Tuesday, December 27, 2011

                      పరబ్రహ్మను ఎందుకు తెలుసుకోవాలి?
              "శుద్ధగంభీర నిర్గుణ నిరాకార పరమాత్మస్వరూపాన్ని ఎందుకు తెలుసుకోవాలి?" అనేది అనాదినుండీ వచ్చే స్వాభావికమైన ఆధ్యాత్మికప్రశ్న. ఈ ప్రశ్నను జన్మించిన ప్రతీవారు, ఎవరికి వారు వేసుకొని సమాధానం రాబట్టుకోవాలి. సరియైన పద్ధతిలో కనక ప్రయత్నిస్తే, ఎవరికి వారికి, వారికే ఒక ప్రత్యేకమైన సమాధానం, ఒక మార్గం, ఒక గమ్యం తెలుస్తాయి. ఈ విషయమై నాకు తెలిసిన ఒక యదార్థమైన విషయాన్ని తెలియజేస్తాను. ఇక్కడ విషయం మాత్రమే ప్రధానమైనందున, సదరు వ్యక్తిపేరు తెలియజేయటం లేదు.  ఒకానొక సమయంలో, ఒక సన్యాసికి అప్పటి శ్రీకంచికామ కోటిపీఠాధిపతులైన, పరమాచార్యులు పరమహంస పరివ్రాజికాచార్య శ్రీశ్రీశ్రీచంద్రశేఖరేంద్రసరస్వతిస్వామి వారి వద్దకువెళ్లి, వారినుండి తురీయఆధ్యాత్మికతత్త్వాన్ని తెలుసుకోవాలనే కోరిక యుండేదట. ఒకనాడు వారు కంచివెళ్లి, శ్రీపరమాచార్యులవారిని కలుసుకొని నమస్కరించారు. వారిని శ్రీపరమాచార్యులవారు ఎందుకు వచ్చావని ప్రశించారు. అప్పుడా స్వామి, 'ఏ కోరిక కోరితే, కోరికలేమీ   ఉండవో, ఆ కోరిక కోసం వచ్చానని' సమాధానమిచ్చారు. దానికి శ్రీపరమాచార్యుల వారు 'అదికూడా ఒక కోరికే కదా!' అన్నారు. అందులకా స్వామి బదులు చెప్పలేక నిశ్చేష్టులై ఉండిపోయారు. అప్పుడు శ్రీపరమాచార్యులవారు నవ్వుతూ అక్కడనుండి వెళ్లిపోయారట.  ఇక్కడ మనం ఒక విషయాన్ని సునిశితంగా గమనించాలి. ఏ కోరిక కోరితే, కోరికలేమీ ఉండవో, అది నిజంగా కోరికేనా? ఏ సమాధానం ఆశించి,  శ్రీపరమాచార్యులవారు 'అదికూడా ఒక కోరికే కదా?' అని ప్రశ్నించారు? ఈ ప్రశ్నకి నిజమైన సమాధానం ఏమిటి?

            ఈవిషయాన్ని నిజంగా మనం తెలుసుకోవాలంటే, కొంత వెనక్కి(flashback) వెళ్ళాలి.ఎంత వరకూ అంటే, మనం ఈమానవశరీరం పొందడానికి, జన్మఎత్తే ముందు, ఆత్మ అణు స్వరూపం లో ఉన్నసమయానికి వెళ్ళాలి. అప్పుడు ఆత్మ అణుస్వరూపంలో ఉన్నప్పటికీ, పూర్వజన్మల, కర్మల, జ్ఞానం సంపూర్ణంగా వుంటుంది. ఆస్థితిలో మనం, జన్మమృత్యుచక్రంనుండి బయటపడి, పరబ్రహ్మ ను చేరుకోవాలంటే నిష్కామకర్మల ద్వారా కర్మరాహిత్యాన్ని చేసుకొని,  ఆపరబ్రహ్మను  జ్ఞాన, తత్వ, యోగసాధనల ద్వారా తెలుసుకోవాలి కాబట్టి, యింతకుమించి వేరే ఏవిధమైన మార్గంలేదుకాబట్టి,  దానికి తప్పనిసరిగా మానవశరీరం, అందుకోసం మానవజన్మ అవుసరం కాబట్టి, ఓ పరమాత్మా! నేను యింతకుముందు అనేకవిధములైన జన్మలెత్తినప్పటికీ, అజ్ఞానతమస్సులో కూరుకు పోయి, నిన్ను తెలుసుకోలేకపోయాను, ఈ జననమరణచక్రబంధం నుండి తప్పించుకొని, నిన్ను చేరుటకు గాను నాకు ఒక్కసారి మానుషజన్మ నివ్వు, నాకు మానవజన్మ ఇస్తే, అన్నివిధములైన ఋణములు తీర్చుకొని, నిష్కామకర్మల ద్వారా కర్మబంధాన్ని త్రెంచుకొని, తత్త్వ, జ్ఞాన, యోగ సాధనల ద్వారా నిన్ను తెలుసుకొని, నిన్ను చేరుతాను, అని ఆయనకు మొర పెట్టుకొన్నాము. ఎట్టకేలకు ఆయన మన బాధ, ఆర్తి గమనించి, ఈసారికి ఈ ఆత్మకి మానవజన్మ నిద్దాము, ఏం చేస్తుందో చూస్తాను అని, మనల్ని యోగ్యమైన ఒక మాతృగర్భంలో ప్రవేశపెడతాడు. అక్కడకూడా, ఈ విషయం మనకు తెలిసియుండుటచే, ఓ పరమాత్మా! నన్ను తొందరగా ఈ గర్భపంజరం నుండి విడుదలచెయ్యి, ఇక్కడ నేను ఉండలేక పోతున్నాను అని ప్రార్థిస్తాము. ఎంతో కష్టమైన జననకాల బాధ ననుభవిస్తూ, మాతృగర్భం నుండి బయటపడగానే, మనం పీల్చే మొదటిశ్వాస లోంచే  'మాయ' మనలో ప్రవేశించి, అంతకుముందు మనకున్న జ్ఞానాన్ని, వివేకాన్ని, మూసివేస్తుంది. వెంటనే మనం 'క్వా' 'క్వా', 'ఎక్కడ' 'ఎక్కడ' అని ఏడుస్తూ, మాయలో పడి, పెరిగి పెద్దవుతూ, విషయాల వలలో చిక్కు కొని, క్రిందు మీదులవుతూ, మనం ఈమానవజన్మకు ఎందుకు వచ్చామో మర్చిపోతున్నాము.ఇప్పుడు చెప్పండి! పరమాత్మ స్వరూపాన్ని గురించి చర్చించి, తెలుసుకొని, దానిని పొందండం మనకు కోరికయా? విధి(duty)యా? అది మన తప్పనిసరి విధి. కోరిక ఎంతమాత్రమూ కాదు! ఈ విధమైన సమాధానాన్ని ఆశించే శ్రీపరమాచార్యులవారు 'అదికూడా ఒక కోరికే కదా?' అని ప్రశ్నించారు.

              కాబట్టి విజ్ఞులమైన మనమందరమూ, ఈ మానవజన్మ ఎత్తినందుకు, మన జీవితాలు సాఫల్యం చెందేందుకు, ఆపరమాత్మకు మనం ఈ జన్మకు ముందర ఇచ్చిన మాటను నిలబెట్టు కునేందుకు, పరబ్రహ్మవిచారాన్ని కొనసాగిద్దాం. ఈ విషయంలో మహాత్ములు, పెద్దవారు, ఋషులు ఏమి చెప్పారో తెలుసుకొందాం. ఇక్కడ చిన్న విషయం. వారు చెప్పినది మామూలుగాను, వాటి వివరణను బ్రాకెట్ల లోను ఉంచడమైనది. గమనించగోర్తాను.

బ్రహ్మసూత్ర దర్శనం:
            సూ.1: "అథాతో బ్రహ్మజిజ్ఞాసా" - పిమ్మట కాబట్టి, బ్రహ్మమును తెలిసికొనుటకు కోరిక.
            వివేకాదిసాధన సంపత్తి  సిద్ధించిన 'పిమ్మట', కర్మఫలం అనిత్యమైనదని, జ్ఞానఫలమైన 'మోక్షం' నిత్యమైనదని తెలిసినది  'కాబట్టి', ముముక్షువైనవాడు బ్రహ్మమును తెలిసికొనుటకు కోరాలి.  (మనం చేసేకర్మల ద్వారా వచ్చే ఫలం భౌతికమైనది, అనిత్యమైనది. తత్త్వవిచారణ ద్వారా పొందిన జ్ఞానంవల్ల మోక్షం శాశ్వతమైనదని తెలుస్తుంది. కాబట్టి మనం శాశ్వతమైన మోక్షం పొందటానికి గాను పరబ్రహ్మను తెలిసికొనుటకు కోరాలి. ఎందువల్లనంటే  'బ్రహ్మవిద్ బ్రహ్మైవభవతి' - బ్రహ్మము నెరింగినవాడు బ్రహ్మమే అవుతాడు.) బ్రహ్మమనేది జ్ఞానరూప ప్రమాణాలతో తెలుసుకో దగినది. వేదాంతవాక్యార్థ విచారణ త్వారా తెలుసుకోదగినది.
             'తత్త్వజ్ఞానాదేవనిఃశ్రేయసాధిగమః' - జీవబ్రహ్మైక్యజ్ఞానం వల్లమాత్రమే మోక్షం లభిస్తుంది. (గౌ.సూ.1.1.2) కాబట్టి మోక్షాన్ని పొందాలంటే  బ్రహ్మవిషయకమైన విచారణ చేయాలి.  తాపత్రయ నివృత్తి కోసం బ్రహ్మ జిజ్ఞాస చేయాలి. అంటే ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవిక దుఃఖాలన్నీ నశించటం కోసం బ్రహ్మజిజ్ఞాస చేయాలి. (మోక్షం కేవలం ఆపరబ్రహ్మలో ఏవిధంగా మమైక్యం చెందాలో తెలిపే తత్త్వజ్ఞానంవల్ల మాత్రమే లభిస్తుంది. మరి ఏఇతరమైన ప్రక్రియలు అంటే పూజలూ, వ్రతాలూ, నోములూ, యజ్ఞయాగాదులు, వాపీకూపతటాకాది నిర్మాణాలు వంటి ప్రాపంచిక సంబంధమైన బౌతికకర్మల వల్ల మాత్రంరాదు. వాటివల్ల వచ్చే పుణ్యం కూడా శాశ్వతం కాదు. మోక్షం కావాలంటే పాపపుణ్యాలు రెండింటినీ సమానంగా పరిహరించాలి.) 

            సూ.4. "తత్తు సమన్వయాత్" - సమన్వయము వల్ల తెలియదగినది. సమన్వయము అంటే వేదాంతవాక్యాలకు పరస్పరవిరోధం లేకుండా ఏకాభిప్రాయాన్ని కలిగించడం. ఆ ప్రకారంగా పరబ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోవడం. (వేదాలలో బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు మొదలైన విభాగాలు ఉన్నాయి. అందులో చిట్టచివరవి ఉపనిషత్తులు. అందువలన ఉపనిషత్తులని వేదాంతము అని అంటారు.)  బ్రహ్మము ఉపనిషత్ప్రతిపాద్యమని, పరమపురుషుడని, వేదాంతం తప్ప ఇతరమైన ప్రమాణాలకు విషయం కాడని తెలుస్తున్నది. వేదాంతానికి బ్రహ్మ భోధార్థకమైన తాత్పర్యమే నిశ్చయమైనది. అన్ని వేదాంతవాక్యాలు ఒకే అద్వితీయ మైన పరబ్రహ్మతో సమన్వయాన్ని పొందుతాయి. (ఉపనిషత్తుల యొక్క ముఖ్య ఉద్దేశ్యము పరబ్రహ్మను అన్నిరకాలుగా ప్రతిపాదించి, అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని పంచిపెట్టడమే. అందువల్ల ఏ ఉపనిషత్తుని తీసుకున్నా అవిఅన్నీ పరబ్రహ్మ విషయంలో మాత్రం ఏకాభిప్రాయం చెందుతాయి. అలా పరబ్రహ్మ విషయంలో వచ్చిన సమన్వయపూర్వక ఏకాభిప్రాయం మాత్రమే గ్రహింపతగ్గది.)

కేనోపనిషత్:ద్వితీయ ఖండం: 6వ వల్లి:
      4.శరీరం పడిపోకపూరమే ఈఆత్మను తెలిసికోనువాడు సంసారబంధము నుండి విముక్తు డగు చున్నాడు. అట్లు తెలుసుకోనలేనిచో, అతడు శరీరమును మరలధరింపవలసి వచ్చును. పునర్జన్మను పొందవలసి వచ్చును. (పరబ్రహ్మ మనలో ఆత్మరూపంలో వున్నాడు. ఆఆత్మను తెలుసు కొంటే, దర్శించగలిగితే, మనకు ఆపరమాత్మ తెలుస్తాడు, దర్శనమిస్తాడు, అంటే అనుభవంలోకి వస్తాడు. త్రాడుకి క్రిందకొస ఆత్మ ఐతే, పైకొస పరమాత్మ. క్రిందకోసయైన ఆత్మను పట్టుకొని పైకి వెళితే పైకోసయైన పరమాత్మ దొరుకుతాడు. ఇంతకుతప్ప ఆ పరబ్రహ్మను పట్టుకోవటానికి వేరే ఏ త్రోవ లేదు. దీనిని మనం ఈశరీరం ఉన్నపుడే, అంటే బ్రతికిఉన్నప్పుడే, జవసత్వాలతో యుక్తవస్సులో ఉన్నప్పుడే  చెయ్యాలి. అలా చెయ్యలేకపొతే, దానికోసం ఇంకొక జన్మఎత్తాలి. అలా చెయ్యటం కోసమే, మానవజన్మ ఇమ్మని ఆ పరమాత్మని మనంవేడుకోన్నాము. కాని ఈ జన్మ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాము?   'సంత్ కబీర్ ' ఇలా అన్నారు: "మర్తే మర్తే జగ్ మరా, మర్నా నజానేకొయి, ఐసా మర్నా కొయి నమరా జో ఫిర్ నామర్నా హొయ్"  'ఈ లోకంలో ప్రతిరోజూ జనం చస్తూనే ఉన్నారు. కాని దురదృష్టవశాత్తు చావు రాకుండాఉండేలా చనిపోయినవాళ్ళు ఎవరూలేరు.' భగవద్గీతలో చెప్పిన  ప్రకారం పుట్టినవాళ్ళు చావక, చనిపోయిన వాళ్ళుమళ్లీపుట్టక తప్పదు.కాని మళ్లీమళ్లీ పుట్టకుండా చని పోవడం అంటే ఏమిటి? జన్మమృత్యుచక్రం నుండి బయటకు వచ్చి, ఆపరబ్రహ్మంలో మహా నిర్వాణం చెందడం.  అదే మళ్లీమళ్లీ చావకుండా చచ్చిపోవడం. ఇదే జన్మయొక్క సార్ధకత. ఇందుకే మనం జన్మించాము.మనం ఆపని చేయకుండా ఇంకేదేదో చేస్తూ మళ్లీమళ్లీ పుడుతూ మళ్లీ మళ్లీ చస్తున్నాము.సార్ధకత చేసుకోని ఈ  జన్మ ఎందుకు? ఈ ప్రశ్న ఎప్పుడు పుడుతుంది? మనం ఎందుకుపుట్టామో తెలుసుకొని, ఈజన్మను ఎలావ్యర్ధం చేసుకున్నామో అర్ధమవుతే అప్పుడువస్తుంది. అప్పుడు మనకు సమయం సరిపోదు. కాబట్టి దీపం ఉండగానే ఇల్లుచక్కబెట్టుకున్నట్లు, ఈ శరీరం, జవసత్వాలు, వయస్సు ఉండగానే ఆపరబ్రహ్మను తెలుసుకొనే ప్రయత్నం చేయాలి. అలా చేయలేక పోతే ఇలా జన్మలు, మానవజన్మలు గాని, ఇతరజన్మలు గాని ఎన్నో అలా ఎత్తుతూనే ఉంటాము.)

యోగవాసిష్టము: స్థితి ప్రకరణము: 18వ సర్గ:
            23. నిర్వికారమును, అద్వితీయమును, అసంగమము నగుటచే యదార్థముగా బ్రహ్మ మకారణమైనది. మరియు ప్రపంచమంతయు నారోపించుటచే, బ్రహ్మమున కారణ నిమిత్తాదులు సంభవింపనేరవు. ఏలయన, యట్లు సంభవించుట బ్రహ్మస్వభావ విరుద్ధమగును. కాన అకారణ మును, వివర్త రూపమునునగు ఈ జగత్తు మిధ్యయే యగుచున్నది. అట్లైన, నిక సారరహితమును, జడమును, దుఃఖమును నగు జగత్తునుగూర్చిగాని, దాని కారణములగూర్చిగాని విచారించుటచే నేమి ప్రయోజనము? సారభూతమగు బ్రహ్మము గూర్చియే విచారింప దగియున్నది. (ఇక్కడ దేని గురించి విచారించాలో శ్రీవసిష్టులవారు శ్రీరామచంద్రుని నిమిత్తంగా చేసుకొని మనకు విశదీకరి స్తున్నారు. పరబ్రహ్మకు ఒక విలక్షణమైన లక్షణం వుంది. అన్నీ తానే చేస్తాడు కాని దేనికీ సంబంధం లేకుండా ఉంటాడు. అన్నీ తనలోంచి వచ్చినా దేనికీ ఏవిధమైన కారణం అవడు. అలా కారణ మవడం పరబ్రహ్మస్వభావానికే విరుద్ధం. ఆకోణంలోంచి చూస్తే ఈ జగత్తుకి, ప్రకృతికి, ఉపాదాన, నిమిత్త కారణాదులుఉన్నా పరబ్రహ్మకోణం  లోంచి చూస్తే లేనట్లే. అప్పుడు వాటి కల్పనకు కారణాలు లేనందున, మనం నిద్రపోతే వచ్చే కలలలాగ మిథ్యారూపమే అవుతాయి. అటువంటి మిథ్యారూపమైన, అశాశ్వతమైన, అన్ని దుఃఖాలకి కారణమైన వాటిగురించి విచారించి తెలుసు కొంటే ఏమి ప్రయోజనం? శాశ్వతమైనది, మోక్షకారణమైనదీ అయిన ఆపరబ్రహ్మము గురించియే విచారించుట ఉత్తమమైవున్నది. కాబట్టి ఆధ్యాత్మిక దృష్టిలో మనం విచారింపతగ్గ వస్తువూ, తెలుసుకోతగ్గది ఆపరబ్రహ్మ మాత్రమే! వేరే ఇతరములు ఏమియూ కావు.)

కేనో పనిషత్ : ద్వితీయ ఖండము:
           2. నాకు బాగుగా బోధపడినదని తలంచజాలను. నాకు పూర్తిగా తెలియకపోలేదు. నాకు కొంచెము తెలిసినది. ఎందుకు బోధపడలేదని, తెలిసినదని, తెలిసికోనుచున్నాడో, అతనికి దాని విషయము తెలియుచున్నది.
           ౩. ఎవడు బ్రహ్మమును తెలిసికొనబడజాలనిదిగా ఎరుగునో, అతడు బ్రహ్మముగూర్చి తెలిసి కొనినవాడు. ఎవడు బ్రహ్మమును తెలిసికొంటినని ఎరుగునో, అతడు బ్రహ్మమునెరుగని వాడేనగును.
            (ఇక్కడ చాలా సంక్లిష్టమైన విషయాలని ఉపనిషద్రష్ఠ ప్రతిపాదిస్తున్నారు. పరబ్రహ్మని పూర్తిగా తెలుసుకున్న వారెవరూ వుండరు. పూర్తిగా తెలుసుకున్న వారు ఆపరబ్రహ్మములో కలిసిపోతారు. అందులో కలసిపోయిన వారెవరూ చెప్పడానికి తిరిగిరారు. అందువల్ల జీవించి ఉన్నవారికి దానిగురించి తెలిసినట్లు వుంటుంది గాని, పూర్తిగా తెలియదు. ఎందువల్ల అదితెలియలేదో అర్థ మవుతే అది తెలిసినట్లే. ఇదే మొదటి శ్లోకంలో ప్రతిపాదించారు. ఈ పరిస్థితిలో అహంకారం ప్రబలి నాకు అంతాతెలుసు అనుకుంటే, వారికి ఏమీతెలియదు. అలా తెలియలేదని ఎవరైతే తెలుసు కొంటారో వారికి పరబ్రహ్మస్వరూపం అర్థమవడం మొదలవుతుంది. పరబ్రహ్మస్వరూపం పూర్తిగా తెలియాలంటే జీవన్ముక్త దశ దాటి, శరీరం నుండి ప్రాణోత్క్రమణం చెంది, విదేహముక్తి కలిగి పరబ్రహ్మలో మమైక్యం చెందాలి. దీని గురించి ఇంకోసారి ముచ్చటించుకుందాము.)

కఠోపనిషత్: 2వవల్లి: ప్రధమాధ్యాయము:
            8. బహురీతుల విచారణ చేయవలెను. ఆఆత్మ అల్పబుద్దులచే బోధింపబడినచో, తెలిసి కొనుటకు సాధ్యము కాదు. కాని బ్రహ్మైక్యము పొందిన సద్గురువుచేత బోధింపబడినదైన దానిని పొంద వచ్చును. ఆఆత్మ అణువుకంటే అణువగుట వలన కేవలవాదము చేత సిద్ధించునది కాదు. అది అనుభవమునకు సంబంధించిన విషయము.
             9. ఈ ఆత్మజ్ఞానము తర్కము ద్వారా పొందబడజాలదు. సద్గురువులచే ఉపదేశింప బడి నపుడే ఇది సులభముగా తెలియును.నీవు దానిని పొంది, ఆసత్యమునందు స్థిరపడితివి. ఓనచికేతా! నీవంటి జిజ్ఞాసువులు మరల మాకు లభించెదరా?
             (ఇది సమవర్తియైన యముడు నచికేతునికి బోధించిన జ్ఞానసారం. ఆ పరబ్రహ్మను ఎన్ని రకాలుగా వీలయితే అన్నిరకాలుగా, అన్ని కోణాలలోంచి (360 x 360 డిగ్రీలలో) విచారించాలి. అప్పుడు 4వ బ్రహ్మసూత్రములోని సమన్వయాన్ని అనుసంధానించి తెలుసుకోవాలి.  ఈ విధానాన్ని  బ్రాహ్మైక్యము గురించి తెలిసిన సద్గురువుల నుండి పొందాలి. మిగతావాళ్ళు చెప్పలేరు. మళ్లీ ఇక్కడ ఇంకో ప్రశ్న వస్తుంది. బ్రహ్మైక్యము గురించి తెలిసిన వారు ఉండరు కదా? వుంటారు. వారు ప్రాణోత్క్రమణం పొందడానికి ముందుఉండే జీవన్ముక్తదశలో వుంటారు. వారికి సమాధ్యవస్థలో ఆత్మానుభవము, తద్వారా పరబ్రహ్మానుభవము పొంది ఉంటారు. వారిద్వారా ఈజ్ఞానం పొందాలి. తదుపరి పరబ్రహ్మ అణువు కంటే అణువు, మహత్తు కంటే మహత్తు అయినందువల్ల, భాష. పాండి త్యాలకు, భౌతికన్యాయసూత్రాలకు వర్తించే, తర్కము, వాదము, న్యాయము, మీమాంస మొదలైన వాటి వల్ల పరబ్రహ్మ తెలియడు. కేవలము అనుభవము వల్ల, లేదా ఆఅనుభవముకల సద్గురువుల వల్ల మాత్రమే తెలుస్తాడు. ఈ విషయాన్నే శ్రీపాండురంగడు నామదేవునికి చెప్పాడు. ఒకసారి 'గోరా కుంభార్'  పాండురంగడికీ ఆయన భక్తులకి తనఇంట్లో విందు చేసాడు. భోజనం అయినపిమ్మట పిచ్చాపాటి కబుర్లలో జ్ఞానదేవుడు, నీవు ఘటములను (కుండలను) చేయువాడవు గాన ఇక్కడ వున్న ఘటములలో పక్వ ఘటములను, అపక్వ ఘటములను పరీక్షించిచెప్పు, అని గోరా కుంభార్ని అడిగారు. దానికి పాండురంగడు కూడా సమ్మతించాడు. అప్పుడు గోరా కుంభార్ కుండలను కొట్టి పరీక్షించే కొయ్యముక్కను చేత్తోపట్టుకొని అక్కడ వున్న భక్తుల ఒక్కక్కరి నెత్తిమీద కొట్టి పరీక్ష చెయ్యడం ప్రారంభించాడు. అప్పుడు ఎవ్వరూ అభ్యంతర పెట్టలేదు కాని, నామదేవుడు మాత్రం అభిమానంతో తలపక్కకు వంచాడు. అప్పుడు గోరా కుంభార్ అందర్నీ తలపై కొట్టడం పూర్తిచేసి, పాండురంగడితో, అయ్యా! అందరూ పక్వఘటాలే కాని ఒక్క నామదేవుడే అపక్వఘటం అన్నాడు. నామదేవుడు తక్కువవాడేమి కాదు. ఆయన పాటపాడితే సాక్షాత్తు పాండురంగడే వచ్చి నృత్యం చేసేవాడు. అప్పుడు నామదేవుడు చాలా బాధపడి, పశ్చాత్తాపపడి పాండురంగడిని వేడుకొంటాడు. అప్పడు పాండురంగడు, 'నామదేవా! నీవు శోకింపవలదు. జ్ఞానానుష్ఠానసంపన్నుడగు సదాచార్యు నాశ్రయింపుము. నాకు పాండురంగడు స్వాధీనుడై యుండగా వేరొక యాచార్యుడేలయని తలమ్ప కుము. శాస్త్రార్థములను జక్కగా పరిశీలించి తన జ్ఞానానుష్ఠానములచే శిష్యులకు సదాచారమును కలుగజేయువాడాచార్యుడనబడును. లోకమున జ్ఞానానుష్ఠానసంపన్నులై చేతనోజ్జీవనకాములగువారు ఈశ్వరావేశముచే ఆచార్యత్వము నిర్వహించెదరు. అగ్నితప్తమయ్యును వెలిగారపు సంబంధము లేక బంగారము కరగనియట్లు, నీవు నన్నాశ్రయించియుండిననూ ఆచార్యసంబంధము లేక పరి పక్వము కానేరవు. నేను జేసిన రామకృష్ణాద్యవతారములయందు వసిష్ఠసాందీప ప్రభృతులయెడ శిష్యభావము చెంది యుపాసించుట ఎరుగవే? గురుకులవాస మత్యావశ్యకమనుటను నేనే యను సరించిచూపితి. కావున సదాచార్యునాశ్రయింపుము. అట్లు చేయవేని జ్ఞానదేవాదులవలె నీకు అఖండ జ్ఞానము సిద్ధింపదు. అది సిద్ధింపకగాని మోక్షార్హుడవు కానేరవు. నీపాటలకు నాయాటలు సరిపో వలసి వచ్చును' అని చెప్పాడు. (చక్రధారి సినిమాలో ఈవిషయం వుంది) చూశారా! భగవంతు డంతటి వాడే అనుభవముగల సద్గురువు యొక్క ఆవశ్యకత గురించి చెప్పాడు. ఈ విషయాన్నే యముడుకూడా చెప్పాడు. అటువంటి గురువులు కూడా మంచియోగ్యతగల శిష్యుని కోసంఎదురు చూస్తూ వుంటారు. అందుకే యముడు 'ఓ నచికేతా! నీవంటి జిజ్ఞాసువులు మరల మాకు లభించెదరా?' అంటున్నాడు.)

ఐతరేయోపనిషత్ : తృతీయాధ్యాయము:
              1. ఆత్మయని మన మెవ్వరిని నుపాసించుచున్నామో, ఆయాత్మఎట్టివాడు? దేనివలన రూపములను చూచుచున్నాడో, దేనివలన శబ్దములను వినుచున్నాడో, దేనివలన వాసనలను గ్రహించు చున్నాడో, దేనివలన నోటితో మాటలాడుచున్నాడో, దేనివలన రుచి, యరుచి యని ఎరుంగుచున్నాడో, యే కారణము చేత మధుర, మధురేతర వస్తువులను గుర్తించుచున్నాడో, అట్టి శృతిప్రతిపాదిత ఆత్మలలో నీ ఆత్మ ఎవడు?
              మహాభారతం:12-270-22: "సర్వభూతాత్మా భూతస్య సమగ్భూతాని పశ్యతః| దేవాఅపి మార్గేముహ్యన్తి  ఆపదస్యప దైషిణః||
               సమస్తభూతాల్నీ ఆత్మమాత్రంగా తెలుసుకొని, అన్నిభూతాల్లోనూ ఉన్నపరమేశ్వరుని ఎరిగి, పరబ్రహ్మ కంటే భిన్నమైనస్థానాన్ని కోరనట్టి బ్రహ్మవేత్తస్థితి తమకు కావాలని కోరే దేవతలు, అతని జ్ఞానాన్నిగూర్చి భ్రాంతులౌతూవుంటారు. బ్రహ్మవేత్తకు మార్గం లేనందువలన దేవతలు సైతం మోహం పొందుతారు. 
              ఈ కారణమున మానుషజన్మ పొందినందువలన బ్రహ్మ జిజ్ఞాస తప్పని సరి.
             (ఇక్కడ ఉపనిషద్రష్ఠ ఆత్మవిచారణ గురించి చెపుతున్నాడు. ఆత్మ పరమాత్మ స్వరూపమే. అందువల్ల పరమాత్మని కూడా ఒక్కక్కసారి ఆత్మ అంటారు. ఇక్కడ ఆత్మ అంటే శరీరానికి చైతన్యం ఒనగూర్చిన ఆత్మయా, లేక ఈ ఆత్మకు మూలకారణ మైన ఆపరమాత్మయా అనే ప్రశ్నను లేవనెత్తుతున్నాడు. ప్రస్తుతానికి అద్వైతాన్ని వెంటనే అందుకోలేము కాబట్టి మనం ఉపాసించాలను కోనేది పరబ్రహ్మే కాబట్టి ఆఆత్మను పరబ్రహ్మగానే మనం తీసుకోవాలి.  కాని నిజానికి పరిపూర్ణ జ్ఞాన స్థితికివెళితే ఆత్మే పరమాత్మ అనే అద్వైతస్థితే మిగులుతుంది. ఆస్థితిలో సమస్తభూతాలలోను, ప్రాణు లలోను ఉన్న చైతన్యము, తనలోని చైతన్యము ఒక్కటే అన్న భావన వస్తుంది. ఆ చైతన్యము కూడా పరమాత్మే. ఈభావమే భారతంలోని శ్లోకం చెపుతోంది. సరిగ్గా ఈభావననే  'మండలబ్రాహ్మణో పనిషత్తు', "సర్వశరీరేషు చైతన్యేకతాధ్యానం" అంటే ' సకలశరీరములందును చైతన్యమొక్కటియే యని భావించుటే ధ్యానము' అని చెప్పారు.  ఇక్కడ భావించుట అంటే అనుభవించుట అనిఅర్ధం.  మనలోను మనంచూసే వాటి అన్నిటిలోనూ నిబిడీకృతమైవున్న ప్రాణచైతన్యము, దానికి కారణమైన పరాచైతన్యము ఒక్కటే, వేరుకాదు అని భావించి, అనుభవించాలి. అప్పుడే నిజమైన అద్వైతస్థితిని అనుభవించ గలుగుతాము. ఈ విధంగా భావన కలిగిన బ్రహ్మవేత్త స్థితి తమకు కావాలని దేవతలు కోరుకొంటూ, అతని జ్ఞానానికి ఆశ్చర్యం పొందుతారట. అతను ఎలా పరబ్రహ్మలో లయమౌతాడో వారికి అర్థంఅవదుట. ఎందుకంటే బ్రహ్మవేత్త దేవతలుండే స్వర్గం నుండి ముక్తికి వెళ్ళడు. పరబ్రహ్మ సర్వాంతర్యామి కాబట్టి, బ్రహ్మవేత్త ప్రాణోత్క్రమణం చెందగానే అక్కడే వున్న పరబ్రహ్మలో ఐక్యమైపోతాడు. అందువల్ల అతడు మోక్షంపొందే విధానం దేవతలకు అందదు. దీని గురించి ఇంకొకసారి చర్చించుకుందాము. కాబట్టి మానవజన్మ పొందినందువలన పరబ్రహ్మము గురించి తెలుసుకొనుట తప్పనిసరి విధి.)

యోగవాసిష్టము: ముముక్షువ్యవహార ప్రకరణము:  13వ సర్గ:
           35. బ్రహ్మము లేదందువా? అయిననూ విచారమొనర్చిన దోషమేమి? ఉన్నచో సంసార సాగరమును తరింతువు.
           ఇక్కడ నిరీశ్వరవాదులకు కూడా శ్రీవసిష్టులవారు నచ్చచెపుతున్నారు. ఒకసారి పరబ్రహ్మ స్వరూపము గురించి చర్చించుటలో తప్పులేదు కదా.  ఉన్నదని తేలితే ఈ భవబంధాల నుండి తప్పించుకోగలము కదా! కాబట్టి ఎవరికి వారు ఒక్కసారి తమ మనస్సులలో ఈ విధమైన చర్చ చేసుకొని పరబ్రహ్మము గురించి ఆలోచన చేసుకోవాలని ప్రార్ధన.
   
             చివరిగా ఒక మనవి. ఆ పరబ్రహ్మస్వరూపం గురించిన ఆలోచన అందరిలోనూ కలిగించాలనే కోరికతో ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఆ పరబ్రహ్మయొక్క జ్ఞానాన్ని, అనుభవాన్ని సాధ్యమైనంత వరకూ అందరికీ పంచిపెట్టాలనే మాగురువుగారి ఆశయసాధనలో భాగమే ఈ ప్రయత్నం. ఈ ప్రయత్నంలో ఎంతవరకూ కృతకృత్యుడనయ్యానో విజ్ఞులు మీరే చెప్పాలి.
             
                        మీ స్పందనల కోసం ఎదురు చూస్తూ వుంటాను.

                      (Please visit: www.tatvavisleshana.weebly.com)
                   

Sunday, December 11, 2011


గజేంద్ర మోక్షము -- తత్వవిచారణ --పరిశీలన {భాగం-1 }
               తత్వవిచారణతో సద్యోఫలితం అందుకున్న వారిలో గజేంద్రుడు అగ్రగణ్యుడు.  ఆయనలాగా తత్వవిచారాన్ని చేసి ఉన్నఫళంగా పరమాత్మసాక్షాత్కారం పొందినవారిలో మొదటివాడు.  మిగతాఅందరికి ఆదర్శప్రాయుడు. గజేంద్రుడి పేరుతో శ్రీవ్యాసులవారు, శ్రీపోతన గారు మనకు తత్వవిచారాన్ని పరిచయం చేసి, ఏవిధంగా దాన్ని చేయాలి, ఎటువంటి ప్రశ్నలు వేసుకోవాలి, ఏవిధమైన జవాబులు రాబట్టుకోవాలి, మన ఆలోచనలని, భావాలని ఏవిధంగా మలచుకోవాలి, ఏవిధమైన భావపరంపరలతో  ముందుకు సాగితే గమ్యమైన పరమాత్మను చేరుతాము అన్న విషయాలను చాలా చక్కగా తెలియజేసారు.  ఇప్పుడు మనం శ్రీమద్భాగవతంలో గజేంద్రుడు పేరుమీద వ్యాసులవారు పోతనగారు మనకు ఇచ్చిన   తత్వవిచార భాండాగారాన్ని ఒక క్రమంలో పరిశీలిద్దాంవారిద్దరూ ఒకే భావాన్ని ఏవిధంగా వ్యక్తపరిచారు, వ్యాసులవారు చెప్పినవాటిలో పోతనగారు వేటిని చెప్పారు, వేటిని వదిలివేసారు, ఇంకా వేటిని చెప్పారు, వీటన్నిటిని కూడా పరిశీలించి, వారి దృక్పధాన్ని తెలుసుకొంటూ తత్వవిచారాన్ని మన మనస్సులలో నాటుకొనేటట్లు చేసుకొందాం. ముందరగా వ్యాసభాగవతంలోని శ్లోకాలను చెప్పుకొని, వాటిని పోతనగారు ఏవిధంగా తెనిగించారు, ఆభావాలను ఏవిధంగా చెప్పారో పోల్చి చూసుకుందాం.

 "ఓమ్ నమో భగవతే తస్మై యత ఎతచ్చిదాత్మకం, పురుషాయాదిబీజాయ పరేశాయాభిధీమహి"

            ఎవని ప్రవేశముచే జడములైన శరీరమనంబులు చేతనములౌనో, ఓంకార శబ్డంబునకు లక్ష్యమై శరీరంబున ప్రకృతీ పురుషులు తానైయున్న సర్వసమర్ధుడైన పరమేశ్వరునకు మనంబున నమస్సులు అర్పించుచున్నాను.

           ఎందుచేతనో గాని పోతనగారు ఈశ్లోకాన్ని తెనిగించలేదు.  ఈశ్లోకంలో వ్యాసులవారు సృష్ట్యాదిలో జరిగిన సంఘటనను తెలియజేసారు.  ఈవిషయాన్ని పైంగలోపనిషద్ లో యాజ్నవల్క్యముని పైన్గలునికి ఉపదేశించారు.  సృష్టికి పూర్వం పరమాత్మ ఒక్కడే వున్నాడు.ఆ పరమాత్మలోనే సకలము సంకుచిత వస్త్రమువలె దాగివున్నది.  ఆ పరమాత్మనుండి రజోగుణముతో నుద్రిక్తమైన మహత్తు ఏర్పడెను.  ఆమహత్తునందు ప్రతిఫలించిన బ్రహ్మము హిరణ్యగర్భచైతన్యముగా నుండెను. అందుండి తమో గుణాద్రిక్తమగు అహంకారము పుట్టెను.  ఆ అహంకారమునందు ప్రతిఫలించిన పరబ్రహ్మము విరాట్ అను చైతన్యమై యుండెను. దానినుండి గర్భోదకశాయి అయిన శ్రీమహావిష్ణువు పుట్టెను. (ఈయన స్థితికారకుడైన సత్వగుణప్రధానుడైన నాలుగు చేతులు గల విష్ణువు కాదు.)  ఈయన నుండే సూక్ష్మ పంచ భూతములు పుట్టినవి.  ఆ పంచభూతముల వివిధరకములైన కలయకల  వలన ప్రాణ శక్తి, అంతఃకరణ, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, శరీరాలు, మనుషులు, దేవతలు, మన విశ్వంతో పాటు అనేక బ్రహ్మాండాలు ఏర్పడ్డాయి. కాని ఆ దేహేన్ద్రియాలు చైతన్యమూర్తియగు పరబ్రహ్మ లేకుండా స్పందన కలిగియుండుటకు, పనిచేయుటకు సమర్ధతలేకుండెను. అప్పుడు ఈపరిస్థితిని గమనించిన పరబ్రహ్మ, బ్రహ్మండములను, సమస్తవ్యష్టిశరీరములయొక్క మస్తకములను బ్రద్దలుచేసి వాటన్నిటి యందు చైతన్యరూపములో ప్రవేశించెను. ఆ రంధ్రమే మన తలలో నున్న బ్రహ్మరంధ్రము. (సహస్రారచక్రము. పరబ్రహ్మ వచ్చిన ఈరంధ్రము గుండానే మనం బయటకు వెళ్ళితే ఆ పరబ్రహ్మను చేరుకుంటాము.  ఈ విషయాన్నీ ఇంకొకసారి ముచ్చటించుకుందాము.)  అప్పటినుండి ఈ శరీరాలు చైతన్యమయమయ్యాయిఆవిషయాన్నే గజేంద్రుడు ద్వారా వ్యాసులవారు మనకు చెప్పారు.  తర్వాత ఓంకార శబ్దమునకు లక్ష్యమైనదని చెప్పినారు.  పెద్దలు "తస్య వాచకః ప్రణవః, తజ్జపః స్తదర్ధభావనః" అని తెలియజేసినారు.  ఆపరమాత్మ యొక్క సర్వనామము (pronoun) ఓంకారమని, దానిని జపించినచో ఆపరమాత్మ యొక్క అర్ధమూ, భావననూ పొందవచ్చునని చెప్పినారు.  అందువల్ల ఓంకారమునకు లక్ష్యము ఆ పరబ్రహ్మేనని, వేరే యితరములు కావని స్పష్టమగుచున్నది.  శరీరమున ప్రకృతీ పురుషులు తానై యున్నాడని చెప్పినారు.  మన శరీరములో ముఖ్యముగా రెండు వున్నవి.  ఒకటి పదార్ధము (matter).  అదియే ప్రకృతి.  రెండవది చైతన్యము. అదే ఆత్మ(energy). ఈ చైతన్యముయొక్క మహాస్వరూపాన్నే ఉపనిషత్తులలోను, పురుషసూక్తములోను పురుషశబ్దంతో తెలియజేశారు.  ఈ ప్రకృతి పురుషుల కలయికతోనే జీవరాసులు ఏర్పడినాయి.  ఈ ప్రకృతి పురుషులు రెండున్నూ ఆ పరబ్రహ్మ తప్ప వేరే ఇంకెవరూ కారు.  చూసారా! వ్యాసులవారు ఎన్ని పెద్ద విషయాలని ఒక చిన్న శ్లోకంలో చెప్పారో!  ఇలా చిన్న పదాలలోంచి అంతర్గతంగా వున్న మహా జ్ఞానాన్ని వెతుక్కోవటమే తత్వ విచారణ.  ఇక తర్వాత శ్లోకానికి వెళదాం.

"యస్మిన్నిదం యతశ్చేదం యేనేదం య ఇదంస్వయం, యో-స్మాత్పరస్మాచ్చ పరస్తం ప్రపద్యే స్వయంభువం" 


            "ఎవని ఆధారమున విశ్వంబు నిలిచియున్నదో, ఎవ్వనినుంచి ప్రభవించినదో, ఎవరు దానిని సృజించిరో, ఎవరు స్వయముగా  తానే విశ్వమై ప్రకటితమయ్యెనో, ఎవరీ దృశ్య ప్రపంచముచే, దాని కారణభూత ప్రకృతిచే విలక్షణమై శ్రేష్టమై తనంతతా కారణరహితుడై ప్రభవించునో అట్టి భగవానుని శరణము నొందుచున్నాను."
     
            దీని అర్ధం చాల తేటతెల్లంగా వుంది.  వేరే వివరణ అవుసరం అక్కరలేదు.  కాని చివర ఒక విషయం చెప్పారు.  అన్నీ తానే అవుతూ, మళ్లీ కారణరహితుడై ఉంటాడట.  అంటే అన్నీ తానేచేస్తాడు, చేయిస్తాడు. మళ్ళా దేనితోను సంబంధం లేకుండా, దేన్నీ అంటు కోకుండా ఉంటాడు.  కాబట్టి మనం కూడా ఈ విషయాన్నే అనుసరించాలి.  ఈ పదార్ధపూరితమైన ప్రకృతిలో వుంటూ, దీనికి సంబంధించిన పనులు, ఇంకా మిగతావి వాటిని అంటుకోకుండా అంటే నిష్కామంగా చేయాలి.  అప్పుడు ఆకర్మల యొక్క ఫలితాలు మనకు అంటుకోవు.  పైగా కర్మరాహిత్యం కూడా అవుతుంది.  ఈవిషయాన్నే పరమాత్మ భగవద్గీతలో "కర్మణ్యేవాధికారస్తే" అని చెప్పాడు. ఈవిషయాన్నే మనకు వ్యాసులవారు కూడా నర్మగర్భంగా చెప్పారు.  ఈశ్లోకాన్ని పోతనగారు తెనిగిస్తూ ఇంకొక విధంగా చెప్పారు.

"ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలనుండు లీనమై, యెవ్వని యందుడిందు, బరమేశ్వరుడెవ్వడు మూలకారణం
బెవ్వ డనాదిమధ్యలయు డెవ్వడు సర్వము దానయైన వా, డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్."  
              
           తత్వ విచారణాక్రమంలో యీపద్యం చాలా విలువైనదీ, ముఖ్యమైనది.  ఒక దాన్ని గురించి సమగ్రంగా తెలుసుకోవాలంటే దాన్ని ఎన్నికోణాల్లోంచి, ఎన్నివిధాలుగా ప్రశ్నించి పరిశీలించాలో  యీపద్యంలో పోతనగారు చెప్పారు.  ఆయన స్వయంగా ఒక యోగి.  యోగ తత్వ రహస్యాలెన్నింటినో ఆయన భాగవతంలో చొప్పించారు.  ప్రస్తుతం యీ పద్యాన్ని నాలుగు  ముక్కలుగా విడదీసుకోవాలి.  మొదటిది ప్రశ్నా భాగం.  రెండవది ఒక్క "వానిని" అన్న మాట మాత్రమే.   మూడవది
"ఆత్మభవు నీశ్వరు".  మిగతాది నాల్గవది.  పోతనగారు ఇక్కడ మంచిగమ్మత్తు చేసారు.  ముందర మనకి ఎలా ప్రశ్నలు వేయాలో నేర్పారు.  తర్వాత ఆప్రశ్నలు వేసుకొని, వాటికి సమాధానాలు రాక మనం ఇబ్బందులు పడతామని గ్రహించి, "వానిని" అంటే ఆ ప్రశ్నలకు సమాధానమైన వానిని అని, మళ్లీ వాడెక్కడ ఉన్నాడో తెలియక కలవర పడతామని, "ఆత్మభవుని" అంటే మన ఆత్మలోనే, మనకు చాలా దగ్గరలోనే ఉన్నాడని విశదీకరించారు.  చూసారా! తత్వవిచారణా పధ్ధతిలో యీపద్యాన్ని అనుసరించి నట్లయితే, పరబ్రహ్మస్వరూపజ్ఞానం కోసం ఏవిధమైన పరిశోధన జరపాలి, వాడెక్కడ వున్నాడు, వాడిని పట్టుకోవాలంటే ముందర దేన్ని తెలుసుకొని దర్శించాలి, దేన్ని పట్టుకొంటే ఆపరమాత్మ దొరుకుతాడు మొదలైన విషయాలన్నీ చాలా తేలికగా తెలుస్తాయి.  ఇదీ పోతనగారి గొప్పతనం.  గజేంద్రుడి మిషతో మనకు ఇంతటి గొప్ప విషయపరిజ్ఞానాన్ని అందించారు.  
(Please visit: www.tatvavisleshana.weebly.com)

Saturday, November 26, 2011

తత్వ విచారణ

తత్వ విచారణ


             శుద్ధగంభీరనిరాకారపరమాత్మ స్వరూపాన్ని భావించుటకు, తెలుసుకొనుటకు, జన్మజరా మృత్యు చక్రమునుండి బయటపడి ఆపరమాత్మ స్వరూపముతో  మమైక్యముచెంది మహాపరినిర్వాణము పొందుటకు చేసే ప్రయాణములో "తత్వ విచారణ" అత్యంత ప్రముఖమైనది. మనం తెలుసుకోనగోరే దానిని సందేహముతో మొదలుపెట్టి జవాబును తెలుసుకొని దానిని పొందుటకు ప్రయత్నించాలి.  మనకు కావలసిన దానియొక్క ఆవిర్భావాన్ని, మూలాన్ని, ఆధారాన్ని, సూటిగా ప్రశ్నించాలి.  గజేంద్రుడు అడిగినట్లు,"ఎవ్వనిచే జనించు? జగమెవ్వని లోపలనుండు లీనమై? ఎవ్వనియందుడిందు? పరమేశ్వరుడెవ్వడు? మూల కారణం  బెవ్వడు? అనాదిమధ్యలయుండెవ్వడు? సర్వము తానైన వాడెవ్వడు?" అని ప్రశ్నించుకొని వాటికి జవాబులు రాబట్టు కోవడానికి ప్రయత్నించాలి.  యోగ వాషిష్టం ఉత్పత్తి ప్రకరణం లో ఇలా చెప్పారు:


"యత్నో యత్నేన కర్తవ్యో మోక్షార్ద్ధం యుక్తి పూర్వకమ్,
యత్నయుక్తి విహీనస్య గోష్పదం దుస్తరం భవేత్"

         
         "మోక్షము కొరకై యుక్తిపూర్వక ప్రయత్నముచే పుర్వపూర్వ సాధనలుసిద్ధింప, ఉతరోత్తర సాధనల యందు మరల యుక్తి పూర్వకముగ ప్రయత్నమాచరింప వలెను.  ప్రయత్నమూ, యుక్తి లేని వారికి గోవు పాదమంత స్టలమున్ను దాటనశక్తమై యుండును."  దీనిని నిశితముగా పరిశీలించినచో, మోక్షము కొరకై మొదట చేసిన ప్రయత్నములు సిద్ధించిన తర్వాత దానితో తృప్తి చెందక తదుపరి సాధనకై ప్రయాత్నము చేయవలెను. దానిని యుక్తి పూర్వకముగా చేయవలెను.  అట్లు చేయలేనిచో గోవు పాదమంత స్థలము కూడా దాటనశక్తుడై యుండును.  ఈవిధంగా మనము ప్రతి స్థాయిలో తత్వ విచారాన్ని యుక్తి పూర్వకముగా కొనసాగించాలి.  అదే  యోగ వాషిష్టం నిర్వాణ ప్రకరణంలో శ్రీవశిష్టులవారు ఈవిధంగా తెలియజేసారు:  


"స్వయమేవ విచారేణ, విచార్యాత్మానమాత్మనా, 
యావన్నాధిగతం జ్ఞేయం, నతావధి గమ్యతే"

           "ఎంతవరకు మనుజుడు విచారణ ద్వారా జ్ఞేయ వస్తువగు ఆత్మను తాను స్వయముగా విచారించి ఎరుగకుండునో, అంతవరకు నద్దాని నాతడు పొందజాలకయే యుండును."  దీనిని బట్టి మానవుడు తనంత తానే విచారణ చేసి, తెలిసికొనదగిన వస్తువును తెలుసుకొనవలెను గాని, యితర మార్గములు లేవు యని రుజువగుచున్నది.  మరియు అదే ప్రకరణములో:


"అస్మిన్సంసార సంరంభే జాతానం దేహ ధారిణం,
అపవర్గ క్షమౌ రామ ద్వావిమా ఉత్తమౌ క్రమౌ

ఎకస్థావద్గురుప్రోక్తాదనుష్టానా చ్చనై శనై, 
జన్మనాజన్మభిర్వాపి సిద్ధిదః సముదాహృతః
ద్వితీయ స్త్వాత్మ నైవాశు కించి ద్వ్యుత్పన్న చేతసా, 

భవతి జ్ఞానసంప్రాప్తి రాకాస ఫల పాతవత్"     

            "ఓ రామచంద్రా! ఈ ప్రపంచసంరంభమున జనించు జీవులకు చెప్పబోవు రెండు క్రమములున్నూ మోక్షమును కలుగజేయు సమర్ద్ధములై యున్నవి. అందొకటి  గురూపదిష్టమగు అనుష్టానమును మెల్లమెల్లగా సాధిన్చుచూ రాగా, ఈ జన్మలోనో లేక కొన్ని జన్మలందు గాని మోక్షమును కలుగజేయునది యని చెప్పబడినది.  ఒకింత పరిపక్వమైన చిత్తము కలవారికి తాను గావించు తత్త్వ విచారణచే ఆకాశము నుండి ఫలము పడు చందమున శీఘ్రముగా జ్ఞానము సంప్రాప్తించుట రెండవ క్రమమై యున్నదని," శ్రీ వశిష్టులవారు ఉపదేశించినారు.

                  దీనిని నిశితముగా పరిశీలించగా, శాస్త్ర ప్రోక్తములైన గురూపదేశ సంప్రాప్త అనుష్టానముల కన్నా, స్వయముగా చేయు తత్త్వ విచారణకే అధిక ప్రాధాన్యత నీయ బడినది.  తాను స్వయముగా విచారించి తెలుసుకోన్నదే బలీయంగా నాటుకొంటుందిదానిపైనే ధృఢమైన ఏకాగ్రత కుదురుతుంది.  ఒకవేళ యిట్టి అవగాహనకు రాలేక పోతే గురువు భాధ్యత వహించి ఈ ఆలోచనకు శిష్యుని ప్రేరేపించాలి.  తత్త్వ విచారాన్ని రేకెత్తించాలి.  ఎప్పుడో పురాణాల్లో వున్న, అమృతం కోసం జరిగిన 'క్షీరసాగర మధనాన్ని' మన మనస్సుల్లో జరపాలి.  ఆ మధనంలోంచే అమృతతుల్యమైన "నిరాకార స్వరూపాన్ని" భావించ గలుగుతాము.

             తత్త్వ విచారమనేది ఆధ్యాత్మిక విద్యకు మూలస్తంభం.  ఇది పరమాత్మ అన్వేషణలో గల అన్ని స్థాయిలలోను అవుసర
పడుతుంది.  బీజగణితంలో మూల సూత్రమైన + మరియు - ల యొక్క సంబంధం ప్రతిచోట అవుసరమైనట్లు, ఈ తత్త్వ విచారణ కూడా ప్రతి స్థాయిలోనూ అవుసరమౌతుంది.  పైపై స్థాయిలకు వెళ్ళేకొద్దీ తత్త్వ విచారణ అత్యంత సునిశితము, సుక్శ్మమూ అవుతూ, ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా మనలను అపప్రదల వైపు అజ్ఞానం వైపు పడవేస్తూ, అసలైన త్రోవనుండి తప్పించి వేస్తూ ఉంటుంది.   దీనియొక్క ప్రాధాన్యత గమనించి బుధులు, ద్రష్టలు అవుసరం ఉన్నా లేకపోయినా చాలచోట్ల దీనిగురించి చెప్పారు. 

             ఇంకా చెపాలంటే "ఉత్తమం  తత్త్వ
చింతనం" అన్నారు. ఈ తత్త్వ విచారణ మనలను చాలా దగ్గర దారిలో పరమాత్మ వద్దకు తీసుకొని పోతుంది.  ఈ తత్త్వ విచారాన్ని ఉపయోగించి గజేంద్రుడు 'ఎవ్వనిచే జనించు' అని మొదలుపెట్టి, 'లోకంబులు లోకేశులు, లోకస్తులు తెగినతుది' అని తెలుసుకొని, 'జిత్రచారునికి, సాక్షికి, నాత్మరుచికిని' అని విచారము చేసి 'నిఖిల కారణునకు, నిష్కారుణునకు నమస్కరింతు' అని, 'విశ్వకరు, విశ్వదూరిని', 'శాశ్వతు, నజు భజయింతున్' అని 'నీవె తప ఇతః పరంబెరుంగ' అని స్వాత్మ సమర్పణ చేసుకొని, ఆ పరమాత్మని పొందాడు.  అలా తత్త్వ విచారణ చేసిన గజేన్ద్రుడుని కాపాడటానికి వెంటనే పరుగు పరుగున 'సిరికిన్ చెప్పక, శంఖు చక్రమున్ చేదోయి సంధింపక' ఆ పరమాత్మ వచ్చాడు.  తత్వావిచారణయొక్క సద్యోఫలితమిదే.  యోగ వాషిష్టంలో కర్కటికోపాఖ్యనంలో కర్కటి రాక్షసి మొదట పదివేల ఏళ్ళు తపస్సు చేసి బ్రహ్మని ప్రత్యక్షం చేసుకుంటుంది.  ఆ తర్వాత మళ్లీ బ్రహ్మ అవుసరం పడి, ఒక నిమేష మాత్రం తత్త్వ విచారణ చేసి ఆ బ్రహ్మ యొక్క సాక్షాత్కారం పొందుతుంది.  ఇదే తత్త్వ విచారణలో ఉన్న గమ్మత్తు.  మదానికి, తమస్సుకి, అజ్ఞాన పరాకాష్టకి ప్రతినిధి అయిన  ఒక జంతువు, ఏనుగు, తత్వ విచారాన్ని చేసి, పరమాత్మని పొందగా, మనస్సు, బుద్ధి, చైతన్యము, యుక్తాయుక్త విచక్షణాజ్ఞానము గల మనం ఆ పరమాత్మని పొందలేమా?  ఎవరికీ వారే ఈ ప్రశ్నని వేసుకోండి! ఇంతటి మహోన్నతమైన ఫలితాలని అందించే తత్త్వ విచారణ గురించి ఆలోచించి, తెలుసుకోండి.

ఆ గజేంద్రుడు ఏవిధంగా తత్త్వ విచారణ చేసాడో, మళ్లీ మనం కలుసుకున్నపుడు తెలుసుకుందాము.
          

దీనిపై మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయ ప్రార్ధన.

"హరి: ఓం"

(Please visit: www.tatvavisleshana.weebly.com)

 

       


Friday, November 25, 2011

తత్వ విశ్లేషణ :

ఆధ్యాత్మిక తత్వ విచారణకు ప్రాచుర్యం కల్పించి, జ్ఞాన సముపార్జన వేగవంతం చెయ్యాలని మా ఆకాంక్ష. దీని వలన ఆధ్యాత్మిక జ్ఞానలోతులకు వెళ్లి ఆ రహస్యాలను తెలుసుకుని, ఆ అనుభవాలను పొంది, వాటిని అందరితోను పంచుకోవాలనే మా ప్రయత్నం. ఈ మా ప్రయత్నంలో అందరు సహకరించ ప్రార్ధన. 

దీనికి ఆ గురు పరంపర యొక్క ఆశీస్సులు ఉంటాయని భావిస్తున్నాము. 

(Please visit: www.tatvavisleshana.weebly.com)