూ వున్నది అధో దృష్టి. అనగా క్రిందకు, ప్రపంచసంబంధమైనవి చూచుట. ఆజ్ఞా చక్రము నుండి ఊర్ధ్వ దృష్టి మొదలగును. అక్కడనుండి  భౌతికేతరమైనవి, పారలౌకికమైనవి కనపడును. అచ్చోట జ్యోతి కిరణములు కనబడునని సూచించినారు. అనగా ఆతేజోమయస్వరూపము యొక్క కిరణము లు మాత్రమే కనపడును. అనగా, ఆ నిరాకార పరమాత్మ యొక్క అంశమగు ఆత్మ కనబడును. ఇచట దృష్టి స్థిరమగును. అనగా దృఢమైన ఏకాగ్రత కలుగును. కాని చాల దృష్టి ఆపరాదు. ఆ ఏకాగ్ర స్థానమును మెల్లమెల్లగా ఇంకనూ పైపైకి తీసుకోని పోయినయెడల జ్యోతి సమూహము కనపడును. అనగా, జ్యోతి కిరణముల, అనగా ఆత్మయొక్క మూలమైన పరమాత్మ అనుభ వము కలుగును. అపుడు అమృత తత్త్వము కలుగును. అట్లు చేసిన వాడే యోగి అని నిర్వ చించినారు. ఈ స్థాయికి వచ్చిన సాధకుని ఆత్మ స్వరూపమే ఇంకనూ పైస్థాయిలకు తీసుకొని పోగలదు.

             ఈ సారి కలుసుకున్నప్పుడు దీని తదుపరి స్థాయి అయిన 'చైతన్యము' గురించి తెలుసుకుందాము.


(మీ స్పందనల కోసం ఎదురు చూస్తూ వుంటాము. Please visit www.tatvavisleshana.weebly.com)                           

Sunday, July 15, 2012

నాదము

             మనం గతములో ఒకచోట 'ఓం'కారము లోని అర్థమాత్ర (నాదము) గురించి చెప్పు కున్నాము. ఇప్పుడు దాని గురించి వివరంగా తెలుసుకుందాము . దీనిని స్థూలంగా 'ఓం' అని అంటారు. 'ఓం' అంటే, అకార, ఉకార, మకార, అర్థమాత్రల సమ్మేళనము. ఇందులో నాదము ఎక్కడ వుంది? అనే ప్రశ్నవెంటనే వస్తుంది. నాదము, ఓంకారాన్నిఅనుష్ఠించడంలోను, అను సంధానించడంలోను సాధింపబడుతోంది. శ్రీవేటూరి వారు 'ఓంకార నాదానుసంధానమౌ' అని ప్రయోగించారు. అదిఎలాగో ఒకసారి చూద్దాం. మనం 'ఓం' అని ఒక్కసారి ఉచ్ఛరించి వదిలి వేయరాదు. దానిని మనఊపిరి, శక్తి ఉన్నంతవరకూ సాగదీసి, తదుపరిదాన్ని మన మనస్సుతో పొడిగించాలి. అలా చేయగా, చేయగా, ఒకానొక పరిస్థితిలో, ఓం కారములోని అ, ఉ, మ లనే అక్షరాలు లయించి పోయి, అక్షరం లేని శబ్దం మాత్రమే మిగులుతుంది. దీన్నే నాదము, నాద బిందువు అని అంటారు. ఈ భావంతోనే, శ్రీశంకరాచార్యులవారు అమ్మవారిని 'సౌందర్య లహరి'లో  'నాదబిందు కళాధరి' అని కీర్తించారు. ఈ నాదబిందు సాధనకు ఓంకారమొక్కటే సులభమార్గం. దీనిని పరిచయం చెయ్యడం కోసమే ఒకసారి 'మాండలిన్' పై 'నమక చమక ములు' పలికించడం జరిగింది.  ఈ నాదబిందువు గురించి, పెద్దలు, సనాతనులు ఏమి చెప్పారో ఒకసారిచూద్దాం. ఇక్కడ ప్రసంగవశాత్తు 'ఓం' అని వచ్చినా దానిని నాదబిందువుగానే పరి గణించ వలసినదిగా ప్రార్ధన. నాద బిందువు యొక్క భౌతిక రూపమే 'ఓం'. [ఇక్కడ ఇంకొక ప్రశ్న రావచ్చును. ఆత్మ సాక్షాత్కారం దాకా వచ్చిన తర్వాత, నాదము గురించి ఎందుకు? అని. యోగమార్గములో, పరబ్రహ్మను చేరుటకు నాద బిందువు చాలా దగ్గర దారి. (shortcut) చాలామంది నియమిత పధ్ధతి ప్రకారం ముందుకు సాగ వలసి వస్తుంది. కాని, జన్మతః జ్ఞాన పరంగా, యోగపరంగా ఒకింత పరిణితి, పరిపక్వత సాధించిన వారికి, ఇటువంటి పద్ధతులు సనాతనులు సూచించారు. అటువంటి వారికిది చాలా సులభము. తెలుసుకొని, జాగ్రత్తగా అనుసరించేవారికి కూడ ఇది సులభ మార్గమే అవుతుంది. మొట్టమొదటే నాదబిందువు గురించి చెపితే కొంత గందరగోళం ఉత్పన్నమయ్యే పరిస్థితి కూడ వుంది. అందువలన ఇంత వరకూ వచ్చిన తర్వాత ఇక్కడ చెపితే, కొంతమేరకు అర్థమవుతుందనే భావనతో ఇక్కడ చెప్పడం జరుగుతోంది. పాఠకులు  గమనింప ప్రార్థన.)     
      
             అధర్వశిరోపనిషత్ 5వ ఖండంలో ఓంకారమునకు ఈ దిగువ తెల్పిన 9 నిర్వచనములు నీయబడినవి.

1. అథఃకస్మాదుచ్యతే ఓంకారః? యస్మాదుచ్ఛార్యమాణయేవ స్సర్వం శరీరమ్ మూర్థ్వమున్నయతి, తస్మాదుచ్యతే ఓంకారః|  ఓం అని పలుకుటకు  ప్రయత్నించిన వెంటనే దేహమంతయు, అనగా కుండలిని ముఖద్వారము మొదలుకొని, ఏకాదశ ద్వారములుకల దేహమునంతయూ ప్రాణవాయువు ఊర్ఠ్వభాగమునకు లేవ దీయును. కావున ఓంకార మనబడుచున్నది.

2.
అథఃకస్మాదుచ్యతే ప్రణవః? యస్మాదుచ్ఛార్యమాణయేవ ఋచో, యజూగ్ మ్ షి, సామధర్వాంగి రసశ్ఛ యజ్ఞే బ్రహ్మణేభ్యః ప్రణామయతి| తస్మాదుచ్యతే ప్రణవః| ఎందువలన ఉచ్ఛరింపబడుచుండగనే, ఋక్కులను, యజస్సులను, సమములను, అథర్వవేద మంత్రములను, షడంగములు మున్నగు వాటిని, జపయజ్ఞము  నందు బ్రహ్మవర్చస్సును, తన్నుచ్చరించు వారిచే పొందింప జేయుచున్నందున, ప్రణవమని చెప్పబడుచున్నది.
 
3. అథఃకస్మాదుచ్యతే సర్వవ్యాపీ? యస్మాదుచ్ఛార్యమాణయేవ సర్వాన్ లోకాన్ వ్యాప్నోతి, సేహోయథా పలలపిండం, శాంతమూలమోతప్రోత మను ప్రాప్య సర్వం వ్యతిశిష్టస్త స్యైవాను విద్ధం వ్యతిశిష్ట స్తస్మాదుచ్యతే సర్వవ్యాపీ| ఉచ్ఛరింపబడుచుండగనే కర్మఫలభూతములగు భూమ్యాకాశాది సకల లోకములను, నువ్వులపిండి ముద్దలో చమురు ఎట్లు వ్యాపించియున్నదో అట్లు శాంతమూల మగు ఓతప్రోతమగు జగత్తును అనుసరించి పొంది మిగిలియున్నదో, అందువలన సర్వవ్యాపీ అని చెప్పబడును. (బట్టలు నేయునపుడు ఉపయోగించే నిలువు అడ్డ దారములను సంస్కృతములో ఓతప్రోతము లంటారు. తెలుగులో పడుగు, పేక లంటారు. వస్త్రములో నిలువు, అడ్డ దారము లెటుల వ్యాపించి ఉన్నవో, ఓంకారము కూడ ఈజగత్తులో అలా వ్యాపిస్తుంది.) 

4.
అథఃకస్మాదుచ్యతే అనంతః? యస్మాదుచ్ఛార్యమాణయేవ ఆద్యంత నోపలభ్యతే, తిర్యగూర్థ్వ మాధస్తాత్తస్మా దుచ్యతే అనంతః| ఉచ్ఛరింపబడుచుండగనే ఆదియు అంతము కనబడుటలేదో, అష్టదిశలందును, అధోభాగము నందును ఆద్యంతములు కనబడుటలేదో, అందువలన అనంతమని చెప్పబడుచున్నది. 

5.
అథఃకస్మాదుచ్యతే తారమ్?యస్మాదుచ్ఛార్యమాణయేవ గర్భజన్మజరామరణ సంసార మహాభయాత్తారయతి, తస్మాదుచ్యతే తారమ్| ఉచ్ఛరింపబడిన వెంటనే గర్భవాసక్లేశము, జనన కాలికాబాధ, ముదిమి, చావు మున్నగునవికల సంసారమునుండి తరింప జేయుటవలన తారమని చెప్పబడుచున్నది.

6. అథఃకస్మాదుచ్యతే సూక్ష్మమ్?యస్మాదుచ్ఛార్యమాణయేవ సూక్ష్మోభూత్వాపరశ్శరీరాణ్యే వాధి తిష్టతి , తస్మాదుచ్యతే సూక్ష్మమ్| ఉచ్ఛరింపబడుచుండగనే అతి సూక్ష్మమునై, స్థావరజంగ మాత్మకములగు భూతముల యొక్క శరీరములను ఆధీనము చేసికొనుచున్నది. కావున సూక్ష్మమనబడుచున్నది.

7.  
అథఃకస్మాదుచ్యతే శుక్లమ్?యస్మాదుచ్ఛార్యమాణయేవ క్లందతే, క్లామయతే, తస్మాదుచ్యతే శుక్లమ్| ఉచ్ఛరింపబడుచుండగనే లోపలధ్వని చేయగలుగుచున్నదో, నాడీగణోత్పన్న దోషము లను నాశనము చేయుచున్నదో, అజ్ఞాన తత్కార్యములను నాశనము చేయుచున్నదో, అందు వలన శుక్లమన బడుచున్నది. 

8.
అథఃకస్మాదుచ్యతే వైద్యుతమ్?యస్మాదుచ్ఛార్యమాణయేవాతి మహతి, తమసి సర్వం శరీరమ్ విద్యోతయతి , తస్మాదుచ్యతే వైద్యుతమ్|  ఉచ్ఛరింపబడుచుండగనే అత్యంత గాఢమైన అంధకారమునందు, లేదా అజ్ఞానమునందున్న సకల దేహమును ప్రకాశింపజేయు చున్నదో, అందువలన వైద్యుతమనబడుచున్నది.

9.
అథఃకస్మాదుచ్యతే పరంబ్రహ్మ?యస్మాదుచ్ఛార్యమాణయేవ బృహతి, బృహయతి, తస్మా దుచ్యతే పరంబ్రహ్మ| ఉచ్ఛరింపబడుచుండగనే వృద్ధిని పొందుచున్నదో, అన్యములైన వాటిని వృద్ధి పొందింప జేయుచున్నదో, అందువలన పరబ్రహము అని చెప్పబడుచున్నది.

     పై నిర్వచనములు పరిశీలించినచో, ఓంకారము ఊర్ధ్వముఖముగా ప్రయాణము చేయుటకు, అనగా యోగామార్గామునకు మార్గదర్శి. సర్వవేద, సర్వ మంత్రార్థము. సర్వ ప్రపంచమునందు వ్యాపించియున్నది. జన్మ, జరా, మృత్యు బాధా రాహిత్యము కలుగజేయు నది. సంసార మహా భయనాశకము. అత్యంతసూక్ష్మము. సర్వభూతములను వశీకరించునది. భౌతికముగా ఉచ్ఛ రించినచో, లోపల అనగా మానసికముగా స్పందన కలుగజేయునది. నాడులలో ఉత్పన్నమైన దోషములను పరిహరించునది. ప్రకాశస్వరూపము. తాను వృద్ధిపొందుతూ, సాధకుని వృద్ధి పొందించునది అని విశదమగుచున్నది. ఇన్ని గుణములు కలది మరొకటి ఈ ప్రపంచములో కనబడుటలేదు. ఇటివంటి ఓంకారము అదే నాదబిందువు నిరాకార పరమాత్మ ను చేరుటకు ఉపయోగపడుననుటలో ఎటువంటి సంశయము లేదు.

         'కైవల్యోపనిషత్' 10వ శ్లోకములో, "ఆత్మానమరణింకృత్వా ప్రణవం చోత్తరారణి, జ్ఞాన నిర్మధనాభ్యాసాత్పాశం దహతి పణ్డితః| తన్ను అధారారణి గాను, ప్రణవము నుత్త
రారణి గాను గావించుకొని, జ్ఞానాభ్యాసమను మథనముచే బ్రహ్మజ్ఞాని అజ్ఞానమను పాశమును దహించు చున్నాడు." అని చెప్పబడినది. అరణి అంటే యజ్ఞములో అగ్నిని పుట్టించుటకు చెక్కతో చేసి నటువంటి సాధనము.అధారారణిని నేలపైవుంచి, దానిరంధ్రములో నుత్తరారణినుంచి వేగముగా త్రిప్పినచో అగ్ని జనించును. ఈవిధముగా సాధకుడు తన్నుఅధారారణిగను, ఓంకారమును నుత్తరారణిగాను భావించి, జ్ఞానమథనముగావించినచో, అజ్ఞానపాశము దహించబడును. దీనిని బట్టి నాదబిందూపాసన అజ్ఞానాంధకారమును పోగొట్టుననుటలో సందేహము లేదు. సాధకు నికి మొదట అజ్ఞానము పూర్తిగా నశిస్తేనే గాని, ముందుకు వెళ్ళలేడు. కాబట్టి సాధకునికి ఇది చాలా ముఖ్యమైనది.

         నాదబిందువు యొక్క ఉత్పత్తిస్థానములను 'అమృతనాదోపనిషత్' చక్కగా వివరించినది. "అఘోష మవ్యఞ్జన మస్వరంచ, మత్తాలు కంఠోష్ఠ మనాసికంచ యత్, అరేఫజాత ముభయోష్మ వర్జితం,యదక్షరం నక్షరతే కథంచిత్ | మాత్రాలిఙ్గపదంత్యక్త్వాశబ్దవ్యంజనవర్జితం,అస్వరేణ మకారేణ పదం సూక్ష్మంహి గచ్ఛతి| ఘోషవ్యంజన స్వరతాలుకంఠో
ష్ఠ నాసికముల సంబంధము లేనిదియు, రేఫము నుండి పుట్టినది కనిదియు, ఉభయోష్మవర్జితమునగు ఏ అక్షరము కలదో, అది ఎన్నడునూ నశింపనిదై యున్నది. శబ్దవ్యంజన రహితమైన, అకార, ఉకార, మకారమను మూడు మాత్రల గుర్తులతో కూడిన ఓంకార పదమును విడచి, స్వర రహితమగు అర్థమాత్రతో,  అనగా ప్రణవముయొక్క తురీయమగు అర్థమాత్ర సహాయమున, కేవలపదమును,తురీయాతీత మగు పరబ్రహ్మపదమును పొందుచున్నాడు." మొదటిశ్లోకమును పరిశీలించినచో ఉపనిషద్రష్ఠ యొక్క స్వరవిజ్ఞానము అనగా శరీరమందు శబ్దోత్పన్నస్థానముల యొక్క విజ్ఞానము, ఎంత కలదో, తెలియుచున్నది. అచ్చులు, హల్లులు, స్వరము కానిది, తాలువు, కంఠము, ముక్కు మున్నగు వాటినుండి పుట్టినది కానిది, రేఫము కానిది(ర్ర్ర్ ర్ కానిది), పెదవులనుండి పుట్టినది కానిది, ఏ అక్షరమైతే వున్నదో, అది నాశనము లేనిది అని విశదీకరించారు. దీనిని బట్టి నాద బిందువు భాష నుండి కాని, శరీరము నుండి కాని ఉత్పన్నము కాదు అని, మానసికముగా మాత్రమే సాధ్యపడునని తెలుయుచున్నది. ఇక రెండవ శ్లోకములో, దీని ద్వారా తురీయాతీత మైన పరబ్రహ్మ పదమును చేరుకొనవచ్చునని, రూఢిపరచుచున్నారు. ఈ ఉపనిషత్ లోనే, 32, 33వ శ్లోకములలో, ఓంకారము ఇంకనూ నిశితముగా పరిశీలింపబడినది. "పార్థివః పంచ మాత్రస్తు, చతుర్మాత్రస్తు వారుణః, ఆగ్నేయస్తు త్రిమాత్రో, వాయువ్యస్తు ద్విమాత్రకః| ఏకమాత్ర స్తదాకాశో, హ్యమాత్రంతు విచిన్తయేత్, సంధిం కృత్వాత్ మనసా, చింతయే దాత్మనే నాత్మని|" "శబ్దస్పర్శరూపరసగంధములను పంచమాత్రలతో కూడినది పార్థివ ప్రణవము. శబ్దస్పర్శ రూపరసములను నాలుగు మాత్రలతో కూడినది వారుణ ప్రణవము. శబ్దస్పర్శరూపములను మూడు మాత్రలతో కూడినది ఆగ్నేయ ప్రణవము. (ఇక్కడ ఆగ్నేయమంటే దిక్కు కాదు, పంచ భూతములలో అగ్నిభూతము) శబ్దస్పర్శలను రెండుమాత్రలతో కూడినది వాయువ్య ప్రణవము. (ఇక్కడకూడా దిక్కుకాదు,వాయుభూతము)శబ్దమను ఒక్కమాత్రతో కూడినది ఆకాశప్రణవము. మాత్రారహితమైనది ఆమాత్ర ప్రణవము. అట్టి ఆమాత్ర ప్రణవమును ఆత్మతోజేర్చి, ఆత్మయందు, ఆత్మను ధ్యానించవలెను." ఈ వివరణలో ఓంకారమునకు, పంచ మహాభూతములకు గల సంబంధం వివరింపబడినది. ఓంకారమును, మానసికముగా నిరంతరముగా పొడిగించి భావిస్తూ ఉన్నచో, క్రమముగా ఒక్కక్క మాత్ర, ఒక్కొక్క మహా భూతము లయించి, చివరకు ఆమాత్ర ప్రణవము మిగులును. నాదబిందు వంటేఇదే. మనకు తెలుసున్నంతలో, శుద్ధ గమ్భీర నిరాకార పరమాత్మ స్వరూపముతో పోల్చతగినది ఏదైనా వుంటే, అది నాద బిందువొక్కటే! ఈ నాద బిందువును ఆత్మతో జేర్చి ఆత్మను ద్యానింప వలెను. ఇందులో మొదటిది మన ఆత్మ. రెండవది దీనికి మూలమైన పరమాత్మ. పరమాత్మను   ధ్యానించడానికి దాని అంశమైన ఆత్మ వల్లే అవుతుంది. కాబట్టి అలా చెప్పారు. ఇక్కడ మనం ఇంకొక ఉదాహరణ చెప్పుకోవాలి. మోషేకి యోహావా (బైబిల్ పరిభాషలో పరమాత్మ) కొండ గుహలో అగ్నిజ్వాల రూపములో కనిపించి నపుడు, మోషే నీ గురించి ప్రజలకి ఏమని చెప్పాలి? అని అడిగినప్పుడు, ఆయన 'Tell them, 'I am that I am"'  అని అంటారు. ఇది చాలా ముఖ్యమైన వాక్యం. మన నాలుగు మహా వాక్యాల వంటిది. ఇందులో మొదటి 'I' పరమాత్మ, రెండో 'I' ఆత్మ. ఎన్నిరకాలుగా చెప్పుకున్న, దీని అసలు అర్థం ఇదే. కాబట్టి పరమాత్మను పట్టుకోవడానికి ఆత్మే సరియైన సాధనం. ఇటివంటి సాధనమైన ఆత్మకి, నిరాకార పరబ్రహ్మతో సరిసమానమైనటువంటి నాద బిందువును అను సంధానించి ధ్యానం చేస్తే, తప్పక పరబ్రహ్మ యొక్క అపరోక్షానుభవము కలుగుతుంది. 

            బ్రహ్మవిద్యోపనిషత్ నందు ఓంకారము యొక్క భౌతిక రూపమును చక్కగా వివరించి నారు. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ యదుక్తం బ్రహ్మ వాదిభిః, శరీరమ్ తస్యవక్ష్యామి, స్థానం కాలం లయా తథా| తత్ర దేవాస్త్రయః ప్రోక్తాః లోకావేదాస్త్రయోన్నయః, తిస్రో మాత్రార్థమాత్రాచ ఆక్షరాస్యశ వస్యచ| బ్రహ్మవేత్తలగువారు 'ఓం' అను ఏకాక్షరమునే బ్రహ్మమని చెప్పుచున్నారు. ఆ బ్రహ్మా వలంబన భూతమగు ప్రణవము యొక్క స్థానకాల మాత్రాది వివరణము చెప్పబడినది. 'అ' కారమునకు, ఋగ్వేదము, గార్హపత్యాగ్ని, పృధివి, బ్రహ్మ, సూర్యకాంతి, దక్షిణ నేత్రము. 'ఉ' కారమునకు, యజుర్వేదము, దక్షిణాగ్ని, అంతరిక్షము, విష్ణువు, చంద్రకాంతి, వామ నేత్రము. 'మ' కారమునకు సామవేదము, అహవనీయాగ్ని, ద్యులోకము, ఈశ్వరుదు, అగ్నికాంతి, తృతీయ నేత్రము, లేదా ఆజ్ఞా చక్రము. ఈ త్రిమాత్రా ప్రణవము యొక్క ఊర్థ్వమందు అర్థమాత్ర ప్రకాశింపుచున్నది. అనగా ఆజ్ఞా చక్రమునకు పైభాగమునందు, అనగా సహస్రారమునందు అర్థమాత్రాస్థానము. అనగా నాద బిందూపాసన ఆజ్ఞా చక్రమున మొదలై సహస్రారమును చేరును. ఇది ధ్యానయోగములో అత్యంత ముఖ్య మైనది. అత్యున్నత స్థానమైనటువంటి ఆ సహస్రారమును చేరుటకు నాద బిందువు ఒక ముఖ్య సాధనము.

             యోగశిఖోపనిషత్ ప్రణవమును లింగమని నిర్వచించినది. "సుక్ష్మాత్వా త్కారణత్వా చ్ఛలనా ద్గమనాదపి, లక్షణాత్పరమేశస్య లిమ్గామిత్యభిధేయతే| అతి సుక్ష్మమగుట చేతనూ, సర్వకారణ మగుటచేతనూ, అన్నిటినీ తనయందు లీనము చేసుకొనుట చేతనూ,
అన్నింటి యందు చేరియుండుట చేతనూ, పరమేశ్వరుని లక్షణములు కలిగి యుండుటచేతనూ, ప్రణవము లింగమని చెప్పబడు చున్నది." దీని బట్టి లింగ స్వరూపము ప్రణవమని తెలుయు చున్నది. లింగాకారమును పరిశీలించినచో, ఒకానొక రూపమును కలిగి యున్ననూ, నైరూప్య మగుటచేత, ఆ రూపమిది యని ఖచ్చితముగా చెప్పలేము. సాకార స్వరూపము నుండి మనస్సు ను నిరాకార స్వరూపము లోనికి మార్చుటకు ఒక సాధనముగా లింగ స్వరూప మేర్పడి యుండునని ఒక భావన. కావుననే ప్రణవము లింగమని భావింపబడినది. నిరాకారో పాసనకు నాద బిందువే సరియైన సాధనము.

             యోగ వాశిష్టము, ఉత్పత్తి ప్రకరణములో శ్రీవశిష్టులవారు శ్రీ రామచంద్రులవారికి ఈ రకంగా బోధించారు. "ఓంకారో
చ్ఛరణప్రాప్త శబ్ద తత్త్వానుభావనాత్, సుషుప్తో సంవిదోజాతే, ప్రాణ స్పందో నిరుద్ధ్యతే| ఓంకారము నుచ్ఛరించుచూ, అద్దాని అర్థమును చింతన చేయుట వలన బాహ్య పదార్థ జ్ఞానము సంపూర్ణముగా నుపశమింప ప్రాణ స్పందనము నిరోధింప బడును." శ్రీవశిష్టులవారు దీనికి ఉదాహరణ కుడా ఇచ్చారు. "ఇతి సంచింత యన్నేవ బలిః పరమ కోవిదః, ఓంకారార్థ మాత్రార్థం భావయన్మౌనమాస్థితం, సంశాంత సర్వసంకల్పః ప్రశాంత కల్పనా గణః| ఈ ప్రకారముగా చింతన చేయుచూ మహాజ్ఞాని యైన బలిచక్రవర్తి, సమస్త సంకల్ప ములు లెస్సగా శమించినవాడై, కల్పనా సమూహవర్జితుడై, ఓంకారము యొక్క అర్థమాత్రార్థ మగు తురీయాత్మను భావించుచూ (స్వాత్మ స్వరూపమును అనుభవించుచూ), మౌనముగా నుండెను."  దీనిని బట్టి శ్రీరామచంద్రునికే పూర్వీకుడైన శ్రీబలిచక్రవర్తి కాలము నుండియే ఈ నాదబిందూపాసన కలదని ఋజువగుచున్నది. 

         ఇంకనూ శ్రీ వశిష్టులవారు శ్రీరామచంద్రులవారికి, నిర్వాణప్రకరణములో ఇలాసూటిగా ఆదేశించారు. "ఒమిత్యుదస్తభవ వాసనమేకమాస్స్వ్య నత్వం నచాహమపి నానది హస్తి సత్యం|" ఓ రామచంద్రా! నీవు ఓంకారము యొక్క మొదటి మూఉడు పాదములు (అకార, ఉకార, మకారములు)నాల్గవపాదమున (అర్థమాత్రలో)లయమొనర్చి, (అనగా నాదబిందువును సాధించి) సంసార వాసనా రహితుడవై, ఏక తురియా రూపుడవై, యుండుము"

           ఈ రకమైన మునిప్రోక్త, ఉపనిషత్ వాక్యోపదేశమైన మార్గము ద్వారా సాధకుడు పర బ్రహ్మము యొక్క  అపరోక్షానుభూతి పొందవలయును.

            ఈ సారి కలుసుకున్నప్పుడు, నాదము యొక్క తదుపరి స్థాయి యైన 'తేజస్సు' గురించి తెలుసుకుందాము.

(మీ స్పందనల కోసం ఎదురు చూస్తూ వుంటాము. www.tatvavisleshana.weebly.com ని దర్శించండి.) 

Friday, July 13, 2012

ఆత్మ సాక్షాత్కారము

   ఆత్మ సాక్షాత్కారము
               యోగము గురించి తెలుసుకున్న తర్వాత వచ్చే స్థాయి ఆత్మదర్శనం. ఇది ఆయా వ్యక్తుల పరిస్తితిని బట్టి రకరకాలుగా వుంటుంది. సద్గురువులు పోడూరి కృష్ణవేణుమాతాజీగారు అనుభవపూర్వకముగా చెప్పినదేమిటంటే, మనం కళ్ళు మూసుకొన్న తర్వాత కనిపించేది చీకటి. ఆ చీకటిని చూస్తూనే, మనం ఏకాగ్రత కోసం ప్రయత్నించాలి. అందులోనే మనకు రక రకాల భావాలు, ఆలోచనలు, ఊహలు, కోరికలు మొదలైనవి కలుగుతూ వుంటాయి. కాని మనం ప్రయత్నపూర్వకముగా వాటిని ప్రక్కకు త్రోసివేసి మనస్సుని ఎటువంటి ఆలోచనలకూ లోను గాకుండా ప్రయత్నం చెయ్యాలి. ఆ ప్రయత్నానికి ఉపయోగపడేదే గురూపదేశమంత్రము. దాన్ని మననం చేసుకొంటూ మనస్సుని ఏకాగ్రతగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తూవుండాలి. అలా కొంతకాలానికి మనస్సు ఎటువంటి ఆలొచనలూలేకుండా నిలబడుతుంది. ఆసమయంలో ఆ చీకటిలొ ఒక్కసారి తళుక్కున మిణుగురు పురుగు వెలిగి ఆరిపోయినట్లు ఒక త్రసరేణువు లాంటి సూక్ష్మమైన కాంతి వెలిగి ఆరిపోతుంది. ఇది సెకనులో లక్షోవంతులో జరుగుతుంది. ఇక్కడితో మనం ఆగిపోకూడదు. ఆ ధ్యాన్నాన్ని అలాగే పట్టుదలతో కొనసాగించాలి. అలా చేస్తూ వుంటే, వెలిగి ఆరిపోతున్న త్రస రేణువు చాలా సార్లు కనపడుతుంది. కొన్నాళ్ళకి అది ఆరి పోకుండా అలాగే నిలబడుతుంది. దాన్నే గమనిస్తూ, మనం ధ్యాన్నాన్ని కొనసాగిస్తూ వుంటే, ఆ త్రస రేణువు యొక్క పరిమాణం పెరిగి పెద్దదై, పౌర్ణమి నాటి చంద్రుని అంతై, ఇంకా పెరిగి, మన దృష్టి ఎంతవరకూ వుంటుందో, అంతవరకూ పెరుగుతుంది. (180 degrees ఇంకా చూడగలిగితే 360 x 360 degrees) వారి వారి స్థాయీలను బట్టి దాని రంగులు కూడా మారుతూ వుంటాయి.  ఇక్కడ చెప్పుకోవలసిన గమ్మత్తైన విషయం ఏమిటంటే, ఇటువంటి అనుభవాల గురించి, ఏ పురాణంలోను, ఉపనిషత్తులోను, ఇంకా ఏ ఆధ్యాత్మికగ్రంధంలొనూ ఉదహరించి యుండలేదు. ఇది కేవలం సద్గురువుల దగ్గర, ఇటువంటి అనుభవం కలిగిన వారి శిష్యులదగ్గర మాత్రమే వినటం, తెలుసుకోవడం జరిగింది. మేము ఉదహరించిన పైవిషయములో ఏమైనా పొరపాట్లు వుంటే, శ్రీగురుమండలిని క్షమాపణ కోరుతున్నాము. కాని ఈ స్థాయి గురించి, ఈ అనుభవం పొందిన వారి స్థితి గురించి కొంత సమాచారం లభ్యమైనది. వాటిని మీ ముందుంచుతున్నాము.

యోగవాసిష్ఠము:ఉత్పత్తి ప్రకరణము:111వ సర్గ:
           
4. ఆత్మ సాక్షాత్కారమను యత్నముచే చిత్తమను బాలుడు, మిథ్యయగు  సాంసారిక పదార్థసముదాయము నుండి తొలగింపబడి, ఆత్మ స్వరూపమును సత్యవస్తువు యందు నియోజితుడై జ్ఞానయుక్తుడు గావింపబడి రక్షింపబడుచున్నాడు.
            7. ఉత్తమ ఫలదాయకమగు సమాధియను సత్కర్మ యందు మనస్సు నుపయోగించి, అట్టి సమాధి ద్వారా చిదాత్మ తోటి మనస్సు నైక్యపరచవలెను.
             13. ఆత్మ సాక్షాత్కార సాధ్యమగు మనో నాశముచే (మనో నాశ మంటే, మనస్సును ఆలోచనలు లేకుండా చేయటం) కామాది శత్రురహితమై ఆద్యంతరహితమగు స్వరాజ్య సుఖము నీదేహముండగనే సంపాదింపుము.
             16. ఆత్మ సాక్షాత్కారముచే సంకల్పములను, అనర్థములను నిర్మూలన మొనర్చు టచే ప్రశాంతమగు జీవన్ముక్త స్థితి లభించును. మనుజ దేహధారి, అధికారి యగు జీవున కిద్దాని యందు క్లేశమేమి కలదు?
              18-20. ప్రసిద్ధమగు ఉత్తమబ్రహ్మపదమును చిరకాలాభ్యాసముచే పొంది పిదప యంతిమ సాక్షాత్కార వృత్తిచే నావిర్భూతమగు చైతన్యముచే అవిద్యను సంపూర్ణముగ నశింపజేసి, చిత్తము నాత్మయందు లయపరచి, చిత్తమునకు పరమైన పూర్ణాత్మ స్వరూప మును బొందుము. ఇట్లొనర్చుటకై, ప్రధమమున చిద్వస్తుభావన జేసి, పిదప యద్దానిని స్థిర పరచుట యందే మిక్కిలి సావధానముగా బుద్ధిని వినియోగింపుము. ఆ పిమ్మట స్వస్థ చిత్తు డవై, చిత్తమును గూడ గ్రసించునదియు, చిత్తమునకు పరమైనదియు నగు పరమాత్మ యందు నిలకడగల్గి యుండుము.  ఆత్మసాక్షాత్కారరూపమగు ఉత్తమపురుష ప్రయత్నమునాశ్రయించి, చిత్తము నచిత్తము చేసి, ప్రసిద్ధమును, శాశ్వతమునగు బ్రహ్మపదమును పొందుము.
                30-32. ఏ యుపేక్ష లేనిదియు, శక్తివంతమును, సర్వహితమును, మాయాదోష రహితమును, శృతి ప్రతిపాదితమును నగు పరమాత్మ యందు చిత్తమును లయమొనర్చుట చేత తప్ప మరియే యుపాయముచేనైననూ, ముక్తి లభింపనేరదనుట, స్వర్గ, పాతాళ, ద్వీప, ద్వీపాంతరములందున్న తత్త్వవేత్తలందరి యొక్క ధృఢ సమ్మతమైనది. (ఇక్కడ ద్వీప, ద్వీపాంతరములనే మాటలను బట్టి దేశ, విదేశ ములలోనున్న తత్త్వవేత్తలతో సంబంధము లుండెడివి అనే విషయం రూఢి అవుతోంది). చిత్తోప శామనముచే కేవల చిన్మాత్ర వస్తువు శేషించుటయే ముక్తి. చిత్తోపశమనము తప్ప ముక్తి బొందుటకు మరొక ఉపాయము లేదు. సత్యమును, త్రికాలాబాధ్యమును, వ్యాపకమును, అజ్ఞానమాలిన్యరహితమునగు ఆ ఆత్మ సాక్షాత్కార రూపమైన ప్రభోధము హృదయమున నుత్పన్నము కాగా, జీవునకు పరమ శాంతి లభించును. అతి విస్తీర్ణమగు హృదయకాశామున అంతిమ బ్రహ్మకారవృత్తిచే ప్రకాశమానయగు చిద్రూపచక్రముచే ఛేధించివేయుము. అపుడు మానసికవ్యధలేమియూ నిన్నుబాధింపజాలవు.  ఆత్మవేత్తలకు సంమతమును, పరమపవిత్రమును, అమనస్కమును, అహంకారవర్జితమును, దుఃఖరహితమును, శాంతమును, జన్మవికార శూన్యము నగు ఆత్మ పదమును నీవు పొందెదవు గాక.

ఉపశమ ప్రకరణము: 8వ సర్గ: సిద్ధగీత  (ఆత్మతత్త్వము):
        
9-13. నేత్రేంద్రియముల ద్వారా స్రక్చందనాది విషయసంయోగముచే నుద్భవించు విషయకార బుద్ధివృత్తియందే యానందరూపము నిశ్చయింపబడుచున్నదో, అట్టి నిరతిశయ భూమానందస్వరూపమైన ఆత్మను నిర్వికల్పసమాదిచేతను, బాహ్యాభ్యంతరేంద్రియ నిగ్రహము చేతను మేము నిరంతరము నుపాసించుచున్నాము. ద్రష్ట, దర్శనము, దృశ్యరూపమగు త్రిపు
టిని వాసనలతోగూడ పరిత్యజించి, నేత్రాది ఇంద్రియముల (లేక మానసిక) వృత్తులను, సాక్షిరూపమై భాసిల్లు ఆత్మరూపమును, అనగా బీజసహిత త్రిపుటీ పరిత్యాగముచే, తురీయ మగు ఆత్మను నిరంతరముపాసించుచున్నాము. నేత్రేంద్రియాదుల జ్ఞానమునకు పూర్వమే భాసించునట్టి సాక్షిరూప సత్తా విషయమై, 'ఇది కలదు', 'ఇది లేదని' వాదించు వారియొక్క అస్తిత్వనాస్తిత్వములు రెండునూ సాక్షి లేకయే సిద్ధింపజాలవు. కావున అస్తిత్వనాస్తిత్వ పక్షములు రెండింటియందును, మధ్యగతమై, సాక్షి రూపమున వెలుగొందుచూ, ప్రకాశ్య వస్తువుల గూడ ప్రకాశింపజేయునట్టి ఆత్మను లెస్సగా నుపాసించుచున్నాము. లేక, అస్తిత్వ నాస్తిత్వములు రెండునూ, ఏక కాలములో యసంభవమగుటచే, రెంటియందునూ యను గతమై సన్మాత్రరూపమున సమస్త ప్రకాశ్య పదార్ధములను ప్రకాశింప జేయునట్టి ఆత్మ వస్తువును నిత్యమూ మేముపాసించు చున్నాము. (ఇది చాలా గమ్మత్తైన statement. ఉన్నది, లేదు అని ఏది భావింపబడుతోందో, ఆ భావాల రెండింటికీ మధ్య అది, దేన్నీ అంటుకొనకుండా, వాటికి విడిగా సాక్షిభూతముగా ఏదైతే వుంటోందో, దాన్ని మేము ఉపాసిస్తున్నాము అని సిద్ధులు చెపుతున్నారు. దేన్నయితే లేదు అని అంటున్నామో, ఎక్కడో, నామమాత్రముగా దాని ఉనికి వున్నట్లేగా! అదీ విషయం.)  అకారమాదియందు హకారమంతమునను కల అహం పదమునకు మాన్యమును, సర్వ వస్తుప్రకాశకమును, వేదశాస్త్రాదులందనుగతమై యున్న అకారాది హకారాంతము వరకూ గల సర్వాక్షర సముదాయ రూపమగు శబ్దజాలమందు అంతర్గతుడైయుండుటచే సర్వాకారుడును నగు నిర్గుణ బ్రహ్మమునందు స్థితికల్గి 'సోహం' మంత్రమును శ్వాసోచ్చ్వాసములచే నిరంతరము జపిమ్చుచున్న యాత్మతత్త్వమును లెస్సగా నుపాసించెదము. ('సోహం' అనగా 'అదే నేను' అని అర్థం. 'అహం బ్రహ్మస్మి' అనే మహావాక్యా నికి ఇది మంత్రరూపం. ఇది ప్రతీ వ్యక్తి లోను వారికి తెలియకుండా ఉఛ్వాసంలో 'సో' అని, నిశ్వాసంలో  'హం' అని నిత్యజపం జరుగుతూవుంటుంది. దీన్నే 'అజపా గాయత్రి' అని అంటారు. అలా తెలియకుండా జరిగే దీనివల్ల ఏమాత్రం ఉపయోగం లేదు.  ఏదైనా పుస్తకంలో చూసి, లేదా దీన్ని చదివి జపం చేసేద్దాము అనుకుంటే అస్సలు ఉపయోగం లేదు. జ్ఞానపరంగా, ఆధ్యాత్మికముగా, మానసికముగా, పరిపక్వత సాధించిన శిష్యునికి, గురువు, దీన్నినియమిత పధ్ధతి ప్రకారం ఉపదేశించి,  ఈ మహామంత్రాన్ని శ్వాసకు ఎలా అనుసంధానించాలో, దృష్టిని, దానితోపాటు మనస్సును ఎక్కడ కేంద్రీకరించాలో, మొదట ధ్యానాన్ని, ఆతర్వాత సహజంగా మారే ఆయోగాన్ని ఎలా చెయ్యాలో, తన స్వంత పర్యవేక్షణలో, శిష్యునిచేత చేయిస్తాడు. అప్పుడు మాత్రమే, ఈ సాధన ఫలిస్తుంది. దీన్నే మేము చేస్తున్నాము అని సిద్ధులు చెపుతున్నారు.)
             18. బాహ్యాభ్యంతరేంద్రియ వ్యాపారముల నిరోధించి, తద్వారా విషయజనిత దుఃఖమునురహితమొనర్చి, ఆత్మసుఖసంపాదన యెనర్పవలెను. అట్టి ఉపశమము (ఇంద్రియ వ్యాపార నిరోధము)చే యింధనములేని అగ్నివలె చిత్తము పూర్ణముగా శమించును. చిత్తము శమించినవానికి పరమార్థభూతమై సుఖరూపమైన ఆత్మయందు చిరకాలముత్తమస్థితి లభించును.
           13వ సర్గ :85: వైరాగ్యము చేతను, ప్రాణాయామము చేతను, సమాధి చేతను, వ్యసన క్షయముచేతను, పరమార్థ బ్రహ్మజ్ఞానము చేతను, ప్రాణవాయువు నిరోధింపబడును.
           14వ సర్గ: 53: జాగ్రత్స్వప్నసుషుప్తరహితమై, వాటన్నింటికినీ సాక్షీభూతమై వెలయునట్టి ఆత్మను భావించుచూ, స్వయముగ ఆత్మయందు స్థితుడవుగమ్ము.                     

         16వ సర్గ: 16, 17: సమాధి యందారూఢుడును, సమాధివ్యత్థానకాలమున వ్యవహరించు వాడును నగు వారిరువురూ (జీవన్ముక్త, విదేహముక్తులు) సుఖవిశ్రాంతి బడయువారై, అవిద్యా వలయరహితులై, కేవలము బ్రహ్మపదమున స్థితులయ్యే వుందురు.  కాని యందొకరు (జీవన్ముక్తుడు) దేహసహితుడుగను, మరియొకడు (విదేహముక్తుడు) దేహరహితుడుగను యుండును. దేహముతోగూడి దుఃఖరహితు డగును. దేహమును త్యజించి జ్ఞేయవాసనాత్యాగియై యొప్పును.
             34వ సర్గ:16, 17: మహాత్త్వరహితమై, మనోవర్జితమై, శాంతమై, పంచేంద్రియభ్రమ రహితమై, సంకల్పవర్జితమైనట్టి శుద్ధచైతన్య రూపమగు ఆత్మమాత్రుడనే నేను. (ఇవన్నీ శుద్ధమైన ఆత్మ యొక్క గుణములు. ఇటువంటి ఆత్మ మాత్రమే 'నేను' అని పిలువబడుతోంది. భగవాన్ శ్రీరమణులవారు లేవనెత్తిన 'నేనెవడను?' అనే ప్రశ్నకు సరియైన సమాధాన మిదియే!) విషయ వర్జితమును, సర్వప్రకాశకమును, బాహ్యాభ్యంతరములందు వ్యాప్తమును, నిష్కళంకమును, నిర్మలమును, సద్రూపమును నగు చిన్మయమును నేనే.
              50వ సర్గ: 36: కర్తృ, కర్మ, కరణ సహితుడవై, విజ్ఞానమయమగు బుద్ధి, బాహ్య విషయములు, ఇంద్రియములు, వీనితొ గూడి నిన్ను స్పృశింపనేరని సంసారము, స్వామ్తర్గతమున, ప్రతిబింబము మాడ్కి స్పృశించును. అనగా సాక్షి రూపమున సర్వ వ్యవ హారములు గాంచును.  నిర్వికల్పమును, నిరాలంబమును, కేవల నిజరూపమునునగు చిన్మాత్రమందు నిష్ఠ గల్గియుండుము.
              43. నిర్మలమును, నిరవయమునునగు నిజచైతన్యమున స్థితికలుగగనే, సంసారభ్రమ కారణమగు మహామోహము క్షయించును.
              54వ సర్గ: 70: నిర్వికల్ప సమాధి యందలి బ్రహ్మనాదసుఖమే పరమ పదము. అదియే శామ్తగతి. అదియే నిత్యశ్రేయము. అచ్చోట నిద్రించిన వానికి భ్రమ ఎన్నటికి బాధించదు.
              62వ సర్గ: 6: నిత్యప్రబుద్ధ (జ్ఞాన సహిత) చిత్తులు ప్రపంచ క్రియల నొనర్చుచున్ననూ, సదా ఎకతత్వ (ఆత్మ) నిష్ఠులై ఉత్తమ సమాధి యుతులై యుందురు. (జీవన్ముక్తుల జీవన విధానము ఇలా వుంటుంది. ఈ ప్రపంచంలో వుంటూనే, తమ మనస్సును  నూటికి తొంభై తొమ్మిది పాళ్ళు ఆపరమాత్మ మీద లగ్నంచేసి, ఇంకా జీవితం వుంది కాబట్టి, కాలం గడుపుతూ వుంటారు. అవుసరమయినంత మేరకు ఈ ప్రాపంచిక సంభంధమైన పనులు చేస్తూ వుంటారు. 'బాబా' సినిమాలో రజనీకాంత్ పాడినట్లు తామరాకు మీద నీటిబొట్టులా వుండటమంటే ఇదే. శ్రీశుకులవారు, జనకమహారాజు, సంత్ జ్ఞానేశ్వర్, భక్త తుకారాం, భక్త నామదేవులు మొదలగు వారు దీనికి ఉదాహరణలు.)
              8, 9: ఎకాగ్రమును, నిత్యతృప్తమును, సత్య వస్తువు నవలోకించునదియు, అబాధితమునగు ఆత్మతత్త్వమును దర్శించునదియు నగు పరాప్రజ్ఞయే సమాధి యని పెర్కొనబడును. (ఆత్మను సంపూర్ణముగా దర్శింపజేసేదే సమాధి. ఆ స్థితిలో మొదట్లో చెప్పుకోన్నట్లు మన దృష్టి ఎంతవరకూ విస్తరించుతుందో అంతవరకూ, రాకాపున్నమి నాడు వచ్చే వెన్నెలరంగులో విస్తరించి ఆత్మ దర్శనం కలుగుతుంది. సరిగ్గా ఈ స్థితినే, "వేదాంత వీధులలొ విహరించు గిరిధారి" అనే పాటలో, ఒక చరణంలో "పండు వెన్నెల రేయి, నిండు పున్నమి హాయి" అని పాడతారు. ఆ
పండు వెన్నెల, నిండు పున్నమి, సమాధి స్థితిలో కలిగే ఆత్మదర్శనానుభూతి తప్ప భౌతికమైనవి కావు.) సమస్త ఆశలను తృణమునకు అగ్నివంటిదగు ఆత్మతత్త్వబోధయే సమాధి యనబడును గాని, తూష్ణీం స్థితి గాదు. [సమాధి అంటే, ఆత్మ చైతన్యము తొణికిసలాడే స్థితి తప్ప, మరచి పోయే మత్తు లాంటిది (neglected, drowsy state) కాదు.]
               12. ఎప్పటినుండి మనస్సు సదా (పారమార్ధిక) జ్ఞానయుక్తమైయుండునో, అప్పటినుండియే, అమ్మహాత్మునకు నిరంతర సమాధి సిద్ధించినదగును.
 
అష్టావక్ర గీత: 17వ ప్రకరణము: తత్త్వజ్ఞ రూపవింశతికము: (ఆత్మజ్ఞాని లక్షణము):
            1, 2 : ఎవడు ఎల్లప్పుడూ తృప్తుడై ఉంటున్నాడో, ఇంద్రియశుద్ధి కలవాడై, ఎట్టి సంగమము లేని వాడై ఆనందించుచున్నాడో, వానిచేత జ్ఞానఫలం, ఆ ప్రకారమే యోగాభ్యాస ఫలం పొందబడుచున్నవి. తత్త్వజ్ఞాని ఈప్రపంచమందు ఎప్పుడూ కూడ ఖేదమును పొందడు. ఇది నిశ్చయము. ఎందువలననగా, ఒక్కడగు అతని చేత ఈ బ్రహ్మండమంతయూ నిండి యున్నది. (ఆ సమయములో అతను నేను పరబ్రహ్మ స్వరూపమును అనే నిశ్చయజ్ఞానము పొందివుంటాడు. అందువల్ల ప్రాపంచిక విషయములేమియూ అతనిపై ప్రభావము చూపలేవు.)
             10. ఎంత ఆశ్చర్యము? మేల్కొనుట లేదు. నిద్రించుటలేదు. కంటి రెప్పలను తెరచుట లేదు. మూయుట లేదు. ముక్తచేతసుడగు జ్ఞానికి ఒకానొక ఉత్కృష్ఠ దశ వుంటున్నది. (ఇదే, ప్రపంచములో వుంటూనే ఆపరబ్రహ్మముతో అనుసంధానింపబడి జీవించడం. ఇదే జీవన్ముక్త దశ.)
              17. ఎవడు విషయములను ద్వేషింపడో, వాటియందు లోలత్వమును కూడ చూడడో, ఎవని మనస్సు నిరంతరము అనాసక్తమై దేనినీ ఆశింపదో, ప్రారబ్దవశమున ప్రాప్తమగు దానిననుభవించుచూ, అప్రాప్తమగు దానిని కోరడో, అతడే జీవన్ముక్తుడగుచున్నాడు.
               20. నశించిన మనస్సు గల జ్ఞాని మనఃప్రకాశమునుండియూ, చిత్తభ్రాంతినందియూ, జడత్వరూప నిద్రనుండి విడివడినవాడై, అనిర్వాచ్యమైన ఒకానొక దశను పొందినవాడుగా నగును.

  
(www.tatvavisleshana.weebly.com ని దర్శించండి. మీ స్పందనల కోసం ఎదురు చూస్తూ వుంటాము.)