Tuesday, July 10, 2012

యోగము

                                 యోగము
                మనం జ్ఞానము, యోగముల యొక్క పూర్తి ఆవశ్యకత గురించి తెలుసుకొన్న తర్వాత, జ్ఞానాన్ని పరిపక్వం చేసేది, ధ్యానము యొక్క తదుపరి స్థితి, విశిష్టమైన అనుభవన్నిచ్చేది, ఆత్మదర్శనమునకు మార్గము, పరబ్రహ్మానుభవమునకు మొదటిమెట్టైన చైతన్యభావాన్ని కలిగించేది, సమాధిస్థితిని కలిగించేది, అఖండానందైకరసానుభూతిని పొందించేది, అయినటు వంటి యోగము గురించి తెలుసుకుందాము. ఈ యోగం విషయమై అనుభవజ్ఞులు ఏమి చెప్పారో తెలుసుకుందాము.

కఠోపనిషత్:ద్వితీయాధ్యాయము:6వ వల్లి: 
             11. స్థిరమగు ఇంద్రియధారణనే యోగమని చెప్పెదరు.  అట్టి స్థితియందు యోగి అప్రమత్తుడై యుండును.  ఈ యోగమును పొందవచ్చును. అజాగ్రత్తచే పోగొట్టుకొనవచ్చును. (చాలామందికి యోగమంటే గాఢమైన నిద్రాస్థితి అని అనుకొంటున్నారు. కానికాదు. యోగము లో బాహ్యచైతన్యము లేనట్లుకనపడినా, ప్రాణ చైతన్యము, పరా చైతన్యము పూర్తి స్థాయిలో పనిచేస్తూవుంటాయి. యోగములో మనము  బాహ్య ప్రపంచానికి జాగ్రదావస్థలో లేనట్లు కనపడినా, జాగ్రత్స్వప్నసుషుప్త్యావస్తల కన్న వేరేదైనటువంటి స్థితిలో వుంటాము. ఆస్థితిలో మన conscious, sub-conscious కూడా మన చెప్పుచేతలలో వుంటాయి. ఇవి కాకుండా, మన అంతఃకరణాలైన మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము కూడా మన అదుపులో వుంటాయి. మన ఆత్మ astral travel చేస్తున్నా, పై పై స్థాయిలకు వెళుతూ, అక్కడ మనకు తెలియని అను భూతులు, అనుభవాలు, సిద్దులైన ఆత్మలతో పరిచయం కలిగినా, అవన్నీ క్రింద భూమిపైన మన శరీరములోని చిత్తానికి తెలుస్తూ వుంటాయి. తర్వాత
వాటిని మిగిలినవారికి వివరించ గలము  కూడా. చూసారా! యోగమంటే ఎటువంటి అప్రమత్తమైన స్థితియో! వెంటనే మనకు ఒక హెచ్చరిక కూడావస్తోంది. ఏమాత్రము అజాగ్రత్తగా వున్న అటువంటి ఉన్నతమైన యోగస్తితి నుండి పడిపోతాము. తిరిగి దాన్ని పొందటము చాలా కష్టము.)

వివేకచూడామణి:
       9.చిత్తనిరోధరూపయోగారూఢభావమును పొంది తత్వసాక్షాత్కారనిష్టతో సంసారనిమగ్ను డయ్యునూ, తననుతానే ఉద్ధరించుకొనవలెను.

యోగవాసిష్ఠము: ఉపశమ ప్రకరణము:78వ సర్గ:
        8. చిత్తనాశమునకై యోగమనియు, జ్ఞానమనియు యిరుతెరగులగు నుపాయములు చెప్పబడినవి. అందు యోగము చిత్తవృత్తి నిరోధమున్ను, జ్ఞానము సమ్యక్ దర్శనమున్ను నగును.
        15. వేదరహస్యమెరింగినవారు ప్రాణస్పందమునే చిత్తమని పేర్కొనిరి. కాన ప్రాణ నిరోధముచే చిత్తమున్నూ తప్పక ఉపశమించును. (మనకు మొదట్లో అంటే, క్రింద స్థాయిలో, బాగా అర్థమగుటకు, అంతఃకరణలు
మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము విడివిడిగా నాలుగు అని చెప్పారు. కాని నిజానికి, ఇవిఅన్నీ ఒక్కటే. ఇంకా పైస్థాయికి వస్తే, యివన్నీ మనప్రాణములో, అంటే మన ఆత్మలో వున్న క్రిందిస్థాయి భాగాలని అనుభవ పూర్వకముగా తెలుసుకుంటాము. ఇంకా చెప్పాలంటే, ఆత్మ యొక్క భౌతిక రూపమే ప్రాణము. ప్రాణము యొక్క శక్తి రూపమే (energy-part) ఆత్మ.     శరీరములో ఉన్నటువంటిది, అజ్ఞానములో ఉన్నటువంటిది ప్రాణము, జీవుడు. అదే, జ్ఞానవంతమైనా, శరీరమును వదిలివేసినా ఆత్మ అవుతుంది. రెండిటికీ వాస్తవానికి తేడాలేదు. కాబట్టి ఎప్పుడైతే చిత్తాన్ని, అదే అలోచించటాన్ని ఆపుచేశామో, చిత్తము దానితోపాటు మనస్సు కూడా పనిచేయడం మానేస్తాయి. కిటుకు ఏమిటంటే, అంతఃకరణాలలో ఏఒక్కదానినైనా పట్టుకొని, దాన్ని పనిచేయకుండా ఆపుచేస్తే, మిగతావి కూడా పని చేయడం మానేస్తాయి. కారణం ఏమిటి? అవన్నీ ఒక్కటేకాబట్టి. అమనస్కయోగము అంటేఇదే. కాబట్టి ఈవిషయాన్ని తెలుసుకొని, ఉపక్రమించండి. తప్పక ఫలితం వస్తుంది.)
           18-21. శాస్త్రసజ్జనసంపర్కము చేతను, వైరాగ్యాభ్యాసముల చేతను పూర్వాభ్యస్తము లగు సాంసారికవృత్తులందలి విశ్వాసము దృఢపడ, ఏకాగ్రత చేత నుదయించిన యభిమత ధ్యానముచేతను, ఏకతత్త్వము యొక్క దృఢాభ్యాసము చేతను, సుఖపూర్వకముగా సిద్ధించిన పూరకాది ప్రాణాయామము చేతను, ఏకాంత ధ్యానయోగము చేతను ప్రాణస్పందము నిరోధింప బడును. (మనం కొద్దిసేపు ధ్యానము చేసి, నాకు మనస్సు నిలకడ కుదరటంలేదు అను కొంటాము. కాని అది నిరంతరంగా అవలంభించాల్సిన ప్రక్రియ. అలా చేస్తూ వుంటే కొంత కాలానికి నిలబడుతుంది. ఎంతవరకూ అన్నది ఆ వ్యక్తిపై ఆధారపడి వుంటుంది. అలా ఏకాగ్రత నిలబడటానికి వివిధ ఉపాయాలు చెపుతున్నారు. శాస్త్రములను అధ్యయనం చేయటంచేత, యోగుల సంపర్కము చేత, వైరాగ్యాన్ని సరియైన రీతిలొ అభ్యసించటం చేత, సాంప్రదాయ ప్రాణాయామము చేత, ఏకాంత ధ్యానము చేత, మనస్సు నిలుస్తుందని చెప్పారు. ఇంకా ముందర చాలా ఉపాయాలు చెప్తారు జాగ్రత్తగా గమనించండి. ఇన్నిరకాల ఉపాయాలు చెప్పడం ఎందుకూ ఆంటే, ఒక్కక్కళ్ళకి ఒక్కక్కటి పనికివస్తుంది కాబట్టి!) ఓంకారమును దీర్ఘముగా నుచ్ఛరించి, యద్దాని చతుర్ధమాత్ర నవలంభించి, శబ్దార్థములను భావన చేయుటచే, బాహ్య విషయజ్ఞానము పూర్ణముగా నుపశమింప నత్తరి ప్రాణస్పందము నిరుద్ధమగును. [ఓంకారాన్ని మననోటితో ఎంతవరకూ అనగలమో, అంతవరకూ అని, తదుపరి దానిని మనస్సుతో పొడిగిస్తే, అందులో, అర్థమాత్ర మిగులుతుంది. అంటే, అకార, ఉకార, మకారములు లయించిపోయి, అక్షరరహిత శబ్దము, అదే నాలుగవది అయిన అర్థమాత్ర మిగులుతుంది. (దీనినే నాదబిందువు అని కూడా అంటారు. దీని గురించి ఇంకొకసారి తెలుసుకొందాము) దీనియొక్క శబ్దము మరియు అర్థములను తెలుసుకొని భావన చేస్తే, బాహ్యజ్ఞానము పూర్తిగా పోయి ఏకాగ్రత కుదురుతుంది. శృతి "తస్య వాచకః ప్రణవః; తజ్జప స్తదర్థభావనః" అని చెప్తోంది. ఆ శుద్ధగంభీర నిరాకార పరమాత్మ యొక్క సర్వనామము (pronoun) ప్రణవమని, దానిని జపించుటవలన ఆ పరమాత్మయోక్క అర్థమూ, భావన కలుగుతాయని దీని భావము. దీనివల్ల స్థిరమైన ఏకాగ్రత కుదురుతుంది.]
            27-31. నాసికాగ్ర భాగమున నిర్మలాకాశము నందు పన్నెండు అంగుళముల వరకు మనోదృష్టుల నిరోధించుటచే ప్రాణస్పంద నిరోధము కలుగును. అభ్యాసముచే తాలువుపై
పన్నెండు అంగుళముల మేరనున్న బ్రహ్మరంధ్రమందు ప్రాణ వృత్తి లయింప ప్రానస్పందము నిరోధింపబడి శాంతి నొంద, పైరీతి ప్రాణమును బ్రహ్మరంధ్రమున బ్రవేశపెట్టుటచే చిన్మాత్ర నిరుద్ధమగును. (దీనినే 'మండలబ్రాహ్మణోపనిషత్' లో 'బహిర్లక్ష్యము' అని చెప్పినారు. బహిర్లక్ష్యము అనగా మన శరీరమునకు బయటనున్న లక్ష్యము. ముక్కు కొస నుండిగాని, తాలువు, అనగా నాలుకపైన నుండే నోటియొక్క భాగము, నుండిగాని, పన్నెండు అంగుళముల పైన మన దృష్టిని, మనస్సును కేంద్రీకరించాలి. అది సరిగ్గా మన శిరస్సు పైభాగాన ఆకాశములో వుంటుంది. అక్కడ దృష్టిని కేంద్రీకరిస్తే, ఆ దృష్టితో పాటు మనస్సుకూడా అక్కడే వుంటుంది. ఇది అభ్యాసము పై వస్తుంది. ఇక్కడ పన్నెండు అంగుళములంటే పన్నెండు స్థాయీలని కూడా చెప్పుకోవచ్చు. మీకు ఇంకొక ఉదాహరణ ఇస్తాను. ఇది చాలా పాత చిత్రము. చేతితో వేసినదను కొంటాను. ఎక్కడైనా లభ్యమైతే చూడండి. విశ్వామిత్రుడు తపస్సు చెస్తూవుంటే పైనుండి మేనక వస్తూవుంటుంది. అక్కడ విశ్వామిత్రుడు తపస్సు చేస్తూవున్న భంగిమ జాగ్రత్తగా గమనించండి. ఒంటి కాలిమీద నిలబడి, రెండు చేతులూ పైకెత్తి నమస్కరిస్తూ, తల పైకెత్తి, కలిసివున్న ఆరెండు చేతుల కొసలు చూస్తూ వుంటాడు. ఆ రెండు చేతుల కొసలు వున్న ప్రదేశమే, ఇక్కడ చెప్పినటు వంటి చోటు. ఆ ఫోటోలో లాగా ఇప్పుడు మనం ఫోజు పెట్టనవసరం లేదు. కళ్ళరెప్పలు మూసు కొని, కను గ్రుడ్లని పైకెత్తి, ఆ ప్రదేశాన్ని భావిస్తూ, మన మనస్సుని అక్కడ కేంద్రీకరించడానికి ప్రయత్నించండి. అదే నిజమైన బ్రహ్మరంధ్రము. అది నిజానికి మన శరీరములొ లేదు. దీనినే వశిష్ఠులవారు చెప్పారు.) గురు ఈశ్వరానుగ్రహముచే కాకతాళీయముగా ఆత్మజ్ఞానము శ్రీఘ్రముగా జనింప, నియ్యది వికల్పంశరహితమై, దృఢపడ, ప్రాణ చలనము నిరుద్ధమగును. (ఇది కేవలము ఆ పరమాత్మకు, సద్గురువులకు మాత్రమే సాద్ధ్యపడే విషయము. వారికి, ఎవరిపైనేనా అపారమైన ప్రేమానురాగాలు, జాలి కలిగితే, వారి అనుగ్రహంతో ఆ వ్యక్తికి మనస్సు నిలబడి, సమాధి స్థితిలోకి వెళ్ళగలడు. హృదయాకాశామున చిరకాలము సులగ్నమొనర్చుట చేతను, వాసనారహితుడై, ఆత్మధ్యానము చేయుట  చేతను, ప్రాణస్పందము నిరోధింపబడును. (దీన్నేహృదయధ్యానమంటారు.)

యోగశిఖోపనిషత్:తృతీయాధ్యాయము:
       
సిద్ధులకు కారణమైన చిత్తు యోగమని చెప్పబడినది.  ఏది తెలిసినంతనే జన్మయనెడి  బంధమును వీడి ముక్తుడగునో, అక్షరమైన పరమనాదము శబ్దబ్రహ్మమని చెప్పబడును. మూలాధారమును పొందిన శక్తి స్వాదారమైనది, బిందురూపిణియు. దానియందు నాదము సూక్ష్మబీజమునుండి అంకురము వలె పుట్టును. దేనిచే యోగులు విశ్వమును చూచెదరొ దానిని 'పశ్యంతీ ' అనెదరు. హృదయమందు మేఘగర్జన వంటి శబ్దము స్పష్టమగును. దానికి 'మధ్యమ' అని పేరు. స్వరమను ప్రాణముచే 'వైఖరి' ప్రసిద్ధమైనది. తాలువు మున్నగు స్థానముల
యెత్తి
డిచే, శాఖాపల్లవరూపమున అకారాది క్షకారాంత అక్షరములు పుట్టును. అక్షరముల నుండి పదములు, పదములనుంది వాక్యములు పుట్టును.  మంత్రములు వేదశాస్త్రములన్నియూ పూర్తిగా వాక్యాత్మకములు.  పురాణములు, కావ్యములు, వివిధ భాషలు అన్నియూ వాక్యాత్మకములే! సప్త స్వరములు, గాధలు అన్నియూ నాదము వలన పుట్టినవే! ఆ సరస్వతీదేవి సర్వభూతముల యొక్క గుహను (నోటిని, హృదయమును) ఆశ్రయించినది. వహ్నియుక్తమైన వాయువుచే మెల్లమెల్లగా ప్రేరేపింపబడినదై దాని వివర్తమైన (మారిన) పదములతో ఈరీతిగా నుండును. ఏ యోగి ఈ వైఖరీ శక్తిని స్వాత్మయందు చూచునొ, అతడు సరస్వతీ ప్రసాదమున వాక్సిద్ధిని పొందును. స్వయముగా వేదశాస్త్రములకు కర్త యగును. బిందువు, నాదము, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, అన్ని యింద్రియ ములు ఎక్కడ లయమగునో, వాయువులు, మనస్సు ఎక్కడ లీనమగునొ, దేనిని పొందిన వాడు ఇంతకన్నా ఎక్కువ లాభముగా దేనిని ఆనుకొనడో, దేని యందుండి, పెద్ద దుఃఖముచే కూడా చలింపడో (వీటికి ఉదాహరణ: ప్రహ్లాదుడు, అంబరీషుడు), యోగసేవచే నిరోధింపబడిన చిత్తము ఎక్కడ విశ్రాంతిని పొందునో, ఎక్కడ ఆత్మచే ఆత్మను చూచుచూ, ఆత్మయందే సంతోషించునో, ఏది బుద్ధిగ్రాహ్యము, అతీంద్రియమునైన అత్యంతిక సుఖమో, అయ్యది క్షరాక్షరాతీతము, అనక్షరము అని చెప్పబడును. సర్వభూతములు క్షరములు. సూత్రాత్మ అక్షరుడు. 

షష్ఠోధ్యాయము:
       
మనస్సుచే మనస్సును చూసి యోగవేత్త ముక్తుడగును.  మనస్సుచే మనస్సును చూచి, ఉన్మన్యంతము ఎప్పుడునూ స్మరించవలెను. మనస్సుచే మనస్సును చూచి, ఎప్పుడునూ యోగనిష్ఠుడు కావలెను. అట్లే దశ ప్రత్యయములు చూడవలెను. ప్రత్యయము లెప్పుడు కనపడునో, అప్పుడు యోగీశ్వరుడగును. బిందువు నాదకలాజ్యోతి. (దీనినే 'తేజబిందోపనిషత్'లో 'నాదాంత జ్యోతిరేవసః" నాదము యొక్క అంతమందు జ్యోతి మాత్రమే మిగులును అని చెప్పారు.) ఆ బిందువు ధృవతారకమైనది. అది శాంతము, అతీతము, పరబ్రహ్మ అని చెప్పబడును. (అట్టి యోగి) నవ్వును. ప్రీతిచే ఉల్లాసముగా నుండును. (ఆత్మలో) క్రీడించును. సంతోషించును. బుద్ధిచే జీవనమును విస్తరించును. అంతట భయము వలన భయపడును. అడ్డగించును. తెలిసికొనును. శోకమువలన మొహమునందును. సంపదచే కాదు. శత్రుకార్యములందు కంపించును. (విదేహముక్తి కొరకై ప్రాణోత్క్రమణ)కోరికచే నవ్వుచూ క్రీడించును. కామరహితమైన చిత్తమును స్మరించి కళేబరమున తెలియవలెను. వాయువెక్కడ ఉండునో, చిత్తమక్కడే ఉండును. (ఇందుకోసమే పూరక, కుంభక, రేచక పూర్వకమైన ప్రాణాయామాన్ని నిర్దేశించారు.) ఎల్లప్పుడూ నాదానుసంధానమున వాసన క్షీణించును. (శ్రీత్యాగరాజుగారు "నాదతనుమనిశం" అని ఇందుకే కీర్తించారు.) వాయువు నిరంజనమైన మనస్సునందు లీనమగును. నాదమేదో అదే బిందువు. అదే చిత్తము. నాదబిందు చిత్తముల కైక్యము సాదిమ్చావలెను. మనస్సు, బిందువును ఉత్పత్తికి, స్థితికి కారణములు. మనస్సుచే బిందువు పాలచే నెయ్యివలె పుట్టుచున్నది. షట్చక్రముల నెరిగినతర్వాత సుఖమండలము ప్రవేశింపవలెను. [సాధారణముగా అందరూ
షట్చక్రములతో ఆఖరు, అంటే సహస్రారమే చివరిది అని అనుకుంటున్నారు. ఉపనిషత్తు లోని ఈ వాక్యముననుసరించి ఆ తర్వాత కూడా స్థాయీలు ఉన్నాయి అని తెలుస్తోంది. రహస్యమైనా ఇక్కడ చెప్పక తప్పదు. సద్గురువులు పోడూరి కృష్ణవేణుమాతాజీ గారు, అనుభవ పూర్వకముగా సహస్రారము తర్వాత ఇంకనూ  ఆరు స్థాయీలు కలవని, అందులో మొదటి మూడు ఈ శరీరము ఉండగా అనుభవములోనికి వచ్చునని, మిగిలిన మూడు ఈ భౌతికశరీరము వదిలిన తర్వాత మాత్రమే ప్రవేశింప  గలమని చెప్పేవారు. ఈ విషయమై మేము  శ్రీగురుమండలిని క్షమాపణ కోరుతున్నాము. ఎందుకంటే ఈ విషయం చెప్పవచ్చో, చెప్పకూడదో, మాకు తెలియదు. మేము ఈ కార్యక్రమాన్ని (తత్వవిశ్లేషణ  అనే వెబ్సైట్ ని నిర్వహించడం) వారి ప్రోద్బలంతోనే చేస్తున్నాము. నిజానికి మాకు ఇవేమియూ తెలియవు] వాయువు నాకర్షించి ప్రవేశించవలెను. అట్లే పైకిన్నీ నియోగించవలెను. వాయువును, బిందువును, చక్రమును, చిత్తమును అభ్యసింపవలయును. సమాధిని, (దానితో) సమముగా అమృతమును యోగులు పొందుదురు. కర్రమధ్యలోనున్న నిప్పు మధించ కుండా పైకి రానటుల అభ్యాసయోగము లేనిదే జ్ఞానదీపము రాదు. దీపము ఘటమధ్యమునందే గాని, బాహ్య ప్రదేశమున వెలగనట్లు, ఘటము భిన్నమైననూ, దీపము ప్రకాశించుచున్నటుల, స్వశిరము ఘటము. జీవుడు తత్పదార్థము. గురువాక్యము సమముగా భిన్నమైన (విశ్లేషింపబడిన)బ్రహ్మజ్ఞానము ప్రకాశించును. గురువును కర్ణదారునిగా (చుక్కాని పట్టువానిగా) పొంది, ఆ గురువాక్యమును తెప్పగా దృఢముగా పొంది, అభ్యసవాసనాశక్తిచే యోగులు భవమనెడి సాగరమును తరింతురు.
              యోగాయుక్తుడైన యోగికి దీపజ్వాల, చంద్రుడు, ఖ్యదోతములు(ఆకాశములో వెలుగుతూ కనిపించేవి), మెరుపు, నక్షత్రములు సూక్ష్మరూపమున ఎప్పుడునూ కనిపించును (ఇవి అన్నియూ నాదబిందువుయొక్క తేజోరూపాలు). అణిమాదికమైన ఐశ్వర్యమతనికి అచిర కాలముననే కల్గును.  నాదముకన్నా గొప్ప మంత్రము లేదు. స్వాత్మకన్నా పరుడైన దేవుడు లేదు. ('దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవో సనాతనః' దీనికి సరియైన అర్థం ఇదియే. ఎందుకంటే, త్రాడుకి పైకొస పరమాత్మ ఐతే, క్రిందికోస ఆత్మ. ఈ క్రింది కొస అయిన ఆత్మను పట్టుకుంటే గాని, పైకొస అయిన పరమాత్మ దొరకడు. అటువంటి ఆత్మ మనలోనే వుంది. కాబట్టి మనలోనే ఉన్నదాన్ని వదిలివేసి, ఆ పరమాత్మకోసం బయట ఎక్కడెక్కడో తిరిగితే, మునిగితే, దొరుకుతాడా?). (ఆత్మ పరమాత్మల) అనుసంధానము కన్నా గొప్పదైన పూజ లేదు. తృప్తికన్నా గొప్పదైన సుఖము లేదు. సిద్ధిని కోరువానిచే సర్వదా నిది గోపనీయము. నాభక్తుడు దీని నెరిగి, కృతకృత్యుడై సుఖవంతుడగును. ఎవనికి దేవుని యందెక్కువ భక్తి కలదో, దేవునియందు వలెనే, గురువుయందు భక్తి కలదో, ఆ మహాత్మునకు చెప్పబడినచో, ఈ విషయములు ప్రకాశించును.

పైంగలోపనిషత్:
తృతీయాధ్యాయము:
             హృదయములో ధూమరహిత, కలశాంతరదీపము రీతిగా ప్రకాశించు అంగుష్ఠమాత్రాత్మను ధ్యానము చేయవలెను. తనలో ప్రకాశించు చున్న కూటస్థ అవ్యయ పరమాత్మను నిరంతరము, జీవితకాలమునంతయూ ధ్యానము చేయుచుండవలయును. (ఈ వాక్యాన్ని బట్టి, ధ్యానము, యోగము పూర్తిగా ఒక జీవితకాల, నిరంతర (perpetual) ప్రక్రియ అని అర్థమవుతోంది. ఒకరోజులో కొన్ని నిముషాలో, నెలలో కొన్ని రోజులో, సంవత్సరములో కొన్ని నెలలో, జీవితంలో  కొన్ని సంవత్సరాలో చేసేది కాదు. పరమార్ధ జ్ఞానం తెలుసుకోన్నప్పటినుండి, ఈ శరీరం పడిపోయే వరకూ మన శ్వాసతోపాటు ధ్యానము, యోగము కూడా కొనసాగ వలసినదే. ఇది ఎలా అన్నది సద్గురువులు చెపుతారు. జనకమహారాజు, అష్టావక్రుడు వంటి వారు ఎందరో దీనికి ఉదాహరణలుగా వున్నారు.) అట్టి ముని జీవించి వున్ననూ, జీవన్ముక్తుదై యున్నందువలన, ధన్యుడు. కృతార్థుడు. (ధన్యత, కృతార్థత అంటే ఇది). ఆట్టివాని శరీరము కాలసాత్ కృతమై ఉన్నందున, (ఇంకనూ జీవితకాలమున్నందున జీవించి, తదనంతరము) ప్రాప్తించిన జీవన్ముక్తపదవిని త్యజించి, చలనరహిత వాయువువలె నాతడు విదేహముక్తిని పొందును. ఆశబ్దము, అస్పర్శము, అరూపము, అవ్యయము, అరసము, అగంధము, అనాది, అనంతము, అమలము, నిత్యమూ, మహాత్వారము, నిరామయమగు సత్యపదార్థమొక్కటియే మిగిలియుండును.

  (మీ స్పందనల కోసం ఎదురు చూస్తూ వుంటాము,
www.tatvavisleshana.weebly.com ని దర్శించండి.)                       

Sunday, July 8, 2012

జ్ఞానము - యోగము

                          జ్ఞానము - యోగము 

            ఇంతవరకూ మనం అజ్ఞానం గురించి, అవస్థల గురించి, శుభఅహంకారాల గురించి, జ్ఞానం మరియు అందులో వున్న వివిధ భూమికల గురించి తెలుసుకున్నాము. జ్ఞానము (knowledge) వివిధవిషయాలగురించి చెపుతుంది. విషయాలగురించి తెలుసుకోవడం అనుభవం అవదు. దాన్నికేవలం అనుభవించ వలసినదే (practical). సైన్సు పుస్తకములో విషయాలని చదువుతాము. దానివల్ల విషయాలు తెలుస్తాయిగాని పూర్తిగా బోధపడవు. పూర్తిగా అర్థమవ్వాలంటే ఆ ప్రయోగం చెయ్యాల్సిందే. అలాగే, విషయాన్ని తెలుసుకోకుండా ఉత్తి ప్రయోగం చేస్తే కూడా విషయం పూర్తిగా అర్థమవదు. కాబట్టి మొదట విషయాన్ని తెలుసుకొని, దాన్ని ప్రయోగం చేసి, ఆ అనుభవం ద్వారా విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. జ్ఞానము, యోగమువిషయంలో కూడా సరిగ్గాఅంతే. జ్ఞానముద్వారా తెలుసుకొన్న విషయాలని, యోగము ద్వారా అనుభవించి పూర్తిగా తెలుసుకోవాలి. కొంతమంది జ్ఞానము ఒక్కటే చాలు అని యోగాన్ని వద్దని నిర్లక్ష్యం చేస్తారు. కొంతమంది యోగం ఒక్కటే ఆచరిస్తే చాలు, ఇంకేమి అక్కరలేదు అనుకొంటారు. కేవల జ్ఞానం వల్ల అనుభవం రాదు. కేవలం యోగం ఒక్కటే చేసి నందువల్ల, దానివల్ల మనం పొందినదేమిటో అర్థం కాదు. కాబట్టి జ్ఞానాన్ని, యోగాన్ని రెండింటినీ సంయమనం చేసుకొని ఆ అనుభవం ద్వారా మనలను పక్వానికి తెచ్చుకోవాలి. ఇక్కడ మనం ఇంకొక ఉదాహరణ చెప్పుకోక తప్పదు. మామిడి కాయను చూడండి. అది ఆకుపచ్చగా, గట్టిగా, పులుపుగా వుంటుంది. మామిడి పండైతే, పసుపురంగుతో, కాయకన్నా కొద్దిగా మెత్తగా, ఒకరకమైన సువాసనతో, తీపిగా వుంటుంది. ఈ గుణాలన్నీ స్వభావ సిద్ధంగా పండిన పండుకువుంటాయి. అదే కార్బైడ్ వేసి పండిస్తే, కాయ పసుపు రంగులోకి మారుతుంది కాని, ఆ పండు వాసన, తీపి రుచి వుండవు. తేడా అర్థమయ్యింది కదా! జ్ఞానంతో పక్వానికి వచ్చిన మనస్సు, యోగమనే ప్రక్రియతో, అనుభవమనే రంగు, రుచి, వాసన పొంది పక్వానికి వస్తుంది. ఈ రెండిటిలో ఏది లేకపోయినా, ఏది తక్కువైనా, సరిగ్గా పండదు. ఆంటే సరియైన జ్ఞానంతో, తగినటువంటి అనుభవం పొందితేనేగాని, పరబ్రహ్మ తత్త్వము అర్థమవ్వదు. కాబట్టి మనకు పరబ్రహ్మ తత్త్వము పూర్తిగా అర్ధమవ్వాలంటే జ్ఞానము, యోగము రెండూ కావలసిందే. ఏ ఒక్కటి తనంత తానుగా మోక్షము వైపు మనలను తీసుకొనిపోజాలదు. కాబట్టి ఈవిషయమై, సనాతనులు, ద్రష్టలు, జ్ఞానులు ఏమి చెప్పారో తెలుసుకోందాము. మొదట జ్ఞానానికి యోగానికి గల సంబంధం గురించి తెలుసుకొని, ఆ తర్వాత యోగం గురించి తెలుసుకొందాము.

యోగశిఖోపనిషత్:  (శంకరుడు బ్రహ్మతో చెప్పుచున్నాడు):

       పరమపదమైన మోక్షమునకు కొందరు జ్ఞానముకారణమందురు. కాని అది కేవలము సిద్ధి నియ్యజాలదు. యోగము లేని జ్ఞానము మోక్షమునెట్లిచ్చునయ్యా? యోగముకూడా జ్ఞానము లేకుండా మోక్షము నీయజాలదు. కావున మోక్షముకోరువాడు జ్ఞానమును, యోగమును దృఢముగా అభ్యసింప వలెను. యోగముకొరకే సాధనమైన జ్ఞానము యొక్కస్వరూపమేదో ముందు తెలియవలెను. అజ్ఞానమననేమి? అనికూడా ముముక్షువు తెలిసికోనవలెను. (చూశారా జ్ఞానము యోగము కొరకు ఒక సాధనమని చెప్పారు. జ్ఞానాన్ని బాగా తెలుసుకో మన్నారు. అంతకు ముందు అజ్ఞానాన్ని కూడా తెలుసుకోమన్నారు. కాబట్టి మనం ఇంతకు ముందు అదే వరుసలో, మొదట అజ్ఞానం గురించి, తర్వాత జ్ఞానం గురించి తెలుసుకొన్నాము. మోక్షము కోసం జ్ఞానము మరియు యోగము యొక్క ఆవశ్యకత గురించి, ఆతర్వాత యోగం గురించి తెలుసుకుంటున్నాము.) దానితో పరమపదమైన కైవల్యము యొక్క నిజరూపము తెలియును.  సర్వ దోషములతో చుట్టుకొనబడిన జీవుడు ఆ కామక్రోధాది దోషముచే వినిర్ముక్తుడు, జ్ఞానముచే నెట్లగును? (ఇక్కడ అరిషడ్వర్గముచే చుట్టుకొనబడిన జీవుడు జ్ఞానముచేఎలా విడిపింపబడతాడు? అని అడుగుచున్నారు. దానికిజవాబు కూడఇస్తున్నారు.) స్వాత్మరూపము వలె జ్ఞానమునూ పూర్ణమైనది. వ్యాపకమైనది యును. కామక్రోధాది దోషము లకు నిజముగా స్వరూపమున బేధము లేదు. దానికి విధి ఏమి? తర్వాత దాని నిషేధమేమి? ఎట్లగును? అనగా, వివేకి ఎప్పుదునూ ముక్తుడే! సంసార భ్రమనుండి తప్పుకున్నవాడే! అది పరిపూర్ణమైనది. సత్యిఅమైనది. పూర్ణము కనుక సకలము, నిష్కళమునదే. కలిచే స్ఫూర్తి పొందినదగుటచే, సంసార భ్రమలలో తిరుగుచున్నది. నిష్కళము, నిర్మలము, సాక్షాత్తు సకలము, ఆకాశము వంటిది. ఉత్పత్తి, స్థితి, సంహారముల యొక్క స్ఫూర్తి జ్ఞానము లేనిది. అట్టిది ఈ రూపము పొందినదై ఎట్లు మోహసాగరమున పడుచున్నది? విద్యను వదిలి మాటి మాటికి సంసారమున పడుచున్నది. సంసారులెట్లు సుఖదుఃఖాది మొహములందుందురో, అట్లే జ్ఞాని వాసనావాసితుడై యుండును. వారిద్దరికినీ విశేషములేదు. సంసారభావన ఇద్దరికిని సమమే. ఇట్టి జ్ఞానము తెలియబడినచో, అజ్ఞానమెట్లుండును? జ్ఞాననిష్టుడు, ధర్మజ్ఞుడు, విజితేంద్రియుడు, విరక్తుడునైననూ, దేహముం దగా మోక్షము పొందలేడు. దేహధారులు అపక్వులు, పరిపక్వులు అని రెండు విధములు. యోగహీనులు అపక్వులు. యోగము కలవారు పరిపక్వులు.


             యోగాగ్నిచే సర్వదేహము శోకవర్జితమై అజడమగును. దేహము పార్ధివము, జడము, అపక్వము, దుఃఖమిచ్చునది యని తెలియవలెను. ధ్యానస్థుడైననూ అతడు ఇంద్రియములచే స్వాధీనుదగును.  ఆ ఇంద్రియములను గట్టిగా నియమించిననూ, నిగ్రహించిననూ, ఇతరమైన వాటిచే బాధపడును. శీతొష్ణములు, సుఖదుఃఖాదులు, మానస వ్యాధులు, ఇంకా ఇతరములైన నానావిధజీవములు, శస్త్రములు, అస్త్రములు, జలము, గాలి వీటన్నిటిచేతను, శరీరము బాధింపబడును. దానితో మనస్సు క్షోభ చెందును. అట్లే ప్రాణాపాయ సమయమున వాయువు క్షోభ చెందును. అంతట అనేక దుః ఖములతో వ్యాప్తమై చిత్తము క్షోభపడును.(ఇక్కడ మనకు ధ్యానానికి, యోగానికి ఎన్నిరకాల అడ్డంకులువస్తాయో అన్నీచెప్పారు) దేహావసాన సమయ మున దేహి దేనిని భావించునో ఆయారూపుడే జీవుడగును. (పూర్వము జడభరతుడనే ముని దేహావసాన సమయములో ఒక లేడిని చూడగా, ఆతర్వాత ఆలేడి కడుపునే జన్మించవలసి వచ్చిందట. దీని గురించి "పరమహంస సచ్చిదానందులవారు",
విశదీకరిస్తూ "జీవబ్రహ్మైక్య రాజయోగ సారామృతము" అనే గ్రందములో  ఒక ప్రకరణము పెట్టారు. వీలయితే ఒకసారి చదవండి.) ఆ రీతిగా జన్మ కారణమున్నది. దేహాంతమున ఆ జన్మఎమైనది? దానిని మానవు లెరుగరు. కావున జ్ఞానము వైరాగ్యము జీవునకు కేవలము శ్రమయే (యోగము లేనప్పుడు). దేహమునంతుకొన్న చీమ ఏదో అలోచించుచూ శరీరమునుండి జారిపడునట్లు తేళ్ళచే దష్టుడై ఈ జీవుడు సుఖపడడే, దేహాంతమున ఎట్లు సుఖపడును? కావున మిథ్యాతర్కముచే నిండిన వారైఎరుగరు. ఎవనికైనా అహంకారమెపుడు నశించునో అతనికప్పుడే దేహముకూడా నశించును. కారణము లేకుండా కార్యమెప్పుడూ ఉండదుకదా! అట్లే అహంకారము లేకుండా దేహమందు దుఃఖ మెట్లుండును? జనులందరూ దేహముచే జయింపబడినారు. కాని యోగులచే శరీరము జయింపబడినది. కనుక సుఖదుఃఖాదిఫలము వారికెట్లు కలుగును? ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, కామక్రోదదికమును జయింపబడినవి. వానిచే సర్వము సంహరింపబడినవి. యోగాగ్నిచే మెల్లగా సప్తదాతుయుక్తమైన దేహము దగ్ధమైనది. మనోబలము గల యోగదేహము దేవతలచేత గుర్తింపబడదు (అందువల్లే దేవతలు యోగులను చూసి ఈర్ష్యపడతారు). 

             బేధబంధములు కలది, నానాశక్తిధరమునైనది "పరాత్మ దేహము ఆకాశమువలె నుండును. ఆకాశము కన్ననూ నిర్మలము, సూక్ష్మము కన్నసూక్ష్మము, దృశ్యము కన్నా స్థూలము, జడము కన్నా జడము. [ఇక్కడ యోగమార్గము (astral-travel) లో ప్రయాణించు యోగి యొక్క ఆత్మ ధరించు, తత్సంబంధ యానకమైన, దేహము గురించి చెప్పినారు.] ఇచ్ఛారూపుడైనవాడు యోగీంద్రుడు. స్వతంత్రుడు, అజరామరుడును, ముల్లోకములందునూ ఎక్కడోనొకచోట క్రీడించుచుండును. అచింత్యశక్తిగల యోగి నానారుపములను ధరించును. విజితేంద్రియుడై స్వేచ్ఛగా వాటిని ఉపసంహరించుకోగలడు. (దీనికి 'ఒక యోగి ఆత్మకధ'లో దృష్టాంతరాలు లభిస్తాయి. శ్రీ పరమహంస యోగానంద గారికి, ఒకేసారి రెండు శరీరాలు ధరించే శక్తిగల ఒక యోగి తారసపడతారు. అలాగే మహావతార్ శ్రీ బాబాజీ గారు, ఒకానొక సందర్భంలో "నేను అప్పటికప్పుడు అక్కడ వుండే అణువులను సంయోగపరచి నాకు కావలసిన దేహమును దరించ గలను, మరలా ఆ శరీరాన్ని అణువులుగా విభజించగలను" అని వివరిస్తారు.) యోగ బలముచే యితడు మరణముబొందడు. యితడు హరునిచే మృతుడు గనుక మృతునికి మరల మరణమెట్లుండును? (ఈ వాక్యము మహావతార్
శ్రీబాబాజీ, శ్రీ త్రిలింగస్వామి లాటివారికి సరి పోతుంది.) 
అందరికినీ ఎక్కడ మరణమో, అక్కడనతడు జీవించును. మూఢుడెక్కడ జీవించి యుండునో, అక్కడతడు మృతుడైయుండును. అతనికి కర్తవ్యమేమియు లేదు. చేసిన దోష వర్జితుడై యుండును. విరక్తులైన కొందరు జ్ఞానులు దేహముచే జయింపబడినారు. మాంసపు ముద్దలుగా కల్పితమైన దేహముకల వీరు యోగులతో తుల్యులెట్లు కాగలరు? (జ్ఞానము కలిగి కూడా యోగాభ్యాసము లేని వారి సంగతి ఇక్కడ చెప్పబడినది). (యోగాభ్యాసము లేని) జ్ఞానులచే, దేహాంతమున పుణ్యము వలననూ, పాపమువలననూ ఫలము పొందబడు చున్నది. ఇటువంటివాడైనవాడు ఆయా కర్మఫలముల ననుభవించి, మరల జ్ఞాని యెట్లు కాగలడు? (యోగాభ్యాసమువలన పక్వముకాని జ్ఞాని, పాపపుణ్యములఫలములననుభవించు టకు గాను తిరిగితిరిగి జన్మలెత్త వలసి వచ్చును. అప్పుడు ఇంకనూ పాపపుణ్యములు చేసినచో, ఆ ఫలితములనుభవించుటకే జన్మలు సరిపోవును గాని, మరల జ్ఞానము ఎలా పొందును?) తరువాత పుణ్యముచే సిద్ధునితో(సద్గురువుతో) సాంగత్యము లభించును. అప్పుడు సిద్ధుని యెక్క దయచే యోగి యగును, లేనిదే కాడు. అంతట సంసారమునశించును. లేనిదే కాదు. (ఒక్కసారి యోగభంగము కలిగితే, మరల యోగికావడము ఎంతదుస్తరమో తెలియజేశారు.) యోగములేకుండా జ్ఞానము మోక్షమునీయదు. అనేకజన్మల జ్ఞానముచే యోగము లభించును. యోగము వలన ఒక్కజన్మలోనే (పరబ్రహ్మ విషయకమైన) జ్ఞానము కలగును.

                              (Please visit www.tatvavisleshana.weebly.com)    

Thursday, July 5, 2012

జ్ఞానభూమికలు

                                         జ్ఞాన  భూమికలు              మనం శుభ అహంకారాల గురించి తెలుసుకొన్న తర్వాత వివిధ జ్ఞాన భూమికల గురించి తెలుసుకుందాము. వీటి గురించి ఉపనిషత్తులలోను ఇంకా ఇతర గ్రంధాలలో ఏవిధంగా చెప్పారో తెలుసుకుందాము. కొన్ని వివరణలు బ్రాకెట్లలో ఇవ్వడమైనది.
పైంగలోపనిషత్:పంచమాధ్యాయము:
           
ఋభువు చెప్పుచున్నాడు: అజ్ఞానభూమికలు 7, జ్ఞానభూమికలు 7 వున్నవి. ఈరెండు భూమికల నుండి అన్యములగు అనేకభూమికలు పుట్టుచున్నవి. స్వస్వరూపస్థితిలో నుండు టయే మోక్షము. అహంకారభావనయే తత్చ్యుతి (భ్రంశము). శుద్ధము సత్తా మాత్రము నగు జ్ఞానమే స్వస్వరూపము. స్వస్వరూప స్థితియందెవ్వరు చలింపకయుందురో, వారియందు అజ్ఞత్వముగాని, రాగద్వేషాదిసంకల్పములుగాని, సంభవింపవు. దీనికంటే వేరైన మోహము పూర్వము లేదు, ఇకమీదట నుండబోదు. సంకల్పపరంపరలో మనస్సు ఒక విషయమునుండి మరియొక విషయము పైకి వెళ్ళునపుడు, ఆ రెండు సంకల్పముల మధ్యలో గలుగు స్థితి (మనస్సు లేని స్థితి)యే స్వరూపస్థితి, ఆత్మస్థితి యని చెప్పడును.
(దీనినే మనం ఇంకో రకంగా చెప్పుకొందాము. మనం ఏపనిలో వున్నా, ఏపని చేయకున్నా, మన మనస్సులో ఆలోచనలు భావాలు నిరంతరంగా ఒకదాని వెంట ఒకటి వస్తూ వుంటాయి. అల్లా వచ్చే ఆలోచనల, భావాల మధ్యలో అంటే ఒకభావం వెళ్ళిపోతూ ఇంకొకభావము వచ్చే మధ్యలో ఏదైతే ఎటువంటిఆలోచన భావము లేని స్థితి వుంటుందో దానిని బాగా గమనించండి. ఇంకా బాగా చెప్పాలంటే, మూవీ ఫిల్ము లో ఒకసెకనుకి 24 ఫ్రేములు వుంటాయి. రెండుఫ్రేముల మధ్యలో దృశ్యములేనిభాగము  ఒక సన్నని గీతలాగా వుంటుంది. దాన్ని గమనించండి. ఇప్పుడు బాగా అర్థమైనదని తలుస్తాను. ఇప్పుడు ఆ దృశ్యము లేని భాగాన్ని, ఆలోచన, భావము లేని భాగాన్ని మనం ధ్యానం ద్వారా పెంచుకోవాలి. వెళ్ళిపోతున్న ఆలోచనని, భావాన్ని వెళ్ళిపోనిచ్చి, వచ్చే ఆలోచనని, భావాన్ని రాకుండా ఆపాలి. ఆ ఏమిలేని స్థితిని ఎంతవరకూ వీలైతే అంతవరకూ పొడిగించుకోవాలి. మనస్సుచేసే పని ఆలోచన. ఎప్పుడైతే పైనచెప్పిన విధానంతో మనం ఆలోచనలను ఆపుచేశామో అప్పుడు మనస్సు పనిచేయడం మానేస్తుంది. అప్పుడు మనస్సు అమనస్సు అవుతుంది. ఇదే అమనస్కయోగం. ఈ విధంగా నిరంతరంగా సమాధి అవస్థలో ఉండటమే స్వస్వరూపస్థితి, అదే సమాధి.)  సమస్తసంకల్పము నశించినదియు, శిలవలె నిశ్చలమైనదియు, జాగ్రత్తు నిద్రకాని స్థితియే స్వరూపస్థితి యనబడును. అది సర్వోత్తమ మగు ఆత్మస్థితి. అహం ప్రవృత్తి తొలగిపోగా, ద్వైతము నశింపగా బేధభావము చిత్తములో రహితము కాగా, జడమగు ఏస్థితి కలదో, అదియే స్వరూపస్థితి యని చెప్పబడును. అనఘా! వీటిని తెలిసికొనిన పిమ్మట తిరిగి మొహపంకమున
మునిగిపోవుటయుండదు. అట్టి 7 రకములుగా నున్నట్టి జ్ఞానభూమికల గురించి వాదిజనులు భిన్నసిద్ధాంతములు చెప్పుచున్నారు.  కాని ఇప్పుడీ చెప్పబోవు  7 భూమికలే నాకు సమ్మత ములుగా నున్నవి. నిశ్చయముగా ఈ భూమికలే శుభప్రదములు.  ఈ 7 భూమికలకు సంబంధించిన జ్ఞానమే యదార్ధజ్ఞానమని మహాత్ములు చెప్పుచున్నారు. కల్ ఈ సప్తభుమికలకు పరముగా నున్న జ్ఞేయవస్తువే మోక్షము. 

         సప్తజ్ఞానభూమికలు 1. శుభేచ్ఛ, 2. విచారణ, 3. తనుమానసి,  4.
సత్త్యాపత్తి  5. అసంశక్తి, 6. పదార్ధభావన, 7. తుర్యగ. ఈ భూమికల నాచరించిన వారికి మోక్షము కలదు. ఆ మోక్షస్థితి యందున్న మనుజుడు మరల దుఃఖమునుపొందడు. ఈ భూమికలను గురించిన నిర్వచ నము ను నీవిప్పుడు శ్రవణము చేయుము. "అయ్యో! నేనెందుకు ఇప్పటివరకు మూఢుడనై పడియుంటిని? ఇకమీదటనైనను శాస్త్రసజ్జన సాంగత్యాదులను ఆచరించి యదార్థజ్ఞానమును తెలిసికొనెదను" అని వచించు వైరాగ్యసహితవాంఛను 'శుభేచ్ఛ' యందురు. (ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. నేను అజ్ఞానములో వున్నానని తెలిసికోవడమే జ్ఞానం పొందడానికి మొదటి మెట్టు. అజ్ఞానంలో వున్నాను అని తెలిసికోన్నవారు ఎవరైనా అలా వూరుకుంటారా? జ్ఞానం కోసం ప్రయత్నంచెయ్యరా? అందువల్ల మనం ఎలా వున్నాము? జ్ఞానంలో వున్నామా అజ్ఞానంలో వున్నామా? 'మన స్థితి' ఏమిటి? అని తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మనమీదే వుంది. అందువల్ల దీనికి ముందర 'మన స్థితి' అని అజ్ఞానం గురించి పరిచయం చెయ్యడం జరిగింది. అలాగా అజ్ఞానం గురించి తెలుసుకొని, దానిలోంచి బయట పడటానికి, జ్ఞానం పొందటానికి మనకు మనం ఇష్టపడటమే,  'శుభేచ్ఛ', శుభకరమైన ఇచ్ఛ.) శాస్త్రసజ్జన సాంగత్యము తోడను, వైరాగ్యాభ్యాసము చేతను ఏర్పడు సదాచారప్రవృత్తి 'ఆత్మ విచారణ' అని పలుక బడును. (ఎప్పుడైతే మనం అజ్ఞానంలో ఉన్నామని తెలుసుకున్నామో ఇక ఊరుకోము కదా. దానినుంచి బయటపడే ప్రయత్నం చేస్తాము. ఆంటే జ్ఞానం ఇచ్చే శాస్త్రాలను చదవడం, వాటిని బాగా తెలుసుకున్న వారితో స్నేహము, సహవాసముచేసి మనకున్న సందేహాలను పోగొట్టుకోవడము, ఇంకా పైపై స్థాయీలలొ వున్న జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. ఆ స్థితిలో మనం ఉంటున్న ప్రస్తుత పరిస్తితి పై ఒకవిధమైన విరక్తి, వైరాగ్య భావన వస్తుంది. దానిపైన, మనం ఇంకా సాగిమ్చవలసిన ప్రయాణం పైన చాల ఆలోచిస్తాము. ఇదే ఆత్మ విచారణ.)  శుభేచ్ఛ చేతను, జ్ఞానవిచారణల చేతను ఇంద్రియార్థముల యందు ప్రీతి శుష్కించి పోవు స్థితిని 'తనుమానసి' యని చెప్పెదరు. (పైన చెప్పిన విధముగా విచారిన్స్తూ వుంటే యదార్థ స్థితిని గమనించి, మనకున్నది, మనం వుంటున్నది సత్యము నిత్యమూ కాదని తెలిసికొంటాము. ఎప్పుడైతే ఈ స్థాయికి వచ్చామో, అప్పుడు మనకి మన శరీరం పైన, వివిధ శరీర అంగాలు ద్వారా వచ్చే భౌతిక జ్ఞానము, ఆనందాల పట్ల అనురక్తి, ప్రీతి క్రమంగా తగ్గుతూ తదుపరి  పూర్తిగా నశించి పోతాయి. దీనినే 'తనుమానసి' అంటారు.)
            ఈ మూడు భూమికల అభ్యాసముచే చిత్తమందు ఉత్తమవైరాగ్య మేర్పడి, చిత్తము శుద్ధసత్యస్థితిని పొంది, స్వాత్మయందు నిలుకడబొందుట 'సత్త్యాపత్తి' అందురు. (పై తను మానసి స్థాయికి చేరుకున్న తర్వాత, ఈ శరీర
ముకాక సత్యము, నిత్యమైనది మనలో ఏమున్నది? అనే ప్రశ్న వస్తుంది. దానితోపాటే, మనలో వున్న ఆత్మే సత్యమైనది, నిత్యమైనది అనే జవాబు కూడా వస్తుంది. అప్పుడు, దానిపై నిలకడ కుదురుతుంది. ఇక్కడ జరిగే సంఘర్షణ, మనస్సుల్లో జరిగే భావపరంపర కల్లోలముల గురించి మాటల్లో చెప్పలేము. కేవలము అనుభవింప వలసినదే. ఇంత జరిగిన తర్వాత గాని మనకు మన ఆత్మ మీద గురి, నిలకడ కలగదు. సరిగ్గా ఈ స్థితినే, 'సత్యాపత్తి' అంటారు.)  ఈ నాలుగు భూమికల అభ్యాసముచే సత్త్యారూఢస్థితిని పొంది, విషయవాసనారహితమగు అసంగస్థితియందు యుందుంటయే 'అసంసక్తి' యనబడును. (ఈ స్త్యాయికి వచ్చిన తర్వాత క్రమేణా అశాశ్వతమని తెలుసుకున్న వాటన్నింటిపైనా ప్రీతి నశించి, వీటిని పూర్తిగా వదలివైచి వాటితో ఏవిధమైన భౌతికమైన, మానసికమైన సంబంధమూ పెట్టుకోకుండా, వాటికి అంటుకోకుండా వుంటాము. ఇదే 'అసంసక్తి') ఈ అయిదు భూమికల యొక్క భాహ్యాభ్యంతరపదార్థ భావనాశూన్యుడై స్వాత్మ యందు ధృఢమైన స్థితిని అనుభవించుచూ, ఇతరులతో ప్రయత్నపూర్వకముగా అవబోధనము చేయింపబడునట్టి స్థితి 'పదార్థ భావన' యనబడును. (ఈ 5వ స్థాయిని అనుభవించుచూ వుండగా క్రమేణా మనకి మనకు బయట, లోపల వున్న వాటితో సంబంధాలు పూర్తిగా పోయి, ధ్యానములో ఆత్మదర్శనం పొంది, తదుపరి ఆ ఆత్మదర్శనాన్ని పొడిగించుకుంటూ, ధ్యానం లోంచి సమాధిస్థితికి మారుతూ, ఆత్మస్థాయి లోంచి పరమాత్మస్థాయికి మనఆత్మ పరిణితి చెందే కాలములో, మనచుట్టూవున్న కొంతమంది మనలను గమనించి, ఆసక్తితో, మీరేదోచేస్తున్నారు, మాక్కూడా చెప్పండి అని అడుగుతారు. అప్పుడు మనం మనకు ఇష్టం లేనప్పటికీ, తాత్కాలి కంగా పైస్థాయి నుండి కిందకి వచ్చి, మరల ఈ ప్రపంచంతో సంభంధం పెట్టుకుని, ఆ అడిగిన వారికి తగు విధంగా చెప్పి, వారితో కూడా ఈ మార్గాన్ని అవలంభింప చేయడం 'పదార్థ భావన') ఈ 6 భూమికల నిరంతరాభ్యాసము వలన బేధభావము నశించగా, స్వాభావికముగా సంభ వించు ఆత్మనిష్ఠనే 'తుర్యగ' అనిచెప్పెదరు. ఇయ్యదియే తురీయావస్థ. తుర్యగ అనే ఈతురీయా వస్థయే జీవన్ముక్తులకు యుండును. (ఈ విధంగా 6 జ్ఞాన భూమికలను నిరంతరంగా అభ్యాసం చేస్తూవుంటే ఒకానొక స్థాయి వచ్చేసరికి, మన ప్రయత్నం ఏమాత్రం అవుసరం లేకుండా, మన ఇష్టానిష్టాలతో సంభంధంలేకుండా, ఈ ప్రపంచాన్నివదలివేసి, మన ఆత్మ దానంతట అదే సమాధి లోకి వెళ్ళిపోతుంది. మళ్లీ ఇది ముక్తి, మరణం కాదుసుమా! ఇంకా మనకి జీవితకాలం (life- span) మిగిలే ఉంటుంది. కాని మనం ఈ ప్రపంచంతోటి గాని, దాని విధివిధానాల తోటి గాని ఏవిధమైన సంబంధం లేకుండా, కేవలం ఆపరమాత్మ తోటే సంగమిస్తూ వుంటూ, ఇంకా మిగిలి వుంది కాబట్టి, జీవితాన్ని గడుపుతూవుంటాము. దీనినే జీవన్ముక్తదశ అంటారు. దీనినిపొందిన వారిని 'జీవన్ముక్తులు' ఆంటే జీవించి యుండగానే ముక్తిని పొందటానికి అర్హులైనవారు అంటారు. వీరిని గురించి ఇంకొక చోట తెలుసుకుందాము.) ఈ అవస్థకు పైన తురియాతీతావస్థ అనునది విదేహముక్తికి సంబంధించినది. తురీయాతీతమనగా, తురీయ వ్యవహారము గూడ దాటి యున్నదని భావము.  మహాత్ములును, ఆత్మారాములును, మహాధన్యులును, వీనిలొ నెవరు సప్తమభూమికని చేరెదరో, వారే మహత్పదమును, విదేహముక్తిని, పొందిన వారగు    చున్నారు. జీవన్ముక్తులు, సుఖదుఃఖ పరిస్థితులలో మునిగిపోరు. అట్టివారు ప్రాప్తించిన కార్యములను మాత్రమే కొంచెముగా చేయుదురు. లేదా యేమియూ చేయకయుందురు. సత్పురుషులు, ప్రక్కలనున్న వారిచే బాధితులై, నిద్రనుండి లేచిన వారి రీతిగా పూర్వాచార క్రమానుగాతములైన ఆచారములను ఆచరించుచుందురు. ధీమంతులకు మాత్రమే ఈ 7 జ్ఞాన భూమికలు అర్థమగును. జన్మాంతర పుణ్య బలముతో పశువులు, మ్లేచ్ఛులు మున్నగు    జీవులు కుడా ఈ జ్ఞానభూమికలను పొందిన, వారు ముక్తులౌదురు. (దీనికి చాలా చక్కని ఉదాహరణలు వున్నాయి. ఒకానొక సందర్భంలో సంత్ జ్ఞానేశ్వరులవారు చైతన్యభావనతో అన్ని ప్రాణులు ఒక్కటే అని చెపుతారు. అపుడు అక్కడ వున్న దున్నపోతును చూపించి, అది నువ్వు ఒక్కటేనా? అని అడుగుతారు. జ్ఞానేశ్వరులవారు ఒక్కటే అని జవాబు చెపుతారు. ఐతే ఆ దున్నపోతుతో వేదం చెప్పించు అని అడుగుతారు. అప్పుడు  జ్ఞానేశ్వరులవారు ఆ దున్న పోతు తలపై చెయ్యి పెట్టగానే, ఆ దున్నపోతు వేదం చెప్పడం ప్రారంభించిందట. అక్కడనుండి ఆ దున్నపోతు బ్రతికి యున్నంత కాలమూ వేదం చెప్పిందట. దాని సమాధిని ఇప్పటికి పండరి పురములో చూడవచ్చట. ఈవిధంగానే ముక్తిని పొందినటువంటి కాకి, చిలక యొక్క గాధలు తెనాలి రామలింగకవి రచించిన 'శ్రీపాండురంగ మహాత్మ్యము' లో వున్నాయి. శ్రీకాళహస్తిలో, సాలె పురుగు, పాము, ఏనుగు మోక్షం పొందిన విషయం మనకు తెలుసు. గజేంద్ర మోక్షం సంగతి తెలియని వారుండరు.  అలాగే భక్త రామదాసు, ఆయనను ఖైదు చేయించిన తానీషా పూర్వ జన్మలో ఒకే గురువు దగ్గర శిష్యులట. వారు చేసిన కొన్ని కర్మలను బట్టి తదుపరి జన్మలో రామదాసు చిత్రహింసలు, కారాగార వాసము అనుభవింప వలసి వస్తే, తానీషాకు రాజ్యాధికారము, శ్రీరామ దర్శనము కలిగినాయట. దీనిని బట్టి, వేదాలలోను, శ్రుతులలోను, స్మృతులలోను, ఉపనిషత్తులలోను వివరించినవి, సత్యములని, జరిగి తీరుతాయని మనం తెలుసుకోవాలి.)
             ఈ జ్ఞానభూమికలలో సంచరించువారు శరీరసహితులైననూ, శరీరరహితులైననూ, వారు ముక్తులే యగుచున్నారు. ఇందులో సందేహము లేదు. హృదయగ్రంధి విచ్ఛేదమే జ్ఞానము. అట్టి సిద్ధి ప్రాప్తించుటే ముక్తి. గ్రంధి
విచ్ఛేదరూపమగు విముక్తిస్థితి. అనగా మృగ తృష్ణలో జలములున్నట్లు భ్రాంతి రీతిగా మహదాదిస్ఠూలాంత భ్రాంతి, అహమాది దేహాంత భ్రాంతి మున్నగు సర్వభ్రాంతులు నశించునట్టి స్థితి. అజ్ఞాన సాగరమును దాటినవారే పరమ పదమును పొందినట్టివారు. స్వాత్మలాభపరాయణులే ఈ సప్తభూమికలలో నున్న వారలగు చున్నారు. (మనకు తెలిసున్నంతలో ఈ అవస్థలలో  చిరకాలము జీవన్ముక్త దశను అనుభవించి, విదేహముక్తి పొందినవారు అలనాటి కంచి పీఠాధిపతి పరమాచార్య శ్రీశ్రీశ్రీ చంద్ర శేఖరేంద్ర సరస్వతి స్వాములవారు.) మనస్సు నశించు ఉపాయమే యోగమని చెప్పబడును.  అట్టి యోగము సప్తభూమికలు కలదిగా తెలియవలెను. అట్టి సప్తభూమికలు విపులముగా వివరింపబడినవి. ఈ సప్త భూమికలకు లక్ష్యము ఆ పరబ్రహ్మపదమే అయివున్నది.
యోగవాసిష్ఠము:నిర్వాణ ప్రకరణము:ఉత్తర భాగము: 120వ సర్గ:
             (పైన చెప్పబడిన సప్తవిధ జ్ఞానభూమికలనే శ్రీవశిష్ఠులవారు శ్రీరామచంద్రునకు వేరొక విధముగా తెలియజేసినారు.) శాస్త్రాభ్యాస సజ్జన సహవాసముచే మొదట 'ప్రజ్ఞ'ను వృద్ధి పరచ వలెను. ఇది యోగము యొక్కయు, యోగి యొక్కయు మొదటి భూమికయని చెప్పబడినది. ఇక రెండవ భూమిక 'విచారణ'. మూడవది 'అసంగ భావన'. నాల్గవది వాసనల కాశ్రయభూత మగు అవిద్య లయించునట్టి 'విలాపనీ' అవస్థ. సుద్ధచిన్మాత్ర సంవిత్తుచే పూర్ణమై, ఆనందరూప మైనది యైదవభూమిక. జీవన్ముక్తుదగు యోగి ఈ భూమికయందర్థనిద్రితుని వలెను, అర్థ జాగ్రతునివలె నుండును. స్వభావముగానే నిరతి శయానందమయమై, బ్రహ్మాకారానుభావ నివృత్తిరూపమై సుషుప్తివోలె నున్నట్టి స్థితి యారవ భూమిక. అట్టి వృత్తి యున్ను క్షయించి, శమించిన తురీయావస్థ కలదై, కేవలము ముక్తిరూపమై, శమమై, స్వచ్ఛమై సౌమ్యమైనట్టి స్థితి, ఏడవ భూమిక, తురీయాతీతావస్థ యగును. ఇట్లు
తురీయాతీతావస్థ పరానిర్వాన రూపమై యున్నది.  ఈ సప్తమ భూమికయే మిగుల ప్రౌఢమయినచో, విదేహముక్తి లభించును. అది జీవించియుండు యోగులకు విషయము కాదు.
             ఇందు మొదటి మూడవస్థలూ జాగ్రద్రూపములై  యుండును. (ఆంటే మనం ఈ అవస్థ లను జాగ్రదావస్థలోనే అనుభవిస్తాము. నాల్గవది స్వప్నరూపమని పేర్కొనబడినది. అందీ జగత్తు స్వప్నరూపముగా భాసించును. (ఈ అవస్థలో మనం ఈప్రకృతి అశాశ్వతమని తెలుసు కొని, ఇందులో మన జీవితాన్ని స్వప్నంలాగా తలుస్తాము.) ఆనంద ఘనమగు ఆత్మతో ఏకీభావము నొందుటచే నైదవ భూమిక సుషుప్తిరూపమని చెప్పబడినది. (ఇది ఆత్మదర్శనం అయిన తర్వాత ఆంటే ధ్యానంలో, మొట్టమొదటి సారిగా, పెంజీకటి మధ్యలో క్షణకాలం మిణుగురుపురుగు లాగ దర్శనం ఇచ్చిన ఆత్మను, ఆ ధ్యానస్థితిని ఇంకా పటిష్టపరచుకుంటూ, వెలుగుతూ ఆరిపొతూ ఉన్నదానిని నిశ్చలం చేసుకొని, ఆ తేజస్సును మిణుగురు పురుగు పరిమాణం నుండి, చంద్రమండల పరిమాణం లోనికి తెచ్చుకుంటూ, ధ్యానస్థితి నుండి సమాధి స్థితికి పరిణామం చెందుతూ, ఆనందం అనుభవించే అవస్థ. ఇక్కడే మనకి స్వస్వరూప జ్ఞానం పూర్తిగాతెలిసి అర్థమవుతుంది. ఇది నిజానికి సుషుప్తి కాకుండా, దానికి పైనున్న అవస్థ అయినప్పటికీ, మనకి తెలియడంకోసం సుషుప్తి అని చెప్పారు.) ఇతర పదార్థముల జ్ఞానములేక కేవలము స్వరూపమాత్రమందలి స్థితి గల్గియున్నదగుటచే ఆరవది తురీయపదమని వచింపబడినది. తురీయాతీత పదావస్థ యుత్తమమైన ఏడవభూమిక యగుచున్నది. ఇది స్వప్రకాశ రూప మగుటచే మనోవాక్కుల కగ్రాహ్యమై పరగుచున్నది. అంతరంగమున సమస్తము లయించుటచే విషయమేమియూ భాసింప కుండునట్టి యా సప్తమ భూమికా రూప మహా సమత్వముచే యోగి ముక్తుడే యగును. ఇందు సందేహమేమియూ లేదు.  

                           (Please visit www.tatvavisleshana.weebly.com)

Saturday, June 30, 2012

శుభ అహంకారములు

                         శుభ అహంకారములు
              ఇప్పటివరకు మనం అజ్ఞానం, భ్రమలు, అవస్థలు గురించి తెలుసుకొని, వాటి నుండి బయట పడటానికి, మననిజమార్గంలో ప్రయాణించడానికి తోడ్పడే మార్గదర్శిఅయిన సద్గురువు యొక్క ఆవశ్యకత గురించి తెలుసుకున్నాము. ఆ సద్గురువును చేరే ముందు మనలని మనం ఎలాసన్నద్ధంచేసుకోవాలో తెలుసుకున్నాం. ఇప్పుడుమనకు అవుసరమయ్యే సద్గుణాల గురించి తెలుసుకుందాము. వాటిలో మొదటివి "శుభ అహంకారములు"(Positive Ego). వీటి  గురించి పెద్దలు ఏమి చెప్పారో తెలుసుకుందాము. కొన్ని వివరణలు బ్రాకెట్లలో ఇవ్వడమైనది.

పైంగలోపనిషత్:పంచమాధ్యాయము: 

                  
  నేను మరియు ఈ సర్వవిశ్వము అచ్యుతుడగు పరమాత్మయే! చైతన్యరూపుడనగు నాకంటే అన్యమైనది మరేమియు లేదు. అనునిట్టి అహంకార సంకల్పము సర్వోత్తమమైనట్టిది. నేనీజగత్తుకంటే వేరుగా నున్నాను. నేను వాలాగ్రము (కేశాగ్రము) కంటే అత్యంత సూక్ష్మమైన వాడను. ఈవిధమగు జ్ఞాన సంకల్పముతో నుండునది రెండవఅహంకారము.  ఈఅహంకారము కూడ శుభమైనదే. ఈరీతిగా నున్న రెండు అహంకారములును మోక్షమును ప్రసాదించును ఈ అహంకారములు జీవన్ముక్తులకుండును. (ఇందులోమొదటిది నాలుగు మహావాక్యాలైన "అహం బ్రహ్మస్మి", తత్వమసి", "అయమాత్మా బ్రహ్మ", "ప్రజ్ఞానం బ్రహ్మ" అనే వాటియొక్క సారము. ఈ రకమైన అహంకారభావన (ఆంటే ఈవాక్యాల ద్వారా ఏదైతే ప్రతిపాదింపబడిందో అదే నేను అనే భావన) సర్వోత్తమమైనది. ఇది నిశ్చయముగా పరబ్రహ్మ వైపుకు తీసుకు వెడుతుంది. ఇక రెండవది మన ఆత్మ గురించి మనం తెలుసుకునే స్వస్వరూప జ్ఞానం. దీని గురించి సరియైన వివరణ మనంరోజూ చదువుకునే "మంత్ర పుష్పం"లోవుంది. దాన్ని చూద్దాం. "అనంత మవ్యయం కవిగ్ మ్, సముద్రేంతంవిశ్వశంభువం, పద్మకోశప్రతీకాశాగ్ మ్, హృదయం చాప్యధోముఖం|| అధో నిష్ట్యావితస్త్యాంతే నాభ్యాముపరితిష్ఠతి, జ్వాలమాలాకులంభాతీ విశ్వస్యా యతనంమహత్||  సంతతగ్ మ్ శిలాభిస్తులంబత్యాకోశసన్నిభం, తస్యాంతేసుషిరగ్ మ్ సూక్ష్మం  తస్మిన్ సర్వంప్రతిష్ఠితం||  తస్యమధ్యే  మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతోముఖః, సోగ్రభుగ్విజన్   తిష్ఠన్నాహారమజరః కవిః|| తిర్యగూర్ధ్వమధశ్శాయీరశ్మయస్త్యస్య సంతతా, సంతాపయతి స్వం దేహమాపాద తలమస్తకః, తస్యమధ్యే వహ్నిశిఖా అణీయోర్ధ్వా వ్యవస్థితః|| నీలతోయద మధ్యస్తా ద్విద్యుల్లేఖేవ భాస్వరా, నీవారశూకవత్తన్వీ పీతాభాస్వత్యణూపమా|| తస్యాశిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః, సబ్రహ్మ సశివః సహరిః స్స్యేంద్రః సోక్షరః పరమఃస్వరాట్||"  అనంతమైన వాడు, అవ్యయుడు, సర్వజ్ఞుడు, సంసారసాగర అంతాన యుండేవాడు, యావత్ప్రపంచానికి మంగళకరుడు అయిన పరమాత్మ అధోముఖమైన తామరమోగ్గలా, కంఠంక్రింద నాభికి జానెడు దూరంలో వున్న హృదయంలో, దీపశిఖల వరుసతో ఆవృత్త మైనట్లు ప్రకాశిస్తూ విశ్వానికంతటికి ఆవాసమైవున్నది. ఆతామరమొగ్గలాంటి హృదయం నలువైపులానాడులతోచుట్టబడివ్రేలాడుతూ వున్నది. దానిలోపల వున్న సూక్ష్మమైన ఆకాశంలో అంతా నెలకొనివున్నది. దానిమధ్యలో సర్వత్రా ప్రకాశిస్తూ, అన్నిదిశాలా వ్యాపిస్తున్నట్లు వుండే అగ్ని వున్నది. అది మొదట భుజించే ఆహారాని విభజించి ధృఢమైనదిగా చేస్తోంది. దానియొక్కకిరణాలు అడ్డదిడ్డంగాను, ఉర్ధ్వంగాను, అధోముఖంగాను, అంతా వ్యాపించి పాదంనుండి తలవరకూ తన శరీరాన్ని వెచ్చగావుండేటట్లు చేస్తుంది. దానిమధ్య అణుప్రమాణమైన అగ్నిజ్వాల ఊర్ధ్వముఖంగా అమరివుంది. అది నీల మేఘంమధ్యనుండి ప్రకాశించే మెరపుతీగవలె వరిగింజకొసలాసన్నమైనదిగా, బంగారురంగులో అణువులా సూక్ష్మమైనదిగా ప్రకాశిస్తూ వుంటుంది. ఆ అగ్నిశిఖ మధ్యలో పరమాత్మ నెలకొని వున్నాడు. ఆయనే బ్రహ్మ, విష్ణువు, శివుడు, హరి, ఇంద్రుడు, అక్షరస్వరూపుడు, స్వప్రకాశ మానుడు. ఆయనకంటే పరమైనవారు ఎవరూలేరు. ఇక్కడ చెప్పబడిన హృదయం మన భౌతిక శరీరంలోవున్న గుండె కాదు. అది మనకున్న వేరే శరీరానికి సంబంధించినది. దీనిగురించి వేరే అంశంలో ప్రస్తావించడం జరిగింది. దయచేసే చూడగలరు. ఆ హృదయంలో వరిధాన్యం కన్న సూక్ష్మంగా వున్నదానినే, ఇక్కడ కేశాగ్రం కంటే సూక్ష్మంగా ఉన్నదని వర్ణించడం జరిగింది. ఈ రెండూ ఒక్కటే. వేరు కాదు. ఇప్పుడు చెప్పండి. ఆ సుక్ష్మమైనదే నేను అనే భావన మనలను ఆ పరమాత్మవైపు పంపిస్తుందా? లేదా? కాబట్టి ఇదికూడా శుభ అహంకారమే. తప్పనిసరిగా కావలసినదే.) 


           హస్తాదులతో కూడిన శరీరము నేను అనెడి నిశ్చయముగల అహంకారము మూడవది. ఇది లౌకిక మైనది, తుచ్ఛమైనది యగును. ఈ లౌకికాహంకారముతో అభిహతుడైన జీవుడు అధోగతికి పోవుచున్నాడు. బహుకాలము ఈశరీరమే నేననుసంకల్పముతో కూడియున్న ఈ దురహంకారమును  చక్కగా విడచిపెట్టి, శేషించిన పరిశుద్ధాహంకారముతో నున్న జీవుడు శాంతుడై ముక్తిని పొందును. అలౌకికములైన మొదటి రెండు అహంకారములను అంగీకరించి మూడవదైన దుఖఃప్రదాయినియగు లౌకికఅహంకారమును త్యజించవలెను. పిమ్మట మొదటి రెండు అహంకారములను కూడ విడచిపెట్టి, సర్వాహంకృతి వర్జితుడై జ్ఞాని, సర్వోత్తమమగు మోక్ష పదము నధిరోహించుచున్నాడు. భోగేచ్ఛయే బంధమగును. భోగమును విడచిపెట్టుటయే మోక్షమని చెప్పబడును. మనస్సు అభివృద్ధిని పొందుటయే అపకారము. మనోనాశనమే మహా లాభము. జ్ఞానికి మనస్సు నశించును. అజ్ఞానికి మనస్సు శృంఖల యగుచున్నది. జ్ఞాని యొక్క మనస్సు సానందము కాదు. నిరానందము కాదు. చలనము, ఆచలనము కాదు. సత్తు, అసత్తు కాదు. సర్వవికల్పముల మధ్యలో నుండు స్థిరత్వమే జ్ఞానియొక్క మనస్సు. ఆకాశము సూక్ష్మమై యున్నందున కన్పించుటలేదు. సర్వసంకల్ప రహితమైన, సర్వసంజ్ఞా వివర్జితమైన, అవినాశియుడైన, స్వస్వరుపమగు ఈ చిత్ వస్తువును 'ఆత్మజుడు' మున్నగు పేర్లతో చెప్పుచున్నారు. బ్రహ్మజ్ఞానుల దృష్టిలో ఈ ఆత్మ ఆకాశములో నూరవ భాగమంతటి సూక్ష్మముగను, శుద్ధముగాను, నిష్కలముగాను, నిజస్వరుపముగాను, ఏకముగను, అనుభవము నిచ్చుచున్నది. 

యోగవాసిష్ఠము:స్థితి ప్రకరణము:33వ సర్గ:
 

             49-54: ఓ రామా! ఈ జగంబున మూడు విధములైన అహంకారములు కలవు. వానిలో మొదటి రెండునూ  శ్రేష్టములు. మూడవది శ్రేష్టము కాదు. య్యది త్యజింపదగినది. వానిని గూర్చి వచింపుచున్నాను. 


              "ఈ జగత్తంతయూ కార్యరూపము. కారణరూపుడును, నాశరహితుడునునగు పరమాత్మనునేనే. నాకన్యముగా జగత్తేలేదు." అను నీఅహంకారము సర్వోత్తమమని యెరుంగ వలయును. ఈ యహంకారము మోక్షమునే గలుగజేయును కాని బంధము కాదు. ఇయ్యది జీవన్ముక్తునకుండును. "నేనన్నింటి కంటెనూ భిన్నమై (సాక్షి స్వరూపుడనై) కేశాగ్ర భాగము యొక్క నూరవభాగము కంటెనూ సూక్ష్మమై యున్నాను. అనగా నిరవయవుండను". ఇట్టి మనోనిశ్చయమున్ను శుభాహంకృతియే యగును. ఈ రెండవయహంకారమున్ను మోక్షము నే కలుగజేయునుగాని బంధమునుగాదు. 
ఇయ్యది జీవన్ముక్తున కుండును. (జ్ఞానములో) సప్తమభుమికయందుండు వారలకీ  రెండుఅహంకారములును కేవలము కల్పనామాత్రములే కాని వాస్తవములు కావు (జ్ఞానములో గల వివిధభూమికల గురించి వేరే చెప్పుకుందాము). ఇక "హస్తపాదాదియుక్తమగు దేహము మాత్రమే నేనను" నిశ్చయము లౌకికముగా తుచ్ఛమును నగు మూడవ అహంకారమనబాడును. ఇది నీచమైనది. మరియు ఇయ్యది ప్రబల శత్రువని వచింపబడినది. గాన త్యజింపదగును. 


               58. మొదటి రెండహంకారములును, మూడవదియగు దేహాహంకారమువలె ధృఢ పరచుకొని , నేను దేహమునుకానని నిశ్చయిం చిన మీదట ఆ యహంకారములను కూడ త్యజించి వేయుట పూర్వీకులగు మహాత్ముల సమ్మతము.


               62. దుఃఖప్రదమగు ఈ మూడవ అహంకారమును త్యజించి, సర్వాహంభావ, శుద్ధా హంభావ, గురుశుశ్రూషాదులచే సప్తభూమికాదులయందు యేవిధమైన స్థితికలిగియుండుటకు సమర్థుడగునో ఆయారీతిగనే స్వరూప సుఖాది లాభమొందుచూ జీవుడు క్రమముగా పరబ్రహ్మమును ప్రాప్తినొందును. 


                71. ప్రథమమున ఈ జగత్తంతయూ నేనే కాన అంతయూ నాస్వరూపమే యగునని నిశ్చయించి పిదప ఈ దేహాదులు నేను కాను, దేహ సంబం ధములగు ధనపుత్రాదులు నావి గావని భావించి, ప్రతిబంధములన్నియు రహితములగుటచే, పూర్వొక్తమగు పరిశుద్ధాత్మ చైతన్యమును బొంది క్రమముగా సప్తమ భూమిక యందు స్థితి కలిగి, స్వయముగా అపరిచ్ఛిన్నమగు పరిపుర్ణాత్మ స్వరుఉపుడై జీవుడు విదేహకైవల్యము ప్రాప్తినొందును.
                                                             
                              (
Please visit www.tatvavisleshana.weebly.com)   
 

Friday, June 29, 2012

కర్తవ్యాచరణ

                                                    కర్తవ్యాచరణ
       మనం ఈలోకంలో ఎందుకు జన్మించామో, ఎందుకు పరమాత్మను చేరుకోవాలో, ఎలా ఈ ప్రకృతి లో వివిధఅజ్ఞానభూమికలలో ఉన్నామో  తెలుసుకున్న తర్వాత, మన జీవితలక్ష్యమైన పరమాత్మను చేరుకోవటానికి మార్గదర్శకులైన వారిని, అదే సద్గురువుని ఆశ్రయించాల్సిన అవుసరం గురించి తెలుస్తుంది. అప్పుడు యోగ్యుడైన సద్గురువునాశ్రయించి, ఉపదేశాదులు పొంది, అజ్ఞానాన్ని తొలగించు కొని, సప్తవిధభూమికలు కలిగిన జ్ఞానాన్ని పొంది, సద్గురువు పర్యవేక్షణలో పరబ్రహ్మ స్వరూపాన్ని అనుభవములోనికి తీసుకోనివచ్చే యోగాన్ని ప్రారంభించి, జ్ఞానాన్ని, యోగాన్ని, అనుభవాన్ని అను సంధానించుకొనుచూ, ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది సమాధ్యవస్థను పొందుతాము. ఈ విషయమై మహానుభావులు, సనాతనులు చెప్పిన విషయాలను తెలుసుకుందాము. కొన్ని వివరణలు బ్రాకెట్లలో ఇవ్వడమైనది.
సద్గురునాశ్రయము:
అద్వయతారకోపనిషత్:
               
           9. గురురేవ పరబ్రహ్మ, గురురేవ పరాగతిః, గురురేవ పరావిద్యా, గురురేవ పరాయణం, గురురేవ పరాకాష్ఠా, గురురేవ పరంధనం, యస్మాత్తదుపదేష్ఠా, సౌ తస్మాత్ గురుతరో గురుః||
           గురువే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మమును చేరు త్రోవ గురువే. ఆ చేరుటకు కావలిసిన జ్ఞానము గురువే. ఆ చేరుట అనే ప్రక్రియ కూడ గురువే. దానికి కావలసిన సాధనసంపత్తి కూడ గురువే. ఈ విధముగా ఉపదేశికులైన మీరు గురువులలోకెల్ల సద్గురువులు.

 
ముండకో
పనిషత్:ప్రధమ ముండకం:ద్వితీయఖండం:

              
12, 13: బ్రహ్మజ్ఞాని కర్మచే ప్రాప్తించు లోకముల యొక్క తారతమ్యములను పరీక్షించి తెలుసుకొని, మోక్షము కర్మలచేత లభించదని గ్రహించి, వైరాగ్యమును పొంది, బ్రహ్మము నెరుంగుటకై, సమిధలు హస్తమునందు గలవాడై, శ్రోత్రీయుడును, బ్రహ్మనిష్ఠుడునునగు గురువును నాశ్రయింప వలెను. ఆ ప్రకారముగా గురువును చేరినట్టి శాంతశమదమాదిసద్గుణములు కల శిష్యునకు ఆ గురువు అక్షరమును, సత్యమును అగు పరమాత్మను తెలిసికొనుటకు సాధన రూపమగు బ్రహ్మ విద్యను యుపదేశించవలెను. (ఇక్కడ మొదట శిష్యుడు ఎలా తన్ను తాను తయారు చేసుకోవాలో, ఎటువంటి గుణములు, ఆలోచనలు, భావాలు కలిగియుండాలో విశదీకరీంచారు. మొదట ఎవరికివారు, నేను ఏమి చేస్తున్నాను? నేను చేసే వాటికి ఫలితమేమిటి? నేను చేసేది నాకు కావలిసినది ఇస్తుందా? అని ప్రశ్నించు కోవాలి. ఇంకా నాకు నిజంగా కావాల్సినదేమిటి? అందుకు నేను త్రికరణశుద్ధిగా ప్రయత్నంచేస్తున్నానా? అనికూడా ప్రశ్నించుకోవాలి. అప్పుడు నిజంగా బ్రహ్మజ్ఞానులవ్వాలి అనే కోరిక వుంటే, మనం చేసే భౌతికకర్మలు, జప, దాన, యజ్ఞ, వాపీకూపతటాకాది నిర్మాణాలు, ఫలితాన్నిఆశించి చేసే కర్మలు, పనులు ద్వారా పరబ్రహ్మాన్ని తెలుసుకోలేము, అవి మోక్షాన్ని ఇవ్వలేవు అని తెలుస్తుంది. అప్పుడు మనకు నిజంగా ఈ ప్రపంచంపట్ల, అందులో మనం చేసే పనులపట్ల విరక్తి, వైరాగ్యం వస్తుంది. సరిగ్గా ఈ విషయాన్నే శ్రీ ఆదిశంకరాచార్యులవారు బ్రహ్మసూత్రాలలొని మొదటి సూత్రములోనే  మనకు చెప్పారు. "అథాతో బ్రహ్మ జిజ్ఞాసా"  అంటే "పిమ్మట, కాబట్టి, బ్రహ్మమును తెలిసికోనుటకు కోరిక". వెంటనే మనకు ప్రశ్నలు రావాలి. దేని పిమ్మట? ఎందుక్కాబట్టి? సమాధానం ఏమిటంటే, వివేకాదిసాధనసంపత్తి సిద్ధించిన 'పిమ్మట', కర్మఫలం అనిత్యమైనదని, జ్ఞానఫలమైన 'మోక్షం' శాశ్వతమైనదని తెలిసినది 'కాబట్టి' ముముక్షువైనవాడు బ్రహ్మమును తెలుసుకొనుటకు కోరాలి. దీనివల్ల మనకు తెలిసేదేమిటంటే, మనం పరబ్రహ్మను తెలుసుకొని, మోక్షాన్ని పొందుటకు సద్గురువు దగ్గరకు వెళ్ళేముందే, మనల్ని మనం సంస్కరించుకోవాలి, సన్నద్ధపరచుకోవాలి, పవిత్రీకరించుకోవాలి, శుద్ధ మనస్కులవ్వాలి, మనం దేన్ని కోరుకుంటున్నామో నిర్దుష్టంగా తెలుసుకోవాలి, (ఇప్పటిభాషలో చెప్పాలంటే, clear goal fix చేసు కోవాలి), దాని కోసం, నీళ్ళల్లో మునిగిపోయినవాడు ఊపిరికోసం ఎలా కొట్టుకుంటాడో. ఒడ్డున పడ్డ చేప నీళ్ళ కోసం ఎలా కొట్టుకుంటుందో, అల్లా పరితపించాలి. (ఇప్పుడు మనకిమనం ప్రశ్నించుకుందాం. మనం ఎప్పుడైనా అల్లా పరమాత్మ కోసం పరితపించామా?) ఇటువంటి అవస్థను అనుభవిస్తే, అప్పుడు మనకి సద్గురువు అవుసరం కనపడుతుంది. అప్పుడు మనం సద్గురువు కోసం వెతకాలి. అంతేగాని, ఏదైనా క్షణకాలబాధకలిగినప్పుడో, ఏదైనా పుస్తకంలోని రెండువాక్యాలు చదివినప్పుడో, ఎవరిదైనా ఉపన్యాసంలో రెండువాక్యాలు విన్నప్పుడో, క్షణికోద్రేకానికిలోనయి, నాకు అర్జెంటుగా మోక్షం వచ్చెయ్యాలి, అర్జెంటుగా సమాధి వచ్చెయ్యాలి, గురువు కావాలి, గురువు, గురువు అంటూ పరుగులు పెడితే సద్గురువులు దొరకరు. ఒకవేళ దగ్గరలో వున్నా, నిర్మలమనస్సులేని మనకు తెలియరు. కాబట్టి నిజంగా పరబ్రహ్మ ను తెలుసుకోవాలని కోరిక వున్నప్పుడు, దానికి తగిన విధంగా మనలను మనం సన్నద్ధ పరచుకొని, సద్గురువు కోసం వెతికితే, తప్పని సరిగా లభిస్తారు. ఇంకా చెప్పాలంటే,  'ఒక యోగి ఆత్మకధ' లో లాగా, శ్రీపరమహంస యోగానందగారికోసం శ్రీయుక్తేశ్వరగిరిగారు వచ్చినట్లు ఆసద్గురువే శిష్యుని వెతుక్కుంటూ వస్తారు. ఏ మాత్రము అధైర్యపడనవుసరం లేదు. శ్రీగురుమండలి అలా కల్పించగలదు.)

పైంగలోపనిషత్:పంచమాధ్యాయము:


            మొట్టమొదట శమదమాది  సద్గుణములతో, సద్గురువు తన శిష్యుని పరిశుద్ధునిగా చేయ వలెను. ఆ పిమ్మట, ఈ సర్వము బ్రహ్మమనియు, శిష్యుని నీవు పరిశుద్ధుడవనియు బోధన చేయ వలెను. అజ్ఞునకు (అధికారము లేనివానికి) సర్వము బ్రహ్మమే అని ఎవడు చెప్పునో, అతడు ఆ యజ్ఞుని వలన మహా నరకములోనికి త్రోయబడును. (ఇక్కడ మనం ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అసలు గురువు దగ్గరకు వెళ్ళేటప్పటికే, మనలని మనం సంస్కరించు కొనివుండాలి. అలా చేసుకొని ఉన్నప్పటికీ, ఎమాత్రంగానైనా సందేహాలు గాని, సంశయాలు గాని, అజ్ఞానము గాని ఉన్నచో, గురువు వాటిని పోగొట్టి శిష్యుని పరిశుద్ధుణ్ణి చేయాలి. ఎందుకంటే, విత్తనం మొలకెత్తాలంటే, భూమిని బాగా దున్ని, రాళ్ళు రప్పలు ఏరివేసి చదును చేయాలి కదా! అలా పరిశుద్దుడు కాని శిష్యుని మనస్సులో గురువు ప్రభోధించే పరబ్రహ్మ విషయాలు లోతుగా నాటుకోవు. తర్వాత అనుభవానికి రావు. అలా లేని శిష్యుడు బయట ఏదైనా తప్పుగా చెపితే, ఆ దోషం గురువుకి వెడుతుంది. ఎవరైనా ఏదైనా తప్పుగా చెపితే, వెంటనే మనం, ఈ విషయం ఎవడు చెప్పాడురా? అంటాము. తత్ఫలితంగా గురువు తనస్థానం నుండి దిగజారి అధోగతి పాలవుతాడు. అందువల్ల అధికారం ఆంటే అర్హతవున్న శిష్యునికే పరబ్రహ్మ విషయాలు ప్రభోదించాలి. అలాకాని పక్షంలో మొదట శిష్యునికి అర్హత వచ్చేలా చేసి ఆ తర్వాతే మిగతా విధానం లోనికి వెళ్ళాలి. లేకపోతే శిష్యుడు పైకి వెళ్ళడం అటువుంచి, గురువు అధోగతి పాలవుతాడు.)

         కావున ఎవని బుద్ధి ప్రబుద్ధమైనదో, ఎవనికి భోగేచ్చ నశించియున్నదో, ఎవనికి ఆశలు పోయినవో, అట్టివానికి ప్రాజ్ఞుడగు గురువు, అవిద్య, మాయ, లేనతనికి, వేదాంతబోధ చేయవలెను. దీపమున్నప్పుడే ప్రకాశమునకు ఉనికి కలదు. సూర్యుడున్నప్పుడే దిపమునకు సత్తయుండును. చిత్ సత్తయే జగత్తు నకు సత్త అయివున్నది. జ్ఞాన దృష్టి కలిగినప్పుడు, జ్ఞానోదయమైనపుడు, స్వస్థచిత్తుడవై నాయొక్క వాక్ దృష్టి (బోధ) యొక్క బలాబలములను నీవు గ్రహించగలవు. ఆ విద్య వలననే, సర్వదోషాపహారిణియగు విద్య (ఆత్మ జ్ఞానము) ప్రాప్తించును. జ్ఞానోదయముతో  నేను, నాది అను స్వార్థబుద్ధి నశించి ఉత్తమ పురుషార్థము లభించును. శుద్దాంతః కరణ యందే ఆత్మకార వృత్తినశించును.

యోగవాశిష్ఠము:నిర్వాణప్రకరణము:ఉత్తరభాగము: ఆఖరిసర్గ:


           22, 23: పరమపురుషార్థ (మోక్ష) ప్రదమగు ఆత్మజ్ఞానమునుపదేశించిన గురువుయొక్క యట్టి మహోపకారమునకు దాగిన ప్రత్యుపకారము నే కర్మచే శిష్యులు చేయగలరు? కాబట్టి మనో వాక్కాయ కర్మలచే శిష్యులు గురువునకు ఆత్మనివేదనము (తనను తాను గురుచరణములందు సమర్పించు కొనుట) గావింప వలెను. అదియే గురువులకు దాగిన ప్రత్యుపకారము. అంతేకాని, మరియే ఇతర కర్మచేతను ప్రత్యుపకారము కానేరదు.
                           (Please visit www.tatvavisleshana.weebly.com)          

Thursday, June 28, 2012

మన స్థితి

మన స్థితి
                 పరమాత్మ సృజించిన సృష్టిలో ప్రస్తుతం మనం ఏ స్థితిలో ఉన్నామో, అంటే ఎలా భ్రమల్లో, అజ్ఞానంతో ఆయా ఆవస్థలలో ఉన్నామో తెలుసుకుందాం. మనం గతంలో, ఇప్పుడు, భవిష్యత్తులో ఉన్న, ఉండబోతున్న భ్రమలు, అవస్థలు, అజ్ఞానం గురించి తెలుసుకుందాం. ఎందుకంటే, అజ్ఞానాన్ని తెలుసుకుంటే, దానినుండి బయటపడి, సమ్యక్ జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాము కాబట్టి. భ్రమలనుండి బ్రహ్మాన్ని చేరే విధానం తెలుసుకుంటాము కాబట్టి. ఈ విషయంలో సనాతనులు, పెద్దలు, తత్త్వవేత్తలు ఏమి చెప్పారో తెలుసుకుందాం. కొన్ని వివరణలు బ్రాకెట్లలో ఇచ్చాము. 
భ్రమలు:
అన్నపూర్ణోపనిషత్:ప్రధమాధ్యాయము:
                 భ్
రమలు 5 విధములు. జీవుడు ఈశ్వరుడు భిన్నరుపులు అనునది మొదటి భ్రమ. (మనం సాధారణంగా చేసే మొదటి పొరపాటు ఇదే. మనలో ఉన్న ఆత్మ, పరమాత్మ వేరే అనుకోవడం. పైంగలోపనిషత్ ప్రకారం, "సృష్టి అంతా ఏర్పాటు అయిన తర్వాత ఆ సృష్టి అంతా జడముగా, ఎటువంటి స్పందన లేకుండా వున్నది. అప్పుడు పరబ్రహ్మ ఈ పరిస్థితిని గమనించి, ఈ సృష్టిలో  చైతన్యము అనగా తాను లేనందున ఇది అంతా జడముగా ఉన్నదని, బ్రహ్మండములను, సమస్త వ్యష్టి శరీరముల యొక్క మస్తకములను బ్రద్దలుచేసి, ఆ బ్రహ్మరంధ్రముల వాటన్నింటి యందు చైతన్యరూపములో ప్రవేశించెను. ఆ శరీరములు మొదట జడములుగా నున్ననూ, ఈశ్వరచైతన్యము ప్రవేశింపగనే చైతన్యవంతములైనవి. ఈశ్వరుడు దేహత్రయతాదాత్మ్యము వలన కర్తృత్వమును భోక్తృత్వమును కలవాడయ్యెను. జీవుడుగా నున్న ఈశ్వరుడు  స్థూల సూక్ష్మ కారణ దేహములను తానుగా అంటే దేహమే తానను భ్రాంతిగా భావించుట వలన, మేలుకొనుట, స్వప్నములను గాంచుట, నిద్రపోవుట, మూర్ఛిల్లుట, మరణము పొందుట మొదలగు ధర్మములను కలిగినవాడై కులాల చక్రము, కుమ్మరి సారె వలె పరిభ్రమించుచున్నాడు."  చూసారా! సృష్ట్యాదిలో ఆ పరమాత్మే మనశరీరాల్లొ చైతన్య రూపంలో ప్రవేశిస్తే గాని మనకు వున్న జడత్వము పోలేదు. కాబట్టి మనలో నున్నది అంటే ఆత్మ ఆ పరమాత్మ యొక్క అంశమే! ఈవిషయములొ ఏమాత్రము తేడాగాని, పొరబాటు గాని లేదు.) ఆత్మనిష్టమైన కర్తృగుణము వాస్తవమనునది(నేను అంటే  అర్థము దేహము అనే భావము) రెండవ భ్రమ.  శరీరత్రయముతో గూడిన జీవుడు సంగము కలవాడన్నది (స్థూల సూక్ష్మ కారణ దేహములతో కూడిన పరమాత్మ ఈ పాంచభౌతిక దేహముతో సంగముకలవాడనే భావము) మూడవ భ్రమ.  జగత్కారణ రూపమునకు వికారిత్వము (పరమాత్మ వేరే, ప్రకృతి వేరే అనే భావము) నాల్గవ భ్రమ. కారణముకన్న భిన్నమైన జగత్తు సత్యమన్నది (మన కంటికి కనబడే ఈప్రకృతి శాశ్వతమైనదనే భావము) పంచమ భ్రమ.
                పంచభ్రమ నివృత్తియు అప్పుడు చిత్తమున స్పురించెను. బింబ ప్రతిబింబ దర్శనము చే భేద భ్రమ తొలగిపోయెను. (అద్దము లో మన ప్రతి బింబాన్ని మనం చూసుకుంటే, బింబము వేరు, ప్రతిబింబము వేరు కాదు. అలాగే మన శరీరములో ప్రతిబింబించిన ఆత్మ పరమాత్మ రూపమే. వేరుకాదు.) స్పటిక లోహిత దర్శనముచే పారమార్ధిక భ్రమ పోయినది. (స్పటికము అంటే ఏదైనా రత్నముమీద బయటినుండి కాంతి పడినప్పుడు ఆ కాంతి ఆ రత్నం లోపలనున్న వివిధ కోణాలలో నున్న తలాలలో ప్రతిఫలించి ఇంకా కాంతివంతముగా కనపడుతుంది. అప్పుడు మనం ఆ కాంతి ఆ రత్నానిదే అనుకొంటాము. కాని నిజానికి ఆ కాంతి వేరే చోటునుండి వచ్చినది. కాని మనం ఈ ప్రతి ఫలించడం అనే భ్రమలో  పడిపోయి ఆ కాంతి రత్నానిదే అనుకొంటాము. అలాగే నేను అన్న దానికి మనకు భౌతికంగా ప్రత్యక్షంగా కనపడే ఈ శరీరం కాదు. ఇప్పుడు మనకి మనం కొన్ని ప్రశ్నలు వేసుకొందాము. నేను తొడుక్కున్న చొక్కా ఎవరిది? జవాబు నాది. నేను పెట్టుకున్న వాచీ ఎవరిది? జవాబు నాది. ఈ శరీరం ఎవరిది? జవాబు నాది. ఈ మూడో జవాబులో వున్న 'నాది' అన్నది ఎవరూ? ఆలోచించండి. ఈ శరీరం కాక ఇంకోటేదో ఈ శరీరాన్ని నాది అంటోంది. అదే ఆత్మ. 'నేను'  అనే పదానికి నిజమైన కర్త ఆత్మే.)  ఘటమఠాకాశ దర్శనముచే సంగి అన్న భ్రమ తొలగిపోయెను. (మన ఇంటిలో ఒక కుండను చూడండి. ఆ కుండలో ఏమి లేకపోయినా శూన్య ప్రదేశము అంటే ఆకాశము వుంటుంది. అలా చూస్తూ వుంటే మనం ఆ ఆకాశమునకు  కుండతో వున్న సంబంధం వల్లే అలా వుందని, లేకపోతే దానికి ఉనికి లేదని అనుకుంటాము. మనం ఆ కుండను  బ్రద్దలు కొట్టామనుకోండి. అప్పుడు ఆ కుండలో వున్న ఆకాశము, కుండ బయట వున్న మహా ఆకాశము తో కలసి పోతుంది. కుండ లేకపోతే ఆకాశము యొక్క ఉనికికి ఏమాత్రం భంగము వాటిల్లదు.  అల్లాగే ఈ శరీరంలో వున్న ఆత్మ ఈ శరీరము తో వున్నట్లు కనిపించిన, నిజానికి లేదు. ఈ శరీరము లేకపోతే ఆ పరమాత్మ లో వుంటుంది. అందువల్ల ఆత్మకు ఈ శరీరముతో ఎంతమాత్రము సంగము అంటే సంభందము లేదు.) కనకరుచిక దర్శనముచే వికారిత్వ భ్రమ పోయినది. (మన ఇంట్లో వున్న ఉంగరము, నెక్లేసు, పాపిడి చేరు, గాజులు, వడ్డాణము, అరవంకీలు వంటి బంగారు ఆభరణాలు పరిశీలించండి. వాటికన్నింటికీ వేరువేరు ఆకారాలు, రూపాలు, పేర్లు వున్నాయి. దేనికదే విడివిడిగా దాని ప్రత్యేకత దాని కుంటుంది. ఇప్పుడు మరల వాటి నన్నింటినీ వాటికి మూల వస్తువైన బంగారంలా చూడండి. ఇప్పుడవన్నీ ఒక్కటే! ఒకే మూల వస్తువైన బంగారం రకరకాలైన రూపాలుగా మార్చుకుని, రకరకాలైన వస్తువులుగా, రకరకాల పేర్లతో పిలువబడుతోంది. అదే ఒక్క బంగారమే. అలాగే ప్రకృతిలో ఎన్ని రకాలుగా మారి కనిపించినా, వాటికన్నింటికి మూల కారణమైన పరబ్రహ్మ ఒక్కటే!) రజ్జుసర్ప దర్శనముచే కారణభిన్నజగత్తుకు సత్యత్వ భ్రమ పోయినది. (చీకటిలో మనం తాడును చూసి పాములా భ్రమ చెందు తాము. ఆ పాముని నిజమనుకొని చంపడానికి కర్ర తెస్తాము. ఈలోగా ఎవరో దీపం తెస్తారు. ఆ వెలుతురులో తాడుని చూసి అయ్యో నేను పాము అనుకొన్నది నిజంగా తాడా! అనుకొంటాము. ఇప్పుడు చూడండి. దీపం వెలుతురు లేనంతవరకు పాము సత్యము. వెలుతురు పడినతర్వాత తాడు సత్యము. అలాగే మనం చూసేటటువంటి, అనుభవానికి వచ్చేటటువంటి ఈ ప్రకృతినే నిత్యమని, సత్యమని, శాశ్వతమని తలుస్తాము. నమ్ముతాము. కాని  తత్వ విచారమనే దీపాన్నితెచ్చి, జ్ఞానమనే వెలుతురులో చూస్తే, నిత్యమైనది, సత్యమైనది, శాశ్వతమైనది ప్రకృతి కాదని, దానికి మూలకారణమైన పరమాత్మని తెలుస్తుంది.)   అప్పుడు భ్రమల్లో నున్న నా చిత్తము బ్రహ్మాకార మైనది.   
(తదుపరి విషయము కొరకు www.tatvavisleshana.weebly.com సందర్శించండి.)

Saturday, June 23, 2012

అదేమిటి?

                     పరబ్రహ్మ స్వరూపమేమి?

              మనం పరబ్రహ్మ స్వరూపాన్ని ఎందుకు తెలుసుకోవాలో విచారించిన పిమ్మట అదేమిటో తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది మహనీయులు, బ్రహ్మాన్ని తెలుసుకొన్న వాడు బ్రహ్మమే అవుతాడని స్వానుభవంతో తెలియజేసారు. కొందరు బ్రహ్మాన్ని తెలుసు కొన్నాననుకొంటే అజ్ఞానమని, తెలుసుకోలేక పోయానని తెలుసుకొంటే, దాని గురించి తెలియటం మొదలవుతుందని చెప్పారు. ఎంత చెప్పినా అది పూర్తి అవదని, దానికి నిర్వచనాలు లేవని, కేవలము అనుభవపూర్వకమని కొందరు తెలియజేసారు. మనం గతంలో అనుకున్నట్లు నిజంగా పరబ్రహ్మను పొందినవాడు ఈలోకంలో ఉండడు. కాని కొంతమంది మహానుభావులు ఆస్థితిలో చివరి వరకూ  వెళ్లి, మళ్లీ వెనక్కు వచ్చి, మనలాంటి వారికోసం కొంతవిషయాన్ని అక్కడక్కడ చెప్పారు. ఒకమాట మాత్రం నిజం. మనం మనుష్యులం కాబట్టి, మాయామయమైన శరీరంతోటి, అంతఃకరణాలతోటి జీవిస్తున్నాం కాబట్టి, ఈ అజ్ఞానం తొలగే వరకూ (పూర్తిగా పనికి రానప్పటికీ) కొంచెం ప్రాపంచకమైన జ్ఞానంతోటి, మన బుద్ధికి, మనస్సుకు అందే విషయాలతోటి దాన్ని తెలుసుకొనేందుకు ప్రయత్నిద్దాం.  అంతవరకూ దోషమేమీ లేదు. దాని సంగతి తెలిసిన పిమ్మట, దాని కోసం ఉపయోగించిన ప్రాపంచిక విషయాలను వదలివేసి, పూర్ణ మైన జ్ఞానాన్ని మాత్రమే ఆశ్రయిద్దాం. ఎందుకంటే "సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ" కాబట్టి.
              ఈ విషయమై అనుభవం పొందిన మహాత్ములు, అనన్యచింతనులు, ఋషులు, యోగులు ఏ విధంగా తెలియజేశారో పరిశీలిద్దాం.  (కొన్ని వివరణలు బ్రాకెట్లలో యివ్వడమైనది).
ఈశావాశ్యోపనిషత్:
             
4. పరమాత్మ ఒక్కటే చలనరహితమైనది. అయినా మనస్సుకంటే మహావేగము కలది.  మనసుకంటే ముందే వెళ్ళుటవలన, అది యింద్రయములకు చిక్కదు. నిత్యమైనది. స్థిరమైనది అయినప్పటికీ, పరిగెత్తే అన్నింటిని అది దాటి పోవుచున్నది.  ఆత్మ సాన్నిధ్య మున్నందు వలననే జీవకోటులు తమ కార్య కలాపములను సాగించుటకు సమర్థవంతము లగుచున్నవి. (ఇక్కడ పరమాత్మ యొక్క వైవిధ్యలక్షణాలను చెపుతున్నారు. పరమాత్మ అన్నిచోట్ల ఉన్నందున మనం ఎంత వేగంగా వెళ్ళినా, అక్కడ మనకన్నా ముందరే వెళ్లి ఉన్నట్లు తోస్తుంది. అందువలన అది ఎక్కడికి వెళ్ళనప్పటికీ అత్యంత వేగంగాఉన్నట్లు తోస్తుంది. మనం గజేంద్రమోక్షంలో తెలుసుకున్నట్లు ఆ పరమాత్మ ప్రవేశించినందు వల్లనే ఈ జీవులన్నియూ చైతన్యవంతములై తమతమ కార్యకలాపములను చేయు సమర్థములైయున్నవి.)        

             
5. ఆ ఆత్మ చలింపదు. దూరములో నున్నది. దగ్గరగా నున్నది. అదియే సర్వ వ్యాపకముగా నున్నది. ఈ అంతటి వెలుపల, లోపల గూడ నున్నది. (పైన చెప్పినట్లు ఆ పరమాత్మ అన్నిచోట్ల ఒకేసారి ఉన్నందున ఈ విధంగా తోస్తుంది. ఒకసారి చర్చలలో, ఒకేసారి దూరంగానూ, దగ్గరగాను ఎలా వుంటుంది? అన్న ప్రశ్న వచ్చింది. మనం ఎదురెదురుగా (face to face) కూర్చుంటే ఎలా వున్నాము? చాలా దగ్గరగా వున్నాము. అలా ఉన్నచోటనే ఒకరి కొకరు వ్యతిరేకదిశలో కూర్చుంటే ఎలా వున్నట్లు? ఎంత దూరంలో వున్నట్లు? ఒక్కసారి ఆలోచించండి! అలాగే మనం పరమాత్మ వైపు తిరిగితే మనకు ఆయన చాలా దగ్గరగా ఉంటాడు. ఆయనకేసి తిరగకపోతే చాలా దూరంగా ఉంటాడు. ఇక్కడ చెప్పిన ఆయన సర్వవ్యాపకత్వాన్నే
మనం ప్రతిరోజూ చదువుకొనే మంత్ర పుష్పంలో "యచ్ఛకించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పివా, అంతర్ బహిశ్చతత్సర్వం వ్యాప్యనారాయణ స్థితః" అంటే 'ఏదయితే మనకు కనపడుతూ, వినపడుతూ వుండే ప్రకృతి  వుందో, దాని లోపలా బయటా అంతా ఆపరమాత్మే నిండివున్నాడు' అని శృతి చెప్పింది.)
              8. స్వయంభువు, సర్వవ్యాపి, అశరీరి, అస్నాయువు, పాప కళంక రహితుడు, ఉజ్జ్వలుడు, పరిపూర్ణుడు, స్వచ్ఛమైనవాడు, సర్వదర్శి, సర్వవిదుడు, సర్వ పరిఛ్చేదకుడు, అయిన పరమాత్మ శాశ్వతులైన ప్రజాపతులకు వారివారి కర్తవ్యములను నిర్ణయించి యిచ్చినాడు.
కేనోపనిషత్: ప్రధమ ఖండం:
              ౩. పరబ్రహ్మమును నేత్రముతో చూచుటకు వీలుకాదు. వాక్కుతో చెప్పుటకు వీలు కాదు. మనస్సుతో చింతించుటకు వీలుకాదు. అట్టి ఆత్మను బోధించుట ఎట్లు? మాకు తెలియదు. అది తెలియువాటికి, తెలియబడని వాటికి, అతీతముగా నున్నది. మా గురుదేవులు (సనాతనులు) ఈ రీతిగా చెప్పు చుండుట వినియుంటిమి.   
               4-8. ఏ ఆత్మ వాగింద్రియముచేత గ్రహించబడదో, దేని శక్తిచేత వాగింద్రియము పని చేయుచున్నదో, దీనిని చక్షుస్సు చూడ లేదో, దేనిచే అంతఃకరణవృత్తులను చూచునో, దేనిని చెవితో వినుటలేదో, దేనిచేత ఈశ్రవణేన్ద్రియము పనిచేయుచున్నదో, ఏది మనసుచేత భావించుటకు అశక్యమగునో, దేనిచేత మనస్సు పనిచేయుచున్నదో, అద్దానినే పరబ్రహ్మమని తెలియుము. అన్యమేదియు బ్రహ్మము కాదు. ఏది ఉచ్చ్వాస నిశ్వాసాత్మకమగు ప్రాణ క్రియతో తెలియ బడజాలదో, దేనిచే ప్రాణము నిజకర్మమున నడుపబడుచున్నదో, అదియే బ్రహ్మమని ఎరుంగుము. అన్యమైనదేమియు బ్రహ్మము కాదు. (ఇక్కడ మన శరీరము భౌతికవిషయ పరిజ్ఞానాన్ని గ్రహించే అవయవాల ద్వారాగాని, శరీర భౌతికకర్మల ద్వారాగాని,  పరబ్రహ్మమును తెలిసికోలేమని, ఈ అవయవాలని, వాటిని నడిపించే మనస్సుని కూడా పనిచేయించేది పరబ్రహ్మమని మనకు తెలియజేస్తున్నారు.)   
చతుర్థఖడం:
           
4. విద్యుత్తు యొక్క ప్రకాశమువలె కన్ను తెరచినప్పుడు వస్తువులు చూడనగును. అది మూయగానే వస్తువులు కనిపింపవు. క్షణమాత్రము మెరుపు మెరసినపుడు కన్నులు మిరుమిట్లు గొలుపును. విద్యుత్తు క్షణ మాత్రమే ప్రకాశించును. అట్లే బ్రహ్మము యొక్క దర్శనము కూడా! (ఇక్కడ బ్రహ్మదర్శనం లేదా ఆత్మదర్శనం గురించి చెపుతున్నారు. మొట్టమొదట్లో ధ్యానంలో ఏకాగ్రత కుదిరినప్పుడు ఎలా ఆత్మ దర్శనం అవుతుందో ఒకసారి గురువుగారు చెప్పారు. చీకటిలో మిణుగురుపురుగు వెలిగినట్లు కనపడుతుందట. వెంటనే మాయమైపోతుందట. తర్వాత ఏకాగ్రత కుదిరిన కొద్దీ కదలకుండా ఉంటుందట. ఈవిషయాన్నే ఉపనిషద్రష్ట తెలియజేస్తున్నారు.)
            6. పూర్వము వర్ణింపబడిన బ్రహ్మమే 'తద్వనం' అనబడును. ఆబ్రహ్మమును సర్వభూతాత్మగా ఉపాసించవలెను. బ్రహ్మను
'తద్వనం' అని ధ్యానించవలెను. సర్వప్రాణులు అతనిని ఆ విధముగానే కోరును. 
కఠోపనిషత్:ప్రథమాధ్యాయము: 6వ వల్లి:
            17. అంగుష్ఠమాత్ర పరిమాణము గల హృదయపద్మ పురుషుడు అంగుష్ఠమాత్రుడనబడును. అట్టి అంగుష్ఠమాత్ర పురుషుని, ముంజ యను తృణవిశేషము నుండి తదంతర్గతయగు ఇషీక, పరకను వెలుపలకు లాగునటుల సర్వశరీరము నుండి జ్ఞానము చేత వేరు పరచవలెను. వేరు పరచిన చిన్మాత్రుడగు ఆయాత్మనే శుద్ధమైన బ్రహ్మముగా నెరుంగవలెను. (ముంజ అనేది ఒకరకమైన గడ్డి. దాని ఆకులలో ఈనె వుంటుంది.  కొబ్బరిఆకుల లోంచి ఈనెను బయటకు లాగునటుల ఈ ముంజగడ్డి ఆకులలోంచి కూడా ఈనెను బయటకు లాగవచ్చును. ఆ ప్రకారంగా మన శరీరంలో ఆత్మచైతన్య రూపంలో వున్న పరమాత్మను జ్ఞానంతో వేరుపరచి దర్శింపవలెను.)
మున్డకోపనిషత్:ప్రధమమున్డకం:
ప్రధమఖండం:
             6. ఈ పరబ్రహ్మ తత్త్వము దర్శించుటకుగాని గ్రహించుటకుగాని వీలుకానిది. సంబంధము లేనిది. రంగులు, రూపములు కాని, నేత్రములు శ్రోతములు గాని, హస్తములు పాదములుగాని లేనిది. నిత్యమైనది. సర్వ వ్యాపకమైనది. సర్వగతము. అత్యంత సూక్ష్మము. అవ్యయము. సమస్త భూతముల యొక్క ఉత్పత్తి స్థానమై యున్నది. తెలిసిన బ్రహ్మజ్ఞానులు సర్వత్ర ఈఆత్మనే దర్శించుచుందురు. (ఇక్కడ ఒక విషయం, మన భారతీయ విద్యావిధానం ఎంతగొప్పదో మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి.  ఒక భాష గురించి చెప్పే మొదటి పాఠం లోనే భాషతో పాటు పరమాత్మ జ్ఞానం కూడా ఇచ్చారు.  తెలుగు వ్యాకరణంలో మొదటి పాఠం భాషాభాగాలు. అవి, నామ వాచకము, సర్వ నామము, క్రియ, విశేషణము, అవ్యయము, మొత్తం 5. వీటిలో అవ్యయము అంటే లింగ, వచన, విభక్తులు లేనిది. ఈ గుణం పరమాత్మకు చెందినది. అంటే పరమాత్మకు చెందిన జ్ఞానం మనకు మొదటి పాఠం లోనే చెపుతున్నారు. కాని మనం దానిని పట్టించుకోకుండా పెరిగి మళ్లీ దాని కోసమే ఎక్కడెక్కడో వెతుకుతాము.)
ద్వితీయమున్డకం:ప్రథమఖండం:
             2. ఆ అక్షర పరబ్రహ్మము జన్మలేనిదై, బాహ్యాభ్యంతరములలో నిండినదై. సమస్త రూపరహితమై, పరిపూర్ణమై, ప్రకాశించుచున్నది. అందువలననే ప్రాణములేనిదై ఆవ్యాకృతాది సర్వవికారముల కంటే భిన్నమై, నామరూపముల కంటే విలక్షణమై, ఉపాధి లేనిదై పరిపూర్ణముగా ప్రకాశించుచున్నది.                               
                           
ద్వితీయఖండం:
             1, 2. ప్రకాశము కలదై, అత్యంత సన్నిహితమై, హృదయగుహలో సంచరించుచున్నదై, మహత్తై, సమస్తమునకు అధారమై, సమస్త విశ్వము తనలో ధరించియున్నదై ప్రకాశించు నీబ్రహ్మమే చలనము కలిగి, ప్రాణవాయువు పీల్చి నిమేషములు కలిగియున్నది. ఈ పరబ్రహ్మమును సత్తుగాను, అసత్తుగాను, సకల ప్రజలలోను ప్రతిష్టమైయున్నదిగాను, పరమైనదిగాను, ప్రాణుల జ్ఞానమునకు అతీతముగా నున్నదాని గాను తెలిసికొనుము. ఏది కాంతి కలదో, అణువుకంటెనూ అణువైనదో, దేనియందు పృథివ్యాది లోకములను, మనుష్యాదులను ఉంచబడినారో అదియే అక్షర బ్రహ్మము. అదియే ప్రాణము. అదియే వాక్కు, మనస్సు. ఆ పరబ్రహ్మమే సత్యము. దదియే అమృతము, నాశరహితము. అదియే మనస్సునకు లక్ష్యముగా చేయ దగినది. అట్టి పరబ్రహ్మమును తెలిసికొనుము.  (ఇక్కడ పరమాత్మ హృదయగుహలో ఉన్నాడని చెపుతున్నారు. ఆ హృదయము గురించి మంత్రపుష్పంలో "అనంతమవ్యయం కవిగ్ మ్ సముద్రేంతం విశ్వశంభువం| పద్మకోశ ప్రతీకాశ
గ్ మ్ హృదయంచాప్యథోముఖం|| అధో నిష్ట్యా వితస్త్యాన్తే నాభ్యాముపరి తిష్టతి| జ్వాలమాలాకులం భాతీ విశ్వస్వాయతనం మహత్||" అనంతుడు, అవ్యయుడు, సర్వజ్ఞుడు, సంసారసాగర అంతముననుండేవాడు, విశ్వ మంగళకారుడు, అయిన పరమాత్మ అధోముఖమైన తామరమొగ్గలా వున్న హృదయంలో వున్నాడు. ఈ హృదయం కంఠానికి క్రింద, నాభికి పైన జానెడు దూరంలోవుంది. ఇందులో  విశ్వానికిఅంతటికి మూలమైన పరమాత్మ దీపశిఖలవరుసతో సమానమైన జాజ్వల్యమానమైన తేజస్సుతో ప్రకాశించు చున్నాడు అని శృతి చెప్పింది. ఇక్కడ చెప్పిన హృదయం మనకు కనపడే గుండె కాదు. మనకు రెండు రకాల శరీరాలున్నాయి. ఒకటి భౌతిక శరీరం (physical body). రెండవది శక్తి శరీరం (energitic body). ఈ రెండవ శరీరంలోనే శక్తిస్థానాలైన షట్చక్రాలూ, హృదయం మొదలైన ఆధ్యాత్మికపరిభాషలో వివరింపబడే అంగాలూ వుంటాయి.  ఈ ఆధ్యాత్మికమైన శరీరం భౌతికమైన అనుభవానికి రాదు. ఈ శరీరం అనుభవం లోనికి రావాలంటే ధ్యానం లేదా తపస్సు ద్వారా తగిన శక్తి (power) సంపాదించు కోవాలి. లేదా ఆశక్తి ఇవ్వగలిగిన వారు ఇవ్వాలి. ఇక్కడ మనకు రెండు గట్టి దృష్టాంతరములు వున్నాయి. భగవద్గీతలో, విశ్వరూపదర్శనయోగములో 8వ శ్లోకంలో కృష్ణపరమాత్మ "నతుమాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా| దివ్యం దదామి తేచక్షుః పశ్యమే యోగమైశ్వరం|| ప్రాకృత చక్షువులతో నా రూపమును నీవు నిజముగా చూడజాలవు. కనుక నీకు దివ్య (అలౌకిక) దృష్టిని ప్రసాదించుచున్నాను. ఆ దివ్యదృష్టితో నా ఈశ్వరీయ యోగరూపమును చూడుము, అని అర్జునునికి చెప్పి దివ్య దృష్టిని ప్రాసాదించాడు. ఒకసారి శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారు షట్చక్రాలూ, వాటి స్థానాలనూ వివరిస్తున్నప్పుడు 'కక్కడు' అనే కాటికాపరి విని ఇంటికి వెళ్లి, నిద్రపోతున్న తనభార్యని కత్తితో కోసి, షట్చక్రాల కోసం వెతుకుతాడు. అవి కనపడవు కాని, భార్య చనిపోతుంది. దాంతో పట్టరాని కోపంతో వీరబ్రహ్మేంద్రస్వాములవార్ని చంపడానికి వస్తాడు. అప్పుడు వీరబ్రహ్మేంద్రస్వాములవారు కక్కడి అమాయకత్వానికి జాలిపడి అతని భార్యని బ్రతికించి అతని తలపై చేయిపెట్టి, షట్చక్రాలను చూపిస్తారు. ఈ రెండు
దృష్టాంతరములు కూడా మనకు ఏమి చెపుతున్నాయి? ఆధ్యాత్మిక పరిజ్ఞానములొనూ, యోగమార్గము లొనూ వివరింపబడే అంగములు, స్థానములు, ప్రదేశములు, లోకములు వగైరాలు భౌతికపరిజ్ఞానము వలనగాని శాస్త్రములవలన గాని, తెలియబడవు.  కేవలము, ధ్యానము, తపస్సు వలన గాని, లేదా మహానుభావుల, సద్గురువుల అనుగ్రహము వలన గాని పొందగలిగే అనుభవముల వల్ల మాత్రమే తెలుస్తాయి.)
            10. నిష్కళంకుడై, విరాజమానుడై, అవిద్యాదోషములు లేనివాడై, హిరణ్మయకోశమందున్న పరబ్రహ్మ పరిశుద్దుడు. సకల జ్యోతులకు జ్యోతి, అని ఆత్మ తత్త్వ వేత్తలు తెలుసుకొనియున్నారు.

(For further subject please visit "tatvavisleshana.weebly.com")