గజేంద్ర మోక్షము -- తత్వవిచారణ --పరిశీలన {భాగం-1 }
తత్వవిచారణతో సద్యోఫలితం అందుకున్న వారిలో గజేంద్రుడు అగ్రగణ్యుడు. ఆయనలాగా తత్వవిచారాన్ని చేసి ఉన్నఫళంగా పరమాత్మసాక్షాత్కారం పొందినవారిలో మొదటివాడు. మిగతాఅందరికి ఆదర్శప్రాయుడు. గజేంద్రుడి పేరుతో శ్రీవ్యాసులవారు, శ్రీపోతన గారు మనకు తత్వవిచారాన్ని పరిచయం చేసి, ఏవిధంగా దాన్ని చేయాలి, ఎటువంటి ప్రశ్నలు వేసుకోవాలి, ఏవిధమైన జవాబులు రాబట్టుకోవాలి, మన ఆలోచనలని, భావాలని ఏవిధంగా మలచుకోవాలి, ఏవిధమైన భావపరంపరలతో ముందుకు సాగితే గమ్యమైన పరమాత్మను చేరుతాము అన్న విషయాలను చాలా చక్కగా తెలియజేసారు. ఇప్పుడు మనం శ్రీమద్భాగవతంలో గజేంద్రుడు పేరుమీద వ్యాసులవారు పోతనగారు మనకు ఇచ్చిన తత్వవిచార భాండాగారాన్ని ఒక క్రమంలో పరిశీలిద్దాం. వారిద్దరూ ఒకే భావాన్ని ఏవిధంగా వ్యక్తపరిచారు, వ్యాసులవారు చెప్పినవాటిలో పోతనగారు వేటిని చెప్పారు, వేటిని వదిలివేసారు, ఇంకా వేటిని చెప్పారు, వీటన్నిటిని కూడా పరిశీలించి, వారి దృక్పధాన్ని తెలుసుకొంటూ తత్వవిచారాన్ని మన మనస్సులలో నాటుకొనేటట్లు చేసుకొందాం. ముందరగా వ్యాసభాగవతంలోని శ్లోకాలను చెప్పుకొని, వాటిని పోతనగారు ఏవిధంగా తెనిగించారు, ఆభావాలను ఏవిధంగా చెప్పారో పోల్చి చూసుకుందాం.
"ఓమ్ నమో భగవతే తస్మై యత ఎతచ్చిదాత్మకం, పురుషాయాదిబీజాయ పరేశాయాభిధీమహి"
ఎవని ప్రవేశముచే జడములైన శరీరమనంబులు చేతనములౌనో, ఓంకార శబ్డంబునకు లక్ష్యమై శరీరంబున ప్రకృతీ పురుషులు తానైయున్న సర్వసమర్ధుడైన పరమేశ్వరునకు మనంబున నమస్సులు అర్పించుచున్నాను.
ఎందుచేతనో గాని పోతనగారు ఈశ్లోకాన్ని తెనిగించలేదు. ఈశ్లోకంలో వ్యాసులవారు సృష్ట్యాదిలో జరిగిన సంఘటనను తెలియజేసారు. ఈవిషయాన్ని పైంగలోపనిషద్ లో యాజ్నవల్క్యముని పైన్గలునికి ఉపదేశించారు. సృష్టికి పూర్వం పరమాత్మ ఒక్కడే వున్నాడు.ఆ పరమాత్మలోనే సకలము సంకుచిత వస్త్రమువలె దాగివున్నది. ఆ పరమాత్మనుండి రజోగుణముతో నుద్రిక్తమైన మహత్తు ఏర్పడెను. ఆమహత్తునందు ప్రతిఫలించిన బ్రహ్మము హిరణ్యగర్భచైతన్యముగా నుండెను. అందుండి తమో గుణాద్రిక్తమగు అహంకారము పుట్టెను. ఆ అహంకారమునందు ప్రతిఫలించిన పరబ్రహ్మము విరాట్ అను చైతన్యమై యుండెను. దానినుండి గర్భోదకశాయి అయిన శ్రీమహావిష్ణువు పుట్టెను. (ఈయన స్థితికారకుడైన సత్వగుణప్రధానుడైన నాలుగు చేతులు గల విష్ణువు కాదు.) ఈయన నుండే సూక్ష్మ పంచ భూతములు పుట్టినవి. ఆ పంచభూతముల వివిధరకములైన కలయకల వలన ప్రాణ శక్తి, అంతఃకరణ, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, శరీరాలు, మనుషులు, దేవతలు, మన విశ్వంతో పాటు అనేక బ్రహ్మాండాలు ఏర్పడ్డాయి. కాని ఆ దేహేన్ద్రియాలు చైతన్యమూర్తియగు పరబ్రహ్మ లేకుండా స్పందన కలిగియుండుటకు, పనిచేయుటకు సమర్ధతలేకుండెను. అప్పుడు ఈపరిస్థితిని గమనించిన పరబ్రహ్మ, బ్రహ్మండములను, సమస్తవ్యష్టిశరీరములయొక్క మస్తకములను బ్రద్దలుచేసి వాటన్నిటి యందు చైతన్యరూపములో ప్రవేశించెను. ఆ రంధ్రమే మన తలలో నున్న బ్రహ్మరంధ్రము. (సహస్రారచక్రము. పరబ్రహ్మ వచ్చిన ఈరంధ్రము గుండానే మనం బయటకు వెళ్ళితే ఆ పరబ్రహ్మను చేరుకుంటాము. ఈ విషయాన్నీ ఇంకొకసారి ముచ్చటించుకుందాము.) అప్పటినుండి ఈ శరీరాలు చైతన్యమయమయ్యాయి. ఆవిషయాన్నే గజేంద్రుడు ద్వారా వ్యాసులవారు మనకు చెప్పారు. తర్వాత ఓంకార శబ్దమునకు లక్ష్యమైనదని చెప్పినారు. పెద్దలు "తస్య వాచకః ప్రణవః, తజ్జపః స్తదర్ధభావనః" అని తెలియజేసినారు. ఆపరమాత్మ యొక్క సర్వనామము (pronoun) ఓంకారమని, దానిని జపించినచో ఆపరమాత్మ యొక్క అర్ధమూ, భావననూ పొందవచ్చునని చెప్పినారు. అందువల్ల ఓంకారమునకు లక్ష్యము ఆ పరబ్రహ్మేనని, వేరే యితరములు కావని స్పష్టమగుచున్నది. శరీరమున ప్రకృతీ పురుషులు తానై యున్నాడని చెప్పినారు. మన శరీరములో ముఖ్యముగా రెండు వున్నవి. ఒకటి పదార్ధము (matter). అదియే ప్రకృతి. రెండవది చైతన్యము. అదే ఆత్మ(energy). ఈ చైతన్యముయొక్క మహాస్వరూపాన్నే ఉపనిషత్తులలోను, పురుషసూక్తములోను పురుషశబ్దంతో తెలియజేశారు. ఈ ప్రకృతి పురుషుల కలయికతోనే జీవరాసులు ఏర్పడినాయి. ఈ ప్రకృతి పురుషులు రెండున్నూ ఆ పరబ్రహ్మ తప్ప వేరే ఇంకెవరూ కారు. చూసారా! వ్యాసులవారు ఎన్ని పెద్ద విషయాలని ఒక చిన్న శ్లోకంలో చెప్పారో! ఇలా చిన్న పదాలలోంచి అంతర్గతంగా వున్న మహా జ్ఞానాన్ని వెతుక్కోవటమే తత్వ విచారణ. ఇక తర్వాత శ్లోకానికి వెళదాం.
"యస్మిన్నిదం యతశ్చేదం యేనేదం య ఇదంస్వయం, యో-స్మాత్పరస్మాచ్చ పరస్తం ప్రపద్యే స్వయంభువం"
"ఎవని ఆధారమున విశ్వంబు నిలిచియున్నదో, ఎవ్వనినుంచి ప్రభవించినదో, ఎవరు దానిని సృజించిరో, ఎవరు స్వయముగా తానే విశ్వమై ప్రకటితమయ్యెనో, ఎవరీ దృశ్య ప్రపంచముచే, దాని కారణభూత ప్రకృతిచే విలక్షణమై శ్రేష్టమై తనంతతా కారణరహితుడై ప్రభవించునో అట్టి భగవానుని శరణము నొందుచున్నాను."
దీని అర్ధం చాల తేటతెల్లంగా వుంది. వేరే వివరణ అవుసరం అక్కరలేదు. కాని చివర ఒక విషయం చెప్పారు. అన్నీ తానే అవుతూ, మళ్లీ కారణరహితుడై ఉంటాడట. అంటే అన్నీ తానేచేస్తాడు, చేయిస్తాడు. మళ్ళా దేనితోను సంబంధం లేకుండా, దేన్నీ అంటు కోకుండా ఉంటాడు. కాబట్టి మనం కూడా ఈ విషయాన్నే అనుసరించాలి. ఈ పదార్ధపూరితమైన ప్రకృతిలో వుంటూ, దీనికి సంబంధించిన పనులు, ఇంకా మిగతావి వాటిని అంటుకోకుండా అంటే నిష్కామంగా చేయాలి. అప్పుడు ఆకర్మల యొక్క ఫలితాలు మనకు అంటుకోవు. పైగా కర్మరాహిత్యం కూడా అవుతుంది. ఈవిషయాన్నే పరమాత్మ భగవద్గీతలో "కర్మణ్యేవాధికారస్తే" అని చెప్పాడు. ఈవిషయాన్నే మనకు వ్యాసులవారు కూడా నర్మగర్భంగా చెప్పారు. ఈశ్లోకాన్ని పోతనగారు తెనిగిస్తూ ఇంకొక విధంగా చెప్పారు.
"ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలనుండు లీనమై, యెవ్వని యందుడిందు, బరమేశ్వరుడెవ్వడు మూలకారణం
బెవ్వ డనాదిమధ్యలయు డెవ్వడు సర్వము దానయైన వా, డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్."
బెవ్వ డనాదిమధ్యలయు డెవ్వడు సర్వము దానయైన వా, డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్."
తత్వ విచారణాక్రమంలో యీపద్యం చాలా విలువైనదీ, ముఖ్యమైనది. ఒక దాన్ని గురించి సమగ్రంగా తెలుసుకోవాలంటే దాన్ని ఎన్నికోణాల్లోంచి, ఎన్నివిధాలుగా ప్రశ్నించి పరిశీలించాలో యీపద్యంలో పోతనగారు చెప్పారు. ఆయన స్వయంగా ఒక యోగి. యోగ తత్వ రహస్యాలెన్నింటినో ఆయన భాగవతంలో చొప్పించారు. ప్రస్తుతం యీ పద్యాన్ని నాలుగు ముక్కలుగా విడదీసుకోవాలి. మొదటిది ప్రశ్నా భాగం. రెండవది ఒక్క "వానిని" అన్న మాట మాత్రమే. మూడవది "ఆత్మభవు నీశ్వరు". మిగతాది నాల్గవది. పోతనగారు ఇక్కడ మంచిగమ్మత్తు చేసారు. ముందర మనకి ఎలా ప్రశ్నలు వేయాలో నేర్పారు. తర్వాత ఆప్రశ్నలు వేసుకొని, వాటికి సమాధానాలు రాక మనం ఇబ్బందులు పడతామని గ్రహించి, "వానిని" అంటే ఆ ప్రశ్నలకు సమాధానమైన వానిని అని, మళ్లీ వాడెక్కడ ఉన్నాడో తెలియక కలవర పడతామని, "ఆత్మభవుని" అంటే మన ఆత్మలోనే, మనకు చాలా దగ్గరలోనే ఉన్నాడని విశదీకరించారు. చూసారా! తత్వవిచారణా పధ్ధతిలో యీపద్యాన్ని అనుసరించి నట్లయితే, పరబ్రహ్మస్వరూపజ్ఞానం కోసం ఏవిధమైన పరిశోధన జరపాలి, వాడెక్కడ వున్నాడు, వాడిని పట్టుకోవాలంటే ముందర దేన్ని తెలుసుకొని దర్శించాలి, దేన్ని పట్టుకొంటే ఆపరమాత్మ దొరుకుతాడు మొదలైన విషయాలన్నీ చాలా తేలికగా తెలుస్తాయి. ఇదీ పోతనగారి గొప్పతనం. గజేంద్రుడి మిషతో మనకు ఇంతటి గొప్ప విషయపరిజ్ఞానాన్ని అందించారు.
(Please visit: www.tatvavisleshana.weebly.com)
No comments:
Post a Comment